Shashi Tharoor: భారత్ చేయి విడిస్తే అమెరికాకే భారం
ABN, Publish Date - Sep 09 , 2025 | 05:03 AM
భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం అమెరికాకు కలిమి, బలిమి కలిగించేదేకానీ భారమయ్యేది కాదు, కాబోదు. అయినా ప్రపంచ అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని ప్రపంచ పురాతన ప్రజాస్వామిక రాజ్యం ఎందుకు దూరం చేసుకుంటోంది..
భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం అమెరికాకు కలిమి, బలిమి కలిగించేదేకానీ భారమయ్యేది కాదు, కాబోదు. అయినా ప్రపంచ అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని ప్రపంచ పురాతన ప్రజాస్వామిక రాజ్యం ఎందుకు దూరం చేసుకుంటోంది? 1940ల తుదినాళ్లలోను, 1950ల తొలినాళ్లలోను ‘చైనాను కోల్పోయింది ఎవరు?’ అన్న అంశంపై అమెరికాలో తీవ్ర చర్చ జరిగింది. అక్టోబర్ 1949లో జనచైనా (పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా) ఆవిర్భావం అమెరికా రాజకీయవేత్తలు, శాసన నిర్మాతలను అమితంగా కలవరపరిచింది. మహానాయకుడు మావో నేతృత్వంలో చైనా కమ్యూనిస్టు పార్టీ చాంగ్–కై–షేక్ నాయకత్వంలోని జాతీయవాద కొమింగ్‌టాంగ్‌ను ఓడించి జనచైనాను నెలకొల్పింది. ఈ పరిణామం కమ్యూనిజంపై ప్రచ్ఛన్నయుద్ధంలో ప్రజాస్వామ్యానికి ఒక వినాశనకర ఓటమిగా, అమెరికా విదేశాంగ విధానం వైఫల్యంగా వాషింగ్టన్ పాలకవర్గాలు భావించాయి. భారత స్వాతంత్ర్య శతాబ్ది (2047) నాటికి, లేదా ఆలోగానే మరొక పరిణామం అమెరికా పాలకవర్గాలలో మరో తీవ్ర అలజడికి కారణమయ్యేందుకు ఆస్కారమున్నది. అమెరికాకు దూరమై, చైనా, రష్యాలకు భారత్ సన్నిహితమవడమే ఆ సంభావ్య పరిణామం. అదే జరిగితే ‘భారత్‌ను కోల్పోయింది ఎవరు?’ అనే విషయమై అమెరికాలో సంచలనశీల వాదోపవాదాలు జరగడం ఖాయం. భారత్‌తో మైత్రి పెద్దగా ప్రాధాన్యం లేని విషయంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్నారు! ఇది సబబేనా? అమెరికా–భారత్ స్నేహబంధం 21వ శతాబ్ది అత్యంత ప్రధానమైన వ్యూహాత్మక భాగస్వామ్యాలలో అగ్రగణ్యమైనది. రక్షణ రంగంలో సహకారం, సాంకేతికతల ఆదాన ప్రదానాల నుంచి పసిఫిక్ మహాసముద్ర తీరస్థ ప్రాంతాలలో శాంతి సుస్థిరతలకు ఇతోధిక కృషి దాకా పరస్పర గౌరవ విశ్వాసాలు, ఉమ్మడి ప్రయోజనాలకు దృఢమైన పునాదులను న్యూఢిల్లీ, వాషింగ్టన్ నిర్మించుకున్నాయి. అయితే ఇప్పుడు ఆ పునాదులు కదిలిపోతున్నాయి. కారణమేమిటి? భారత్‌పై కనీవినీ ఎరుగని రీతిలో ట్రంప్ విధిస్తున్న ప్రతీకార సుంకాలు, భారత్ పట్ల ఆయన ప్రదర్శిస్తున్న తిరస్కారపూరిత వైఖరి. ఇవి ఉభయ దేశాల మధ్య దౌత్య ఘర్షణలకు దారితీస్తున్నాయి. అమెరికాకు ప్రధాన శత్రువు అని భావిస్తున్న చైనాపై 30 శాతం సుంకాలు, ఇతర ఆసియా దేశాలపై 15 నుంచి 20 శాతం సుంకాలు మాత్రమే విధించిన ట్రంప్ భారత్‌పై ఏకంగా 50 శాతం సుంకాలు విధించారు! అమెరికా ప్రజలు సైతం హర్షించని నిర్ణయమిది అనడంలో సందేహం లేదు. పాతికేళ్లుగా భారత్–అమెరికా సంబంధాలను నిర్వచించి, నిర్ణయిస్తున్న, నిర్దేశిస్తున్న ‘వ్యూహాత్మక భాగస్వామ్యం’ ఏమయింది? ట్రంప్ నిర్ణయాలు, చర్యలు దానికి సమాధి తవ్వుతున్నాయి.
