విస్మృత గిరిజన స్వాతంత్ర్య సమరయోధుడు
ABN, Publish Date - Jun 17 , 2025 | 02:51 AM
1940వ దశాబ్దపు ద్వితీయార్ధంలో తెలంగాణలో కమ్యూనిస్టు ఉద్యమం తారస్థాయికి చేరింది. రజాకార్ల అరాచకాలకు, భూస్వాముల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు దళాలు అరణ్యాల్లో గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించాయి. అప్పటి హైదరాబాద్ రాష్ట్ర పాలకుడు నిజాం...
1940వ దశాబ్దపు ద్వితీయార్ధంలో తెలంగాణలో కమ్యూనిస్టు ఉద్యమం తారస్థాయికి చేరింది. రజాకార్ల అరాచకాలకు, భూస్వాముల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు దళాలు అరణ్యాల్లో గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించాయి. అప్పటి హైదరాబాద్ రాష్ట్ర పాలకుడు నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఈ దౌర్జన్యాలను అరికట్టకపోవడం వల్ల రజాకార్ల దురాగతాలకు మద్దతిచ్చినట్లయ్యింది. కమ్యూనిస్టు గెరిల్లా దళాల్లో ఒకటి ప్రస్తుత మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం అరణ్య ప్రాంతంలో రహస్యంగా పనిచేసింది. నాయికపోడు గిరిజనుడైన పసుల సీతారాములు ఈ దళంలో కీలక పాత్ర పోషించారు. జనబాహుళ్యంలోకి రావడానికి అంతగా ఇష్టపడని గిరిజనుల నుంచి ఒకరు ఇలా ఉద్యమానికి నాయకత్వం వహించడం అరుదైన విషయమే.
గార్ల, బయ్యారం సమీపంలోని పెద్దతాళ్ళగడ్డ గ్రామానికి చెందిన పసుల బుచ్చయ్య, చాసమ్మ దంపతులకు సీతారాములు జన్మించారు. తెలంగాణలోని నిజాం నిరంకుశ పాలనను చూస్తూ పెరిగి, ఆ దౌర్జన్యాలను అడ్డుకోవాలనుకున్నారు. తర్వాత ఆయన ఒక తుపాకీని సంపాదించారు. ఆ రోజుల్లో అదొక అసామాన్యమైన విషయం. తుపాకీ వాడటాన్ని నేర్చుకుని రజాకార్లు, నిజాం పోలీసులు, స్వాతంత్ర్యానంతరం భారత సైన్యం వంటి బృందాలను ధైర్యంగా ఎదిరించారు. పలుమార్లు కాల్పుల నుంచి చాకచక్యంగా తప్పించుకున్నారు. పెత్తందారీ భూస్వామ్య వ్యవస్థను వ్యతిరేకించడంలో సీతారాములు ముందుండే వారు. వాస్తవంగా గిరిజనులు కష్టపడి పనిచేసినా, ఫలితాలు మాత్రం బయటివారికే చెందేవి. ఉదాహరణకు కమ్మ సామాజిక వర్గానికి చెందిన సంగయ్య అనే వ్యక్తి గిరిజనులతో అడవిని నరికించి ‘సండ్రలపోడు’ అనే కొత్త గ్రామాన్ని ఏర్పాటు చేశాడు. కానీ తర్వాత ఆ గ్రామాన్ని ఉత్తర భారతీయ వ్యాపారి సంత్‌లాల్ ఆక్రమించాడు. దాంతో ఆ గ్రామం పేరు సంత్‌లాల్‌పోడుగా మారిపోయింది. కష్టపడినవారికి అందాల్సిన ఫలాలు వేరొకరు దక్కించుకోవడం అన్యాయం. అలాంటి వాటిపై సీతారాములు గట్టి పోరాటం చేశారు.
కానీ భూస్వాములు, వ్యాపారులకే నిజాం పోలీసులు, రజాకార్లు మద్దతు ఇచ్చేవారు. ఈ శక్తులకు వ్యతిరేకంగా పోరాడిన సీతారాములుపై ఓసారి బయ్యారం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అప్పుడప్పుడూ పేషీకి హాజరు కావాలంటూ ఆయన్ను పోలీసులు స్టేషన్‌కు పిలిపించేవారు. తనకు సైకిల్ ఏర్పాటు చేస్తేనే పేషీకి వస్తానని ఏ మాత్రం బెదరకుండా వారికి జవాబిచ్చేవారు. అనంతరకాలంలో ఆయన పేషీకి వెళ్లడానికి పూర్తిగా నిరాకరించి, బహిరంగంగా తిరుగుబాటు చేశారు. 1947లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం కమ్యూనిస్టులపై దాడి ప్రారంభించడంతో సీతారాములు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. భారత సైన్యం ఆయన్ను వెంటాడి, ఆయన తుపాకీతో ప్రతిఘటిస్తుండగా కాల్చి చంపింది. సీతారాములు వీరగాథ క్రమంగా మరుగున పడిపోతోంది. ఆయన గురించి ప్రస్తుతం చెప్పగలిగినవారు ఆయన తమ్ముడి కుమారుడు పసుల బుచ్చయ్య మాత్రమే. గిరిజన నాయకుడైన సీతారాములు సాహసగాథ తెలంగాణ స్వాతంత్ర్య పోరాట చరిత్రలో ఓ వెలుగు దివ్వెలా నిలిచిపోతుంది.
డా. ద్యావనపల్లి సత్యనారాయణ
ఇవి కూడా చదవండి
షార్‌లో తీవ్రవాదులు ఉన్నారంటూ ఫోన్
కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ కైవసం
Read Latest AP News And Telugu News
Updated Date - Jun 17 , 2025 | 02:51 AM