Amidst Adverse Winds: ప్రతికూల పవనాల్లో భారత్ అమెరికా మైత్రి
ABN, Publish Date - Oct 11 , 2025 | 02:08 AM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పొగడ్తల విషయంలో చాలా పొదుపరి. ఒక వ్యక్తిని ఒకసారి మాత్రమే కాకుండా రెండుసార్లు, అందునా నాలుగు రోజుల వ్యవధిలో ఘనంగా...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పొగడ్తల విషయంలో చాలా పొదుపరి. ఒక వ్యక్తిని ఒకసారి మాత్రమే కాకుండా రెండుసార్లు, అందునా నాలుగు రోజుల వ్యవధిలో ఘనంగా ప్రశంసించడం అసాధారణమైన విషయమే. ఈ అరుదైన వైఖరిని ఆయన ఇటీవల చూపారు. మోదీ మెచ్చుకోలుకు అర్హుడైన పెద్ద మనిషి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ జె. ట్రంప్. ‘ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధాన్ని ముగింపునకు తీసుకురావడానికి’ ట్రంప్ ఇరవైసూత్రాల ‘శాంతి ప్రణాళిక’ను ప్రతిపాదించిన సందర్భంగా ఆయనను మోదీ ఒకటికి రెండుమార్లు మెచ్చుకున్నారు, అభినందించారు. ట్రంప్ ప్రతిపాదించిన ‘శాంతి ప్రణాళిక’ గురించి సెప్టెంబర్ 30, 2025న మోదీ ఒక ప్రకటనలో ఇలా పేర్కొన్నారు: ‘గాజా ఘర్షణను సమాప్తి చేసేందుకు దోహదం చేసే సమగ్ర ప్రణాళిక అది. పాలస్తీనియన్, ఇజ్రాయెలీ ప్రజలకే కాకుండా సమస్త పశ్చిమాసియా ప్రాంతానికి సుదీర్ఘ, సుస్థిర శాంతి, భద్రత, అభివృద్ధిని సమకూర్చే ఆచరణీయ మార్గమది’. మోదీ మరో అసాధారణ చర్య కూడా తీసుకున్నారు. తన ప్రకటనను ఎనిమిది భాషల– అరబిక్, చైనీస్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్‌తో పాటు హిబ్రూ, హిందీ– లో జారీ చేశారు. అక్టోబర్ 4న మోదీ ఇలా ప్రకటించారు: ‘గాజాలో శాంతి స్థాపనకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు నిర్ణయాత్మక పురోగతి సాధించాయి. హర్షామోదాలతో ఆయన నాయకత్వాన్ని స్వాగతిస్తున్నాం’.
నేనీ వ్యాసాన్ని రాస్తున్న సమయంలో ట్రంప్ శాంతి ప్రణాళిక మొదటి దశను అమలుపరిచేందుకు హమాస్, ఇజ్రాయెల్ అంగీకరించాయి. హమాస్ తన చెరలో ఉన్న ఇజ్రాయెలీ బందీలను విడుదల చేస్తుంది, ఇజ్రాయెల్ కాల్పుల విరమణ పాటిస్తుంది. అయితే ఇవి ఎప్పటి నుంచి అమలవుతాయన్న విషయం తెలియదు, బహుశా, త్వరలోనే కావచ్చు. ఎట్టకేలకు శాంతి వీచికలు వీస్తున్నందుకు గాజాలోనూ, ఇజ్రాయెల్లోను ప్రజలు వీధుల్లోకి వచ్చి పండుగ చేసుకొంటున్నారు. హమాస్ ఇప్పటికీ ఆ శాంతి ప్రణాళికలోని అనేక అంశాలను అంగీకరించలేదు. ముఖ్యంగా గాజాపై తన నియంత్రణ అధికారాలను