Western Dominance: ప్రభవిస్తున్న భారత్‌పై అగ్రరాజ్యాల అసూయ
ABN, Publish Date - Jun 12 , 2025 | 06:30 AM
ప్రభవిస్తున్న ఒక కొత్త శక్తిని ఎవరూ అభిమానించరు. నేను ప్రస్తావిస్తున్న కొత్త శక్తి భారత్. అవును, మన భారత్ ఉత్థానాన్ని అమెరికా అంగీకరించదు. చైనా సహించదు. ఐరోపా ఇష్టపడదు. ప్రభవించే కొత్త శక్తి యథాతథ పరిస్థితిని మార్చివేసి, ప్రాబల్య సమతుల్యతను తలకిందులు చేస్తుంది కనుకనే ఆ విముఖత.
ప్రభవిస్తున్న ఒక కొత్త శక్తిని ఎవరూ అభిమానించరు. నేను ప్రస్తావిస్తున్న కొత్త శక్తి భారత్. అవును, మన భారత్ ఉత్థానాన్ని అమెరికా అంగీకరించదు. చైనా సహించదు. ఐరోపా ఇష్టపడదు. ప్రభవించే కొత్త శక్తి యథాతథ పరిస్థితిని మార్చివేసి, ప్రాబల్య సమతుల్యతను తలకిందులు చేస్తుంది కనుకనే ఆ విముఖత. చైనా అగ్రరాజ్య ప్రతిపత్తిని సమకూర్చుకుంటున్నప్పుడు తాము ప్రాధాన్యం కోల్పోతామని పాశ్చాత్య అగ్ర రాజ్యాలు భయపడ్డాయి. చైనాను ప్రపంచ అగ్రగామి ఆర్థిక శక్తిగా, అధునాతన సాంకేతికతల కాణాచిగా అంగీకరించేందుకు వాటికి దశాబ్దాలు పట్టింది. భారత్ ప్రగతి విజయాల పట్ల అమెరికా నేతృత్వంలోని పాశ్చాత్య ప్రపంచ ప్రతిస్పందన మరింత సంక్లిష్టంగా ఉన్నది. తమ ప్రపంచాధిపత్యానికి ఒక ప్రత్యక్ష ముప్పుగా చైనాను భావించిన ఆ సంప్రదాయ అగ్రరాజ్యాలు భారత్ సర్వోన్నతిని అలా భావించడం లేదు. అయితే భారత్ రాబోయే ఇరవై సంవత్సరాలలో పాశ్చాత్య అగ్రరాజ్యాలకు ఒక శక్తిమంతమైన ఆర్థిక, సైనిక, సాంకేతికతా ప్రత్యర్థిగా ప్రభవించనున్నదని వాషింగ్టన్‌లోని ముందుచూపుగల ఆలోచనాపరులు గ్రహించారు. ప్రపంచ శక్తులుగా ప్రభవిస్తున్న దేశాల పట్ల పాశ్చాత్య అగ్రరాజ్యాలు ఎలా వ్యవహరిస్తాయో తెలుసుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది. సోవియట్ యూనియన్ 1960వ దశకం వరకు అమెరికాకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నది. దాని స్థాయిని తగ్గించేందుకు అమెరికా ఒక జంట వ్యూహాన్ని అనుసరించింది. తొలుత చైనాతో స్నేహం చేసింది. 1972లో అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్, తన విదేశాంగ కార్యదర్శి హెన్రీ కిస్సింజర్‌తో కలిసి బీజింగ్‌ను సందర్శించారు. ప్రపంచ అగ్రగామి కమ్యూనిస్టు దిగ్గజ రాజ్యాలు సోవియట్ యూనియన్, చైనాల మధ్య విభేదాలు సృష్టించడమే అమెరికా లక్ష్యం. తమతో మైత్రికి రావడంలో అమెరికా లక్ష్యమేమిటో చైనా సర్వోన్నత నాయకుడు మావో జెడాంగ్‌కు బాగా తెలుసు.
