ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సమతా భావం సాకారమయ్యేదెన్నడు

ABN, Publish Date - May 21 , 2025 | 05:52 AM

‘మీరు షెడ్యూల్డు కులానికి చెందిన వ్యక్తి అయినందుకు మిమ్మల్ని గౌరవించడం లేదు. మీరు దళితుడైనందువల్ల ఈ పదవి మీకు లభించలేదు. ప్రజాజీవనంలో ఎంతో అనుభవమున్న మీకున్న ప్రతిభ వల్లే మీకీ పదవి వచ్చింది’ అని 1998లో తొలి దళిత స్పీకర్ అయిన జిఎంసి బాలయోగిని...

‘మీరు షెడ్యూల్డు కులానికి చెందిన వ్యక్తి అయినందుకు మిమ్మల్ని గౌరవించడం లేదు. మీరు దళితుడైనందువల్ల ఈ పదవి మీకు లభించలేదు. ప్రజాజీవనంలో ఎంతో అనుభవమున్న మీకున్న ప్రతిభ వల్లే మీకీ పదవి వచ్చింది’ అని 1998లో తొలి దళిత స్పీకర్ అయిన జిఎంసి బాలయోగిని అభినందిస్తూ రిపబ్లికన్ పార్టీ వ్యవస్థాపకుడు రామకృష్ణ సూర్యభాను గవాయి లోక్‌సభలో చేసిన ప్రసంగం చరిత్రలో నిలిచిపోదగ్గది. గత వారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన ఆయన కుమారుడు జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయి భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) పదవికి పూర్తి అర్హుడు. తండ్రి వారసత్వంలో బౌద్ధమతస్తుడుగా కొనసాగుతున్న జస్టిస్ గవాయి జస్టిస్ కెజి బాలకృష్ణన్ తర్వాత 18 సంవత్సరాలకు సీజేఐ అయిన రెండో దళితుడు. తనకు అర్హతలు ఉన్నప్పటికీ దళితుడినైనందువల్లే ఈ పదవి దక్కిందని జస్టిస్ బిఆర్ గవాయి 2019లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎంపికైనప్పుడు అంగీకరించారంటే దేశంలో దళితులకు ప్రతి 10 ఏళ్లకో, 15 ఏళ్లకో ఏదో ఒక ఉన్నత పదవి ఇచ్చి కన్నీరు తుడవడం మన దేశంలో సాధారణమయిందని అర్థం చేసుకోవచ్చు.

‘భారతదేశంలో ఒక వ్యక్తికి ఒక ఓటు మాత్రమే కాదు, ఒకే విలువ ఉండాలి’ అని బాబాసాహెబ్ అంబేడ్కర్ చేసిన వ్యాఖ్యలు ఎప్పటికైనా నిజం అవుతాయని ఆర్ఎస్ గవాయి కలలు కన్నారు. కాని ఈ మాటలు ఇప్పట్లో నిజమయ్యే అవకాశాలు లేవని ఆయన కుమారుడు జస్టిస్ గవాయికి ఆదివారం నాడు మహారాష్ట్ర బార్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమం జరిగిన తీరును బట్టి అర్థమైంది. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర చీఫ్ సెక్రటరీ, డీజీపీ, ముంబై పోలీసు కమిషనర్ వంటి ఉన్నతాధికారులే హాజరు కాలేదు. ‘మహారాష్ట్రకు చెందిన ఒక వ్యక్తి సీజేఐ వంటి ఉన్నత పదవికి ఎంపికైన తర్వాత రాష్ట్రానికి తొలిసారి వచ్చినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం వారు ఈ కార్యక్రమానికి హాజరు కావాలి. నేను నాకు లభించాల్సిన గౌరవం గురించి మాట్లాడడం లేదు. ఒక రాజ్యాంగ వ్యవస్థ మరో రాజ్యాంగ వ్యవస్థకు ఇవ్వాల్సిన గౌరవం గురించి మాట్లాడుతున్నాను’ అని ఆయన స్పష్టంగా చెప్పాల్సి రావడం విషాదకరం. ఇదే మహారాష్ట్రకు చెందిన జస్టిస్ డివై చంద్రచూడ్ సీజేఐ అయిన తర్వాత స్వరాష్ట్రానికి వెళ్లినప్పుడు ఇదే విధంగా ప్రోటోకాల్ ఉల్లంఘన ఎందుకు జరగలేదు?


