Tribal Rights Telangana: ఆదివాసీల అభివృద్ధికి అన్నీ ఆటంకాలే
ABN, Publish Date - Jun 04 , 2025 | 06:03 AM
ఫిఫ్త్ షెడ్యూల్ ప్రాంతాల్లో ఆదివాసీల హక్కులు పరిరక్షణకు సంబంధించిన జీవోలు, చట్టాలు సక్రమంగా అమలవడం లేదని వ్యాసం పేర్కొంది. ఐటీడీఏలకు నిధులు మరియు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో సమర్థత తక్కువగా ఉంది.
‘ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియా’ ఆదివాసీలకు సంబంధించిన భూభాగం. ఆ భూములపై హక్కులన్నీ వారివే. కానీ సదరు భూములకు సంబంధించి గతంలో జారీ అయిన జీవోలు, చట్టాలు ప్రస్తుతం అమలయ్యే పరిస్థితి కన్పించడం లేదు. దీనికి కారణాలు అనేకం. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచీ ఆదివాసీల అభివృద్ధి విషయంలో ఐటీడీఏల క్రియాశీలక పాత్ర తగ్గుతూ వస్తోంది. నిత్యం నీతిసూత్రాలు వల్లించే మేధావులే ఆదివాసీల హక్కులను కాలరాస్తున్నారు! ఫిఫ్త్ షెడ్యూల్ ప్రాంతంలో ఐటీడీఏల ద్వారా 29 శాఖల్లో ఉద్యోగాలను భర్తీ చేయాలి. కానీ ఈ నిబంధన అమలుకు నోచుకోవడం లేదు. స్థానిక యువత వంద శాతం రిజర్వేషన్లు పొందుతున్నారని చెబుతూ జీవో 3ను ఎత్తివేశారు. దీంతో ఆదివాసీ విద్యార్థుల జీవితాలు అగాధంలోకి నెట్టివేయబడ్డాయి. గతంలో ఐటీడీఏలకు వందల కోట్ల రూపాయల ఫండ్స్ వచ్చేవి, కానీ నేడు ఆ పరిస్థితి కనబడడం లేదు. నాటికీ నేటికీ ఇంత వ్యత్యాసం ఎందుకు?! మైదాన ప్రాంత ప్రజలతో పోలిస్తే ఆదివాసీలు ఎంతో వెనుకబడి ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఆదివాసీలకు సంబంధించిన జీవోలు, చట్టాల అమలుపై ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆదివాసీల అభివృద్ధి కుంటుపడుతోంది. ఇప్పటికైనా ఫిఫ్త్ షెడ్యూల్ ప్రాంతపు ప్రజాప్రతినిధులు మేల్కొని ఐటీడీఏలకు నిధులు మంజూరు చేయించాలి. ట్రైబల్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేయాలి. ఐటీడీఏకు మళ్లీ జవసత్వాలు అందించాలి. ఆదివాసీ చట్టాలకు అనుగుణంగా యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనకు చొరవ చూపాల్సిన అవసరం ఉంది.
– మైపతి సంతోష్‌కుమార్ ఏటీఎఫ్ ములుగు జిల్లా అధ్యక్షుడు
Updated Date - Jun 04 , 2025 | 06:06 AM