ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Donald Trump Tariff Impact: అమెరికా సుంకాలతో నష్టమెంత

ABN, Publish Date - Aug 16 , 2025 | 05:18 AM

మన ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ రూపంలో ఆర్థిక సంక్షోభం ముంచుకొచ్చింది. భారత్‌ నుంచి...

న ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ రూపంలో ఆర్థిక సంక్షోభం ముంచుకొచ్చింది. భారత్‌ నుంచి వచ్చే దిగుమతులపై ఈ నెల మొదట్లోనే 25శాతం సుంకాలు విధించగా, మరో 25 శాతం సుంకాలు వడ్డించబోతున్నట్టు 8వ తేదీన ప్రకటించారు. ఇది మరో ఇరవై రోజుల్లో అమల్లోకి రానుంది. ఈ పెంపు ఇక్కడితో ఆగుతుందా? లేక ఆయన గతంలో హెచ్చరించిన విధంగా 250 శాతం వరకూ పెరుగుతుందా అనేది చూడాలి. ట్రంప్‌ నిర్ణయం వల్ల మన దేశం నుంచి అమెరికాకు వెళ్లే 8,500 కోట్ల డాలర్ల (రూ7.1 లక్షల కోట్ల) ఎగుమతులు ఒడుదుడుకుల్లో పడ్డాయి. ఎగుమతి ఆధారిత రంగాలూ, తెలంగాణ వంటి రాష్ట్రాలూ ఈ పరిస్థితులను ఎలా అధిగమించగలవన్నది పరిశీలించాల్సి ఉంటుంది.

రంగాల వారీగా చూస్తే వస్త్ర, ఆభరణాల రంగాలపై అమెరికా ఆంక్షల ప్రభావం ఉండే అవకాశముంది. అధిక సుంకాలవల్ల వీటికి డిమాండ్‌ తగ్గుతుంది. ఉత్పత్తి ఆ మేరకు పడిపోవచ్చు కూడా. ఔషధ రంగం విషయానికొస్తే 2023లో మన దేశం నుంచి 2,700 కోట్ల (రూ. 2.2లక్షల కోట్ల) విలువైన ఎగుమతులు సాగాయి. ఔషధాల ఎగుమతుల్లో అమెరికా వాటా గణనీయంగా ఉన్నా వీటిని ఇతర మార్కెట్లకు మళ్లించుకునే వీలుంది. దీంతో సంబంధం లేకుండా సహజంగానే మన ఎగుమతిదారులు కొత్త మార్కెట్ల వెదుకులాటలో పడతారు. సానుకూల వాణిజ్య ఒప్పందాలున్న ప్రాంతాలకూ, బలంగా ముందుకొస్తున్న ఆర్థిక వ్యవస్థలకూ ఎగుమతులను మళ్లిస్తారు. వాణిజ్యం ఎప్పటికీ నిలకడగా, నిబ్బరంగా ఉండాలంటే ఈ మళ్లింపు అవసరం. దేశ ఐటీ, ఫార్మా రంగ ఎగుమతుల్లో తెలంగాణది ప్రధాన భూమిక. రాష్ట్రం నుంచి ఫార్మా రంగ ఎగుమతుల విలువ దాదాపు 5,500 కోట్ల డాలర్లు (దాదాపు రూ. 4.5 లక్షల కోట్లు). 2023 ఏప్రిల్‌ నుంచి 2024 డిసెంబర్‌ వరకూ రాష్ట్రం నుంచి 940 కోట్ల డాలర్ల (రూ.77,000 కోట్ల) విలువైన ఔషధ ఎగుమతులు సాగాయి. ఔషధ ఫార్ములేషన్ల ఎగుమతుల్లో రాష్ట్రం ఎంతో ముందుంది. 2024 ఏప్రిల్‌– అక్టోబర్‌ల మధ్య తెలంగాణ నుంచి 2.30 లక్షల కోట్ల ఫార్మా ఎగుమతులు సాగాయి. రాష్ట్రం నుంచి చేసిన మొత్తం వాణిజ్య ఎగుమతుల్లో ఫార్మా వాటా 26.9శాతం. ఈ ఏడు నెలల దూకుడును గమనిస్తే వార్షిక ఎగుమతులు 3.9 లక్షల కోట్లు మించుతాయని అంచనా. అందులో అమెరికాకు చేసిన దిగుమతులే దాదాపు రూ. 85,000 కోట్లు వుండొచ్చు. కాబట్టి సుంకాల ప్రభావం తీవ్రంగానే మన ఎగుమతులపై పడక తప్పదు. ఎగుమతుల మళ్లింపు వల్ల కొంతమేర ఈ రంగానికి రక్షణ దొరుకుతుంది. ఇక ఐటీ రంగానికి వస్తే రాష్ట్రం నుంచి ఐటీ ఎగుమతులు 2024–25లో రూ. 3 లక్షల కోట్లు. క్రితంతో పోలిస్తే ఈ పెరుగుదల 12శాతంగా ఉంది. ఐటీ రంగంలో 9.5 లక్షల మంది వృత్తి నిపుణులున్నారు. సర్వీస్‌ రంగంలో తెలంగాణ పాత్రేమిటో గణాంకాలు చెబుతాయి. ఈ రంగానికి సుంకాల బెడద ఇప్పటికైతే లేదు కాబట్టి నిబ్బరంగానే ఉండొచ్చు. అంతేకాదు... దాదాపు రూ. 4.5 లక్షల కోట్ల ఎగుమతుల్లో సేవారంగం వాటా రూ. 3 లక్షల కోట్లు. ఎగుమతులపై పడే మొత్తం ప్రభావాన్ని సేవారంగం ఎగుమతులతో కొంతమేర తట్టుకునే అవకాశం ఉంటుంది.