ఒక బాహ్య అధికార సంస్థకు అప్పగించేందుకు హమాస్ సుముఖత చూపడం లేదు. జనవరి 20, 2025న అమెరికా అధ్యక్ష పదవీ బాధ్యతలు చేపట్టిననాటి నుంచీ ట్రంప్ మహాశయుడు భారత్‌ను అగౌరవపరుస్తున్నారు, అవమానిస్తున్నారు. భారత్ ప్రయోజనాలను దెబ్బతీసే, భారతీయుల శ్రేయస్సుకు హానికలిగించే నిర్ణయాలే తీసుకుంటున్నారు. అయినప్పటికీ ట్రంప్‌ను ఘనంగా పొగిడేందుకు, ఆయనను ప్రసన్నుడిని చేసుకునేందుకు ప్రధాని మోదీ ఎందుకు అంతగా ఆరాటపడుతున్నారు? ట్రంప్ మొదటి పర్యాయం అధ్యక్షుడుగా ఉన్న కాలం (2017–21)లో భారత్ (ఇంకా కొన్ని ఇతర దేశాల)పై భారీ సుంకాలు విధించారు. ఉక్కుపై 25 శాతం, అల్యూమినియంపై 10 శాతం సుంకాలు విధించారు. భారత్‌కు జీఎస్‌పీ ప్రయోజనాలను రద్దు చేశారు. భారతీయులు వినియోగించుకుంటున్న వివిధ రకాల వీసాలు, ముఖ్యంగా హెచ్–1బిని నిలిపివేశారు. అయినప్పటికీ సెప్టెంబర్ 22, 2019న టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో ట్రంప్‌కు మద్దతుగా ‘అబ్కీ బార్, ట్రంప్ సర్కార్’ అనే ఒక అప్రతిష్టాకర ప్రకటనను మోదీ చేశారు. ఈ ఏడాది జనవరిలో రెండో పర్యాయం అధ్యక్ష పదవీ బాధ్యతలు చేపట్టిన ట్రంప్ దరిమిలా గత తొమ్మిది నెలల్లో భారత్ (బ్రెజిల్ పైన కూడా)పై పెద్ద ఎత్తున సుంకాలు విధించారు.
తద్వారా అమెరికాకు భారత్ నుంచి ఉక్కు, అల్యూమినియం, జౌళి ఉత్పత్తులు, ముత్యాలు, బంగారు ఆభరణాలు, సముద్ర ఆహారోత్పత్తులు, ఔషధాలు, పాదరక్షలు, ఫర్నీచర్, కార్లు, ఆట వస్తువులు మొదలైన వాటి ఎగుమతులను దాదాపుగా నిలిపివేశారు. రష్యా నుంచి పెట్రోలియం ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా యుద్ధాన్ని కొనసాగించేందుకు రష్యాకు భారత్ నిధులు సమకూరుస్తోందని ట్రంప్ ఆరోపించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నదనే ఆక్షేపణతో భారత్‌పై మరో 25 శాతం అదనపు సుంకాలు విధించారు. ఆయన సన్నిహితుడు సెనేటర్ లిండ్సే గ్రాహమ్ అయితే భారత్‌ను తీవ్ర కష్టనష్టాలకు గురి చేస్తామని హెచ్చరించారు. ‘రష్యా నుంచి చమురు కొనుగోలును కొనసాగిస్తే మీ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేస్తా’మని కూడా ఆయన తీవ్రంగా అన్నారు. భారత్‌ను ‘టారిఫ్ కింగ్’ అని ట్రంప్ దుయ్యబట్టారు. ఆయన వాణిజ్య సలహాదారు పీటర్ నవార్రో అయితే మరింత ఘోరంగా మాట్లాడారు. భారత్–రష్యా సంబంధాలను తీవ్రంగా విమర్శిస్తూ ఆ రెండు దేశాలూ ‘మృత ఆర్థిక వ్యవస్థలు’ అని ట్రంప్ వెటకారం చేశారు. హెచ్ 1–బి