అయితే ఆ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కాపాడుకుని పెంపొందించుకునేందుకు ఇంకా కాలం మించిపోలేదు –వాషింగ్టన్ అభిలషిస్తే. భారత్ పట్ల ఘర్షణాత్మక వైఖరిని అమెరికా విడనాడాల్సిన సమయమాసన్నమయింది. బీటలువారుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పునరుద్ధరించుకుని దృఢతరం చేసుకోవాల్సిన అగత్యం ఎంతైనా ఉన్నది. ఇది ఇరుదేశాల ప్రయోజనాల పరిరక్షణకే కాకుండా ప్రపంచ దేశాల విస్తృత లబ్ధికి కూడా చాలా అవసరం. ఆగస్టు 26–27 అర్ధరాత్రి భారతీయ సరకులపై సుంకాలను రెట్టింపు (50 శాతం) చేశారు. అమెరికాకు భారత్ ఎగుమతి చేస్తున్న 8,700 కోట్ల డాలర్ల విలువైన సరుకులలో 4,800 కోట్ల డాలర్ల విలువైన సరుకులపై ఈ సుంకాల పెంపుదల భారం పడింది. జౌళి, బంగారు ఆభరణాలు, ముత్యాలు, చర్మ ఉత్పత్తులు, సముద్ర ఆహారోత్పత్తులు (ముఖ్యంగా రొయ్యలు), ఆటోమొబైల్స్ విడిభాగాల ఎగుమతులు ఈ సుంకాల భారాన్ని భరించవలసివున్నది. ప్రస్తుతానికి ఫార్మాస్యూటికల్స్, ఎలక్ట్రానిక్ వస్తువులను ఈ సుంకాల పెరుగుదల నుంచి మినహాయించారు. భారత్ ఎగుమతులపై అమెరికా సుంకాల పెరుగుదలకు కారణమేమిటి? రష్యా నుంచి చమురు, సహజ వాయువు, సైనిక సామగ్రిని భారత్ కొనుగోలు చేయడమే! ఈ కొనుగోళ్ల నుంచి లభిస్తున్న ఆదాయంతోనే రష్యా, ఉక్రెయిన్‌పై ఎడతెగని యుద్ధం చేయగలుగుతోందని ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఈ అభియోగాన్ని న్యూఢిల్లీ తీవ్రంగా ఖండించింది. అదొక నిరాధారమైన ఆరోపణ అని సహేతుకంగా స్పష్టం చేసింది. చైనా తమకంటే చాలా పెద్ద ఎత్తున రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందని, యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా రష్యా నుంచి 6,700 కోట్ల డాలర్ల విలువైన సరుకులు దిగుమతి చేసుకుంటున్నాయని, అయినా చైనా, యూరోపియన్ దేశాలపై అమెరికా అధిక సుంకాలు విధించలేదని భారత్ ఆక్షేపించింది. భారత్‌పైనే వివక్ష ఎందుకు అని ప్రశ్నించింది.
