Hyderabad Crime Rate: భద్రత కరువవుతున్న విశ్వనగరం
ABN, Publish Date - Apr 23 , 2025 | 03:04 AM
హైదరాబాద్ నగరంలో నేరాల సంఖ్య పెరిగిపోతూ ఉంది, ముఖ్యంగా స్త్రీలపై జరుగుతున్న దారుణాలు, అత్యాచారాలు, సైబర్ నేరాలు గణనీయంగా పెరిగాయి. ప్రభుత్వం, చట్టాలు ఉన్నప్పటికీ, అవగాహన రాకపోవడం మరియు శిక్షలు క్షీణంగా ఉండటం కారణంగా ఈ నేరాలు కొనసాగుతున్నాయి
హైదరాబాద్‌ను విశ్వనగరం చేస్తామని ముఖ్యమంత్రులు హామీలిస్తూనే ఉన్నారు. విశ్వనగరం సంగతి దేవుడెరుగు కాని, గుంతలూ, పిచ్చికుక్కలు, రోడ్ల ఆక్రమణలు, మనిషి నడవడానికి జాగాలేని ఫుట్‌పాత్‌లు, వర్షం వస్తే జలమయ మయ్యే రోడ్లు మాత్రం హైదరాబాద్‌లో ఉన్నాయి. మహానగరంలో మహాసమస్యల శీర్షికన ఇదే పత్రికలో ఇదే పేజీలో అయిదేళ్ల కింద ఇదే రచయిత వ్యాసం ప్రచురితమైంది. ఈ అయిదేళ్లలో పరిస్థితులు మారలేదు కాని, సమస్యలు పెరిగాయి. ప్రస్తుతం రాష్ట్రాన్ని, నగరాన్ని పట్టిపీడిస్తున్న విషయాలు చూద్దాం. చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉన్న సంఘటన ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. ఈ విశ్వనగర సందర్శన కోసం ఆనందంగా వచ్చిన ఓ జర్మన్ యువతి ఇక్కడ తన శీలం పోగొట్టుకుంది. హైదరాబాద్‌లో ఏమేం చూడాలనుకుందో, ఎన్ని జ్ఞాపకాలను డైరీలో రాసుకుని జర్మనీలో తన మిత్రులతో పంచుకోవాలనుకుందో, ఎన్ని అద్భుతాలను తన కెమెరాలో ఎక్కించుకుని ఆల్బంలో దాచుకోవాలనుకుందో కాని ఓ కామాంధుని కోర్కెకు బలయింది. ఈ దారుణానికి ఒడిగట్టింది ప్రయాణికులు వంద శాతం నమ్మకం ఉంచే టాక్సీ డ్రైవరు. హైదరాబాద్ రోజురోజుకీ నేర నగరంగా మారుతుందన్న దాఖలాలు అనేకం ఉన్నాయి. రాష్ట్ర పోలీసు శాఖ ఇటీవల విడుదల చేసిన నేరాల నివేదిక 2024 ఈ విషయాన్ని బలపరుస్తోంది. రాష్ట్రంలో గత సంవత్సరం డిసెంబర్ 31 నాటికి 2945 అత్యాచారాలు జరిగాయి. రాష్ట్రంలో స్త్రీల పట్ల జరిగిన నేరాలు 2023లో 19,013 అయితే, 2024లో 19,222కు పెరిగాయి.
