ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Financial Impact: ప్రవాసులపై ట్రంప్‌ మరో పిడుగు

ABN, Publish Date - May 22 , 2025 | 06:12 AM

అమెరికా ట్రంప్ పరిపాలన 5 శాతం సుంకం విధించే బిల్లుతో భారతీయ సమాజం ఆందోళన చెందింది. ఈ సుంకం భారతదేశం నుండి అమెరికాకు నగదు పంపే వ్యక్తులపై ప్రభావం చూపిస్తుంది.

ట్రంప్ పరిపాలనా సరళిలోనే ‘అమెరికా ఫస్ట్’ అనే నినాదం అంతర్భాగం. ఆయనకు అమెరికా ప్రయోజనాలు మాత్రమే ముఖ్యం. అందుకోసం తీసుకునే నిర్ణయాలు మిగిలిన ప్రపంచం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయనేది వారికి ముఖ్యం కాదు. అగ్రరాజ్యంగా అమెరికా తీసుకునే నిర్ణయాలు యావత్ ప్రపంచాన్ని కూడా ప్రభావితం చేయగల నేపథ్యంలో ట్రంప్ సర్కారు సరికొత్త ఆలోచన ప్రకంపనలు పుట్టిస్తోంది. అమెరికా పౌరులు కానివారు అంతర్జాతీయంగా చేసే నగదు చెల్లింపులపై ఐదు శాతం సుంకం విధించాలనే బిల్లును ట్రంప్ ప్రభుత్వం రూపొందించింది. ఈ బిల్లు అమెరికాలోని విదేశీయులలో, ముఖ్యంగా భారతీయ సమాజంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ బిల్లు గురించి మధ్య, దిగువ మధ్య తరగతికి చెందిన వారంతా బాగా ఆందోళన చెందుతున్నారు. అమెరికా నుంచి పెద్ద మొత్తాల్లో నగదు చెల్లింపులు పొందుతున్న దేశాల్లో మొదటిస్థానం ఇండియాదే. ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం 2023లో అంతర్జాతీయంగా అన్ని దేశాల నుంచి భారత్‌కు చేరిన నగదు చెల్లింపులు అన్నీ కలిపి 125 బిలియన్ డాలర్లు కాగా, అందులో కేవలం అమెరికా నుంచి వచ్చిన భాగమే 89 బిలియన్ డాలర్లు ఉంది! అమెరికాలోని ఆర్థిక వ్యవహారాల్లో భారతీయ సమాజం చూపించగల ముద్ర ఏమిటన్నదానికి ఈ నివ్వెరపరిచే లెక్కలే సాక్ష్యమంటూ అమెరికన్ మీడియా ప్రధానంగా ప్రస్తావించింది. ఇంత పెద్దమోతాదులో అమెరికా నుంచి భారత్‌కు నగదు తరలుతుండడానికి అనేక కారణాలున్నాయి. ఇండియాలో ఉన్న తమ తల్లిదండ్రులు జీవనం గడవడానికి; తమ నుంచి ఆర్థికంగా మద్దతు ఆశించే సోదరులు, కుటుంబసభ్యులకు పంపడానికి; వారి ఆరోగ్య అవసరాలు తీర్చడానికి డబ్బు పంపడం సర్వసాధారణం. ఇండియాలో రియల్ ఎస్టేట్‌లోను, ఇతర వ్యాపారాల్లోనూ పెట్టుబడులు పెట్టడానికి అమెరికా నుంచి నిధులు పంపేవాళ్లు కూడా ఉన్నారు. భారత్‌లో రియల్ ఎస్టేట్ రంగాలు ఆకర్షణీయమైన వృద్ధిని నమోదు చేస్తుండడంతో పాటు, స్వదేశంలో పెట్టుబడులు పెట్టడం అనేది భవిష్యత్ భద్రతకు పునాదులు వేస్తాయని వారు నమ్ముతుండడం కూడా ఇందుకు ఒక కారణం. అలాగే అమెరికాలోని పలువురు భారతీయులు రిటైర్మెంట్ తర్వాత తమ విరామ జీవితాన్ని గడపడానికి కూడా భారత్‌నే ఎంచుకుంటూ ఉంటారు. పోల్చి చూసినప్పుడు ఇండియాలో జీవనవ్యయం అమెరికా కంటే బాగా తక్కువ కావడంతో రిటైరైన తర్వాత అక్కడకు వెళ్ళే ఉద్దేశంతో ముందే పొదుపు పథకాల్లోను, బీమా, పెన్షన్ పథకాల్లోనూ సొమ్ములుపెట్టే వాళ్ల సంఖ్య కూడా ఎక్కువే. అలాగే అమెరికాలోని భారతీయ సమాజం దాతృత్వానికి కూడా పెట్టింది పేరు. స్వదేశంలో వివిధ సేవా కార్యక్రమాల కోసం అమెరికా నుంచి బిలియన్లలో డాలర్లు ఖర్చు పెడుతుంటారు.