అయినప్పటికీ గుంభనగా అమెరికాతో స్నేహం నెరిపారు. 1979లో అమెరికా, చైనాల మధ్య పూర్తి స్థాయి దౌత్య సంబంధాలు నెలకొన్నాయి. ఇందుకు ప్రత్యుపకారంగా చైనీస్ శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులకు అమెరికా టెక్నాలజీని నిర్నిబంధంగా అందుబాటులో ఉంచేందుకు వాషింగ్టన్ పాలకులు అంగీకరించారు. దరిమిలా మూడు దశాబ్దాల పాటు చైనా ఆ సౌలభ్యాన్ని ఎంత గరిష్ఠంగా ఉపయోగించుకోవాలో అంత గరిష్ఠంగా ఉపయోగించుకుంది. అమెరికా సృష్టించిన అధునాతన సాంకేతికతల గుట్టు మట్టులు తెలుసుకుంది. వాటి ఆలంబనతో సొంతంగా సాంకేతికతలను అభివృద్ధిపరచుకున్నది. ‘మీ శక్తి సామర్థ్యాలను గుప్తంగా ఉంచండి, సమయం కోసం వేచి ఉండండి’ అని కమ్యూనిస్టు చైనా మహా సంస్కర్త డెంగ్ జియావో పింగ్ తన ప్రజలకు ఉపదేశించారు. ఆ సమయం 2010లో వచ్చింది. అమెరికా దిమ్మ తిరిగిపోయేలా చైనా జీడీపీ 20 రెట్లు పెరిగింది (1980లో 0.30 ట్రిలియన్ డాలర్ల నుంచి 2010లో 6.10 ట్రిలియన్ డాలర్లకు చేరింది). ఇదే కాలంలో అమెరికా జీడీపీ కేవలం ఐదు రెట్లు మాత్రమే అధికమయింది (1980లో 2.86 ట్రిలియన్ డాలర్ల నుంచి 2010లో 15.05 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది). ఇదిలావుండగా అమెరికా తన వ్యూహంలోని రెండో అంశాన్నీ అమలుపరచసాగింది. 1991లో ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన తరువాత రష్యా ముప్పును తటస్థీకరించడమే ఈ రెండో ఎత్తుగడ. సైనిక కూటమి నాటోను విస్తరించి రష్యా ముంగిటకు తీసుకువెళ్లింది. 1991లో 16 సభ్య దేశాలు ఉన్న నాటో 2025లో 32 సభ్య దేశాల కూటమిగా మహాబలోపేతమయింది. ఈ సభ్య దేశాలు రష్యాను ప్రభావశీలంగా చుట్టుముట్టాయి. మరింత స్పష్టంగా చెప్పాలంటే రష్యా ఇప్పుడు నాటో చక్ర బంధంలో ఉన్నది. ఇదే సమయంలో పాశ్చాత్య అగ్ర రాజ్యాల ఆధిపత్యానికి అంతకంతకు పెరుగుతోన్న ఒక మహా ముప్పుగా చైనా మరింత తీవ్ర స్థాయిలో పరిణమిస్తోంది. బీజింగ్‌కు వ్యతిరేకంగా వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనీస్ సరుకులపై దిగుమతి సుంకాలను 145 శాతం నంచి 30శాతానికి అనివార్యంగా తగ్గించుకున్నారు.
పాశ్చాత్య అగ్రరాజ్యాల ఆధిపత్యానికి భారత్ నుంచి తక్షణ సవాళ్లు ఏమీ లేవు. అయితే రాబోయే ఇరవై ఏళ్లలో తమ ఆధిక్యతను భారత్ సమర్థంగా సవాల్ చేయగలదని ఆలోచనాపరులు అయిన అమెరికా నాయకులకు అవగతమయింది. ఈ కారణంగానే, ఇటీవల పాకిస్థాన్ భారత్ సాయుధ సంఘర్షణల సందర్భంగా భారత్‌ను, ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తున్న పాకిస్థాన్‌ను సమస్కంధులుగా పరిగణించేందుకు వాషింగ్టన్ పాలకులు ప్రయత్నించారు! పెరుగుతోన్న చైనా ప్రాబల్యాన్ని ఎదుర్కొనేందుకు భారత్ ఎలా ఉపయోగకరమో , భారత్ ఉత్థానాన్ని అదుపు చేసేందుకు పాకిస్థాన్ కూడా అదే విధంగా ఉయోగపడుతుందని వాషింగ్టన్ భావిస్తోంది. జపాన్‌ను అధిగమించి భారత్ ప్రపంచ నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించింది. భారత్ జీడీపీ 4.187 ట్రిలియన్ డాలర్లు (రూ.3,56,61,000 కోట్లు) కాగా జపాన్ జీడీపీ 4.186 ట్రిలియన్ డాలర్లు (రూ.3,56,53,000 కోట్లు). 2027లో జర్మనీని అధిగమించి ప్రపంచ అతి పెద్ద మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్ ప్రభవించనున్నది. అద్భుత పురోగమనం, సందేహం లేదు. అయినా ఈ ప్రగతిపథంలో మన దేశం చైనా, అమెరికాలకు చాలా దూరంలో వెనక పట్టునే ఉండిపోయింది. ఒక వాస్తవమేమిటంటే చైనా, అమెరికాలు మన కంటే చాలా ముందున్నప్పటికీ వాటి వార్షిక వృద్ధిరేటు మన వార్షిక వృద్ధిరేటులో సగంగా మాత్రమే ఉన్నది.
