ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Inspirational Biography: కల్లోల జీవితంపై అక్షరాల వంతెన

ABN, Publish Date - Jun 16 , 2025 | 03:07 AM

నోట్స్ కొనే డబ్బుల్లేక, ఖాళీ సిగరెట్ పెట్టె మీద టీచర్ చెప్పిన పాఠాలు రాసుకుని, వాటిని దారాలతో కుట్టి, చూరుకు వేలాడ దీసి, తీరిక సమయాల్లో చదువుకుని...

నోట్స్ కొనే డబ్బుల్లేక, ఖాళీ సిగరెట్ పెట్టె మీద టీచర్ చెప్పిన పాఠాలు రాసుకుని, వాటిని దారాలతో కుట్టి, చూరుకు వేలాడ దీసి, తీరిక సమయాల్లో చదువుకుని... ఇలాంటి కల్లోల జీవితం లోంచి కమ్యూనిస్టుగా, రచయితగా, అనువాదకుడిగా ఆదర్శవంతమైన జీవితం లోకి ఎదిగారు ఆలూరి భుజంగరావు. శిక్షించకపోతే చదువు రాదని పిల్లల కండ్లలో మిరియపు గంధం పెట్టడం, తల్లిదండ్రులే తమ పిల్లల్ని కమ్మరి దగ్గరికి తీసుకెళ్లి కాళ్లకు సంకెళ్లు వేయించడం వంటి అమానుష పద్ధతులు పాటించే కాలంలో– మూడోతరగతి వాచకం కొనమని గొడవపెట్టినందుకు కొనలేని దుస్థితిలో తండ్రి చింతబరికతో చావ బాదడంతో భుజంగరావు గారి చదువు అర్ధాంతరంగా ఆగిపోయింది. తర్వాతేముందీ... గోళీలాటలూ, బీడీలు కాల్చడాలూ, ఇంట్లో బియ్యం ఎత్తుకెళ్ళి సినిమాలు చూడ్డం, చిరుతిళ్ళూ, చిల్లర తిరుగుళ్ళూనూ!

తొమ్మిదో ఏట పొట్టకూటి కోసం పాట్లు మొదలయ్యాయి. వృద్ధుడైన తండ్రి వల్ల పూట గడవని స్థితిలో భుజంగరావు అన్నలతో కలిసి మధూకరం (భిక్ష) తెచ్చేవారు. పదేళ్ల వయసులోనే హోటల్ కార్మికుడిగా చేరి 23వ ఏట దాకా గుంటూరు, బెజవాడ, తెనాలి, బాపట్ల, చేబ్రోలు పట్టణాల హోటళ్లలో చాకిరీ చేశారు. తిండీ నిద్రా అక్కడే. తెల్లవారు జామున 4 గంటల నుండి రాత్రి 10 గంటలవరకూ పొగలో సెగలో పని. పొట్టకూటి కోసం అలా పాట్లు పడుతూనే హిందీ, తమిళం, కన్నడం, భాషల్ని నేర్చుకున్నారు. కథలు రాశారు. అవి చదివిన కష్టమర్లు హోటల్లో ఈయన్ని చూసి ‘‘ఆ రచయిత ఈయనా!’’ అని మొహం తిప్పుకుపోయే వారట. ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదవడం చూసి యజమానులు కస్సుమ నేవారు. నెల జీతంతో పాటు బీడీలకు అర్ధణా దక్షిణ ఇచ్చేవారు. అవి కాల్చుకోడానికి పది నిమిషాల విరామం ఇచ్చే వారు. బీడీలు కాల్చక పోతే అర్ధణాతోపాటు ఆ విరామమూ పోతుందని బీడీలు కాల్చారు.