వీసాలకు దరఖాస్తు చేసేవారు లక్ష డాలర్ల ఫీజు చెల్లించాలని ఉత్తర్వు జారీ చేసారు. విద్యార్థి, కుటుంబ సభ్యుల వీసాల నియమ నిబంధనలను మరింత కఠినతరం చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి–మే నెలల మధ్య 1000 మందికి పైగా భారతీయులను ‘చట్టవిరుద్ధ వలసకారులు’ అనే ఆరోపణతో అరెస్ట్ చేసి వారి చేతులకు సంకెళ్లు, కాళ్లకు గొలుసులు కట్టి సైనిక విమానంలో భారత్‌కు తరలించారు. పహల్గాం ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్ ప్రమేయమున్నదని తెలిసి కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆ దేశానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. అమెరికా మద్దతుతో పాకిస్థాన్ ఐఎమ్‌ఎఫ్ నుంచి 100 కోట్ల డాలర్లు, ఏడీబీ నుంచి 80 కోట్ల డాలర్లు, ప్రపంచ బ్యాంక్ నుంచి 400 కోట్ల డాలర్ల ఆర్థిక సహాయాన్ని పొందింది. పాక్‌కు ఈ ఆర్థిక వితరణను భారత్ వ్యతిరేకించినప్పటికీ అమెరికా పట్టించుకోలేదు. పహల్గాం తరువాత భారత్–పాకిస్థాన్‌ల మధ్య యుద్ధం ముగిసేందుకు తాను మధ్యవర్తిత్వం చేశానని ట్రంప్ ప్రకటించారు. ఇందులో ఆవగింజంత సత్యం కూడా లేదని భారత్ ఎంతగా ఖండించినప్పటికీ ట్రంప్ ఆ వాదనను పదే పదే పునరుద్ఘాటిస్తున్నారు. మున్నెన్నడూ లేని రీతిలో అమెరికా అధ్యక్షుడు తన అధికార నివాసం శ్వేతసౌధంలో పాకిస్థాన్ సైనిక దళాల ప్రధానాధికారికి గత జూన్ 18న విందు ఇచ్చారు. ఇది భారత్‌ను అవమానించడం కాదా? ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వాధినేత ఒక సైనికాధికారికి ఆతిథ్యమివ్వడమేమిటి? సెప్టెంబర్ 25న పాకిస్థాన్ ప్రధానమంత్రి, సైనిక దళాల ప్రధానాధికారితో కలిసి విలేఖర్ల సమావేశంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా పాక్ ‘మహానాయకులు’ ఇరువురూ అమెరికాకు అత్యాధునిక పరిశ్రమలకు అవసరమైన రేర్ ఎర్త్ మినరల్స్‌ను సరఫరా చేసేందుకు పాకిస్థాన్ సుముఖంగా ఉందని ప్రకటించారు.
అంతేకాకుండా అరేబియా సముద్ర తీరస్థ ప్రాంతంలో ఒక ఓడ రేవును నిర్మించేందుకు అమెరికాను ఆహ్వానించారు. సెప్టెంబర్ 11 ఉగ్రవాద దాడులు, ఒసామా బిన్ లాడెన్, అబ్బోటాబాద్, పాకిస్థాన్ ఉగ్రవాదులకు ఒక సురక్షిత స్థావరమై పోయిందని బుష్, ఒబామా ప్రభుత్వాలు పదే పదే చేసిన ప్రకటనలను ట్రంప్ అమెరికా పూర్తిగా విస్మరించింది. ఒకేసారి రెండు గుర్రాల (అమెరికా, చైనా)పై స్వారీ చేసే విద్యలో పాకిస్థాన్ ఆరితేరిపోయింది. జనవరి 2025 నుంచి భారత్‌కు