ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Dictatorship Past: ఆ చీకటి రోజుల్లో నేను–నా దేశం

ABN, Publish Date - Jun 14 , 2025 | 03:19 AM

వర్తమానం గతంతో ముడివడివుంటుంది. మన ప్రజాస్వామ్య వక్రగతికి ఒక పూర్వ దృష్టాంతం–ఎమర్జెన్సీ. ఈ జూన్‌ 26కు సరిగ్గా యాభై సంవత్సరాల క్రితం ఆ ‘చీకటి అధ్యాయం’ మొదలయింది.

ర్తమానం గతంతో ముడివడివుంటుంది. మన ప్రజాస్వామ్య వక్రగతికి ఒక పూర్వ దృష్టాంతం–ఎమర్జెన్సీ. ఈ జూన్‌ 26కు సరిగ్గా యాభై సంవత్సరాల క్రితం ఆ ‘చీకటి అధ్యాయం’ మొదలయింది. నేను నా ‘India after Gandhi’లో ఆ చీకటి రోజుల గురించి వివరంగా రాశాను. అత్యవసర పరిస్థితి కాలంలో భారతదేశ చరిత్ర గురించి మరింత తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారు ఎమ్మా టార్లో (Unsettling Memories. Narratives of the Emergency in Delhi), గ్యాన్‌ ప్రకాశ్‌ (Emergency Chro-nicles: Indira Gandhi and Democracy's Turning Point), క్రిస్టొఫెజఫ్రెలాట్‌, ప్రతినావ్‌ అనిల్‌ (India's First Dictatorship: The Emergency, 1975–1977), సుగత శ్రీనివాసరాజు (The Conscience Network: A Chronicle of Resistance to a Dictatorship | Untold History of India’s Emergency Resistance | US Solidarity, Indian Diaspora & Gandhi-Inspired Civil Rights) పుస్తకాలు చదవాల్సిందిగా సూచిస్తున్నాను. ఈ కాలమ్‌లో ఢిల్లీలో ఒక కళాశాల విద్యార్థిగా ఎమర్జెన్సీ కాలంలో నా వ్యక్తిగత అనుభవాలను రేఖా మాత్రంగా వివరిస్తాను. వీడని జ్ఞాపకాలవి. మే 1975లో నేను న్యూఢిల్లీలోని సెయింట్‌ స్టీఫెన్స్‌ కళాశాలలో బీఏ మొదటి సంవత్సరం పూర్తి చేశాను. వేసవి సెలవులకు డెహ్రాడూన్‌లో ఉండే నా తల్లిదండుల వద్దకు వెళ్లాను. సెలవుల్లో ఉన్నప్పుడే అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. జూలై మూడవ వారంలో కళాశాల కేంపస్‌కు తిరిగివచ్చాను. ఎమర్జెన్సీ విషయం నా మనసులో లేనేలేదు. ప్రధాని ఇందిర తన ప్రత్యర్థులు అందరినీ ఖైదు చేయడం, దీని ప్రభావాలు, పర్యవసానాలు వర్తమాన, భావి భారతదేశంపై ఎలా ఉంటాయన్న విషయమై నేనేమీ ఆలోచించలేదు. అసలా విషయమే నాకు పట్టలేదు. అప్పుడు నా వయసు 17 సంవత్సరాలు మాత్రమే. కళాశాల క్రికెట్‌ జట్టులో నాకొక స్థానాన్ని దక్కించుకోవడం గురించే నా ధ్యాస అంతా. ఆ మాటకొస్తే స్టీఫెన్స్‌లోని నా సహపాఠాలు ఎవరికీ రాజకీయాల గురించి పెద్దగా ఆసక్తి లేనివారే. రాజకీయ వ్యవహారాల పట్ల మా ఉదాసీనతను కళాశాల పాలకవర్గం పనిగట్టుకుని ప్రోత్సహించేది. ఢిల్లీ విశ్వవిద్యాలయ స్టూడెంట్స్‌ యూనియన్‌ కార్యవర్గ స్థానాలకు ఎన్నికలు చాలా తీవ్ర పోటీతో జరిగాయి. ఆ ఎన్నికలలో ఓటు వేసేందుకు స్టీఫెన్స్‌ విద్యార్థులకు అనుమతి లేదు! విశ్వవిద్యాలయంలోని ఇతర కళాశాలల– హిందూ, హన్స్‌రాజ్‌, రాంజాస్‌, కిరోరిమాల్‌ విద్యార్థులు అందరూ చాలా ఉత్సాహంగా ఆ ఎన్నికలలో పాల్గొన్నారు. సరే, ఢిల్లీకి మరో చివర జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న విశ్వవిద్యాలయం విద్యార్థులు అందరూ రాజకీయాలలో మరింత చురుగ్గా ఉండేవారు. మహాత్మాగాంధీ సన్నిహితుడు సి.ఎఫ్‌ అండ్రూస్‌ మా కళాశాలలో అధ్యాపకుడుగా ఉండేవారు.

