Thermal Power Importance: దేశ ప్రగతిలో నల్ల బంగారం
ABN, Publish Date - Jun 18 , 2025 | 02:28 AM
ప్రస్తుతం మన దేశ తలసరి విద్యుత్ వినియోగం సుమారు 1,395 యూనిట్లు మాత్రమే. ఇది ప్రపంచ సగటు విద్యుత్ వినియోగం కంటే చాలా తక్కువ. యూఎస్‌ఏ తలసరి విద్యుత్ వినియోగం సుమారు 12,497 యూనిట్లు.
ప్రస్తుతం మన దేశ తలసరి విద్యుత్ వినియోగం సుమారు 1,395 యూనిట్లు మాత్రమే. ఇది ప్రపంచ సగటు విద్యుత్ వినియోగం కంటే చాలా తక్కువ. యూఎస్‌ఏ తలసరి విద్యుత్ వినియోగం సుమారు 12,497 యూనిట్లు. చైనా సగటు తలసరి విద్యుత్ వినియోగం 6,150 యూనిట్లు. మన దేశ తలసరి విద్యుత్ వినియోగం కంటే ఖతార్, కువైట్, సౌదీ అరేబియా దేశాల తలసరి విద్యుత్ వినియోగం చాలా ఎక్కువ. దేశ ఆర్థికాభివృద్ధితో పాటు ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల కోసం తలసరి విద్యుత్ వినియోగాన్ని భారీగా పెంచాల్సిన అవసరం ఉంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో పునరుత్పాదక ఇంధన రంగంలో భారతదేశం విశేష పురోగతి సాధించింది. గత ఏడాది దేశం 29.52 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంది. దీంతో మొత్తం సామర్థ్యం 220.10 గిగావాట్లకు పెరిగింది. ప్రధాని మోదీ నాయకత‍్వంలో 2030 నాటికి మన దేశం శిలాజేతర ఇంధన ఉత్పత్తి సామర్థ్యాన్ని 500 గిగావాట్లకు పెంచుకోవాలనే లక్ష్యంతో ముందుకుపోతోంది. అంతర్జాతీయంగా ఈ ప్రయత్నాలు ఎన్నో ప్రశంసలు పొందుతున్నప్పటికీ భారతదేశ ఇంధన రంగంలో బొగ్గు రంగం పాత్ర మరువలేనిది. ఈ ఏడాది మార్చి 31 నాటికి భారతదేశ మొత్తం స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 483.26 గిగావాట్లు. ఇందులో బొగ్గు ఆధారిత విద్యుత్ స్థాపిత సామర్థ్యం 210 గిగావాట్లు. భారతదేశం తన ఇంధన మిశ్రమంలో దాదాపు 55 శాతం బొగ్గుపై ఆధారపడి ఉంది. దేశంలోని విద్యుత్తులో దాదాపు 74 శాతం బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అవుతోంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం రికార్డు స్థాయిలో ఒక బిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసి ఓ కీలక మైలురాయిని అధిగమించింది.