ఓ పక్క హోటల్లో పనిచేస్తూనే, సంగీతం నేర్చుకోవాలన్న ఒక గురువు సలహా ప్రకారం తెల్లవారుజామున చలిలో స్వరసాధన కోసం పార్కులో కూర్చుని, ఎలుగెత్తి అరిచి, లాభం లేదని విరమించుకున్నారు. కొన్నాళ్ళు చిత్రకళ అభ్యసించి థియేటర్లలో బోర్డులు రాసి చేతులు కాల్చుకున్నారు. సురభి నాటక సంస్థలో చేరి చిట్టిపొట్టి వేషాలేశారు. మద్రాసువెళ్లి పూట భోజనమూ, ఐదు రూపాయల కూలీకి ‘గొల్లభామ’, ‘నారద నారది’ సినిమాల్లో అతిథి పాత్రలేశారు. దుర్భర జీవితాన్ని గడుపుతూనే హిందీ భాషా సాహిత్యాల అధ్యయనం కోసం హిందీ నేర్చుకున్నారు. ఆయనకు హిందీ నేర్పిన గురువు కూడా ఒక హోటల్ పనివాడే కావడం విచిత్రం. పలక కూడా కొనుక్కోలేని దీన స్థితి చూసి పాపం ఆ గురువే పలక కొనిచ్చాడు. మద్రాసులో అద్దెగది. చింకిచాప కూడాలేని దుస్థితి. ఒక వార్తా పత్రిక మీద పడుకుని మరో పత్రికను కప్పుకుని కాలక్షేపం చేశారు. బ్రతకడానికి హిందీ ట్యూషన్లు చెబుతానంటే, అందుకోసం ‘రాష్ట్రభాష’ పరీక్ష పాసవ్వాలి గానీ, రాహుల్ సాంకృత్యాయన్నీ, ప్రేమచంద్‌నీ చదివి హిందీ పాఠాలు చెబుతానంటే ఎలా? అని పెదవి విరిచారట.

హోటల్లో చదువుకుంటే యజమాని ఒప్పుకోడు కాబట్టి రోడ్డుపక్కన కూర్చుని చదువుకున్నారు. అభ్యుదయ సాహిత్యాన్ని అధ్యయనం చేశారు. ‘‘గోర్కీ జీవితం, ‘అమ్మ’ నవలా నాకెంత ఇష్టమంటే కడుపుకి ఆపరేషన్ చేయించుకున్నపుడు దాన్ని తల కింద పెట్టుకుని పడుకున్నాను’’ అన్నారు. ఉద్యోగానికి ఎసరు వస్తుందని తెలిసి కూడా మేడే ప్రదర్శనలో పాల్గొన్నారు. అలా హోటల్లో పని కూడా పోయింది. రచనా వ్యాసంగంలోకి అడుగు పెట్టి ‘కుక్క ఆత్మకథ’, ‘అంతా గమ్మత్తు’, ‘దిక్కు మొక్కు లేని జనం’, ‘ప్రజలు అజేయులు’ వంటి నవలలు, ‘సాహిత్య బాటసారి శారద’ జీవిత చరిత్రా రాశారు. ప్రేమ్‌ చంద్, రాహుల్ సాంకృ త్యాయన్, కిషన్ చం దర్, యష్ పాల్, సరోజ్ దత్తాల రచనలను తెలుగు లోకి అనువదించారు. ‘వెలుగురవ్వల జడి’లో తన అనుభవాలను వివరించారు.’ ‘ప్రభాత్’ పత్రికకు సంపాదకులుగా ఉన్నారు.

‘‘ప్రతి జాతి జీవితంలోనూ ఒక సమయం వస్తుంది. అధికార మదాంధులూ, డబ్బు మదం కలవారూ, వారి పాలక యంత్రం, కాపలా కుక్కలూ – ప్రజల మీద దోపిడీ పీడనలను విస్తృతం చేసి జాతి మనుగడను– దుర్భరం చేస్తారు. అలాంటి సమయంలో ప్రజలకు బ్రతకడం కంటే పోరాడి చావడమూ, శాంతికంటే అలజడీ ప్రియాతి ప్రియమైన విషయాలుగా పరిణమిస్తాయి’’ అంటారు ఆలూరి తన ఆత్మకథ ‘గమనా గమనం’లో. 1928 లో గుంటూరు జిల్లా కొండముది గ్రామంలో జన్మించిన ఆయన విరసం సభ్యుడిగా, రచయితగా, అనువాదకుడిగా, జీవితాన్ని అర్థవంతం చేసుకుని 2013 జూన్ 20 న తుదిశ్వాస విడిచారు.

-పి.యస్. ప్రకాశరావు

99637 43021

Updated Date - Jun 16 , 2025 | 03:10 AM