Gurukula Mitra: సామాజిక చింతనాశీలి గురుకుల మిత్రా
ABN, Publish Date - Jul 20 , 2025 | 12:51 AM
తెలుగుభాష, జాతి, చరిత్ర, సంస్కృతులని లోతుగా అధ్యయనం చేసిన ప్రజ్ఞాశాలి డాక్టర్ గురుకుల మిత్రా.
తెలుగుభాష, జాతి, చరిత్ర, సంస్కృతులని లోతుగా అధ్యయనం చేసిన ప్రజ్ఞాశాలి డాక్టర్ గురుకుల మిత్రా. సకల అభ్యుదయ శక్తుల్ని మిళితం చేసి ‘సమసంఘం’ సంస్థను రూపొందించినవాడు. బడుగు, బలహీనవర్గాల రాజ్యాధికారం కోసం ఒక శాస్త్రీయ దృక్పథాన్ని వెలువరించిన మిత్రా, దేశంలోని వామపక్ష, ప్రగతిశీల సంఘాలన్నింటినీ సమన్వయం చేసి, ‘బలహీన వర్గాల సమాఖ్య’ ఏర్పరిచాడు. దళిత బహుజన శ్రేణులు అన్నింటినీ ఒక్క తాటి పైకి తీసుకొని రావడానికి ప్రయత్నం చేశాడు. ఆనాడే కులగణన కోసం గొంతు విప్పిన వ్యక్తి మిత్రా.
గుంటూరు జిల్లా రేపల్లెలో జూలై 21, 1933లో జన్మించిన మిత్రా, విద్యార్థి ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్నాడు. గుడివాడలో హోమియో వైద్యం అభ్యసించాడు. రాడికల్ వామపక్ష ఉద్యమాలలో క్షేత్రస్థాయిలో పనిచేశాడు. పేదరికాన్ని అనుభవిస్తూనే అసాధారణ అధ్యయనం చేశాడు. కలకత్తాలో పీజీ చదివి, చైనా వెళ్ళి షాంఘై విశ్వవిద్యాలయంలో ఆక్యుపంక్చర్ ఎం.డి. చేశాడు. ఆధునిక పద్ధతులలో ఆ విధానాన్ని మెరుగుపరిచి, భారతదేశంలో ప్రత్యామ్నాయ ఆక్యుపంక్చర్ పద్ధతిని కనుగొన్నాడు. కొన్ని వందల హెల్త్ క్యాంపులు నిర్వహిస్తే, ప్రభుత్వం ప్రత్యేకంగా బస్సులు నడిపేదంటే, వాటికి ఉన్న ప్రజాదరణను ఊహించవచ్చు. ప్రత్యామ్నాయ వైద్యగ్రంథాలు రచించాడు. ఎందరో వైద్యుల్ని, ఆరోగ్య కార్యకర్తల్ని తయారు చేశాడు.
ఒకవైపు వైద్యుడిగా పనిచేస్తూనే, అన్నిరకాల భావోద్యమాల్లోనూ అవిశ్రాంతంగా కృషి చేశాడు. జాతి విముక్తి పోరాటాలు చేస్తున్న రాష్ట్రాలన్నింటిలో అధ్యయన పర్యటనలు చేయడమే కాక, అన్ని ప్రజాసంఘాలతో ఎల్లప్పుడూ చర్చిస్తూనే ఉండేవాడు. అక్రమ కేసుల్లో అనేకసార్లు అరెస్టయ్యాడు. ఒక దశలో మిత్రా మీద నిరంతరం రహస్య నిఘా ఉండేది. కొండపల్లి సీతారామయ్య మొదలుకుని వావిలాల గోపాలకృష్ణయ్య వరకు దేశంలోనూ, తెలుగు ప్రాంతంలో మిత్రాకి పరిచయం లేని బుద్ధిజీవులు లేరు. అటు వామపక్ష ప్రగతిశీల పార్టీల నుంచి, ఇటు నాస్తిక హేతువాద సంఘాల దాకా ప్రజాసంఘాలకి వెన్నుదన్నుగా నిలిచిన మేధావి మిత్రా. ఆ రోజుల్లో తాను దైవాంశ సంభూతుడినని ప్రచారం చేసుకుంటున్న ఒక ప్రఖ్యాత బాబా దగ్గర మారువేషంలో కొంతకాలం శిష్యుడిగా చేరి అక్కడి మోసాల్ని బట్టబయలు చేసి, మహిమలు లేవని నిరూపించిన వ్యక్తి.