అమెరికా మిత్ర దేశమని చెప్పేందుకు వీలు కల్పించే ఒక్క నిర్ణయాన్ని కూడా ట్రంప్ ప్రభుత్వం తీసుకోలేదు. భారత్–అమెరికా సంబంధాలు సజావుగా లేవు. అవి దిగజారుతున్నాయి. అంతర్జాతీయ పరిస్థితులు భారత్‌కు వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ క్లిష్ట పరిస్థితిని అధిగమించేందుకు మరింత పట్టుదలతో బృహత్తర కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. పరిస్థితి ఇదయితే ట్రంప్‌ను ప్రశంసించేందుకు ఇజ్రాయెల్ మద్దతుతో ప్రతిపాదించిన గాజా శాంతి ప్రణాళికను భారత ప్రధానమంత్రి ఎందుకు ఒక అవకాశంగా తీసుకున్నారు అనేది ఒక ఆసక్తికరమైన ప్రశ్న. ఆ శాంతి ప్రణాళిక పాలస్తీనియన్లకు న్యాయం చేసేదేమీ కాదు. అందులోని 19వ అంశాన్ని చూడండి: గాజా పునర్ నిర్మాణ కార్యక్రమం కొనసాగుతూ, నిర్దేశించిన విధంగా పాలస్తీనా అథారిటీ తనను తాను సంస్కరించుకోవడం జరిగినప్పుడు పాలస్తీనా స్వయం నిర్ణయాధికార హక్కుకు, స్వతంత్ర దేశ ప్రతిపత్తికి అంతిమంగా అనుకూల పరిస్థితులు నెలకొంటాయి’. ఇదేమన్నా పాలస్తీనియన్లకు ఆనందోత్సాహాలు కలిగిస్తుందా? నేను అభిప్రాయపడుతున్నది ఏమిటంటే యుద్ధం అంతిమంగా నిలిచిపోవచ్చు, త్వరలోనే బందీలు విడుదల కావచ్చు, నిస్సహాయులుగా మిగిలిపోయిన గాజా వాసులకు మానవతాపూరిత సహాయం అందవచ్చు... ఇంతమాత్రాన సమస్య తీరిపోతుందా? డోనాల్డ్ ట్రంప్, టోనీ బ్లెయిర్ (బ్రిటన్ మాజీ ప్రధాని) తదితర ప్రముఖులతో ఏర్పాటయ్యే ‘బోర్డ్ ఆఫ్ పీస్’ అనే సంస్థ పర్యవేక్షణలో గాజా దాదాపుగా ఒక వలసపాలనా ప్రాంతంగా పరిణమిస్తుంది. తమ మాతృభూమి స్వతంత్ర దేశంగా ఆవిర్భవించాలన్న పాలస్తీనియన్ల స్వప్నం సంపూర్ణంగా భగ్నమవుతుంది. మళ్లీ అటువంటి స్వప్నానికి ఆస్కారం లేని పరిస్థితులు నెలకొంటాయి. భారత ఆర్థిక వ్యవస్థ పురోగతి గురించి, ప్రపంచ వ్యవహారాలలో భారత్ పోషిస్తున్న పాత్ర గురించి మోదీ చాలా చాలా గొప్పగా మాట్లాడడం కద్దు. ఆ ఘనమైన మాటలు ఎలా ఉన్నా ప్రపంచంలో భారత్‌కు కొద్ది మంది మిత్రులు మాత్రమే ఉన్నారని, భారత ఆర్థిక వ్యవస్థ గడ్డు పరిస్థితులను అధిగమించలేని పరిస్థితిలో ఉందన్న కఠోర వాస్తవాలను ప్రధాని మోదీ గుర్తించారు. చుట్టుముడుతున్న ప్రతికూల పరిస్థితులను అర్థం చేసుకుంటున్నారు. హేతుబద్ధమైన విదేశాంగ విధానం, మంచి వాణిజ్య, పెట్టుబడుల విధానాలకు చిత్తశుద్ధిలేని పొగడ్తలు ఎంత మాత్రం ప్రత్యామ్నాయాలు కావు, కాబోవు.
-పి. చిదంబరం
Updated Date - Oct 11 , 2025 | 02:08 AM