అత్యంత సంక్లిష్టమైన సమయంలో సీజేగా బాధ్యతలు చేపడుతున్న జస్టిస్ గవాయి కేవలం ఆరు నెలలే ఈ పదవిలో ఉంటున్నప్పటికీ తనదైన ముద్ర వేసే అవకాశాలు ఉన్నాయని ఆయన అనుసరిస్తున్న వైఖరిని బట్టి స్పష్టమవుతోంది. అంబేడ్కర్ అనుయాయుడుగా ఆయనతో పాటు బౌద్ధ మతాన్ని స్వీకరించిన ఆర్ఎస్ గవాయి కుమారుడైన జస్టిస్ గవాయిపై రాజ్యాంగాన్ని, సామాజిక న్యాయాన్ని పరిరక్షించాల్సిన గురుతర బాధ్యత ఉన్నది. ఆయన ఇచ్చే ప్రతి తీర్పును విమర్శకులు ఈ దృష్టితో చూసే అవకాశాలున్నాయి. ఎన్నికల బాండ్లను రాజ్యాంగ వ్యతిరేకమని ప్రకటించిన బెంచ్‌లో ఉన్న జస్టిస్ గవాయి ఎస్సీ ఎస్టీ వర్గీకరణను కూడా సమర్థించారు. మానవహక్కుల కార్యకర్త తీస్తా సెతల్వాద్‌కు బెయిల్ ఇచ్చినా, మోదీపై చేసిన వ్యాఖ్యల ఆధారంగా రాహుల్‌ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించడం సరైంది కాదని చెప్పినా, మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు ఢిల్లీ మద్యం కేసులో బెయిల్ ప్రసాదించినా, నేరస్తుల ఇళ్లను వారు నేరాలు చేశారన్న కారణంగా కూలగొట్టడం ‘రూల్ ఆఫ్ లా’ కు వ్యతిరేకమని ప్రకటించినా జస్టిస్ గవాయి తనదైన ప్రజాస్వామిక వైఖరిని ఇప్పటికే తన తీర్పుల ద్వారా స్పష్టం చేశారు.

దేశంలో ప్రధాన న్యాయమూర్తి వంటి ఉన్నత పదవులు నిర్వహించడం అంత సులభం కాదు. ఉన్నత పదవుల్లో ఉన్న వారిని తమకు అనుకూలంగా ఉపయోగించుకోవడం కోసం రకరకాల శక్తులు ప్రయత్నిస్తూనే ఉంటాయి. ఈ క్రమంలో గత పది సంవత్సరాల్లో జస్టిస్ చంద్రచూడ్‌తో పాటు ఆయనకు ముందున్నవారిలో కొందరు సీజేఐలు కూడా వివాదాస్పదులయ్యారు. అయినా రాజకీయ నాయకులతో పోలిస్తే న్యాయవ్యవస్థలో వివాదాస్పదులైన వారి సంఖ్య తక్కువే. అత్యంత క్లిష్టమైన సమయంలో భారత ప్రధాన న్యాయమూర్తి అయిన తెలుగు వాడు జస్టిస్ రమణ తన పదవిని కత్తిమీద సాములా నిర్వహించినా ఆయనకు లభించినంత ప్రచారం, ఆదరణ మరే సీజేఐకి లభించలేదు. జస్టిస్ రమణకు ఉన్న జనాదరణ చూసిన తర్వాత అంతటి ఆదరణ తనకు లభిస్తుందా అన్న అనుమానం తనకు కలుగుతోందని ఆయన తర్వాత సీజేఐ అయిన జస్టిస్ లలిత్... జస్టిస్ రమణ వీడ్కోలు సందర్భంగా అన్నారు. ఇటీవల జస్టిస్ రమణ పుస్తకం ‘నారెటివ్స్ ఆఫ్ బెంచ్ – ఎ జడ్జి స్పీక్స్’ అన్న పుస్తకాన్ని జస్టిస్ బిఆర్ గవాయి ఆవిష్కరించినప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తులే కాదు, దేశవ్యాప్తంగా పలు హైకోర్టుల న్యాయమూర్తులు, న్యాయవాదులు పెద్ద సంఖ్యలో హాజరు కావడంతో జస్టిస్ రమణ తన ఆదరణను ఏ మాత్రం కోల్పోలేదని అర్థమవుతోంది.


