India Population: అధిక జనాభా... వరమా, భారమా
ABN, Publish Date - Jun 14 , 2025 | 02:59 AM
ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం భారత జనాభా 146 కోట్లకు చేరుకుంది. మరో నలభై ఏళ్లలో అది 170 కోట్లకు చేరుకుని, తర్వాత తగ్గడం మొదలుపెడుతుంది. ఎందుకంటే ప్రస్తుత జననాల రేటు స్థిరీకరణకు అవసరమైన 2.1 కన్నా తక్కువగా 1.9గా కొనసాగుతోంది
ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం భారత జనాభా 146 కోట్లకు చేరుకుంది. మరో నలభై ఏళ్లలో అది 170 కోట్లకు చేరుకుని, తర్వాత తగ్గడం మొదలుపెడుతుంది. ఎందుకంటే ప్రస్తుత జననాల రేటు స్థిరీకరణకు అవసరమైన 2.1 కన్నా తక్కువగా 1.9గా కొనసాగుతోంది. అలా తక్కువగా కొనసాగడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య. కాబట్టి దాన్ని అధిగమించాలా, లేదా ప్రపంచంతోనే నడుస్తూ, భారత్ కూడా అట్టే పట్టించుకోనక్కరలేదా అన్నది ఒక కోణం. ఇప్పుడు దృష్టి పెట్టాల్సినవి రెండు ముఖ్యాంశాలు ఉన్నాయి. ఒకటి– జనాభాలో 68 శాతం పని చేయగల వయస్సువారు, అంటే అరవై నాలుగు సంవత్సరాల లోపువారు. అందులో యువత కూడా గణనీయ సంఖ్యలో ఉన్నారు. సమగ్ర ప్రణాళికలు, వాటి అమలుతో వారిని ఉత్తమ మానవ వనరులుగా తీర్చిదిద్దవచ్చు. ఆరోగ్యం, విద్య, నైపుణ్యాలు, ఉపాధి వీలైనంత ఎక్కువమందికి చవకగా అందుబాటులో ఉంచాలి. వ్యవసాయం, పరిశ్రమలు, పరిశోధన, సేవలు, ఉత్పాదకత రంగాలను ఆధునిక సాంకేతికత సాయంతో దేశం స్వయం సమృద్ధి సాధించడానికే కాకుండా ప్రపంచ దేశాలకు అందించే స్థాయికి తీసుకురావాలి. ప్రస్తుతం తీసికట్టుగా ఉన్న మానవ అభివృద్ధి సూచీల మెరుగుదల సాధించాలి. పెరుగుతున్న ఆర్థిక అంతరాల్ని తగ్గించే విధానాలు ఉండాలి. దేశ సంపద, ఆదాయాలు ఒక్క శాతం మంది చేతిలో నలభై శాతం ఉండడం, ఏబై శాతం మంది ప్రజలు, ఆరు శాతం సంపదతో సరిపెట్టుకోవాల్సి రావడం సమర్థనీయం కాదు. ఈ అంతరంతో సమ్మిళిత అభివృద్ధి సాధ్యం కాదు. అందుకనే సంపద పంపిణీ, పేదరిక నిర్మూలనలపై విధానాల్ని పునస్సమీక్షించుకోవాలి. ఇక రెండోది– వృద్ధులు జనాభాలో ఏడు శాతం. జీవన ప్రమాణాల పెంపుతో ఆ సంఖ్య మరింత పెరుగుతుంది. వారికి సామాజిక రక్షణ కల్పించడం ప్రభుత్వాల బాధ్యత. కనుక నూతన విధానాలతో ఆ దిశగా అడుగులు వేయాల్సి ఉంటుంది. ఇక, జననాల రేటు తగ్గినా అది దేశవ్యాప్తంగా ఒకేలా లేదు. అందుకనే దక్షిణాది రాష్ట్రాలు పిల్లల్ని ఎక్కువగా కనమని పిలుపు ఇస్తుంటే, ఉత్తరాది వారు ఎక్కువమందితో సతమతమవుతున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ కూడా దీనితో ప్రభావితమవుతోంది. ప్రాంతీయ అసమానతలు ఎక్కువ కాకుండా చూడాలి. సున్నితత్వంతో, దీర్ఘకాలిక వ్యూహంతో వ్యవహరిస్తే అధిక జనాభా దేశానికి వరం. లేదంటే పెను భారం.
– డి.వి.జి. శంకరరావు,
మాజీ ఎంపీ
Updated Date - Jun 14 , 2025 | 03:02 AM