US Education System: ట్రంప్ గ్రహణంలో విద్యా అమెరికా
ABN, Publish Date - May 31 , 2025 | 01:24 AM
అమెరికా పట్ల వ్యతిరేక భావాలతో ప్రారంభమైన రచయిత జీవితం, యేల్ విశ్వవిద్యాలయ అనుభవం ద్వారా మేధో ప్రేరణతో ప్రేమగా మారింది. అక్కడ కలిసిన మేధావుల ప్రభావంతో రచయిత పరిశోధన, ఆలోచనాక్షేత్రాలు విస్తరించాయి.
నాకు ప్రపంచ జ్ఞానం వచ్చినప్పటి నుంచీ అమెరికా పట్ల పరస్పర విరుద్ధ భావాలు ఉండేవి. అమెరికా సాహితీవేత్తలు కొంతమందిని (ఎర్నెస్ట్ హెమింగ్వే నాకు ప్రత్యేకంగా ఇష్టం) అభిమానించే వాణ్ణి. బాబ్ డిలాన్, మిస్సిస్సిపి జాన్ హర్ట్ సంగీతాన్ని గౌరవించేవాణ్ణి. ఇదలావుంచితే 1971 యుద్ధంలో రిచర్డ్ నిక్సన్, హెన్రీ కిస్సింజర్ భారత్, బంగ్లాదేశ్‌లకు వ్యతిరేకంగా పాకిస్థాన్‌ను ఎంతగా సమర్థించారో నాకు ఇప్పటికీ బాగా గుర్తు ఉన్నది. 1980లో ఉన్నత విద్యాభ్యాసానికి కలకత్తా వెళ్లాను. అప్పటికి అమెరికా విషయంలో నా పరస్పర విరుద్ధ మనోభావాలు పూర్తిగా విరోధపూరితమయ్యాయి. మార్క్సిస్టు మేధావులు అయిన నా ఉపాధ్యాయుల ప్రభావంలో నేను అమెరికాకు పూర్తిగా వ్యతిరేకినైపోయాను. అమెరికన్ల దుందుడుకుతనం, రోత కలిగించే వ్యాపార స్వభావం, లాటిన్ అమెరికా, ఆగ్నేయాసియాలో వారి సామ్రాజ్యవాద దుర్మార్గాలు నాకు ఏవగింపు కలిగించేవి. ఈ అసహ్యం నా వ్యక్తిగత చర్చల్లోనూ, బహిరంగ సంభాషణల్లోనూ తరచూ వ్యక్తమవుతుండేది. నాకుగా నేను అయితే అమెరికా వెళ్లి ఉండేవాణ్ణి కాను. అయితే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ పట్టభద్రురాలు అయిన నా భార్య సుజాతకు 1985లో యేల్ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీ చేసేందుకు ఉపకార వేతనం లభించింది. ఆ విద్యావతి ఉన్నత విద్యాభ్యాసానికి అభ్యంతరం చెప్పలేనుకదా. అందునా యేల్ విశ్వవిద్యాలయ గ్రాఫిక్ డిజైన్ విభాగం ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా పేరు పొందింది. అదృష్టవశాత్తు చరిత్ర విదుషీమణి ఉమాదాస్ గుప్తా నాకు పరిచయమయ్యారు. ఆమె అప్పుడు భారత్‌లోని యునైటెడ్ స్టేట్స్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఉన్నత స్థాయి బాధ్యతల్లో ఉన్నారు. ఉమాజీ సలహా, సహకారంతో యేల్ స్కూల్ ఆఫ్ ఫారెస్టరీ అండ్ ఎన్విరాన్‌మెంట్‌లో విజిటింగ్ లెక్చెర్‌షిప్‌కు దరఖాస్తు చేశాను. ఆశ్చర్యకరంగా నా అభీష్టం నెరవేరింది. 2 జనవరి 1986న నేను యేల్‌కు చేరాను.