ఈ విషయాన్ని మేము గొప్పగా, సగర్వంగా చెప్పుకునేవాళ్లం. మా కళాశాల నుంచి హర్‌ దయాళ్‌, బ్రిజ్‌కృష్ణ చండీవాలా మొదలైన స్వాతంత్ర్య సమరయోధులు వచ్చినప్పటికీ ముంబై, పూణే, కోల్‌కతా, చెన్నై, వారణాసి, అలహాబాద్‌, పాట్నా తదితర నగరాలలోని కళాశాల‍లతో పోలిస్తే స్వాతంత్ర్యోద్యమానికి చేసిన దోహదం వెలవెలబోతుంది. రాజకీయాల పట్ల ఉపేక్ష స్వాతంత్ర్యానంతరం కూడా కొనసాగింది. స్టీఫెన్స్‌ నుంచి ప్రభవించిన ప్రతిభావంతులు సివిల్‌ సర్వీసెస్‌లో చేరేందుకు ప్రథమ ప్రాధాన్యమిచ్చేవారు. 1960 దశకంలో కొంతమంది మార్క్సిజం పట్ల ఆకర్షితులయ్యారుగానీ వారు కేవలం దారి తప్పినవారు మాత్రమే. వారి సమకాలికులు ప్రతిష్ఠాత్మక ప్రభుత్వ పదవులనధిష్ఠించడమే లక్ష్యంగా పెట్టుకునేవారు. జర్నలిస్టులు, విద్యావేత్తలు, కార్పొరేట్‌ ఎగ్జిక్యూటివ్‌లు అయినవారూ చాలా మంది ఉన్నారు. నాకు తెలిసిన స్టీఫెన్స్‌ కళాశాలకు గుణ విశేషాలు చాలా ఉన్నాయిగానీ రాజకీయాలలో క్రియాశీలంగా పాల్గొనడం వాటిలో ఒకటి కానేకాదు. మేము వర్తమానంలో నివసించేవాళ్లం, భవిష్యత్తు వర్తమానం అయినప్పుడు మాత్రమే దాని గురించి ఆలోచించేవాళ్లం. వేసవి సెలవుల అనంతరం జూలైలో కళాశాలకు తిరిగివచ్చాను. కళాశాలలో పరిస్థితులు యథాతథంగా ఉన్నాయి. ప్రతిపక్ష నాయకుల నిర్బంధం, పత్రికా స్వేచ్ఛపై ఆంక్షలు మమ్ములను ఏ మాత్రం ప్రభావితం చేయలేదు. ఎప్పటిలాగానే పిచ్చాపాటీ చేసేవాళ్లం, సందడి చేసేవాళ్లం, ఆడుకునేవాళ్లం. 1975 ద్వితీయార్ధంలో క్రికెట్‌లో నా నైపుణ్యాలను మరింతగా మెరుగుపరచుకోవడంపై శ్రద్ధ పెట్టాను. అలాగే నా తోటివారు తమ తమ ప్రత్యేక అభిరుచులకు ప్రాధాన్యమిచ్చేవారు. షేక్‌స్పియర్‌ నాటకాలు చదవడం, బ్రిడ్జి ఆడడం, శాస్త్రీయ సంగీతం వినడం మొదలైన వాటిపై వారు అమితాసక్తి చూపేవారు. సరే, ఎమర్జెన్సీ కొనసాగుతూనే ఉన్నది. దానిమాటున జరుగుతున్న ఘోరాలూ మాకు మెల్లమెల్లగా తెలియవస్తున్నాయి. ప్రధానమంత్రి కుమారుడు సంజయ్‌గాంధీకి ప్రమేయమున్న ఉదంతాలు తెలిసినప్పుడు దిగ్భ్రాంతికి లోనవుతుండేవాళ్లం. విద్యార్థులు ఎంతగానో అభిమానిస్తుండే విజయన్‌ (ఉన్ని) నాయర్‌ విషయం సంజయ్‌ దృష్టికి వెళ్లింది. ఆయన, విజయన్‌ డెహ్రాడూన్‌ స్కూల్‌లో సహ విద్యార్థులు. ఇరువురికీ ఉమ్మడి స్నేహితుడు అయిన ఒక వ్యక్తి ద్వారా కళాశాల అధ్యాపకత్వాన్ని వదిలివేసి, ‘దేశాన్ని పాలించడం’లో తనకు సహాయకారిగా ఉండేందుకు రమ్మని సంజయ్‌ ఆహ్వానించాడు. అయితే ఇందుకు విజయన్‌ ససేమిరా అన్నారు. తాను తన వృత్తిలో సంతృప్తికరంగా ఉన్నానని సంజయ్‌కు సమాధానమిచ్చారు. యూనివర్సిటీ కాఫీ హౌస్‌లో మేము ఒక వ్యక్తిని రోజూ చూస్తుండేవాళ్లం. ఆయన గడ్డం గోధుమ రంగులో ఉండేది. ఆయన సులోచనాలు కూడా అదే రంగులో ఉండేవి. గంటల తరబడి అక్కడే కూర్చునేవాడు. సదా కాఫీ తాగుతూ ఉండేవారు. కాఫీ కాకపోతే ధూమపానం. చివరకు మేము ఆ వ్యక్తి ఇంటెలిజెన్స్‌ బ్యూరో ఏజెంట్‌ అనే నిర్ధారణకు వచ్చాం. కేంపస్‌లో పరిస్థితుల గురించి వాకబ్‌ చేయడమే అతని విధి. అందుకే నిత్యం యూనివర్సిటీ కాఫీ హౌస్‌లో ఉండేవాడు. ఈ అనుభవాలతో, నాలో అప్పటివరకు నిద్రాణంగా ఉన్న రాజకీయ చైతన్యం మేలుకోవడం ఆరంభమయింది.

