ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Telangana Local Elections: ప్రజాస్వామిక వెలుగుబాటలు

ABN, Publish Date - Oct 04 , 2025 | 05:17 AM

లార్డ్‌ రిప్పన్‌ ఆధునిక భారతీయ స్థానిక ప్రభుత్వాల పితామహుడు నుంచి భారత రాజ్యాంగ సభ (1946) వరకు, ప్రాచీన గ్రామీణ పంచాయతీ వ్యవస్థ పునరుద్ధరణకు ఉద్దేశించిన 40వ ఆదేశిక సూత్రం...

లార్డ్‌ రిప్పన్‌ (ఆధునిక భారతీయ స్థానిక ప్రభుత్వాల పితామహుడు) నుంచి భారత రాజ్యాంగ సభ (1946) వరకు, ప్రాచీన గ్రామీణ పంచాయతీ వ్యవస్థ పునరుద్ధరణకు ఉద్దేశించిన 40వ ఆదేశిక సూత్రం నుంచి 73, 74వ రాజ్యాంగ సవరణల దాకా స్థానిక స్వపరిపాలనా వ్యవస్థ పరిణామ చరిత్ర స్ఫూర్తిదాయకమైనది. ప్రజాస్వామిక నాగరీకంలో ప్రజలను సుశిక్షితులను చేస్తున్న ప్రాథమిక పాఠశాల స్థానిక ఎన్నికల వ్యవస్థ. తెలంగాణ రాష్ట్రం మరోసారి ఈ ఎన్నికలకు సంసిద్ధమవుతోంది. ఎస్సీ, ఎస్టీ, మహిళలతో పాటు జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలకూ రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం సంకల్పించడంతో ఈ స్థానిక ఎన్నికలు మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. తొలుత పాలనా వ్యవస్థలో, దరిమిలా రాజకీయ రంగంలో కొత్త యువ నాయకత్వం ప్రభవించేందుకు ఈ ప్రజాస్వామ్య పోరు దోహదం చేయనున్నది. సుదూర గతంలో ప్రతి గ్రామమూ ఒక గణతంత్ర రాజ్యంగా విలసిల్లుతుండేది. గ్రామస్తులు సమష్టిగా నిర్ణయాలు తీసుకునేవారు. స్థానిక పాలనకు బాధ్యత వహించే గ్రామ పెద్దలను ‘గ్రామిక’లుగా కౌటిల్యుని ‘అర్థశాస్త్రం’ పేర్కొంది. రాచరికాలు ప్రబలి, సామ్రాజ్యాలు విస్తరిల్లిన తరువాత, ముఖ్యంగా బ్రిటిష్‌ వలసపాలనలో ఆ గ్రామీణ అధికార వికేంద్రీకరణ వ్యవస్థ పూర్తిగా ఛిద్రమైపోయింది. 1992లో 73, 74 రాజ్యాంగ సవరణలతో స్థానిక ప్రభుత్వాలకు వినూత్న ప్రజాస్వామిక స్వరూప స్వభావాలు సమకూరాయి. అణగారిన సామాజిక వర్గాల వారు రాజకీయ అధికారంలో భాగస్వాములు అయ్యారు. మరీ ముఖ్యంగా మహిళా సాధికారితకు ఇతోధిక దోహదం చేకూరింది. పలువురు మహిళలు పంచాయత్‌ సభ్యులుగా ప్రారంభమై శాసనసభ, పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌవది ముర్ము రాజకీయ ప్రస్థానాన్ని ప్రస్తావించి తీరాలి. 1997లో ఒడిషాలో ఒక ఆదివాసీ గ్రామ పంచాయత్‌ వార్డు సభ్యురాలుగా ఎన్నికైన ముర్ము ఆ రాష్ట్ర శాసనసభకు రెండుసార్లు ఎన్నికై ఆ తరువాత జార్ఖండ్‌ గవర్నర్‌గా పనిచేసి ఇప్పుడు భారత గణతంత్ర రాజ్య సార్వభౌమాధినేతగా ఉన్నారు. ఈ స్ఫూర్తిదాయక ఆదివాసీ విజయగాథ 73వ రాజ్యాంగ సవరణతోనే సుసాధ్యమయింది.

ఇదలా ఉంచితే ప్రభుత్వాలు ప్రజాహిత నిర్ణయాలు తీసుకోవడం ఎంత ముఖ్యమో వాటి అమలులో చిత్తశుద్ధి పాటించడం అంతకంటే ముఖ్యం. గత సార్వత్రక, తదనంతర అసెంబ్లీ ఎన్నికలలో నిర్వహణలో అక్రమాలు చోటుచేసుకున్నాయని, ప్రజాస్వామ్య నైతిక సూత్రమైన ఓటు హక్కు లక్షలాది ప్రజలకు లేకుండా చేస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ జాతీయ నాయకుడు రాహూల్‌గాంధీ. ఆ విషయమై ఎన్నికల సంఘంకు వ్యతిరేకంగా పెద్ద పోరాటమే చేస్తున్నారు. ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు ఎన్నికలలో పోటీ చేసేందుకు అనర్హులన్న నిబంధనను కొనసాగిండం ముదావహం. అయితే సర్పంచ్‌, ఇతర వార్డు సభ్యులను ఏకాభిప్రాయంతో ఎన్నుకోవడాన్ని నగదు బహుమానాలతో ప్రోత్సహించే పద్ధతికి స్వస్తి చెప్పితీరాలి. ఎందుకంటే అది ప్రజాస్వామ్య స్ఫూర్తిని బలహీనపరుస్తుంది. ‘ప్రతి గ్రామం స్వావలంబనతో తన వ్యవహారాలను తానే నడుపుకోగలగాలి. ప్రపంచం మొత్తం ప్రతి కూలమయినా తననుతాను సంరక్షించుకోగలగాలి’ అని గాంధీజీ పంచాయత్‌ వ్యవస్థకు ఆశయ నిర్దేశం చేశారు. ఈ ఆశయ సాధనకు మన 11వ రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్ కలాం ఒక ఆచరణాత్మక మార్గాన్ని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ సదుపాయాలు కల్పించడం ద్వారా గ్రామాలకు అభివృద్ధి సామర్థ్యం కలిగించడమే ఆ నిర్మాణాత్మక బాట. ఆధునికీకరణకు ప్రగతిశీల రాజకీయాలే ప్రాతిపదిక కావడమనేది స్వతంత్ర భారతదేశ చరిత్ర విశిష్టత. ఈ దృష్ట్యా దళితులు, గిరిజనులు, మహిళలు, వెనుకబడిన వర్గాల వారికి పాలనావ్యవస్థల్లోనూ రాజకీయ అధికారంలోనూ గణనీయమైన భాగస్వామ్యం కల్పించేందుకు దోహదం చేస్తూ ఈ స్థానిక ఎన్నికలు తెలంగాణ ఔన్నత్యానికి వెలుగు బాటలు వేయాలి.

Updated Date - Oct 04 , 2025 | 05:17 AM