దరిమిలా ఏడాదిన్నరపాటు నా విద్యార్థులకు బోధించడం ద్వారాను, వారి నుంచి నేర్చుకోవడం ద్వారాను నా మేధో నైశిత్యాన్ని పెంపొందించుకున్నాను, నా పరిశోధనాసక్తులను విస్తృతపరుచుకున్నాను. ఆనాడు నేను అమెరికా వెళ్లినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. అప్పటికే నేను పిహెచ్.డి పూర్తి చేసినందున నాకు సునిశ్చితమైన మేధో విశ్వాసాలు ఉండేవి. అమెరికాలో విద్యాభ్యాసానికి వచ్చిన యువ భారతీయ చరిత్రకారులు ఆనాటి విద్యాప్రపంచంలో ప్రచలితంగా ఉన్న సంప్రదాయాలను మాత్రమే అనుసరించడం నన్ను కించిత్ చకితుడిని చేసింది. పాలస్తీనియన్ మేధావి ఎడ్వర్డ్ సయీద్ ‘Orientalism’, వలసవాదానంతర, సాంస్కృతిక అధ్యయనాలు అమిత ఉత్సుకతను కలిగిస్తున్న కాలమది. వాటిపట్ల ఆసక్తి చూపేవారికి ఎనలేని ప్రోత్సాహమూ లభిస్తున్న రోజులవి. నాకు ఆసక్తి ఉన్న, శిక్షణ పొందిన చరిత్ర, సామాజిక మానవ శాస్త్రంలో అనుభావిక పరిశోధనకు ఆలంబన, మద్దతు కొరవడిన విద్యావాతావరణమది. విద్యాభ్యాసానికి, బోధనకు అమెరికాకు వచ్చిన నా తరం భారతీయులు చాలావరకు జీవితోన్నతిని సాధించేందుకునేందుకు వచ్చినవారే. నేను వారితో కలివిడిగా ఉండేవాణ్ణికాను. మా మేధో ఆసక్తులు, ప్రవృత్తులు భిన్నమైనవి కావడమే అందుకు కారణం. నాకు విశేష ఆసక్తి ఉన్న రెండు అంశాల– పర్యావరణం, సామాజిక నిరసనోద్యమాలు– లో విశేష కృషి చేసిన విద్వత్‌పరులే నన్ను ఎక్కువగా ఆకట్టుకునేవారు. వారు కృషి చేసిన సంస్కృతులు, సందర్భాలు నా సొంత వాటికి పూర్తిగా భిన్నమైనప్పటికీ వారి నుంచి స్ఫూర్తి పొందాను, నేర్చుకున్నాను. యేల్ విశ్వవిద్యాలయంలో పర్యావరణ సామాజిక శాస్త్రవేత్త ‘William Burch’, పర్యావరణ చరిత్రకారుడు ‘William Cronon’, పర్యావరణ మానవ శాస్త్రవేత్త ‘Timothy Weiskel’లతో పలుమార్లు సుదీర్ఘ సంభాషణలు జరిపాను. మరో విద్వజ్ఞుడు ‘James Scott’తో తరచు సంవాదాలు జరుపుతుండేవాణ్ణి. ఆయన అప్పుడే ప్రచురించిన ‘Weapons of the Weak : Everyday Forms of Peasant Resistance’ ఆయన గ్రంథాలలో కెల్లా ఉత్తమమైనది అని నేను భావిస్తాను. యేల్‌కు వెలుపల రట్జెర్స్ విశ్వవిద్యాలయంలో తులనాత్మక అధ్యయనాల ప్రముఖుడు Michael Adas తోను, బెర్కెలీలోని సామాజిక శాస్త్రవేత్త Louise Fortmannతోను, బ్రాండెయిస్‌లో ప్రొఫెసర్‌గా ఉన్న అమెరికన్ పర్యావరణ చరిత్ర పథనిర్దేశకుడు Donald Worsterతోను సంబంధాలు నెరిపాను.