న్యాయమూర్తులు ప్రజలకు దూరంగా ఒంటరిగా జీవించకూడదని, న్యాయవ్యవస్థ సామాన్యులకు అందుబాటులో ఉండాలని జస్టిస్ రమణ ఆశించారని, ఒకరకంగా జస్టిస్ రమణ ‘ప్రజల న్యాయమూర్తి’ అని జస్టిస్ బిఆర్ గవాయి ప్రశంసించారు. తాను, జస్టిస్ రమణ ఇద్దరం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చామని, కుటుంబంలో ఎవరూ న్యాయవాది కాకపోయినా తాము న్యాయవాద వృత్తి చేపట్టి అంచెలంచెలుగా పైకి ఎదిగామని ఆయన చెప్పారు. న్యాయవ్యవస్థను పటిష్ఠం చేయాలనే దీర్ఘకాలిక దృష్టితో జస్టిస్ రమణ పనిచేశారని, తాను ఆయన మార్గదర్శకత్వంలో నడుస్తానని జస్టిస్ గవాయి చెప్పడం గమనార్హం. జస్టిస్ రమణ హయాంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళలకు చెందిన 9మంది న్యాయమూర్తులను నియమించారని, తొలిసారి సుప్రీంలో మూడోవంతు ప్రాతినిధ్యం మహిళలకు కల్పించారని ఆయన గుర్తు చేశారు. నిజానికి జస్టిస్ రమణ కొలీజియంలో ఉన్నప్పుడే ఇద్దరు సీనియర్లను కాదని జస్టిస్ గవాయిను సుప్రీంకోర్టుకు నియమించారు. లేకపోతే ఆయన సీజేఐ అయి ఉండేవారే కాదు. అదే విధంగా జస్టిస్ నాగరత్న వచ్చే ఏడాది భారత తొలి సీజేఐ అవుతున్నారంటే జస్టిస్ రమణ నేతృత్వంలోని కొలీజియం ఆమెను సుప్రీంకోర్టుకు ఎంపిక చేయడమే కారణం. న్యాయవ్యవస్థలో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు కూడా ఆయన తీవ్రంగా ప్రయత్నించారు. ఈ విషయాలను జస్టిస్ గవాయి స్వయంగా వెల్లడించారు.

జస్టిస్ రమణతో పాటు పలు బెంచ్‌ల్లో ఉన్న జస్టిస్ గవాయి బహుశా ఆయన సీజేఐగా అయ్యే క్రమంలో ఎదుర్కొన్న సమస్యల్ని గ్రహించే ఉంటారు. బెంచ్‌లో చేరినప్పటి నుంచీ ఉన్నత స్థానానికి వచ్చేవరకూ తానెన్నో కుట్రపూరితమైన పరీక్షలకు గురయ్యానని, తాను, తన కుటుంబం మౌనంగా ఎంతో వేదనకు గురయ్యామని జస్టిస్ రమణ స్వయంగా వెల్లడించారు. వీడ్కోలు సందర్భంగా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఆయన పుస్తకంలో కూడా చోటు చేసుకున్నాయి. ఏమిటా కుట్రలు? జస్టిస్ రమణ స్వయంగా వెల్లడిస్తే కాని అవి దేశానికి తెలిసే అవకాశాలు లేవు. నిజానికి న్యాయమూర్తులు, సీజేఐలు తమ హయాంలో ఎదురైన వ్యక్తిగత అనుభవాలు, ఒత్తిళ్ల గురించి చెప్పుకున్నప్పుడే భారతదేశంలో న్యాయవ్యవస్థ ఏ మార్గంలో పయనిస్తుందో అర్థమవుతుంది.


