GST overhaul Prime Minister speech: జీఎస్టీ ప్రక్షాళన
ABN, Publish Date - Aug 19 , 2025 | 05:49 AM
ప్రధాని ఎర్రకోట ప్రసంగంలో జాతీయతనూ, దేశభక్తినీ రగల్చే వ్యాఖ్యలు ఉత్తేజాన్నివ్వడంతోపాటు, వస్తుసేవల పన్ను (జీఎస్టీ) విధానంలో మార్పు...
ప్రధాని ఎర్రకోట ప్రసంగంలో జాతీయతనూ, దేశభక్తినీ రగల్చే వ్యాఖ్యలు ఉత్తేజాన్నివ్వడంతోపాటు, వస్తుసేవల పన్ను (జీఎస్టీ) విధానంలో మార్పు తేబోతున్నామన్న హామీ ఈ దేశ సగటు మనిషిని కచ్చితంగా సంతోషపెట్టి ఉంటాయి. దీపావళికి జీఎస్టీ పండుగ రాబోతున్నదనీ, ఆ రోజున గొప్ప బహుమతి ఇవ్వబోతున్నామని ప్రధాని ఎర్రకోటమీద నుంచి వ్యాఖ్యానించారు. వెనువెంటనే, ఆర్థిక మంత్రిత్వశాఖ నుంచి మీడియాకు లీకులు అందాయి. ప్రస్తుతం ఉన్న నాలుగురకాల జీఎస్టీ శ్లాబుల్లో ౧2, 28శాతం తొలగిపోయి, ౫, 18శ్లాబులు మిగుల్తూ జీఎస్టీ 2.0 ఆవిర్భవించబోతున్నదని మీడియా కథనాల సారాంశం. కేంద్ర ఆర్థికశాఖ పరోక్షంగా అందించిన సమాచారాన్ని కాచివడబోసి, పాలు, పన్నీరు నుంచి టీవీలు, వాషింగ్ మెషీన్ల వరకూ ఎన్నిరకాల ఉత్పత్తుల ధరలు తగ్గవచ్చునో మీడియా అంచనాలు కడుతోంది. సుంకాల యుద్ధాలో, విదేశాలతో చేసుకోవాల్సి వస్తున్న వాణిజ్య ఒప్పందాలో, సొంతబలం లేని స్థితిలో ముంచుకొస్తున్న రాష్ట్రాల ఎన్నికలో.. ఎవరు ఏ కారణాలు చెబుతున్నప్పటికీ, జీఎస్టీ సమూల ప్రక్షాళనకు ప్రభుత్వం సిద్ధపడినందుకు సంతోషించాలి, అభినందించాలి.
కేవలం శ్లాబుల కుదింపు, పన్నురేట్ల తగ్గింపులే కాక, జీఎస్టీ వ్యవస్థను సమూలంగా సంస్కరించే పని జరుగుతోందట. పన్ను ఎగవేతలను రూపుమాపి, బోగస్ ఇన్వాయిస్‌లతో ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్‌ను దిగమింగే అకృత్యానికి కూడా అడ్డుకట్టవేస్తారట. రిటర్నులు, రిఫండ్ల ప్రక్రియలు అతివేగంగా జరిగిపోతాయట. మొత్తానికి అటు అమ్మకందారు, ఇటు కొనుగోలుదారు కళ్ళలో ఆనందాన్ని చూడాలని ఆర్థికశాఖ అనుకుంటోందని అర్థం. 2017లో జీఎస్టీ వ్యవస్థను ప్రవేశపెడుతున్నప్పుడు పాలకులు దానిని ఏ రీతిన కీర్తించారో మనకు తెలుసు. ఆ తరువాత అది చక్కనిదీ, సరళతరమూ (గుడ్ అండ్ సింపుల్) కాదని తేలిపోయింది. జీఎస్టీ వసూళ్ళు దాదాపు రెండులక్షల కోట్లకు చేరి, ఏటా పదిశాతానికి పైగా వృద్ధి కనబడుతున్నా, పన్ను రేట్లు, వివిధ శ్లాబులలోకి వచ్చే వస్తువులు, సేవల విషయంలో సామాన్యులకు తీవ్రమైన అసంతృప్తి ఉంది. రేట్ల నిర్ణయంలో కేంద్రం అమానవీయంగా వ్యవహరిస్తోంది. ఆరోగ్య ఉత్పత్తులు–సేవలు, ఔషధాలు, వెన్న, నెయ్యి, పాలు వంటి నిత్యావసరాలపైనా జీఎస్టీ హెచ్చుస్థాయిలో ఉండటం ఏ విధంగానూ సమర్థనీయం కాదు.
