ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Student Protests: బాధితుని జ్ఞాపకాల్లో ఎమర్జెన్సీ

ABN, Publish Date - Jun 24 , 2025 | 03:27 AM

ఈ నెల 25తో ఎమర్జెన్సీకి 50ఏళ్ళు. 1974లో గుజరాత్‌లో ఇంజనీరింగ్‌ కళాశాల హాస్టల్‌లో మెస్‌చార్జీల పెంపును నిరసిస్తూ విద్యార్థులు ఆందోళనకు శ్రీకారం చుట్టారు. దానికి మధ్యతరగతి ప్రజానీకం కూడా గొంతు కలిపింది.

ఈ నెల 25తో ఎమర్జెన్సీకి 50ఏళ్ళు. 1974లో గుజరాత్‌లో ఇంజనీరింగ్‌ కళాశాల హాస్టల్‌లో మెస్‌చార్జీల పెంపును నిరసిస్తూ విద్యార్థులు ఆందోళనకు శ్రీకారం చుట్టారు. దానికి మధ్యతరగతి ప్రజానీకం కూడా గొంతు కలిపింది. పాలనలో అవినీతి పెరిగిందని, గుజరాత్‌లో చిమన్‌బాయ్‌ పటేల్‌ ప్రభుత్వాన్ని రద్దు చేసి శాసనసభకు తిరిగి ఎన్నికలు జరపాలని మొరార్జీ దేశాయ్‌ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. దీంతో చిమన్‌బాయ్‌ పటేల్‌ ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. ఈ ఉద్యమాన్ని నవనిర్మాణ సమితి నడిపింది. 1975 జనవరిలో ఈ స్ఫూర్తితో బిహార్‌లో ఛాత్ర సంఘర్ష్‌ సమితిని ఏర్పాటు చేసి అక్కడ కూడా అవినీతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం నిర్వహించారు. శరద్‌యాదవ్‌ అధ్యక్షుడుగా, సుశీల్‌కుమార్‌ మోదీ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అప్పట్లో అనారోగ్యంతో పట్నాలో ఒక ఆసుపత్రికి వచ్చిన జయప్రకాశ్‌ నారాయణ్‌ను అక్కడే కలిసిన విద్యార్థులు ఉద్యమానికి నాయకత్వం వహించాలని కోరారు. ఉద్యమ సారథ్యం వహిస్తూ జయప్రకాశ్‌ నారాయణ్‌ 1975లో దేశవ్యాప్త పర్యటనలకు శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా 1975 మే 4న విశాఖపట్నానికి, మే 5న విజయవాడకు వచ్చారు. ఈ పర్యటనకు ఎంవీ రామ్మూర్తి, గొట్టిపాటి మురళీ మోహన్‌, నేను నాయకత్వం వహించాం. ఈ సందర్భంగా యువజన సదస్సు నిర్వహించాం.

ఈ సదస్సులో నాతో పాటు వెంకయ్యనాయుడు, కంభంపాటి హరిబాబు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ మాంటిస్సోరి మహిళా కళాశాల ఆడిటోరియంలో కార్యక్రమాన్ని నిర్వహించాం. పీడబ్ల్యూడీ గ్రౌండ్‌లో బహిరంగ సభ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో జనం హాజరయ్యారు. వర్షంలోనే జేపీ ఉపన్యసించారు. ఆ రాత్రి విజయవాడలో బస చేసి మే 6న చెన్నై వెళ్లారు. అలా క్రమంగా జేపీ ఉద్యమం దేశవ్యాప్తంగా ఊపందుకుంది. 1975 జూన్‌ 12న మూడు చరిత్రాత్మక పరిణామాలు జరిగాయి. అలహాబాద్‌ హైకోర్టు తీర్పు వెలువడటం, గుజరాత్‌ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ ఓడిపోవటం, ప్రధాని ఇందిరాగాంధీ కార్యదర్శిగా ఉన్న ఐఏఎస్‌ అధికారి డీపీ ధర్‌ చనిపోవడం. ఉదయం 10.30 గంటలకు అలహాబాద్‌ హైకోర్టు తీర్పు వచ్చింది. ఆ రోజు నేను విజయవాడలోనే ఉన్నాను. హైకోర్టు తీర్పును దృష్టిలో ఉంచుకుని విజయవాడలోని న్యూ ఇండియా హోటల్‌ సెంటర్‌లో ఒక కార్యక్రమం జరిగింది. ఇందిరాగాంధీ వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశాం. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో నేను ప్రభుత్వ బ్లాక్‌ లిస్టులో చేరాను. అంతకుముందు జరిగిన జై ఆంధ్ర ఉద్యమంలో నేను నిర్వహించిన పాత్రను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం నాపైన నిఘా పెంచింది. 1975 జూన్‌ 25న నేను గుంటూరులో ఇంట్లో నిద్రిస్తుండగా ఎస్సైలు సాయిబాబు, గంటయ్య, రతన్‌సింగ్‌ రెండు పోలీసు వాహనాల్లో వచ్చి, నన్ను నిద్ర లేపి కలెక్టర్‌, ఎస్పీలు తీసుకురమ్మన్నారని, రాకపోతే అరెస్టు చేస్తామని స్పష్టం చేశారు.

