ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Social Empathy: సరిహద్దులు లేని సహానుభూతి

ABN, Publish Date - Jun 27 , 2025 | 05:01 AM

ప్రతి ఉదయం కాఫీ పెట్టుకుంటూ, ‘గడచిన రాత్రి ఉక్రెయిన్‌, గాజా, కశ్మీర్‌, ఇజ్రాయెల్‌, ఇరాన్‌లో ఏమి జరిగి ఉండవచ్చు’ అని ఆలోచనామగ్నుడనవుతాను. ట్యాబ్‌ ఓపెన్‌చేస్తే, కాంతులు విరజిమ్ముతూ ఆకాశంలో దూసుకువెళుతోన్న బాంబులు, క్షిపణులు దృశ్యమానమవుతాయి.

ప్రతి ఉదయం కాఫీ పెట్టుకుంటూ, ‘గడచిన రాత్రి ఉక్రెయిన్‌, గాజా, కశ్మీర్‌, ఇజ్రాయెల్‌, ఇరాన్‌లో ఏమి జరిగి ఉండవచ్చు’ అని ఆలోచనామగ్నుడనవుతాను. ట్యాబ్‌ ఓపెన్‌చేస్తే, కాంతులు విరజిమ్ముతూ ఆకాశంలో దూసుకువెళుతోన్న బాంబులు, క్షిపణులు దృశ్యమానమవుతాయి. ఆ కాంతులు రంగుల రంగేళీ కాదు, మృత్యుపాశాలంటూ నేలమట్టమైన భవనాలు, అంబులెన్స్‌లు, రక్తాలోడుతున్న చిన్నారులు, ఆసుపత్రులు, మృతదేహాలు నాకు గుర్తు చేశాయి. కాఫీ ముగించాను, బ్రౌజర్‌ విండో మూసివేశాను. ఆలోచనలను నా దైనందిన వ్యాపకాల మీదకు మళ్లించాను. సుదూర సంఘటనలపై కలతచెందుతున్న నేను ఒక్కసారిగా నా సొంత జీవితంలో లీనమయ్యాను, లిప్తపాటులో పరివర్తన చెందాను. దూర శ్రవణ సాధనంలో మరణమృదంగాన్ని చూశాను; అది ‘గుండెల కొండలలో మారుమ్రోగుతుండగానే’ బతికే క్షణాలలోకి వెళ్లిపోయాను. మనం మన నిత్య జీవన కార్యకలాపాలను వదిలివేయాలనిగానీ, సొంత భద్రత, ఆనందాల ఆరాటాన్ని ఆపివేయాలని కానీ నేను అనడం లేదు. మరి, ధ్వంసమవుతోన్న మానవతకు దిగ్భ్రాంతి చెందుతూనే ఇలా నిర్లిప్తంగా ఉండిపోవడం వివేకశీలురు చేయవలసిన పనేనా? కాదు. ఆత్మసంరక్షణ ప్రభావంలో హింసనచణ, ధ్వంసరచన దారుణాల నుంచి మానసికంగా దూరతీరాలకు వెళ్లిపోతాం. సామాజిక వేర్పాటు, భౌగోళిక ఎడబాటు సమకూర్చిన వెసులుబాటు ఇది. ఈ రక్షణాత్మక సౌలభ్యమే విశాల ప్రపంచ వేదనకు పరితాపం చెందడం నుంచి స్వీయ జీవితంలోకి వెళ్లేందుకు మనలను పురిగొల్పుతుంది. ఆ అమానుషాలు, అకృత్యాలన్నీ భౌమ రాజకీయాలు, చారిత్రక వైరుధ్యాలు ప్రేరేపించిన ఘర్షణలనీ, వాటిని నివారించేందుకు మనమేమీ చేయలేమని రాజకీయవేత్తలు, రాజనీతిశాస్త్రవేత్తలు వక్కాణిస్తారు. అదొక అనివార్య, చారిత్రక పరిణామమని, నివారించలేని హాని అని మనసు లోలోతుల్లో ఒప్పుకున్నాం కనుక ఘర్షించుకుంటున్న వైరిపక్షాలలో ఒకదానివైపు మొగ్గుతాం.