గత ఏడాది సెప్టెంబరులో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో జరిగిన ఓ సమావేశంలో, తమిళనాడులోని ఓ హోటల్ చైన్ యజమాని వివిధరకాల ఆహారోత్పత్తులపై వేర్వేరు జీఎస్టీ రేట్ల గురించి చేసిన వ్యాఖ్యలు క్రీమ్ బన్ వీడియోగా ఎంతో ప్రాచుర్యం పొందాయి. ‘క్రీమ్ బన్ మీద 18శాతం జీఎస్టీ ఉంటే, విడిగా బన్ మీద అస్సలు లేదు..., మా హోటల్‌కు వచ్చిన కస్టమర్లు, బన్ను, క్రీము వేరువేరుగా ఇస్తే మేమే దానిమీద పూసుకొని తింటామని అంటున్నారు మేడమ్’ అంటూ నిజాన్నీ, నిష్ఠూరాన్నీ సమానపాళ్ళలో మేళవించి వ్యాఖ్యానించాడాయన. ఆ తరువాత ఆర్థికమంత్రికి అవమానమో, ఆగ్రహమో కలిగినందున, విడిగా కలిసి క్షమాపణలు చెప్పకున్న మరో వీడియో వెలుగుచూసింది. ఇక, రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో జరిగిన 55వ జీఎస్టీ సమావేశం పాప్‌కార్న్ ఫ్లేవర్, దానిలోని చక్కెర, మసాలా స్థాయిలను బట్టి మూడురకాల పన్నులు నిర్ణయించడంతో నెటిజన్లు ప్రభుత్వాన్ని తీవ్రంగా ట్రోల్ చేశారు. జీవిత బీమా (లైఫ్ ఇన్సూరెన్స్), ఆరోగ్య బీమా (హెల్త్ ఇన్సూరెన్స్) ప్రీమియంలపై 18శాతం జీఎస్టీ వసూలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాయడం కలకలం రేపింది. సామాన్యులకు అవసరమైన బీమా ప్రీమియంలపై జీఎస్టీని తగ్గించాలంటూ ఉద్యోగ సంఘాలు దీర్ఘకాలంగా డిమాండ్ చేస్తూ, నాయకులకు విన్నపాలు సమర్పిస్తున్నాయి. ప్రీమియం చెల్లింపులపై జీఎస్టీని పూర్తిగా రద్దుచేయాలని పార్లమెంట్‌లో విపక్షాలు అడిగినప్పుడు జీఎస్టీ రాకమునుపు కూడా ప్రీమియంపై పన్ను ఉన్నదంటూ ప్రభుత్వం ప్రతివిమర్శ చేసింది. ప్రతీదానినీ రాజకీయం చేయవద్దని విపక్షాన్ని హెచ్చరించింది. ఇప్పుడు ప్రీమియంపై కూడా పన్ను తగ్గించబోతున్నారనీ, సగటు మనిషి ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పెట్రోలియం ఉత్పత్తులనూ జీఎస్టీ పరిధిలోకి తెచ్చి మంటను ఉపశమింపచేస్తారనీ వింటున్నాం. ప్రజల ప్రతీ అవసరాన్నీ దృష్టిలో పెట్టుకొని, రేట్లనూ, శ్లాబులనూ చక్కదిద్దాలనీ, న్యాయమైన, హేతుబద్ధమైన పన్ను విధానం రూపొంది, అమ్మకందారుల, వినియోగదారుల ప్రశంసలు అందుకోవాలని ఆశిద్దాం.
Updated Date - Aug 19 , 2025 | 06:03 AM