మోదీ క్రియాశీల నాయకత్వంలో బొగ్గు రంగంలో స్వావలంబన వైపు కదులుతూ ఇంధన భద్రత, ఆర్థికవృద్ధి సాధించేలా భారతదేశం అడుగులు వేస్తోంది. కేంద్రం తెచ్చిన సంస్కరణలు, విధానాల ఫలితంగా రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తి జరిగింది. వీటిలో గనులు, ఖనిజాలు (అభివృద్ధి, నియంత్రణ) చట్టానికి సవరణలు, బొగ్గు గనుల చట్టం, CMSP చట్టం– 2015 ద్వారా బొగ్గు బ్లాకుల వాణిజ్య వేలాన్ని, బొగ్గు రంగాన్ని ప్రైవేట్ సంస్థలకు తెరవడం, సింగిల్ విండో వ్యవస్థ, స్థిరమైన, బాధ్యతాయుతమైన మైనింగ్‌తో కూడిన అత్యాధునిక సాంకేతికతలు, సమర్థవంతమైన పద్ధతులు బొగ్గు ఉత్పత్తిని గణనీయంగా పెంచాయి. ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలో భారతదేశం క్రిటికల్ మినరల్స్ రంగంలో దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకుని, కీలకమైన ఖనిజాల రంగంలో ముఖ్య పాత్ర పోషించడానికి సాహసోపేతమైన చర్యలు తీసుకుంటోంది. చైనా తర్వాత రెండో అతిపెద్ద బొగ్గు ఉత్పత్తిదారు భారత్. ఇండోనేసియా, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి హై గ్రేడ్ బొగ్గును కూడా దిగుమతి చేసుకుంటోంది. దేశీయ ఉత్పత్తి పెరగడం వల్ల 2024 ఏప్రిల్, డిసెంబర్ మధ్య భారతదేశ బొగ్గు దిగుమతులు 8.4 శాతం తగ్గాయి. ఫలితంగా గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే దాదాపు 5.43 బిలియన్ డాలర్ల విదేశీ మారకద్రవ్యాన్ని దేశం ఆదా చేసింది. ఉద్గారాలను తగ్గించడం, వాతావరణ మార్పులను తగ్గించడం కోసం బొగ్గు/లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులను ప్రోత్సహించడానికి రూ.8,500 కోట్ల వ్యయంతో సమగ్ర పథకానికి ఇటీవల కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంతో మార్గం సుగమమైంది. ‘బొగ్గు నుంచి SNG, నైట్రేట్’ ప్రాజెక్ట్‌లను స్థాపించడానికి ఈక్విటీ పెట్టుబడుల ప్రతిపాదనలను మంత్రివర్గం ఆమోదించింది. భారతదేశం పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సామర్థ్యాన్ని, ముఖ్యంగా సౌర, పవన విద్యుదుత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరిగినప్పటికీ, వాటి ఉత్పత్తి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఒడిదొడుకులకు గురవుతూ ఉంటుంది.
ఎల్లవేళలా స్థిరమైన ఉత్పాదకతను సౌర, పవన విద్యుత్ ప్లాంట్లు కలిగి ఉండకపోవడంతో గ్రిడ్ నిర్వహణలో సవాళ్లు తప్పవు. ఈ నేపథ్యంలో ఎళ్లవేళలా నాణ్యమైన థర‍్మల్ విద్యుదుత్పత్తి కోసం బొగ్గు ఎంతో కీలకంగా మారింది. 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే ‘వికసిత్ భారత్ @ 2047’ లక్ష్యంతో భారత ప్రభుత్వం ముందుకు సాగుతోంది. 2021 నవంబర్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి ‘ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్’ (COP–26)లో భారతదేశం 2070 నాటికి కర్బన ఉద్గారాలను నికరంగా సున్నా (నెట్ జీరో) స్థాయికి తగ్గించాలని లక్ష్యంగా ప్రకటించింది. ఇక్కడ నెట్ జీరో అంటే బొగ్గు వాడకాన్ని జీరో చేయడం కాదు. పరిశ్రమల్లో అత్యాధునిక సాంకేతికతను వినియోగించి కర్బన ఉద్గారాలను సాధ్యమైనంతగా తగ్గించడంతో పాటు అడవుల విస్తీర్ణాన్ని పెంచి రెండింటి మధ్య సమతుల్యతను సాధించడం. మనదేశ పురోగతికి బొగ్గు దశాబ్దాల తరబడి ఇంధనాన్ని అందిస్తోంది. లక్షలాది గృహాలకు శక్తిని అందించింది. ఉపయోగకరమైన ఆర్థిక కార్యకలాపాలను ఉత్పత్తి చేసింది. వాతావరణ మార్పు, వాయు కాలుష్యంపై స్థిరమైన మార్గాన్ని అనుసరించాల్సిన అవసరాన్ని గుర్తించినప్పటికీ, రాబోయే రోజుల్లో బొగ్గు రంగం, సవాళ్లను ఎదుర్కొంటూనే భారతదేశ ఇంధన రంగానికి ప్రధాన దిక్సూచిగా నిలవనుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
-ప్రసన్నకుమార్ మోటుపల్లి
సీఎండీ, ఎన్‌ఎల్‌సీ ఇండియా,
బొగ్గు మంత్రిత్వ శాఖ
Updated Date - Jun 18 , 2025 | 02:31 AM