ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

A Marxist Rebuttal: పెట్టుబడిదారీ శాపనార్థాలు చాలించాలి

ABN, Publish Date - Aug 30 , 2025 | 04:49 AM

విప్లవం..చాలించాలి అనే పేరుతో, మార్క్సిజం మీద వి.వి.సుబ్రహ్మణ్యం పెట్టిన శాపనార్థాల వ్యాసం ఆగస్టు 16 చదివాక, దానిమీద కలగజేసుకోడం తప్పనిసరి..

‘విప్లవం..చాలించాలి’ అనే పేరుతో, ‘మార్క్సిజం’ మీద వి.వి.సుబ్రహ్మణ్యం పెట్టిన శాపనార్థాల వ్యాసం (ఆగస్టు 16) చదివాక, దానిమీద కలగజేసుకోడం తప్పనిసరి అనిపించింది నాకు. నా రాత వల్ల వ్యాసకర్తకి ఏదో తెలియాలని కాదు. అటువంటి భ్రమలు లేవు నాకు. మార్క్సిజం గురించి అంతగా తెలియని పాఠకుల కోసమే ఇది! మార్క్సిజంతో పూర్తి ఏకీభావం ఉన్న వ్యక్తిగా ఇది రాస్తున్నాను. ముందుగా, మార్క్సిజం మీద వ్యాసకర్త శాపనార్థాలు వినండి! (1) మార్క్సిజం, ‘‘రోగం కన్నా హానికరమైన మందు!’’, ‘‘విషప్రాయమైన ఔషధం!’’ –ఇక్కడ ‘రోగమూ’, ‘మందూ’ అనే వాటి గురించి చెపుతాను. ఏ యజమాని అయినా, ఏ పరిశ్రమలో అయినా, పనివాళ్ళ శ్రమ విలువల నించి, దొరికినంత శ్రమ విలువని, ‘లాభం’ పేరుతో, డబ్బు రూపంలో, తన స్వంత శ్రమ అంటూ లేకుండా, సంపాదించే శ్రమ దోపిడీయే ‘రోగం!’ దాని గురించి తెలుసుకుని, దాన్ని వ్యతిరేకించి, ఆ దోపిడీనించి పూర్తిగా విముక్తి చెందాలన్నది మార్క్సు బోధన. ఈ బోధననే, వ్యాసకర్త ‘హానికరమైన మందు’గా ప్రకటించి, ‘శ్రమ దోపిడీ’ అనే మాటని మాత్రం తన వ్యాసంలో ఎక్కడా చెప్పలేదు. ఇంకా కొన్ని శాపనార్థాలు వినండి! (2) ‘‘మార్క్సిజం ఒక ‘వికృత సిద్ధాంతం!’’ అట! (3) మార్క్సిజం చూపిన దారి, అధోగతికి రహదారి!’’ అట! (4) ‘‘మార్క్సిజం ఒక కుహనా రాజకీయ తార్కిక సిద్ధాంతం!’’ అట! – పెట్టుబడిదారీ శ్రమ దోపిడీని తీసెయ్యాలని చెప్పే మార్క్సిజం మీద ఇలా సాగింది, వ్యాసకర్త శాపనార్థాల చిట్టా!

మార్క్సు సిద్ధాంతం మీద ఇలా శాపనార్థాలు పెట్టిన సుబ్రహ్మణ్యాలు ఇతర దేశాలలో కూడా కొందరు కనబడ్డారు గతంలో! మచ్చుకి (1) ‘రేమండ్ యారన్’ అనే ఫ్రాన్స్ దేశపు సుబ్రహ్మణ్యం ఒకరు! ఇతగాడు, మార్క్సిజాన్ని ఉద్దేశించి, అది ‘మేధావుల పాలిట మత్తుమందు’ (‘ది ఓపియం ఆఫ్ ఇంటలెక్చువల్స్’) అనే పేరుతో ఏకంగా ఒక పుస్తకమే రాశాడు. (2) ఇటలీ దేశపు సుబ్రహ్మణ్యం ఇంకొకరు! ‘గెటానో మాస్కా’ అనే ప్రబుద్ధుడు, ‘పాలక వర్గం’ (‘ది రూలింగ్ క్లాస్’) అనే తన పుస్తకంలో (పేజీ– 518), మార్క్సు శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా రాసిన ‘కాపిటల్ పుస్తకంలో ఎంతెంత తప్పులున్నాయో ఇలా చెప్పాడు: ‘కాపిటల్ పుస్తకంలో, ప్రతీ పేజీలోనూ వర్గాల మధ్య విధ్వంసకర ద్వేషాన్ని ప్రచారం చేస్తాడు మార్క్సు!’ అని ఆరోపించాడు. ఇతర దేశాల సుబ్రహ్మణ్యాల విమర్శల గురించి, నాలుగేళ్ళ కిందట, ‘మార్క్సిజం మీద విమర్శలకు జవాబులు’ అనే పేరుతో నేను ఒక చిన్న పుస్తకం రాశాను.