సామాజిక సమస్యల కోసం, విపత్తు సమయాల్లోను ఇది మరింతగా కనిపిస్తుంటుంది. మనం ఎదిగి వచ్చిన సమాజానికి తిరిగి రుణం తీర్చుకోవడం అనేది భారతీయ సంస్కృతి మూలాల్లోనే ఉన్న అంశం కావడంతో వీరిలో ఆ వైఖరి ఎక్కువ. అమెరికాలో స్థిరపడేలా గ్రీన్ కార్డు పొందడంలో ఉన్న ఇబ్బందులు, అస్థిర పరిస్థితులు, సుదీర్ఘకాలం ఎదురుచూడాల్సిన అవసరం లాంటి వాతావరణం ఇక్కడి భారతీయ సమాజాన్ని భారత్‌కు డబ్బు తరలించేందుకు ప్రేరేపిస్తుంటుంది. అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితుల్లో ఉన్నవారు– ప్రత్యేకించి హెచ్–1బి లేదా ఎల్–1 వీసాల మీద ఉన్నవారు– తమ స్వదేశంలో ఆర్థిక భద్రతకే అధిక ప్రాధాన్యం ఇస్తుండడం కూడా ఒక కారణం. తమ మిత్రులు, బంధువులకు కానుకలు పంపేవారు; అమెరికాలో చదువులకోసం భారత్‌లో తీసుకున్న విద్యారుణాలకు తిరిగి చెల్లింపులు చేసేవారు కూడా ఎక్కువే. ఇలాంటి కారణాలతో అమెరికా నుంచి భారత్‌కు నగదు చెల్లింపులు భారీగానే జరుగుతాయి. అయితే ఇప్పుడు ఈ చెల్లింపుల మీద 5 శాతం సుంకం విధించడానికి ట్రంప్ నిర్ణయించడం వీరందరినీ కూడా ప్రభావితం చేస్తుంది. పెట్టుబడులు, రాబడి మార్గాల కోసం అమెరికా నుంచి డబ్బు పంపేవారు ఈ కొత్త సుంకాన్ని కూడా పద్దులో రాసుకుని, ఆ మేరకు తమ లాభాలు ప్లాన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే భారత్‌లో ఉన్న తమ కుటుంబాలు గడవడానికి, తల్లిదండ్రులను పోషించడానికి, విద్యారుణాలు చెల్లించడానికి ఇక్కడినుంచి డబ్బు పంపుతున్న వారికి ప్రభుత్వం అదనంగా ఒక్క శాతం సుంకం విధించినా అది చాలా పెద్ద భారం. అమెరికా నుంచి భారత్‌కు అందుతున్న నగదుకు కారణాలు ఏమైనా కావొచ్చుగాక. కానీ ఆ చెల్లింపుల మీద 5 శాతం సుంకం విధించాలన్న ట్రంప్‌ నిర్ణయం ఆ సొమ్ము అటు పంపుతున్న, ఇటు స్వీకరిస్తున్న వారి జీవితాలపై గణనీయమైన ప్రభావం చూపిస్తుంది. ఆర్థిక లావాదేవీల మీద సుంకాలు విధించడం వంటి నిర్ణయాలు తీసుకునే ముందు జరుగుతున్న చెల్లింపుల మౌలిక స్వభావం ఏమిటో అర్థం చేసుకోవడం ముఖ్యం. అన్ని రకాల వ్యవహారాలను ఒకే గాటన కట్టేసినట్టుగా విదేశాలకు జరిగే ప్రతి చెల్లింపు మీద గంపగుత్తగా 5 శాతం సుంకం విధించడం చాలామంది జీవితాలను ప్రభావితం చేస్తుంది. భారతీయులు మాత్రమే గాక, అనేక దేశాల నుంచి అమెరికాకు వచ్చి తమ దేశాల్లోని కుటుంబాలను పోషించుకోవడానికి ఇక్కడ కష్టపడుతున్న వారంతా కూడా ఈ నిర్ణయం వల్ల ఆందోళనకు గురవుతున్నారు. అమెరికాలోని వ్యక్తులు తమ స్వదేశానికి పంపే సొమ్ములను, ఇతర దేశాలకు పంపే సొమ్ములను వేర్వేరుగా చూడాలి.


పైగా అమెరికాలో ఉంటున్న వారిలో గరిష్ఠంగా స్వదేశంలో తల్లిదండ్రుల కుటుంబపోషణ నిమిత్తం ప్రతి నెలా వెయ్యి, రెండువేల డాలర్ల వరకు పంపడం జరుగుతుంది. నెలవారీగా జరిగే ఇలాంటి చిన్న చెల్లింపులను, స్వదేశంలో సేవా కార్యక్రమాలకు వెచ్చించే మొత్తాలను, సుంకం పరిధి నుంచి మినహాయించాలని భారతీయ సమాజం కోరుకుంటోంది. భారత్‌లో మధ్యతరగతి కుటుంబాలు అనేక కష్టనష్టాలకోర్చి, అప్పులుచేసి ఆస్తులు అమ్మి పిల్లలను అమెరికాకు పైచదువుల కోసం పంపుతుంటారు. అక్కడ ఉద్యోగాలు పొందగలిగితే తమ కష్టాలు, రుణాలు తీరుతాయనే ఆశతో అక్కడి నుంచి రాగల సొమ్ముకోసం ఎదురుచూస్తుంటారు. అలాంటి వారి జీవితాలన్నీ ఈ సుంకంతో ప్రభావితం అవుతాయి. భారత విదేశాంగ శాఖ ఇలాంటి వ్యవహారాల్లో చొరవ చూపించాలి. వ్యాపారుల ప్రయోజనాలను అత్యధికంగా ప్రభావితం చేసే సుంకాల విషయంలో ట్రంప్ ప్రభుత్వానికి లేఖ రాసిన భారత ప్రభుత్వం, అదే విధంగా అమెరికాలోని భారతీయ సామాన్యుల కోణంలో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అమెరికా నుంచి భారత్‌కు జరిగే వ్యక్తిగత చెల్లింపులలో ఒక పరిమితి వరకు సుంకాలు లేకుండా ఉండే విధానం రావాలి.

- కృష్ణమోహన్ దాసరి

పాత్రికేయుడు, డల్లాస్

Updated Date - May 22 , 2025 | 06:13 AM