ఇక్కడ గమనించాల్సిన మరో విషయం... మనం ఎగుమతి చేస్తున్న జనరిక్‌ ఔషధాలను అమెరికా ఉత్పత్తి చేద్దామనుకుంటే అక్కడ ఆరు రెట్ల అధిక ధర పెట్టాల్సి ఉంటుంది. అంతేకాదు, అమెరికాలో లేదా వేరే దేశాల్లో ఉత్పత్తులు మొదలు పెట్టాలంటే అందుకు కనీసం 3నుంచి అయిదేళ్ల సమయం పడుతుంది. ధరల బాదుడుతో అక్కడి వినియోగదారులు నిండా మునుగుతారు. సిప్లా, సన్‌ ఫార్మా, డాక్టర్‌ రెడ్డీస్‌ వంటి సంస్థలు పేటెంట్‌ గడువు పూర్తయిన వందలాది జనరిక్ ఔషధాల్ని అమెరికాకు ఎగుమతి చేస్తూ లాభాలు గడిస్తున్నాయి. నిరుడు మనం 870 కోట్ల డాలర్ల (రూ. 76,113 కోట్లు) ఔషధాలను ఎగుమతి చేయగా, మొత్తం ఎగుమతుల్లో దాని వాటా 11 శాతం. ఆర్థికరంగ నిపుణులు చెబుతున్నట్టు దేశీయ డిమాండ్‌ ఎక్కువగా ఉన్నప్పుడు, వ్యూహాత్మకంగా వేరే మార్కెట్ల అన్వేషణ కొనసాగుతున్నప్పుడు అమెరికా చర్యల ప్రభావం మనపై పెద్దగా ఉండకపోవచ్చు. ఐటీ, ఫార్మా రంగాల్లో మనకున్న శక్తి సామర్థ్యాలను సరిగ్గా వినియోగించుకుంటే ప్రస్తుత అనిశ్చితిని దాటడం ఏమంత కష్టం కాదు.

-బిటి. గోవిందరెడ్డి తెలంగాణ ఐటీ,

పరిశ్రమల మంత్రి ముఖ్య సమాచార అధికారి

Updated Date - Aug 16 , 2025 | 05:18 AM