Focus on Teaching Centric Policies: బోధనకు ప్రాధాన్యమిచ్చే విధానాలపై దృష్టి పెట్టాలి
ABN, Publish Date - Aug 13 , 2025 | 04:43 AM
ఆంధ్రప్రదేశ్‌లో విద్యా వ్యవస్థ నిరంతరం మార్పులకు లోనవుతున్నది. గడచిన కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధికి..
ఆంధ్రప్రదేశ్‌లో విద్యా వ్యవస్థ నిరంతరం మార్పులకు లోనవుతున్నది. గడచిన కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధికి అనేక పథకాలను ప్రవేశపెట్టింది. అయితే, వీటి అమలులో విద్యార్థుల భవితవ్యాన్ని దృష్టిలో పెట్టుకోకుండా తీసుకునే కొన్ని నిర్ణయాలు, ముఖ్యంగా బోధనేతర కార్యక్రమాలు విద్యార్థులకు నష్టాన్ని కలిగిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం పాఠ్యబోధన కంటే జాతీయ పఠనోద్యమం, మన బడి, నాడు–నేడు, జాతీయ పథకాల అమలు, ఒకేషనల్ శిక్షణలు, అభ్యాస పరీక్షలు, పరిశీలనా పత్రాలు, ఎంపికల పరీక్షల నిర్వహణ, సర్వేలు, పర్యవేక్షణ మాడ్యూళ్లు, ప్రగతి నివేదికలు, పబ్లిక్ రివ్యూ మీటింగ్‌లు వంటి కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఉపాధ్యాయులు తరగతులు చెప్పడానికి బదులుగా ఈ కార్యక్రమాల నిర్వహణకే సమయం కేటాయించాల్సిన పరిస్థితి నెలకొంది. ఫలితంగా విద్యార్థుల పాఠ్యబోధన తీవ్రంగా దెబ్బతింటోంది. పదో తరగతి విద్యార్థులకు సిలబస్ పూర్తి చేయాలంటే గణనీయంగా సమయం అవసరం. కానీ తరచూ జరిగే బోధనేతర కార్యక్రమాలకు ఉపాధ్యాయులు ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తోంది.
ఇక ప్రైవేటు పాఠశాలల విషయానికొస్తే, అక్కడ బోధనే ప్రధాన లక్ష్యంగా శిక్షణ పద్ధతులు అమలవుతున్నాయి. అక్కడ ప్రభుత్వ కార్యక్రమాలు ఉండవు, కనుక విద్యార్థులను పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తున్నారు. ఫలితంగా విద్యా ప్రామాణికత, ఉత్తీర్ణత శాతం ఎక్కువగా ఉంటున్నది. అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఈ పోటీలో వెనుకబడుతున్నారు. ఇక్కడే ఒక ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతోంది. విద్యను నైతికంగా అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉందా? లేకపోతే విద్యార్థులు చదువుపై మక్కువ కోల్పోవడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల అస్తిత్వం క్రమంగా తగ్గిపోవడానికే ఈ పరిస్థితులు దారితీస్తున్నాయా? ప్రజా వ్యవస్థలో సమాన విద్యావకాశాలు కల్పించాల్సిన ప్రభుత్వమే ఇలా భిన్న దృక్పథాన్ని అనుసరించడం అభ్యంతరకరం. అధికారులు ప్రైవేటు పాఠశాలలను తరచూ తనిఖీలు చేస్తూ ‘బోధన తప్ప ఇతర కార్యక్రమాలు ఉండకూడదు’ అనే నియమం అమలు చేస్తుంటారు. మరి ప్రభుత్వ పాఠశాలలకు దీనిని ఎందుకు వర్తింపజేయరు? ఉపాధ్యాయుల సమయాన్ని శిక్షణలకూ, సమావేశాలకూ వినియోగించకుండా, బోధనకు అనుమతిస్తే విద్యార్థులకు మెరుగైన మౌలిక విద్య అందుతుంది. బోధనేతర కార్యక్రమాలు మోయలేని భారమై ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తోంది. సమర్థవంతమైన విద్యను అందించాలనుకుంటే, బోధనకు ప్రాధాన్యతనిచ్చే విధానాలపై ప్రభుత్వం దృష్టిసారించాలి. లేకపోతే ‘బడి బడిలా ఉండదు – చదువు చదువులా ఉండదు’ అన్న వాక్యం వాస్తవమైపోతుంది.
– తరిగోపుల నారాయణస్వామి
Updated Date - Aug 13 , 2025 | 04:43 AM