జోరు వర్షంలో అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్ళారు. కొద్దిసేపటికి కర్లపూడి రాఘవరావును కూడా తీసుకొచ్చారు. మమ్మల్ని రాజమండ్రి జైలుకు పంపారు. నాకు వైద్యవిద్యలో పీజీ సీటు వచ్చింది. విశాఖ ఆంధ్ర మెడికల్‌ కాలేజీలో ఇంటర్వ్యూ. పెరోల్‌ ఇవ్వడమో, ఇంటర్వ్యూను జైల్లో ఏర్పాటు చేయడమో, పోలీసు బందోబస్తుతో విశాఖకు తీసుకెళ్ళడమో, లేక ఇంటర్వ్యూ వాయిదా వేయడమో చేయాలని కోరాను. ప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో పై చదువులు చదువుకోలేకపోయాను. అప్పట్లో రాజమండ్రి జైల్లో నాతో పాటు జూపూడి యజ్ఞనారాయణ, టి.రామాచారి, కొమరగిరి కృష్ణమోహన్‌, తుమ్మల చౌదరి, డాక్టర్‌ పీవీఎన్‌ రాజు, ఎంవీఎస్‌ సుబ్బరాజు, కొల్లా వెంకయ్య తదితరులు ఉన్నారు. ఆంతరంగిక భద్రత చట్టం కింద మమ్మల్ని అరెస్టు చేశారు. కోర్టులో మా కేసు మేమే వాదించుకుంటామని చెప్పాం. విచారణ కోసం హైదరాబాద్‌ చంచల్‌గూడ జైలులో ఉంచి, విచారణ తర్వాత మమ్మల్ని రాజమండ్రికి పంపారు. జూన్‌ 25న అరెస్టు తరువాత మళ్లీ అక్టోబరు 10న విడుదల చేయడం, మళ్లీ అరెస్టు చేయడం, 1975 నవంబరులో విడుదల చేయడం, అరెస్టు చేయడం జరిగాయి. జూపూడి యజ్ఞనారాయణ ఇంట్లో ఇన్‌ కెమెరా సమావేశం నిర్వహించి హింసను రెచ్చగొట్టారని చెరుకుపల్లి పోలీస్‌స్టేషన్‌లో మాపై కేసు పెట్టారు.

ఈ కేసులో మళ్లీ నన్ను అరెస్టు చేశారు. నేను చంచల్‌గూడ, ముషీరాబాద్‌ జైళ్లలో ఉన్నాను. 1976 ఏప్రిల్‌ 12న ఎనిమిది మందిని హైకోర్టు ముందు ఉంచారు. వారిలో నన్ను, ఎంవి రామ్మూర్తిని మాత్రమే విడుదల చేశారు. రామ్మూర్తి అప్పటికే పెరోల్‌పై బయట ఉన్నారు. దీంతో ఎనిమిది మంది విడుదల అవుతారని, అయిన వెంటనే అరెస్టు చేయాలని కోర్టు దగ్గర వేచిచూస్తున్న 50 మంది పోలీసులు, నేను ఒక్కడినే విడుదలకావడంతో నాపైనే దృష్టి పెట్టారు. జడ్జి కుప్పుస్వామి చాంబర్‌కు వెళ్ళి నేను ఏ నేరం చేయకపోయినా అరెస్టు చేశారని, విడుదల, వేరే కేసులో అరెస్టు చేయడం... ఇలా ఏడాదిగా జరుగుతోందని ఫిర్యాదు చేశాను. మళ్లీ అరెస్టు చేస్తే హెబియస్‌ కార్పస్‌ దాఖలు చేయాలని జడ్జి సూచించారు. పోలీసులు బైట నన్ను అరెస్ట్‌ చేసి చార్మినార్‌ పోలీస్ ‌స్టేషన్‌లో ఉంచారు. ఈ సారి సీ క్లాస్‌ జైల్లో హత్యలు, గంజాయి అమ్మకాలు, దొంగతనాలు చేసి వచ్చిన వారితో పాటు ఉంచారు. వారం తరువాత కోర్టులో హాజరు పరిచారు. మేజిస్ట్రేట్‌ ఎవరైనా హామీ ఉంటే నన్ను విడుదల చేస్తామన్నారు. హైదరాబాద్‌లో నాకు ఎవరూ తెలియదని అన్నాను. పిలిచినప్పుడు కోర్టుకు వచ్చేట్టు పర్సనల్‌ బాండ్‌ ఇవ్వమన్నారు, నేను అంగీకరించలేదు. గుంటూరు నుంచి రావాలంటే సాధ్యం కాదని మొండికేశాను. దీంతో బేషరతుగా విడుదల చేశారు. కానీ, విడుదలైన వెంటనే కొత్తగా అంతర్గత భద్రత చట్టం (మీసా)పై అరెస్టు చేశారు. మళ్లీ జైలుకు తీసుకెళ్ళారు. జైలు నుంచి చీఫ్‌ సెక్రటరీకి లేఖ రాశాను. కోర్టు ధిక్కరణ, హెబియస్‌ కార్పస్‌ వేస్తానని లేఖలో స్పష్టం చేశాను. కోర్టు ధిక్కరణ ఆరోపణలతో పిటిషన్‌ వేయబోతున్నట్లు రాసి న్యాయవాదిని అనుమతించాలని కోరాను. దీంతో ప్రభుత్వం కంగారుపడి విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో ఎమర్జెన్సీ కంటే కూడా ఘోరమైన పరిస్థితులు కొనసాగుతున్నాయి. పాలకులు తమ సీటును కాపాడుకోవడం కోసం ప్రజాస్వామ్య హక్కులకు తిలోదకాలు ఇస్తున్నారు. అప్పట్లో అరెస్టు అయిన మా బోటివారంతా తెరమరుగయ్యారు. సగంమంది చనిపోయారు. బహుశా మరో పదేళ్ళల్లో ఈ ఎమర్జెన్సీ జ్ఞాపకాలు గలవారంతా పూర్తిగా తెరమరుగు కావచ్చు.

డా. యలమంచిలి శివాజీ

రాజ్యసభ మాజీ సభ్యులు

Updated Date - Jun 24 , 2025 | 03:49 AM