ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

India Skips Peace Summit: శాంతి ఆశలు!

ABN, Publish Date - Oct 17 , 2025 | 01:39 AM

ఈజిప్ట్‌ షర్మ్‌ అల్‌ షేక్‌లో ఎంతో ఆర్భాటంగా జరిగిన శిఖరాగ్ర శాంతి సదస్సుకు భారత ప్రధానమంత్రి ఎందుకు వెళ్ళలేదు? తనతోపాటు, పాకిస్థాన్‌ ప్రధాని షరీఫ్‌ను...

ఈజిప్ట్‌ షర్మ్‌ అల్‌ షేక్‌లో ఎంతో ఆర్భాటంగా జరిగిన శిఖరాగ్ర శాంతి సదస్సుకు భారత ప్రధానమంత్రి ఎందుకు వెళ్ళలేదు? తనతోపాటు, పాకిస్థాన్‌ ప్రధాని షరీఫ్‌ను కూడా అమెరికా అధ్యక్షుడు ఆహ్వానించడం మోదీకీ నచ్చలేదా? ఇజ్రాయెల్‌–హమాస్‌ మధ్య ట్రంప్‌ బలవంతంగా కుదిర్చిన శాంతి ఒప్పందాన్ని అమెరికా ఆప్తమిత్రదేశాల అధినేతలకంటే ఘనంగా కీర్తించిన నరేంద్రమోదీ ఆ కార్యక్రమానికి వెళ్ళివుంటే భారత్‌–అమెరికా మధ్య ప్రస్తుతం నెలకొనివున్న వేడి కాస్తంత చల్లారేదని కొందరి భావన. ఒప్పందంలో కీలకపాత్ర పోషించిన టర్కీ, ఖతార్‌, అమెరికా, ఈజిప్ట్‌ వినా మిగతా దేశాధినేతలు, రాజులూ యువరాజులదంతా అక్కడ ప్రేక్షకపాత్రే. అయితే, కార్యక్రమానికి అతిథ్యం ఇచ్చిన ఈజిప్ట్‌ అధ్యక్షుడి ప్రసంగం మినహా, మాట్లాడమంటూ ట్రంప్‌ స్వయంగా ముందుకు తోసిన ఏకైకవ్యక్తి పాకిస్థాన్‌ ప్రధాని షరీఫ్‌. దీంతో ఉబ్బితబ్బిబ్బయిన పాక్‌ ప్రధాని ఈ వేదికగా మరోమారు తన విశ్వాస ప్రకటన చేశారు. ట్రంప్‌ను మహాద్భుతమైన అరుదైన వ్యక్తిగా కీర్తిస్తూ, ఈ శాంతి ప్రేమికుడిని తాను మళ్ళీ నోబెల్‌కు నామినేట్‌ చేస్తాననీ, ఇది కేవలం గాజాలో శాంతి సాధించినందుకు కాక, దక్షిణాసియాలోనే లక్షలాదిమంది ప్రాణాలను కాపాడినందుకని చిన్న షరీఫ్‌ ప్రకటించారు. మే నెలలో భారత్‌–పాక్‌ మధ్య ఘర్షణలను నిలువరించి, రెండు అణ్వాయుధ దేశాల మధ్య ఒక మహాయుద్ధం జరగకుండా ట్రంప్‌ చేశారని ఈ వ్యాఖ్యల అర్థం. ట్రంప్‌ తనను తెరముందుకు తెచ్చినందుకు కృతజ్ఞతగా ఈ మారు నేరుగా భారత్‌ పేరు ప్రస్తావించకుండానే ఆయనను కీర్తించి షరీఫ్‌ మంచి మార్కులు కొట్టేశారు. తాను కోరుకుంటున్నదే షరీఫ్‌ నోట వినబడుతుందని ట్రంప్‌కూ తెలుసు. అదిమాత్రమే కాక, గాజా శాంతి ఒప్పందం మరుసటి దశల అమలులో పాకిస్థాన్‌ ప్రముఖ పాత్ర పోషించబోతున్నదన్న సందేశం కూడా ఇందులో ఉన్నదని కొందరి వాదన. పశ్చిమాసియా పరిస్థితులను ప్రముఖంగా మార్చివేసే ఈ ఘట్టానికి, భారత ప్రధాని దూరంగా ఉండిపోవడం సరికాదని, ఇజ్రాయెల్‌ నుంచి ఇరాన్‌ వరకూ, అరబ్‌ దేశాలన్నింటితోనూ సత్సంబంధాలున్న మనం, అంతటి పెద్ద వేదిక మీద కనిపించివుంటే బాగుండేదన్న అభిప్రాయం కొట్టిపారేయలేనిది. వందిమాగధులంతా ట్రంప్‌కు జేజేలు పలికే ఈ కార్యక్రమానికి వెడితే తానూ ఏమి చేయాల్సివస్తుందో తెలుసు కనుకనే దూతను మాత్రమే పంపి మోదీ సరిపెట్టివుండవచ్చు. ఎట్టకేలకు ఈ శాంతి ఒప్పందం కుదిరినందుకు ప్రపంచమంతా సంతోషిస్తున్నా, కేవలం తొలి అడుగుపడి, ఇంకా అనేక కీలకదశలు దాటాల్సి ఉన్న తరుణంలో అపనమ్మకాలూ లేకపోలేదు.