ఏప్రిల్‌ 1976 రెండో వారంలో ఒక రాత్రి ఆకాశవాణి ప్రభుత్వ కాకారాయుడు ఒకరు చేసిన ఓ వ్యాఖ్య నా రాజకీయ చైతన్యాన్ని జాగరూకం చేసింది. ఆ రాత్రి మేము ఒక ట్రాన్సిస్టర్‌ రేడియో చుట్టూ మూగి క్రికెట్‌ కామెంటరీ వింటున్నాం. పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌లో వెస్టీండీస్‌పై టెస్ట్‌ మ్యాచ్‌ చివరిరోజు అది. 400కు పైగా పరుగులు సాధిస్తేగానీ మన జట్టు విజయం సాధించే అవకాశం లేదు. మన లిటిల్‌ మాస్టర్ల ద్వయం –సునీల్ గవాస్కర్‌, గుండప్ప విశ్వనాథ్‌ – ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ఇంకేముంది, ఆకాశవాణిలోని మన వ్యాఖ్యాత తన ఆనందాన్ని ఇలా వ్యక్తంచేశాడు: ‘యే ఇందిరాగాంధీ కా దేశ్‌ హై! యే బీస్‌ సూత్రి కారికారమ్‌ కా దేశ్‌ హై!’ (ఇది ఇందిరాగాంధీ భూమి! ఇది ఆమె ఇరవైసూత్రాల కార్యక్రమం అమలవుతున్న దేశం). ఈ వ్యాఖ్య విన్న వెంటనే అది దేశానికి చాలా అవమానకరంగా ఉన్నదని నేను భావించాను. క్రికెటర్లు తమ ప్రతిభాపాటవాలతో దేశానికి సాధించిన కీర్తిచంద్రికలను నిరంకుశ పాలకురాలు అయిన రాజకీయవేత్త ఘనతగా పేర్కొనడం మితిమీరిన భజనపరత్వం కాక మరేమిటి? 1977 సంవత్సరారంభంలో ఎమర్జెన్సీని ఎత్తివేసి సార్వత్రక ఎన్నికలు ప్రకటించారు. ఇందిర, ఆమె కాంగ్రెస్‌ను వ్యతిరేకించే నాలుగు పార్టీల కలయికతో కొత్త జనతా పార్టీ ఆవిర్భవించింది. మా కళాశాలకు సమీపంలో ఉన్న మారిస్‌ చౌక్‌లో జనతా పార్టీ ర్యాలీ నొకదాన్ని నిర్వహించారు. వేలాది ఇతర విద్యార్థులతో పాటు నేనూ ఆ సభకు వెళ్లాను. సోషలిస్టు రాజ్‌ నారాయణ్‌ నెహ్రూల–కీర్తిశేషులు, సజీవులు, పుట్టబోయేవారు–పై తీవ్ర విమర్శలు చేశారు. నెహ్రూ సోదరి విజయలక్ష్మీ పండిట్‌ డెహ్రాడూన్‌ నుంచి ప్రత్యేకంగా వచ్చి ఆ ర్యాలీలో ప్రసంగించారు పౌర హక్కులు