Eric Frickenberg: తెలుగు చరిత్రకారుడు ఫ్రికెన్‌బర్గ్ కన్నుమూత
ABN, Publish Date - Apr 26 , 2025 | 05:17 AM
తెలుగువారి చరిత్ర, సంస్కృతిని ఆధునిక యుగంలో ప్రపంచానికి పరిచయం చేసిన ప్రముఖ చరిత్రకారుడు ఎరిక్ ఫ్రికెన్‌బర్గ్ కన్నుమూశారు. భారతదేశ చరిత్రపై ఆయన చేసిన పరిశోధనలు, ముఖ్యంగా గుంటూర్ డిస్ట్రిక్ట్ గ్రంథం, క్రైస్తవ మత వ్యాప్తి, హిందూ జాతీయవాదం వంటి అంశాలలో ఆయన గొప్ప కృషిని చాటాయి
తెలుగువారి చరిత్ర–సంస్కృతులను, ఆధునిక యుగానికి సంబంధించి, తన పరిశోధనల ద్వారా బాహ్య ప్రపంచానికి తెలిపిన ప్రముఖ చరిత్రకారుడు ఎరిక్ ఫ్రికెన్‌బర్గ్ కన్నుమూశారు. 1930లో జన్మించిన ఈయన, తమిళనాడులో విద్యాభ్యాసం మొదలుపెట్టి, ఆ తర్వాత అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం (బర్కిలీ)లో రాజకీయ శాస్త్రం చదివి, 1961లో లండన్‌లో స్కూల్ ఆఫ్ ఒరియంటల్ స్టడీస్‌లో డాక్టరేట్ పట్టా పుచ్చుకున్నారు. విస్కాన్సిన్–మేడిసన్ విశ్వవిద్యాలయం చరిత్ర విభాగంలో (1962–1997) బోధనావృత్తి చేపట్టారు. అక్కడున్నప్పుడు, భారతదేశ చరిత్రకు సంబంధించి భూసమస్యలు, మత మార్పిడులు, హిందూ జాతీయవాదం, భారతదేశంలో క్రైస్తవమత పుట్టుక, ఎదుగుదల గురించి గణనీయమైన కృషి సలిపి, రచనలు చేశారు.
ఫ్రికెన్‌బర్గ్ పరిశోధించి, వెలువరించిన ‘గుంటూర్ డిస్ట్రిక్ట్’ గ్రంథం ఆయనకు ఎనలేని ఖ్యాతిని తీసుకొచ్చింది. ప్రభుత్వ పరిపాలనను, వలస పాలనాధికారుల కంటే భారతీయులే అమితంగా ప్రభావితం చేశారన్న అంశాన్ని విపులంగా చర్చించారు. బ్రాహ్మణులు– నియోగులు, దేశస్త బ్రాహ్మణులు, గ్రామకరణాలుగా, అనువాదకులుగా (దుబాషీలు), కచేరీ ఉద్యోగులుగా పనిచేస్తూ, వారి స్వప్రయోజనాలను పొందిన తీరు వివరిస్తూ, గ్రామకరణాలు లబ్ధిపొందిన తీరు, అవసరమైన రికార్డులను తొలగించి, వాటి స్థానంలో ‘తప్పుడు’ లెక్కలను చూపించిన పద్ధతులను వెలికి తీశారు. ఫ్రికెన్‌బర్గ్ అనుసరించిన భారతీయ చరిత్ర అధ్యయన విధానాన్నే ఆ తర్వాత ప్రాచుర్యానికొచ్చిన కేంబ్రిడ్జి స్కూల్ చరిత్రకారులు అనిల్ సీల్, డేవిడ్ వాష్‌బ్రూక్, క్రిస్ బేకర్, సి.ఎ. బెయిలీ తదితరులు అవలంబించారు.
ఫ్రికెన్‌బర్గ్, ఆ తర్వాతి కాలంలో తమిళనాడు, ఆంధ్ర ప్రాంతాల్లో క్రైస్తవ మతవ్యాప్తి గురించి అధ్యయనం చేశారు. ఈ ప్రక్రియలో తనకు తోడ్పడిన భారతీయ మద్దతుదార్లను గూర్చి రాశారు. ‘క్రిస్టియానిటీ ఇన్ ఇండియా: ఫ్రం బిగినింగ్స్ టు ద ప్రెజెంట్’ ప్రచురించారు. భారతదేశ గతాన్ని గూర్చి ఆయన రచించిన, ‘ఇండియాస్ రాజ్: ఎస్సేస్ ఇన్ హిస్టారికల్ అండర్‌స్టాండింగ్స్’ గ్రంథం, ఫ్రికెన్‌బర్గ్ ప్రశంసాపూర్వక విద్వత్తుకూ, భారతదేశ చరిత్ర గతానికీ ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
– వకుళాభరణం రామకృష్ణ
Updated Date - Apr 26 , 2025 | 05:19 AM