ఈ విద్వజ్ఞులు అందరూ నేను అలవాటుపడని పరిశోధనా పద్ధతులు, శిక్షణ లేని విద్యా విభాగాలతో ఆఫ్రికా, ఆగ్నేయాసియా, ఉత్తర అమెరికాలో విశేష విద్వత్ కృషి చేసినవారు. అంతేకాకుండా కలకత్తా, ఢిల్లీలోని పండిత ప్రకాండుల వలే కాకుండా ఈ అమెరికన్ విద్యావేత్తలు ఎటువంటి అహం లేకుండా తమ కొత్త విద్యార్థులతో సైతం ఎంతో కలివిడిగా మాట్లాడే ఉదార స్వభావులు, సహృదయులు. వారంతా నా కంటే పెద్దవారయినప్పటికీ పేరు పెట్టి పిలిచినా ఆనందంగా ఆదరించేవారు. తమ భావాలపై నా మిమర్శలకు ప్రాధాన్యమిచ్చి నిశిత చర్చలు జరిపేవారు. ప్రస్తావిత జ్ఞాన పారంగతులు కలుసుకోవడం, సమాలోచనలు జరపడం ద్వారా నా మేధో దిగంతాలు విస్తరించాయి, నా జ్ఞానాసక్తులు వికసించాయి, మేధో ఆకాంక్షలు కొత్త లక్ష్యాలను నిర్దేశించాయి. వారి మాదిరిగానే నా పీహెచ్‌డీ థీసీస్‌ను పుస్తకంగా ప్రచురించాలని, పిదప రెండో పుస్తకం, ఆ తరువాత మూడో పుస్తకం రాయాలని అభిలషించాను, ఆరాటపడ్డాను. నాకు తెలిసిన చాలా మంది భారతీయ విద్వజ్ఞులు మొదట ఒక ప్రశస్త పుస్తకం రాసి, అది సమకూర్చిన గౌరవంతో సంతృప్తి పడిపోయినవారే. Adas, Scott, Worsterలు మనవారికి పూర్తిగా భిన్నమైనవారు. వారి మేధో కృషి చాలా ఉన్నతమైనది, లోతైనది, విస్తృతమైనది, వైవిధ్య భరితమైనది. ఇంటికి తిరిగివెళ్లిన తరువాత వారిలా నా మేధో కృషి సాగించాలని నేను నిర్ణయించుకున్నాను. యేల్ విశ్వవిద్యాలయ జీవితాన్ని సుజాత, నేను చాలా ఆనందంగా గడిపాము. ఆమె మాస్టర్స్‌ను పూర్తి చేసిన తరువాత మేము స్వదేశానికి వెళ్లిపోతాము కనుకనే ఎటువంటి ఆలోచన లేకుండా సంతోషంగా ఉన్నాము. కొంతమంది అమెరికన్లు మాకు సన్నిహిత మిత్రులు అయ్యారు. వారితో మాకు ఇప్పటికీ ఆత్మీయ సంబంధాలు కొనసాగుతున్నాయి. బెర్కెలీలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో నేను గడిపిన ఒక సెమిస్టర్ నాకు ఎన్నో ఆనందప్రదమైన జ్ఞాపకాలను మిగిల్చింది. యేల్, స్టాన్‌ఫోర్డ్ వర్సిటీలలో కంటే ఈ విశ్వవిద్యాలయంలోని విద్యార్థులు వైవిధ్య నేపథ్యాల నుంచి వచ్చినవారే కాకుండా ప్రశస్త మేధో నైశిత్యమున్నవారు కూడా. ఓనమాల నుంచి డాక్టొరేట్ పొందేవరకు నా విద్యాభ్యాసమంతా పూర్తిగా భారతదేశంలోనే జరిగింది. నా వృత్తి జీవితమూ నా మాతృభూమిలోనే సాగింది. నా జీవితమంతా నా జన్మ భూమిలోనే నివసిస్తున్నాను. అయినప్పటికీ అమెరికాలో నాకు పరిచితులైన ప్రాజ్ఞులు, విద్వజ్ఞులు, విద్యార్థులకు నేను అపారంగా రుణపడి ఉన్నాను. అమెరికాలోని గ్రంథాలయాలు, పురాపత్రాల భాండాగారాలు ప్రశస్తమైనవి.