స్త్రీల పట్ల జరిగిన నేరాల్లో కేవలం అత్యాచారాలే 28.94 శాతం పెరిగాయి. ఇవికాక హాస్టళ్లలో ఆత్మహత్యలు, కాలేజీల్లో ర్యాగింగులు, ఉద్యోగంలో శోషణ, రోడ్ల వెంబడి వేధింపులు ఉన్నాయి. అసలు ఎటుపోతున్నాం మనం! వీటితో పాటు సైబర్ నేరాలూ పెరిగాయి. సైబర్ సెక్యూరిటీ బ్యూరో లెక్కల ప్రకారం 2020లో 17,571 నేరాలు జరిగితే, అవి 2024లో 25,184 అయ్యాయి. అంటే 43.33 శాతం నేరాలు పెరిగాయి. ఇదే లెక్కన 2024లో స్త్రీలు, యువతులను ఎత్తుకుపోతున్న కేసులు 26.92 శాతం పెరిగాయి. కట్నాల వేధింపులు 8,973; పోక్సో చట్టం కింద జీవితఖైదు పడ్డవాళ్లు డెబ్బై ఏడుగురు... ఇలా నేరాలు పెరుగుడే కాని తరుగుడు కనిపించడం లేదు. రాష్ట్రం మొత్తం మీద నేరాలు చూస్తే అవి కూడా పెరుగుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. తెలంగాణ నేర రికార్డుల ప్రకారం 2020లో 1,19,863 నేరాలు జరిగాయి. అవి 2021 నాటికి 1,25,479కి, 2022లో 1,31,988, 2023లో 1,38,312కు పెరిగాయి. గత ఏడాది జరిగిన నేరాలు 1,69,477. ఈ లెక్కన 2020లో జరిగిన నేరాల కన్నా దాదాపు 42 శాతం ఎక్కువ నేరాలు 2024లో జరిగాయన్నమాట. ఇవన్నీ నమోదయిన నేరాలు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని 320 సెక్షను కొన్ని నేరాలు కోర్టు అనుమతి లేకుండా రాజీపడేవిగా పేర్కొంది. ఇలాంటి వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటే నేరాల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఈ నేరాలు ఇంతగా ఎందుకు జరుగుతున్నాయి? మనం ఎందుకు అరికట్టలేకపోతున్నాం. స్త్రీల పట్ల ఇన్ని నేరాలు జరగడానికి కారణాలేమిటి? ఆగ్రహావేశాలు, అత్యాచారాలు, వివాహేతర సంబంధాలు, ఆ సంబంధాలకు బానిసలై భర్తనూ లేదా భార్యనూ, పిల్లలనూ ఎందుకు చంపుతున్నారన్నది సభ్య సమాజంతో పాటు ప్రభుత్వం ఆలోచించాల్సిన విషయం. నిర్భయ కేసులో చట్టాన్ని మార్చి శిక్షాస్మృతులను బలపరిచాం. ఏమయింది? అత్యాచారం చేసే వారికి భయం కలగడం లేదు.
చట్టాలు బలంగా ఉన్నాయి. నేరాలకు శిక్షలు కటువుగా ఉన్నాయి. నేరస్తులను కటకటాల్లోకి నెట్టే పోలీసులున్నారు. నిందితులను శిక్షించే కోర్టులున్నాయి. అయినా ఖండాంతరాలు దాటి మన నగరాన్ని చూసి జ్ఞాపకాలు మూటకట్టుకుందామనుకున్న జర్మన్ యువతిపై అత్యాచారం ఎందుకు జరిగింది? దిశపై అత్యాచారం ఎందుకు జరిగింది? ఉరుకొండలో భర్తతో కలిసి దైవదర్శనానికి వెళ్లిన యువతిని అతని ముందే అత్యాచారం ఎందుకు చేశారు? పోక్సో చట్టం కిందకు వచ్చే నేరాలు అసలు ఎందుకు జరుగుతున్నాయి. నేరాలు చేయడానికి ధైర్యం ఎక్కడ నుంచి వస్తోంది? భయం ఎందుకు లేదు? ఈ నేపథ్యంలో చట్టాల సవరణ కాదు, వాటి పట్ల అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. నేరం చేస్తే శిక్ష ఈ విధంగా ఉంటుందన్న భయం ప్రజల్లో కలగాలి. అలాగే నేరం చేసిన వారి, మహిళ బతుకును నాశనం చేసిన వారి కేసులను త్వరగా పరిష్కరించాలి. ఆ నేరాలకు బాధ్యులైన వారి గురించి విస్తృత ప్రచారం జరగాలి. దీనికి తోడు నేరం జరిగే అవకాశమున్న ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, టాక్సీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, లారీ డ్రైవర్లకు నేరాల మీద అవగాహన కలిగించాలి. అలాగే అత్యాచార కేసుల్లో కోర్టులు స్త్రీకి కలిగిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కఠినంగా శిక్షించాలి. అలాగే గ్రామాల్లో నేరాలు జరిగితే పంచాయతీలు పెట్టి తీర్పు చెప్పడం కాదు, పోలీసులకు అప్పగించి తగు విధంగా శిక్షపడేలా చేయాలి. విదేశీ యువతులపై అత్యాచారాల కేసుల్లో ప్రజాప్రతినిధులు, మంత్రులు, ముఖ్యమంత్రి చొరవ తీసుకుని కాలయాపన జరగకుండా శిక్షపడేలా చూడాలి.
డా. పి.మాధవరావు ఐక్యరాజ్యసమితి మాజీ సీనియర్ సలహాదారు
Updated Date - Apr 23 , 2025 | 03:04 AM