‘ప్రభుత్వ అధికారాల్ని, చర్యల్ని న్యాయవ్యవస్థ సమీక్షించాలంటే అందుకు పూర్తి స్వేచ్ఛ ఉండాలి. న్యాయవ్యవస్థను ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ చట్టసభలు, ప్రభుత్వాలు నియంత్రించలేవు. అలా జరిగితే రూల్ ఆఫ్ లా అనేది భ్రమే అవుతుంది. మనం రూల్ ఆఫ్ లాను గౌరవించే సమాజాన్ని సృష్టించాలి’ అని జస్టిస్ రమణ తన పుస్తకంలోని ఒక ప్రసంగ వ్యాసంలో అన్నారు. ‘న్యాయానికి అధికారంలో ఉన్నవారు కూడా లొంగి ఉండాల్సిందే’ అని అరిస్టాటిల్ అన్న వ్యాఖ్యలను గుర్తు చేశారు. అసలు అలా అనాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది?

‘మీ విధేయత రాజ్యాంగానికి, రూల్ ఆఫ్ లా కే కాని, ఏ వ్యక్తికీ కాదు. రాజకీయాధికారం ఉన్నవారు కాలంతో పాటు మారుతూనే ఉంటారని, కాని ఒక వ్యవస్థగా మీరు శాశ్వతంగా ఉంటారు. అందుకే ఎవరికీ లొంగకుండా, స్వతంత్రంగా వ్యవహరించాలి’ ఆయన సీబీఐ అధికారుల సమావేశంలోనే చెప్పారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని పటిష్ఠం చేయడమంటే ప్రతిపక్షాన్ని పటిష్ఠం చేయడం అని కూడా ఆయన మరో సందర్భంలో అన్నారు. కాని అలా జరుగుతోందా? జస్టిస్ రమణ పుస్తకంలో ఇలాంటి కీలక వ్యాఖ్యలు కోకొల్లలుగా ఉన్నాయి. మానవహక్కుల హననం గురించి కూడా ఆయన అనేక సందర్భాల్లో చెప్పారు. న్యాయమూర్తులు పలు సందర్భాల్లో చేసే ప్రసంగాల ద్వారా దేశంలో న్యాయవ్యవస్థ, ప్రభుత్వం నడుస్తున్న తీరుతెన్నులు స్పష్టంగా అర్థమవుతాయి. కాని ఆచరణలో మాత్రం అవి చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లే మారతాయి.


తాను పదవీవిరమణ చేసిన తర్వాత మరే పదవీ చేపట్టబోనని జస్టిస్ గవాయి స్పష్టంగా ప్రకటించారు. తనకు పదవి ఇస్తామని ఎవరూ ప్రలోభపెట్టడానికి ఆస్కారం లేకుండా ఆయన ఈ ప్రకటన చేశారు. గతంలో సీజేఐలు మానవహక్కుల చైర్మన్‌, గవర్నర్, రాజ్యసభ సభ్యత్వం వంటి పదవులు స్వీకరించారు. జస్టిస్ చంద్రచూడ్‌కు ఏదో ఒక అంతర్జాతీయ పదవి వచ్చే అవకాశాలు ఉన్నాయని చర్చ జరుగుతోంది. జస్టిస్ గవాయిది రాజకీయ కుటుంబం కనుక పదవీ విరమణ తర్వాత తన తండ్రి నియోజకవర్గమైన అమరావతి నుంచి పోటీ చేసే అవకాశాలు లేకపోలేదు. కాని జస్టిస్ రమణ తనకు మొదటి నుంచీ క్రియాశీలక రాజకీయాలపై ఆసక్తి ఉన్నదని, విధి తనను న్యాయవ్యవస్థ దిశగా నడిపించిందని స్పష్టంగా చెప్పారు. సీజేఐగా తనకు లభించిన వీడ్కోలుతో తన క్రియాశీల జీవితం ముగియలేదని మరో అధ్యాయం ప్రారంభం కానున్నదని ఈ పుస్తకంలో ఆయన అన్యాపదేశంగా చెప్పారు. నిరంతరం క్రియాశీలకంగా యోచించేవారు ఖాళీగా ఉండలేరు.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

ఈ వార్తలు కూడా చదవండి..

Tiruvuru Political Clash: తిరువూర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. దేవినేని అవినాష్ అరెస్ట్

Liquor Case Remand: లిక్కర్ కేసు.. ఆ ఏడుగురు మళ్లీ జైలుకే

Read Latest AP News And Telugu News

Updated Date - May 21 , 2025 | 05:52 AM