పునరుద్ధరించాలని, తన మేనకోడలి నియంతృత్వ పాలనకు చరమ వాక్యం పలకాలని ఓటర్లకు ఆమె పిలుపునిచ్చారు. పలువురు విద్యార్థి నాయకులు (మా కళాశాలకు చెందినవారు ఒక్కరూ లేరు), జనసంఘ్‌ నాయకుడు అటల్‌ బిహారీ వాజపేయి కూడా ఆ ర్యాలీలో ప్రసంగించారు. వాజపేయి ఉపన్యాసం శబ్ద సారళ్యంతో సంస్కారవంతంగాను, శ్రావ్యంగాను ఉన్నది. ఆయన హాస్యోక్తులు, చతురోక్తులకు శ్రోతలు పగలబడి నవ్వారు. క్రికెటేతర వ్యవహారాలు, సెయింట్‌ స్టీఫెన్స్‌ కళాశాల వెలుపలి ప్రపంచంపై నా శ్రద్ధాసక్తులను ఆ బహిరంగ సభ ఇతోధికంగా పెంచింది. ఈ ర్యాలీ అనంతరం కొద్దివారాలకు సార్వత్రక ఎన్నికలు జరిగాయి. ఓట్ల లెక్కింపు ఆరంభమయింది. నేనూ, నా స్నేహితుల బృందం పలు ప్రధానపత్రికల ప్రధాన కార్యాలయాలు ఉన్న బహదూర్‌ షా జాఫర్‌ మార్గ్‌కు వెళ్లాము. ఇంటర్నెట్‌ అప్పటికి ఇంకా సుదూర భావి అద్భుతమే. విశ్వసనీయమైన సమాచారానికి ఆకాశవాణి, దూరదర్శన్‌పై ఆధారపడే పరిస్థితి లేదు. ఒక పత్రికా కార్యాలయం బయట ఒక పెద్ద బ్లాక్‌ బోర్డ్‌పై ఎన్నికల ఫలితాలు ఎప్పటికప్పుడు ఫ్లాష్‌ అవుతున్నాయి. అమేథీలో సంజయ్‌గాంధీ ఓడిపోయాడన్న వార్త వచ్చినప్పుడు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి. రాయబరేలీలో ఇందిర అపజయం పాలయ్యారని తెలియగానే మరింతగా హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి. నిరంకుశ పాలన ఓడిపోయింది. వంశపారంపర్య రాజకీయాలు ముగిశాయి. అవునా? అయ్యో! యాభై సంవత్సరాల తరువాత నిరంకుశ పాలన, వంశపారంపర్య రాజకీయాలు రెండూ మనలను వెంటాడుతున్నాయి, పీడిస్తున్నాయి. కాకపోతే తేడా అల్లా ఇప్పుడు వాటికి వివిధ పార్టీలలో ప్రాతినిధ్యం ఉన్నది; పరిపూర్ణ ఆలంబన కూడా లభిస్తోంది.

(వ్యాసకర్త చరిత్రకారుడు)

Updated Date - Jun 14 , 2025 | 03:26 AM