భారతదేశ చరిత్రపై స్వదేశంలో లభించని విలువైన చారిత్రక పత్రాలు అమెరికాలో లభ్యమవుతాయి. ప్రగాఢ అధ్యయనాలకు అపార అవకాశాలు అందివస్తాయి. ఈ కారణంగానే విశిష్టమైన, అద్వితీయమైన అమెరికన్ విశ్వవిద్యాలయ వ్యవస్థను ధ్వంసం చేసేందుకు డోనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, చేపడుతున్న చర్యలు నాకు అంతులేని ఆవేదన, అపరిమిత ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. సైద్ధాంతిక విశ్వాసాల ప్రేరణతో చేస్తున్నారో లేక వ్యక్తిగత వైరంతో చేస్తున్నారో గానీ సమున్నత ఉన్నతవిద్యా వ్యవస్థ పట్ల ట్రంప్ వ్యవహరిస్తున్నతీరు తాను పరిపాలిస్తున్న, తాను ఎంతగానో ప్రేమిస్తున్నానని ఆయన చెప్పుకుంటున్న దేశానికి ఎనలేని హాని చేస్తోంది. అమెరికా ఉన్నత విద్యారంగంలో లోపాలు, లొసుగులు లేకపోలేదు. అయితే ప్రపంచంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాలలో అత్యధికం నిస్సందేహంగా అమెరికాలోనే ఉన్నాయి. సమస్త దేశాలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులకు, అధ్యాపకులు, ఆచార్యులు, మేధావులకు ఉత్కృష్ట విద్యా విజ్ఞానాలు సమకూర్చడం ద్వారా అమెరికా కీర్తిప్రతిష్ఠలను ఘనంగా పెంపొందించాయి, విశ్వం అంచులకు విస్తరింపచేశాయి. వైజ్ఞానిక సృజనాత్మకతను వికసింపచేసి, సమృద్ధం చేయడం ద్వారా అమెరికాను ఆర్థిక మహాశక్తిగా, అధునాతన సాంకేతికతల స్రష్టగా ప్రపంచ అగ్రగామిగా నిలుపుతున్నాయి. 1986లో యేల్ విశ్వవిద్యాలయానికి వెళ్లక ముందు నేను కొంతకాలం అమెరికా విదేశాంగ విధానం విమర్శకుడుగా ఉన్నాను. అనంతర కాలంలో కూడా విదేశాల్లో అమెరికా ప్రభుత్వ ధ్యేయాలను నేను తీవ్రంగా సంశయించేవాణ్ణి. ప్రపంచ వ్యవహారాలలో నా శ్రద్ధాసక్తులు ప్రారంభమైన నాటి నుంచీ అమెరికా విదేశాంగ విధానం దురహంకారం, నయవంచనల మిశ్రమంగానే ఉంటోన్నది. అయితే అమెరికా విశ్వవిద్యాలయాలు పూర్తిగా మరో విషయం. అవి మానవత్వానికి అలంకారాలు. మానవతా ప్రదీప్త జ్ఞాన మందిరాలు. వాటిపై ప్రేరేపిత, వివేక రహిత దాడులపట్ల సమస్త దేశాల ఆలోచనాపరులు అందరూ ఆవేదన చెందాలి.
(వ్యాసకర్త చరిత్రకారుడు)
Updated Date - May 31 , 2025 | 01:24 AM