ఇప్పుడు, మన రాజమహేంద్రవరం సుబ్రహ్మణ్యం చేసిన విమర్శలకి, క్లుప్తంగా నా జవాబులు ఇవీ: (1) ‘‘మార్క్సు చెప్పిన విధంగా ఏ ఒక్క చోటా విప్లవం రాలేదు’’ – అని వ్యాసకర్త విమర్శ! మార్క్సు చెప్పిన విధంగా చేశారా? విప్లవం రాలేదంటే, చెప్పినట్టు చేస్తేనే కదా, విప్లవం వచ్చేది? కానీ, గతంలో రష్యా, చైనాల్లో జరిగిన విప్లవాలు, ఆ మార్గంలో పడిన కొన్ని తొలి అడుగులు మాత్రమే! శ్రమ దోపిడీ నించీ విముక్తి గురించి చెప్పే మార్క్సిజాన్ని, ఆ దేశాలలోని కమ్యూనిస్టులే, తామే తగినంతగా గ్రహించకపోవడమూ; దానిని శ్రామిక జనాలలో విస్తారంగా వ్యాప్తి చెయ్యలేకపోవడమూ ప్రధాన కారణం. అంతేగానీ, అది మార్క్సు సిద్ధాంతంలో లోపం కాదు. (2) ‘‘చరిత్ర క్రమంలో, ఎవ్వరూ ఆపలేని విధంగా విప్లవం దానంతట అదే వస్తుందని ‘మానిఫెస్టోలో’ మార్క్సు చెప్పాడని’’ వ్యాసకర్త నిరాధారమైన వాదన! ‘కమ్యూనిస్టు పార్టీ మేనిఫెస్టో’లో (‘కార్మికులూ, కమ్యూనిస్టులూ’ అన్న చాప్టరులో) చెప్పింది ఏమిటో చూడండి! ‘‘కార్మికులు ఒక వర్గంగా రూపొందాలి! బూర్జువా ఆధిపత్యాన్ని కూలదోయాలి! కార్మిక వర్గం రాజకీయ అధికారాన్ని గెలుచుకోవాలి!’’... ‘‘కార్మికవర్గ విప్లవంలో మొదటి మెట్టు, కార్మిక వర్గం పాలక వర్గం కావడం! బూర్జువా వర్గం నించీ సమస్త పెట్టుబడినీ– అంటే, ఉత్పత్తి సాధనాలన్నిటినీ స్వాధీనం చేసుకోవాలి!’’ –ఇది కదా మార్క్సు వాళ్ళు చెప్పింది? మరి, వ్యాసకర్త వక్రీకరించినట్టు, ‘విప్లవం దానంతట అదే వస్తుందని’ చెప్పిందెక్కడ? (3) ‘‘పెట్టుబడిదార్లను ద్వేషించినంతగా మార్క్సు ఇంకెవరినీ ద్వేషించలేదేమో!’’ అని తెగ వాపోతున్నాడు మన వ్యాసకర్త! ‘శ్రమదోపిడీ’ మీద బతికే వర్గాన్ని ద్వేషించాలా, పూజించాలా? (4) ‘‘పెట్టుబడుల్ని తీసుకొచ్చి, సంపద సృష్టించి, అభివృద్ధిని సాధించాలనే విధానాన్ని’’ ఈ వ్యాసకర్త తెగ మెచ్చుకోవడానికి అర్థం ఏమైనా ఉందా? సంపదని సృష్టించేది ఎవరు? కార్మికులు! లాభాల రూపంలో ఆ సంపద ఎవరికి అందుతుంది? పెట్టుబడిదారీ వర్గానికి! (5) చివరిగా, వ్యాసకర్త చేసిన ఒక వివేకవంతమైన ఉపదేశం ఉంది. ఏమిటంటే: ‘‘పెట్టుబడిదారులూ, కార్మికులూ సమాజ ప్రగతికి అవసరం గనక, ఒకరి వల్ల ఒకరికి అన్యాయం కలగకుండా చేసుకోవాలేగానీ, ఏదో ఒక వర్గాన్ని నిర్మూలించేయడం అవివేకం’’ అని! ఒకరి వల్ల ఒకరికి అన్యాయమా? కార్మికుల వల్ల, యజమానులకు లాభమా, అన్యాయమా? యజమాని వల్ల కార్మికులకు అన్యాయం గాక న్యాయమా? పెట్టుబడిదారులూ, కార్మికులూ అనే వాళ్ళు, ఒకే రకం వాళ్ళు కాదు. పెట్టుబడిదారులు ‘శ్రమలు’ చేయరు. వాళ్ళు కార్మికుల శ్రమలను, ‘లాభాల’ పేరుతో దోచి బతుకుతారు. ఈ శ్రమ దోపిడీ సమస్యని పరిష్కరించడానికి మార్క్సిజం చెప్పే మార్గం: ‘‘సమాజంలో అందరూ, అన్ని రకాల శ్రమలూ శక్తి కొద్దీ చేస్తూ, చేసిన ఉత్పత్తుల్ని అందరూ అవసరం కొద్దీ వాడుకోవాలి’’ అని! అలా జరిగినప్పుడు, ‘పెట్టుబడిదారులు’ – ‘కార్మికులు’ అనే విభజనా ఉండదు; అసలు వర్గాలనేవే ఉండవు. అందరూ, సమిష్టి, సహకార ఉత్పత్తిదారులుగా (అసోసియేటెడ్ ప్రొడ్యూసర్స్) అయిపోతారు.

చివరిగా, వ్యాసకర్తకి, ఆయన వాడిన విశేషణాలే ఉపయోగించి, మార్క్సిజం ఇచ్చే వివేకవంతమైన సలహా ఏమిటంటే: ‘హానికరమైన’, ‘విషప్రాయమైన’, ‘వికృత’, ‘కుహనా’ పెట్టుబడిదారీ విధానం ‘చేత కట్టించుకున్న పుస్తెను’, వెంటనే తెంచేసుకోమని! వ్యాసకర్త తేల్చింది, ‘విప్లవం చాలించాలి!’ అని. కానీ, చాలించవలిసింది, విప్లవ ప్రయత్నాల్ని కాదు. పెట్టుబడిదారీ శాపనార్థాల్ని! పెట్టుబడిదారీ పిల్లి శాపనార్థాలతో, మార్క్సిజం ఉట్టి తెగిపడదు!

-రంగనాయకమ్మ

Updated Date - Aug 30 , 2025 | 04:49 AM