భౌమ రాజకీయ వైఖరి తీసుకుంటాం. వెన్వెంటనే లోకం బాగోగులను పూర్తిగా ఉపేక్షించి నిత్య జీవన వ్యవహారాలలో తలమునకలవుతాం. సాగుతూన్న యుద్ధాలు సజ్జనులు, దుర్జనుల మధ్య చెలరేగుతున్నవేనని మనకు మనం సంజాయిషీ ఇచ్చుకుంటూ ‘అంతా ప్రారబ్ధం, విధిని ఎవరు తప్పించగలరు?’ అన్న నిట్టూర్పుతో ఇది ముగుస్తుంది. ఒక్కక్షణం మనలను వేరు చేస్తున్న ఈ రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, భాషాసంబంధ, చారిత్రక నిర్దేశాలను తొలగించి చూడండి. అటువంటి అంతరాలు ఏవీలేవని, ‘అంతరంగం అట్టడుగున అంతమందిమీ మానవులమే’ అని స్పష్టమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతోన్న ఈ యుద్ధాలు, ఇతర బాధాకర సంఘటనలు మీకు, నాకు సంబంధించినవేనని అర్థమవుతుంది. వాతావరణ మార్పు మన విశ్వజనీనతను మనకు ఇప్పటికీ గుర్తుచేస్తున్నది. మనకు మనం కట్టుకున్న సకల అడ్డుగోడలకు అతీతంగా అది సర్వత్రా పరివ్యాప్తమై ప్రతి ఒక్కరినీ సతమతం చేస్తోంది. మన సంకుచిత మనస్తత్వం, కూపస్థ మండూక స్వభావం, అత్యాశలు, అధికార ఆరాటాలు, మరీ ముఖ్యంగా సహానుభూతి లేకపోవడమే మనం ఎదుర్కొంటున్న విపత్తులకు మూలమని క్లైమేట్‌ ఛేంజ్‌ విశదం చేస్తోంది. భౌమ రాజకీయ సమస్యలు సమస్తమూ మన వ్యక్తిగత (విలువలు, రాజకీయ అభిప్రాయాలు మొదలైనవి), స్థానిక (పర్యావరణ భద్రత, సామాజిక గతిశీలత, ఆర్థిక స్థితిగతులు మొదలైనవి) అంశాల నుంచే ప్రభవిస్తున్నాయి. గత నెలలో మూడు విభిన్న స్థానిక ఘటనలు నా అనుభవంలోకి వచ్చాయి. ప్రజలను, ధరిత్రిని, విశాల ప్రపంచాన్ని ఎలా చూడాలో అవి నాకు నేర్పాయి. ఇటీవల ప్రముఖ తమిళ రచయిత, అనువాదకుడు ఎమ్‌ఎల్‌ తంగప్ప సన్మాన కార్యక్రమంలో పాల్గొనేందుకు పుదుచ్చేరి వెళ్లాను. ఈ సందర్భంగా ‘ప్రజల సంగీత’ కార్యక్రమం చూస్తారని నాకు చెప్పారు. ఆ కచేరీ ఒక భవనం టెర్రస్‌ మీద జరిగింది. నాకు అది ఒక సంగీత సమారాధన జరిగే ప్రదేశంలాగా కన్పించలేదు.

ఈ అభిప్రాయం, బహుశా, నా సొంత సామాజిక పరిసరాలతో ప్రభావితమయి ఉండవచ్చు. కానీ, పలు సామాజిక, సౌందర్యాత్మక అవధులను అధిగమించిన సంగీతంతో ఆ కచేరీ శ్రోతలను అలరించింది. శాస్త్రీయ, జానపద, లలిత మొదలైన సంప్రదాయ రీతులను ఆ విలక్షణ సంగీత కచేరి విస్మరించింది. సాంస్కృతిక, ఉద్వేగాత్మక విభజనలన్నిటిని అధిగమించి విభిన్న శ్రోతలనందరినీ అలరించిన ఆ సంగీతం నాకొక విశాల భావోద్వేగ అనుభవం. కలశపాక్కం తమిళనాడులో ఒక చిన్న గ్రామం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు ఆ పల్లెలోని ‘సంప్రదాయ విత్తన కేంద్రం’ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నాను. దేవాలయం వెనుక భాగంలో ఉన్న ఒక సరస్సు తీరాన వేప వృక్షం నీడలో సమావేశమయ్యాం. పాతికేళ్లుగా ఆ చుట్టు పక్కల ప్రాంతానికి చెందిన సేంద్రియ వ్యవసాయదారులు ప్రతి నెలా అక్కడ సమావేశమై నైతిక వ్యవసాయం (ఆర్థిక ప్రయోజనాలతో పాటు జంతు సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతలకు ప్రాధాన్యమిచ్చే సేద్యం), విత్తనాలు, సాగు విజ్ఞానాన్ని ఉచితంగా పంచుకోవడం, అవగాహనను పెంపొందించుకోవడం, సుస్థిర వ్యవసాయాభివృద్ధిని సాధించడం మొదలైన అంశాలపై మాటామంతీ జరుపుతారు. పేరాశకు తావులేని జీవన విధానాన్ని ఈ రైతులు దృఢంగా విశ్వసిస్తారు. తమ ఫలసాయాన్ని ఉచితంగా పంచుకుంటారు. భిన్నాభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేస్తారు, చర్చిస్తారు. వారి మధ్య రాజీ చేయ వీలులేని విభేదాలున్నా క్రమం తప్పకుండా సమావేశమవుతారు. చెన్నైలో హైకోర్టు బార్‌ కౌన్సిల్‌ ఆడిటోరియంలో సమాఖ్య పాలనా విధానంపై జరిగిన ఒక సమావేశంలో పాల్గొన్నాను. వేదికపై పలువురు రిటైర్డ్‌, ప్రస్తుత న్యాయమూర్తులు ఉన్నారు. సభికులలో యువ న్యాయవాదులు, విభిన్న సామాజిక నేపథ్యాల నుంచి వచ్చిన వారున్నారు. ఆ యువ న్యాయవాదులలో అనేక మంది ప్రజాఉద్యమాలలో కార్యకర్తలుగా పనిచేస్తున్నవారు. చర్చ శక్తిమంతంగా జరిగింది. లోతైన రాజకీయ వివేచన, చారిత్రకవిశ్లేషణతో రాజ్యాంగ సంస్థల పనితీరులో లోపాలు, లొసుగులు ఎత్తి చూపుతూ ప్రసంగాలు జరిగాయి. పాలనా పద్ధతిగాను, సామాజిక సూత్రంగాను సమాఖ్య విధానంలో తమ విశ్వాసాన్ని దృఢంగా వ్యక్తం చేస్తూ పలువురు వెలువరించిన ప్రసంగాలను విన్నాను.

