Munasu Venkat: తెలంగాణ జీవ కవిగా నాకు పేరు తెచ్చింది
ABN, Publish Date - Jun 30 , 2025 | 12:28 AM
ముందుమాటలు గానీ, ఆవిష్కరణలు గానీ, పరిచయ సభలు గానీ లేని నా మొదటి పుస్తకం ‘ఎన’ 1999 జూలైలో గోసంగి నీలి సాహితి ద్వారా 35 కవితలతో, 64 పేజీలతో వెలువడింది.
‘ఎన’ వచ్చిన తర్వాత దానిపై చాలా ఉత్తరాలు అందుకున్నాను. ఆవంత్స సోమసుందర్ ఒక ఉత్తరం రాస్తూ, ‘‘కవితా ప్రపంచంలో నా ఇన్నేళ్ల ప్రయాణంలో ఒక్క ముక్క కూడా అర్థం కాకుండా వచ్చిన కవితా సంపుటి మీదే’’ అన్నారు. బదులుగా నేను ‘‘మీ భాష వేరు, తెలంగాణ భాష వేరు. ఇప్పటికైనా అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు’’ అని రాశాను.
ముందుమాటలు గానీ, ఆవిష్కరణలు గానీ, పరిచయ సభలు గానీ లేని నా మొదటి పుస్తకం ‘ఎన’ 1999 జూలైలో గోసంగి నీలి సాహితి ద్వారా 35 కవితలతో, 64 పేజీలతో వెలువడింది. ఇది అమ్మ నాయనలకు అంకితం. నా కవిత్వాన్ని పుస్తక రూపంలో చూసుకున్నప్పుడు నా గుండెల నిండా ఓ నిశ్శబ్ద వేడుక. దానిని అమ్మకు చూపించి ఆనందపడ్డ క్షణాలు మరువలేనివి. ‘బహువచనం’, ‘చిక్కనవు తున్న పాట’, ‘పదునెక్కిన పాట’, ‘మేమే’, ‘మొగి’ వంటి కవితా సంకలనాలలో వచ్చిన నా కవిత్వమంతా కలిపి ‘ఎన’గా వచ్చింది. ప్రముఖ చిత్రకారుడు ఏలే లక్ష్మణ్ ముఖచిత్రాన్ని వేశారు. అప్పటికే ఆయన ‘మేమే’, ‘మొగి’ కవితా సంకలనాలకు ముఖచిత్రాలు వేసి ఉండడంతో నా పుస్తకానికి కూడా ఆయననే ఎంచుకున్నాను.
‘ఎన’లో కవిత్వమంతా తెలంగాణ ఉత్పత్తి కులాల భాష. ఈ పుస్తకం తెలంగాణ జీవ కవిగా నాకు పేరు తెచ్చింది. అంతకుముందే కొంతమంది మిత్రులు ‘బహువచనం’, ‘మేమే’, ‘మొగి’ కవితా సంకలనాలలో తెలంగాణ భాషను రాశారు. అది కూడా నా కవిత్వానికి ఒక కారణం. ఇంకా అప్పటికి తెలంగాణ మలిదశ రాజకీయ ప్రస్తావన జరగలేదు. ‘ఎన’ కవితా సంపుటి మీద అనేక వ్యాసాలు, ఉత్తరాలు రావడమే కాకుండా చాలా చర్చ కూడా నడిచంది. ‘ఎన’ కవితా సంపుటి రాకముందే ఆంధ్రజ్యోతిలో పబ్లిష్ అయిన ‘దావా’ అనే కవిత గురించి ప్రముఖ కవి సిద్ధార్థ ఆంధ్రప్రభలో తన ‘ప్రెజెంట్ టెన్స్’ శీర్షికలో అద్భుతంగా విశ్లేషించారు. ‘ఎన’ వచ్చినాక కూడా అదే ఫీచర్‌లో సిద్ధార్థ మరో రెండు వ్యాసాలు రాశారు. నా కవిత్వపు లోలోపల నడుచుకుంటూ నా ఎద ముచ్చట్లు విన్న మంచి పాఠకుడు సిద్ధార్థ. ఆ తర్వాత ఆంధ్రజ్యోతిలో థింసా ‘దళిత దిక్సూచి.. ఎన’ పేరుతో అద్భుతంగా విశ్లేషించారు. ‘చింత’ సాహిత్య పత్రికలో దెంచనాల శ్రీనివాస్, ఏనుగు నరసింహారెడ్డి భిన్నకోణాల్లో రాశారు. ‘ఎన’ వచ్చిన తర్వాత దానిపై చాలా ఉత్తరాలు కూడా అందుకున్నాను.
సి. నారాయణరెడ్డి చాలా ప్రశంసా పూర్వకమైన ఉత్తరం రాశారు. ‘బ్రహ్మ మొహం లోంచి పాదాలు’ అనే నా కవితను ఒక అపూర్వ సృష్టి అనీ, ‘ఎన’ ఒక పస ఉన్న కవితా సంపుటి అనీ, ఇందులో ఉన్న భాషని తాను కొత్తగా చదువుకుంటున్నాననీ ఆయన రాశారు. ఆ తర్వాత ఆవంత్స సోమసుందర్ నాకు ఒక ఉత్తరం రాస్తూ, ‘‘కవితా ప్రపంచంలో నా ఇన్నేళ్ల ప్రయాణంలో ఒక్క ముక్క కూడా అర్థం కాకుండా వచ్చిన కవితా సంపుటి మీదే’’ అన్నారు. బదులుగా నేను ‘‘మీ భాష వేరు, తెలంగాణ భాష వేరు. ఇప్పటికైనా అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు’’ అని రాశాను. తెలంగాణ భాష పట్ల ఒక ఆత్మగౌరవ చర్చగా ఈ ఉత్తరాలను చూడొచ్చు. నగ్నముని ‘ఎన’ను మెకనాస్ గోల్డ్‌గా అభివర్ణించారు. ‘ఎన’లోని పద చిత్రాలను చూసి హెచ్చార్కె పెద్ద కవులతో నన్ను పోల్చి ప్రశంసించారు. అంబటి సురేంద్ర రాజు, జ్వాలాముఖి, నిఖిలేశ్వర్, శివారెడ్డి, వరవరావు, దర్భశయనం శ్రీనివాసాచార్య, అద్దేపల్లి రామ్మోహన్ రావు వంటి పెద్దవారంతా ‘ఎన’ ద్వారా నన్ను గుండెలకు హత్తుకున్నారు. దళిత కవి మిత్రులు ఎండ్లూరి సుధాకర్, మద్దూరి నగేష్ బాబు, పైడి తేరేష్‌బాబు... ఇంకా చాలా మంది కవి మిత్రులు, అభిమానులు నాకు ఉత్తేజాన్నిస్తూ ఉత్తరాలు రాశారు. ‘ఎన’ లోని కొన్ని కవితలు ఇంగష్‌లోకి హిందీలోకి అనువాదం అయ్యాయి. ఎక్కిళ్ళు ఎగదన్నుకొస్తుంటే పఠమెక్కి శిగమూగిందే నా ‘ఎన’ కవిత్వం.
- 99481 58163
Updated Date - Jun 30 , 2025 | 12:29 AM