Womens Safety: మెరుగయిన మహిళా భద్రత
ABN, Publish Date - Oct 18 , 2025 | 04:20 AM
మహిళల భద్రతలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో అగ్రస్థానానికి దూసుకుపోతుండటం గర్వకారణం. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న...
మహిళల భద్రతలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో అగ్రస్థానానికి దూసుకుపోతుండటం గర్వకారణం. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న అవగాహన కార్యక్రమాలు, పోలీసుల సత్వర స్పందన... ఇలా అన్నీ కలసి మహిళలకు భరోసా, నమ్మకం కల్పిస్తున్నాయి. ప్రతి మహిళ ధైర్యంగా న్యాయం కోసం పోరాడే సామర్థ్యాన్ని పొందేలా ప్రత్యేక పథకాలు పాలకులు అమలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం రాకముందు రాష్ట్రంలో హింస, అత్యాచారాల సంఖ్య పెరిగిపోయింది. మహిళలు భయంతో బతికే పరిస్థితి ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎన్సీఆర్బీ–2023 నివేదిక ప్రకారం, గత ప్రభుత్వ పాలనలో మహిళలు, బాలికలపై నేరాలు, అఘాయిత్యాలు గణనీయంగా పెరిగాయి. దేశవ్యాప్తంగా 8,416 కేసులు నమోదైతే, అందులో 2,826 (33.57శాతం) ఏపీలోనే ఉన్నాయి. బాధితుల సంఖ్యలో కూడా దేశంలో 8,661 మంది ఉంటే, ఏపీలో 3,020 మంది బాధితులు ఉన్నారు. జాతీయ క్రైం రేటు 1.3గా ఉండగా, ఏపీలో ఇది 10.6గా ఉందంటే గత ప్రభుత్వ హయాంలో మహిళలపై దాడులు ఎంత ఘోరంగా జరిగాయో అర్థమవుతున్నది. షెల్టర్‌హోమ్‌లలో బాలికలపై లైంగిక వేధింపుల విషయంలోనూ ఉత్తరప్రదేశ్ తరువాత ఏపీ మూడవ స్థానంలో ఉంది.
దళితులపై దాడుల విషయంలో కూడా దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. వారానికి ముగ్గురు దళిత మహిళలు అత్యాచారానికి గురైన కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 57,789 ఎస్సీ/ఎస్టీ కేసులలో 2,027 ఏపీలోనే నమోదయ్యాయి. ప్రతి నెలా మూడు హత్యలు, నలుగురిపై హత్యాయత్నాలు, వారానికి 11 దాడులు, రోజుకు సగటున 5–6 అకృత్యాలు జరిగాయంటే పరిస్థితి ఎంత హీనంగా ఉండేదో అర్థమవుతోంది. మహిళలు, బాలికల భద్రతపై ఎన్సీఆర్బీ గణాంకాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. అత్యాచారాల్లో 98 శాతం కేసుల్లో నిందితులు బాధితురాళ్లకు పరిచయమైనవారే అని ఎన్సీఆర్బీ రిపోర్ట్ స్పష్టం చేసింది. 2023లో పోక్సో కింద నమోదైన 858 కేసుల్లో 99.4 శాతం బాధితులకు తెలిసినవారే నిందితులుగా తేలారు. వీటిలో 425 కేసులు సోషల్ మీడియా పరిచయాల వల్ల, 335 కేసులు కుటుంబ సభ్యులు, స్నేహితులు, పొరుగువారి వల్ల, 93 కేసులు బాధితుల సొంత కుటుంబసభ్యుల వల్ల చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల్లో భద్రతపై నమ్మకం పెరిగింది. హత్యలు, నేరాలు, మహిళలపై అఘాయిత్యాలు ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి. నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవడం వల్ల రాష్ట్రంలో భద్రతా వాతావరణం మెరుగుపడింది. ఇందుకు గణాంకాలే సాక్ష్యాలు. గత ఏడాదితో పోలిస్తే మహిళలపై దాడులు 4.84శాతం తగ్గినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో తెలిపారు. వరకట్న మరణాలు 86 నుంచి 49కి, మహిళా హత్యలు 33 నుంచి 28కి తగ్గాయి. 343 మంది నిందితులపై పోక్సో చట్టాన్ని అమలు చేశారు. 13,672 పాఠశాలలు, కళాశాలల్లో స్వీయరక్షణ శిక్షణ, 17,576 మంది బాలికలను శక్తి వారియర్స్‌గా తీర్చిదిద్దారు. కేవలం 15 నెలల్లోనే కూటమి ప్రభుత్వం మహిళల భద్రతా ప్రమాణాలను పెంచింది. అత్యాచారాలు, దాడులపై సాంకేతికత, పోలీసు చర్యలు, సామాజిక అవగాహనలను సమన్వయం చేసి, భద్రతా వాతావరణాన్ని పెంపొందించింది. ‘నేషనల్ యాన్యువల్ రిపోర్ట్ ఇండెక్స్ ఆన్ ఉమెన్స్ సేఫ్టీ–2025’ ప్రకారం, విశాఖపట్టణం దేశంలోనే అత్యంత సురక్షిత నగరాల్లో రెండో స్థానంలో నిలిచింది.
రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో నేరాల నుంచి రక్షణకు అవగాహన కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాం. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో పర్యటించి, మహిళలకు చట్టాలు, హక్కులపై అవగాహన కల్పిస్తున్నాం. వన్ స్టాప్ సెంటర్ల ద్వారా వందలాది మహిళలు రక్షణ పొందుతున్నారు. గృహహింస, ఆస్తి వివాదాలు, ఉద్యోగం చేసే ప్రదేశాల్లో వేధింపుల విషయంలో న్యాయం పొందుతున్నారు. అదేవిధంగా ఫేక్ శక్తి సదన్‌లపై ఉక్కుపాదం కూడా మోపాం. మహిళా సంక్షేమంలో భాగంగా సూపర్ సిక్స్ పథకాల ద్వారా మహిళలను ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్నది. దీపం పథకం, తల్లికి వందనం, స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఆర్థిక సహాయం, ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. మహిళల స్వయం సమృద్ధి కోసం హస్తకళలు, చిన్న వ్యాపారాలు, డిజిటల్ మార్కెటింగ్, నైపుణ్య శిక్షణలను అందిస్తున్నారు. అయితే, కొన్ని సంఘటనలు ఇంకా కలవరపెడుతున్నాయి. పాలకొల్లు, ఉయ్యూరు, విజయవాడ సమీప గ్రామాలు, విశాఖలో చోటుచేసుకున్న ఘటనలు సమాజం ఎంత జాగ్రత్తగా ఉండాలో సూచిస్తున్నాయి. శారీరకంగా, మానసికంగా బలహీనమైన బాలికలు దాడులకు గురై తమ వేదనను బయటపెట్టలేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై న్యాయ ప్రక్రియ కూడా వేగవంతం కావాలి, ప్రత్యేక కోర్టులు మరింత బలంగా పనిచేయాలి. కేవలం చట్టాలే సరిపోవు, సామాజిక దృక్పథం కూడా మారాలి. కుటుంబం, పాఠశాలలు, సమాజం కలిసి కృషి చేస్తేనే మహిళలు ధైర్యంగా జీవించే ఆస్కారం కలుగుతుంది.
శైలజ రాయపాటి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్
Updated Date - Oct 18 , 2025 | 04:20 AM