హమాస్‌ చెరలో ఉండిపోయిన ఇజ్రాయెలీ పౌరులు, ఇజ్రాయెల్‌ జైళ్ళలో మగ్గుతున్న పాలస్తీనా పౌరుల్లో ఐదోవంతుమంది బయటకు వచ్చిన ఆ దృశ్యాలు ఎంతో ఉపశమనం కలిగించాయి. ఇజ్రాయెల్‌ సైన్యాలు వెనక్కు తగ్గడం, ఎక్కడెక్కడో తలదాచుకున్న గాజాపౌరులు తిరి‍గి రావడం వంటి పరిణామాలు బాగున్నాయి. అయితే, ఒప్పందాలూ అవగాహనలను ఉల్లంఘించడం ఇజ్రాయెల్‌కు అలవాటే కనుక, అమెరికా అధ్యక్షుడు హితవుపలికినట్టు శాంతిని కడవరకూ కాపాడాల్సిన బాధ్యత ప్రధానంగా ఇజ్రాయెల్‌పైనే ఉంది. రెండేళ్ళ యుద్ధంలో పూర్తిగా నేలమట్టమైపోయిన గాజా భవితవ్యం గురించి కానీ, స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటు ఊసు గానీ ఈ ఒప్పందంలో లేవు. హమాస్‌ చేతుల్లోనుంచి జీవించివున్న బందీలంతా విడుదలైనప్పటికీ, మిగతావారి మృతదేహాల అప్పగింత విషయంలో వివాదం సాగుతూనే ఉంది. నెతన్యాహూ చెబుతున్న లెక్కలకు, హమాస్‌ అప్పగింతలకు లెక్కసరిపోవడం లేదు. ఇరవై మృతదేహాలను తన దగ్గరే పెట్టుకొని హమాస్‌ కొత్త నాటకానికి తెరదీసిందని ఇజ్రాయెల్‌ ఆరోపణ. గాజాలో సామాన్యుల ప్రాణాలు తీస్తూ ఇజ్రాయెల్‌ ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న ఘటనలు కూడా వెలుగుచూస్తున్నాయి. నోబెల్‌ శాంతికోసం అల్లాడిపోతున్న ట్రంప్‌ మళ్ళీ హమాస్‌ను తప్పుబట్టడం ఆరంభించారు. బందీలంతా క్షేమంగా తిరిగి వచ్చేశారు కనుక, మృతదేహాల పేరిట ఇజ్రాయెల్‌ తిరిగి కయ్యానికి కాలుదువ్వే ప్రమాదం కనిపిస్తోంది. కట్టుదాటితే ఏ మాత్రం క్షమించేది లేదని ఇజ్రాయెల్‌ను ట్రంప్‌ ఘాటుగా హెచ్చరించినప్పుడే, ఈ ఒప్పందం నిలుస్తుంది.

Updated Date - Oct 17 , 2025 | 01:39 AM