ఈ మూడు సంఘటనలూ– సంగీతకళాకారుల కచేరీ, వ్యవసాయదారుల సమాలోచన, న్యాయశాస్త్ర విజ్ఞుల చర్చ– ఒకదానితో ఒకటి సంబంధం లేనివిగా కనిపించవచ్చు. కానీ, తమతమ రంగాలలో కృషి చేస్తున్న వారిని సమైక్యపరిచేందుకు, సమష్టి కార్యాచరణకు ఒక ఉమ్మడి ప్రాతిపదికను కనుగొనేందుకు, జీవనసూత్రాలలో భాగమయ్యేందుకు జరిగిన విశిష్ట ప్రయత్నాలవి. వారందరూ విభిన్న ‘స్థానిక’ అంశాలతో వ్యవహరిస్తున్నవారే. సంగీతాన్ని సృష్టించడమేకాకుండా, ఆ శ్రావ్య కళను సృష్టించిన, ప్రదర్శించిన, వినియోగించిన సామాజిక, సాంస్కృతిక సందర్భాలలో మౌలిక గుణశీల మార్పును సాధించడమే పుదుచ్చేరిలోని యువ సంగీత కళాకారుల లక్ష్యం; ఆరోగ్యకరమైన, స్వయం పోషకమైన జీవన విధానం విషయమై తమ అనుభవాలు, పాఠాలను విశాల సమాజంతో పంచుకోవడమే కలశపాక్కం వ్యవసాయదారుల మనోరథం; సమాఖ్య పాలనా విధానంపై తమ చర్చలు, వాదనలు, నిర్ణయాలు న్యాయస్థానాలకే పరిమితమవకూడదనేది న్యాయమూర్తుల, న్యాయవాదుల ఆకాంక్ష. గాజా సుదూర సీమ కాదు, ఉక్రెయిన్‌ రష్యా సమస్య మాత్రమే కాదు. కశ్మీర్‌ సంక్షోభం కేవలం ఉగ్రవాద దుర్మార్గాల పర్యవసానమే కాదు. బతుకు పరుగుల్లో పడి మన చుట్టుపక్కల సంభవిస్తున్న విషాదాలను విస్మరిస్తున్నాం, దురదృష్టకర పరిణామాలను ఉపేక్షిస్తున్నాం. అసంఖ్యాక ప్రజల దురవస్థలకు మానవీయ సంవేదనలతో ప్రతిస్పందించడంలో మన అశక్తతను గాజా, ఉక్రెయిన్‌ యుద్ధాలు ఎత్తి చూపుతున్నాయి. మన ఆలోచనలు మానవతా సంస్పర్శతో సాగాలంటే మన స్థానిక నిమగ్నతలు, బాంధవ్యాలు కేవలం స్వీయ సామాజిక ప్రపంచానికి పరిమితం కాకూడదు. విశాలమైనవి, పరిపూర్ణమైనవిగా అవి వర్ధిల్లాలి.

-టి.ఎమ్‌. కృష్ణ కర్ణాటక సంగీతవేత్త (ది టెలిగ్రాఫ్‌)

Updated Date - Jun 27 , 2025 | 05:19 AM