ట్రంప్ విధించిన 50 శాతం సుంకాలు కేవలం ఆర్థిక జరిమానాలు కాదు. అవి రాజకీయ సంకేతాలు. వ్యూహాత్మక స్వతంత్ర ప్రతిపత్తితో వ్యవహరిస్తున్నందుకు భారత్‌కు శిక్షగా అమెరికా ఆ ప్రతీకార సుంకాలు విధించిందని న్యూఢిల్లీ అధికార వర్గాలు సునిశ్చితంగా విశ్వసిస్తున్నాయి. ఆ సుంకాల పర్యవసానాలు భారత్‌కు తీవ్ర నష్టదాయకంగా పరిణమించనున్నాయి. అమెరికా విపణిలో భారతీయ సరుకులు పోటీ సామర్థ్యాన్ని కోల్పోనున్నాయి. స్వదేశంలో తిరుపూర్, సూరత్, విశాఖపట్నంలో వేలాది కార్మికులు వీధిన పడవలసే పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా వినియోగదారులు అధిక ధరలు భరించవలసిరావడంతో ఆ దేశ వ్యాపారస్తులు ఇప్పటికే వియత్నాం, ఈక్విడార్, థాయిలాండ్, టర్కీ నుంచి భారతీయ ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా వివిధ సరుకుల దిగుమతికి ఇప్పటికే ఏర్పాట్లు చేసుకొంటున్నారు. సూరత్‌లో బంగారు ఆభరణాల శ్రామికులు, తిరుపూర్‌లో జౌళి కార్మికులు, విశాఖపట్నంలో రొయ్యల సాగుదారులు కోలుకోలేని రీతిలో నష్టాలపాలయ్యారు. ఇది అటు అమెరికాకు కానీ, ఇటు భారత్‌కు కానీ లాభదాయకం కాని పరిస్థితి. ఉభయులకూ నష్టాలు ఖాయంగా వాటిల్లుతాయి. ఇంకెంత మాత్రం ఈ పరిస్థితి కొనసాగకూడదు. దీనిని తొలగించుకోకపోతే భారత్–అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు అడుగంటుతాయి. ఆర్థిక వ్యవస్థల సౌష్ఠవమూ దెబ్బతింటుంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈ వాణిజ్య యుద్ధం పెచ్చరిల్లుతున్నప్పటికీ రక్షణ రంగంలో భారత్ అమెరికాల మధ్య సహకారం యథాతథంగా ఉన్నది. సైనిక సహకారాన్ని మరింత దృఢతరం చేసుకునేందుకు, అత్యాధునిక ఆయుధాల ఉత్పత్తిలో భాగస్వామ్యాన్ని పెంపొందించుకొనేందుకు, ‘టైగర్ ట్రయంఫ్’ పేరిట సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించేందుకు భారత్, అమెరికాలు ఫిబ్రవరి 2025లో పరస్పరం సంకల్పించుకున్నాయి. పలు అత్యాధునిక యుద్ధ విమానాలు, నవీన సైనిక సామగ్రిని అమెరికా నుంచి కొనుగోలు చేసేందుకు భారత్ నిర్ణయించుకున్నది. ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలతో రక్షణ రంగంలో ఈ సహకారానికి తీవ్ర విఘాతమేర్పడే అవకాశమున్నది. భారత్ కేవలం వాణిజ్య భాగస్వామి మాత్రమే కాదు, ఇండో–పసిఫిక్ ప్రాంతంలో ఒక కీలక శక్తి. అమెరికా ఈ వాస్తవాన్ని విస్మరిస్తే ‘క్వాడ్’ బలహీనపడే ప్రమాదమున్నది. అది, అమెరికాకు ఏ మాత్రం శ్రేయస్కరం కాని పరిణామమవుతుంది.