భాష విషయంలోనూ మిత్రా తనదైన కృషి చేశాడు. సులువైన వర్ణ క్రమంతో తెలుగు అక్షరమాలని ఆయన ప్రయోగించేవాడు. తన కవితల్లో, రచనల్లో కూడా క్లిష్టమైన, గ్రాంధిక పదాల బదులు అందరికీ అర్థమయ్యే తేలికపాటి వాక్యాల్నే ఆయన ఉపయోగించేవాడు. రోజువారీ వ్యవహారాల్లో తెలుగు భాష ప్రాముఖ్యత గుర్తించాలనే డిమాండుతో మిత్రా అన్ని తెలుగు జిల్లాలలో సమావేశాలు నిర్వహించి, ‘తెలుగు మహాసభ’ స్థాపించాడు. ప్రజా పోరాటాలను నడిపాడు. ‘‘దైనందిన జనజీవన పాలనా విధానంలో, బోధనా రంగంలోనూ తెలుగు భాషనే వాడాలి’’ అంటూ నాటి ముఖ్యమంత్రి ఎన్‌టి రామారావు ఉత్తర్వులు జారీ చేయడంలో మిత్రా కృషి కూడా ఉంది.
అప్పటివరకూ కేవలం నినాదంగా ఉన్న బహుజన రాజ్యాధికారానికి స్పష్టమైన తాత్విక భూమికను మిత్రా రచించాడు. ‘సామాజిక న్యాయం’ అనే మౌలిక ప్రజాతంత్ర భావన ఆధారంగానే ప్రత్యామ్నాయ రాజకీయ స్రవంతులు ఉండాలని నిర్దేశించాడు. ఏ సామాజిక సిద్ధాంతానికైనా ‘సమానతే’ ప్రాతిపాదిక కావాలని ప్రకటించాడు. పీడిత కులాలు ఏకం కావాలని చెబుతూ, దామాషా ప్రకారం అవకాశాలు అన్ని కులాలకు ఉండాలి అంటాడు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ జనాభా ఉన్న తెలగ, బలిజ, మున్నూరు కాపు, తూర్పు కాపు వంటి ఉప కులాలన్నీ సమాఖ్యగా ఏర్పడి కాపు కులం చోదక శక్తిగా మారాలని ఆశించిన మిత్రా ‘కాపునాడు’ రూపకర్త. పీడిత తాడిత, దళిత బహుజన సబ్బండ కులాల ఐక్య సంఘటన ప్రాధాన్యతను ఎన్నడో చాటి చెప్పినవాడు.
సామాజిక మార్పు కోసం కృషి చేసిన మిత్రా ఏప్రిల్ 13, 2007న మరణించాడు. తన మరణానంతరం పార్థివ దేహాన్ని నిట్టనిలువుగా పూడ్చమనే చిత్రమైన కోరిక ఆయన కోరాడంటారు. మిత్రా అముద్రిత రచనలు, శాస్త్రీయ ఆక్యుపంక్చర్ గ్రంథాలు వెలికి తీయాల్సి ఉంది. భావజాల పరంగా మిత్రా ఆలోచనలకు నేడు మరింత ప్రాసంగికత ఉంది. వైద్యునిగా, సామాజిక చింతనాశీలిగా, సాంస్కృతిక దార్శనికుడిగా మిత్రా కృషి ప్రశంసనీయమైనది. జూలై 21న గురుకుల మిత్ర జయంతి. ఆయన ఆశయాల్ని మరింత ముందుకు తీసుకువెళ్ళడమే ఆయనకి ఇవ్వగలిగే క్రియాశీలక నివాళి.
-గౌరవ్
Updated Date - Jul 20 , 2025 | 12:51 AM