ఈ బహు దూరాలు అధిగమించలేనివా? కానే కావు. గత రెండు దశాబ్దాలలో చైనా త్వరితగతిన పురోగమించి అమెరికా తరువాతి స్థానానికి చేరలేదూ? మరి భారత్ కూడా రాబోయే ఇరవై ఏళ్లలో అటువంటి అద్భుత పురోగతి సాధించగలుగుతుందా? దీర్ఘకాలానికి వర్తించే అంచనాలు వేయడం అంత సులభం కాదు. అసాధ్యం అని కూడా ఒప్పుకుందాం. అయితే ఆర్థికాభివృద్ధిలో అమెరికా, చైనాలతో ఉన్న అంతరాన్ని భారత్ తప్పకుండా గణనీయంగా అధిగమించి తీరుతుంది. ఇది తథ్యం. శక్తిమంతమైన చైనీస్, టర్కిష్ ఆయుధ వ్యవస్థలను తుత్తినియలు చేసి పాకిస్థాన్‌పై భారత్ నిర్ణయాత్మక సైనిక విజయాన్ని సాధించడాన్ని ప్రపంచ వ్యాప్తంగా రక్షణ వ్యవహారాల నిపుణులు గుర్తించారు. ప్రత్యర్థి రష్యా బలిమిని తగ్గించడంలో సఫలమైన అమెరికా ఇప్పుడు చైనా, భారత్‌లతో ఆసియా ప్రపంచ మహా శక్తిగా పునరుజ్జీవమవనున్నదని అమితంగా కలవరపడుతోంది. 2035 సంవత్సరం నాటికి చైనా, భారత్‌ల మొత్తం జీడీపీ అమెరికా జీడీపీని పూర్తిగా అధిగమించనున్నదని ప్రపంచ ఆర్థికవేత్తలు ఘంటాపథంగా చెప్పుతున్నారు. ఆధునిక ప్రపంచ చరిత్రలో ప్రప్రథమంగా సంభవించనున్న పరిణామమిది. అగ్రరాజ్యమంటే ఏమిటి? తన జాతీయ ప్రయోజనాలకు ప్రమాదమేర్పడినప్పుడు స్వీయ సైనిక శక్తిని నిర్ణయాత్మకంగా ఉపయోగించగల సామర్థ్యం, సంకల్పం కలిగి ఉండడమే ఒక అగ్రరాజ్యాన్ని నిర్వచించే విశిష్ట లక్షణం. పాశ్చాత్య అగ్రరాజ్యాలు తమ జాతీయ ప్రయోజనాలకు ముప్పు వాటిల్లినప్పుడు తమ సైనిక బలాన్ని నిస్సంకోచంగా, అంతర్జాతీయ సమాజం ఆమోదం పొందనవసరంలేకుండా ఉపయోగించాయి. ఆపరేషన్ సిందూర్‌తో భారత్ ఈ శతాబ్దంలో మొట్టమొదటసారి అదే విధంగా వ్యవహరించింది. పాకిస్థాన్‌పై భారత్ నిర్ణయాత్మక సైనిక చర్య పాశ్చాత్య అగ్రరాజ్యాలలో అసూయ రేకెత్తించింది. వాస్తవిక దృష్టినీ కల్పించింది. ప్రపంచ అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా ప్రభవిస్తున్న భారత్ తన సైనిక పాటవాన్ని నిర్ణయాత్మకంగా ఉపయోగించగల సామర్థ్యాన్ని, సంకల్పాన్ని నిరూపించుకుంది. అందుకే అసూయ. ఆపరేషన్ సిందూర్ ప్రపంచ అధికార సమతౌల్యతను పునర్ నిర్దేశించింది. దీనితో భారత్ శక్తి సామర్థ్యాలు పాశ్చాత్య అగ్రరాజ్యాలకు అవగతమయ్యాయి.
-మిన్హాజ్ మర్చెంట్
(‘ఓపెన్’ సౌజన్యం)
Updated Date - Jun 12 , 2025 | 06:33 AM