భారత్ వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి తన సార్వభౌమత్వాధికార వ్యక్తీకరణేగానీ, ఏ దేశాన్నీ ధిక్కరించడంగానీ, సవాల్ చేయడం గానీ కాదని అమెరికా గుర్తించాలి. విదేశీ వాణిజ్యంలో ఏ దేశమైనా స్వీయ జాతీయ ప్రయోజనాలకే అగ్ర ప్రాధాన్యమిస్తుంది. మరి రష్యా నుంచి చమురు, సహజవాయువు, సైనిక సామగ్రి కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌ను ప్రతీకార సుంకాలతో శిక్షించడం సమంజసమేనా, ట్రంప్ గారూ? దూరదృష్టితో తీసుకోని నిర్ణయాలు అమెరికాకు ప్రతికూలంగా పర్యవసించడం ఖాయం. ఉభయతారకంకాని చర్యలకు బదులుగా వాషింగ్టన్ ఇలా వ్యవహరించడం ఇరు దేశాలకూ శ్రేయస్కరంగా ఉంటుంది : ప్రతీకార సుంకాలను, మరీ ముఖ్యంగా శ్రమ సాంద్ర రంగాలపై, తక్షణమే ఎత్తివేయాలి (25 శాతం సుంకాలకే ఈ రంగాలు కుదేలవుతున్నాయి. 50 శాతం సుంకాలతో అవి తమ ఉత్పత్తులను విక్రయించుకోవడం అసాధ్యం); స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై చర్చలు వేగవంతం చేయాలి; పరస్పర రాయితీలపై నిర్మాణాత్మక చర్చలతో భారత్‌పై విధించే సుంకాలను, ఇతర ఆసియా దేశాల విషయంలో వలే, 15 నుంచి 19 శాతానికి తగ్గించాలి; ప్రభుత్వాధినేతల మధ్య ప్రత్యక్ష సంభాషణలతో సహా అత్యున్నత స్థాయి దౌత్య మంతనాలను పునః ప్రారంభించాలి (ఈ నెల 17న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు అధ్యక్షుడు ట్రంప్ శుభాకాంక్షలు తెలిపితే ఇరువురి మధ్య సంబంధాలలో నెలకొన్న పొరపొచ్చాలు తొలగిపోయి సుహృద్భావం వెల్లివిరియదా? ఈ నెలలోనే ప్రారంభమవనున్న ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సమావేశాల సందర్భంగా ట్రంప్, మోదీ మనసు విప్పి మాట్లాడుకుంటే అద్భుతాలు సంభవిస్తాయి). సాంకేతికతల ఆదాన ప్రదానాలు, రక్షణ రంగంలో సహకారం పరస్పర విశ్వాసాన్ని దృఢతరం చేస్తాయి, ఉభయ దేశాల ప్రయోజనాలను పరిరక్షిస్తాయి. భారత్ కేవలం ఒక సౌలభ్య భాగస్వామి మాత్రమే కాదు, ఎంతో ప్రాధాన్యమున్న ఎనలేని సానుకూల పరిణామాలకు దోహదం చేసే సాటిలేని భాగస్వామి. భారత్ భాగస్వామ్యం బలిమేగానీ భారం కాదని, కాబోదనే వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి. విభేదాలు కొనసాగితే రెండు దశాబ్దాల (ఉమ్మడి లక్ష్యాల, ప్రయోజనాల) వ్యూహాత్మక ఏకీకరణ నిరర్థకమవుతుంది. భారత్–అమెరికా వ్యూహాత్మక సంబంధం అంతర్జాతీయ శాంతిభద్రతలు, రాజకీయ సుస్థిరత భవిష్యత్తుకు ఆవశ్యకమైనది. ఆ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పునర్నిర్మించేందుకు భారత్–అమెరికాల మధ్య పరస్పర విశ్వాసం మళ్లీ నిండుగా వర్ధిల్లాలి. ఇందుకు అమెరికాయే ప్రథమ చొరవ తీసుకోవాలి. ‘చెరపకురా చెడేవు, చెరువుకు నీటి ఆశ, నీటికి చెరువు ఆశ’ అనే భారతీయ లోకోక్తులలోని విశ్వజనీన వివేకాన్ని ట్రంప్ విస్మరించరని ఆశిద్దాం.
-శశి థరూర్ లోక్‌సభ సభ్యుడు
Updated Date - Sep 09 , 2025 | 05:03 AM