Election Commission India: ఈ సర్‌తో ఏ ప్రజాస్వామ్య వెల్గులకు
ABN, Publish Date - Jul 19 , 2025 | 02:36 AM
ఆర్థిక సంస్కరణల ప్రథమ దశ అంటే 1991 96 సంవత్సరాల మధ్య మన రాజ్యాంగ వ్యవస్థలలో అత్యుత్తమ, అత్యంత ప్రభావశీల సంస్థ ఏది
ఆర్థిక సంస్కరణల ప్రథమ దశ అంటే 1991–96 సంవత్సరాల మధ్య మన రాజ్యాంగ వ్యవస్థలలో అత్యుత్తమ, అత్యంత ప్రభావశీల సంస్థ ఏది? అనే విషయమై దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించి ఉంటే ప్రజలు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) వైపే మొగ్గు చూపి ఉండేవారు. రాజ్యాంగ న్యాయస్థానాల కంటే ఈసీఐకే అత్యధికులు ప్రథమ గణ్యత నిచ్చేవారనడంలో సందేహం లేదు. ఈసీఐకు అటువంటి గౌరవం దక్కడానికి ప్రధాన కారకుడు ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సీఈసీ) టి.ఎన్. శేషన్. ఆయన హయాంలో ఈసీఐ స్వతంత్రత, న్యాయవర్తన, నిష్పాక్షికతతో తన విధ్యుక్త ధర్మాన్ని నిర్వహించిందని ప్రతి ఒక్కరూ గుర్తించారు, గౌరవించారు. శేషన్ అనంతరం సీఈసీలుగా బాధ్యతలు నిర్వర్తించిన ఎమ్‌ఎస్ గిల్, జేఎమ్ లింగ్డో, టిఎస్ కృష్ణమూర్తి, నవీన్ చావ్లా, ఎస్‌వై ఖురేషీలు ఈసీఐ స్వతంత్రత, న్యాయవర్తన, నిష్పాక్షికతను దృఢంగా కాపాడారు. ఇతర సీఈసీలు నిర్వాచన్ సదన్ (భారత ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం)కు ఎలా వచ్చారో అలా వెళ్లిపోయారు. అధికారంలో ఉన్న ప్రభుత్వానికి కొన్నిసార్లు లొంగిపోయేవారు, మరికొన్నిసార్లు లొంగిపోలేదన్న విధంగా కనిపించేవారు. గత పన్నెండు సంవత్సరాలుగా సీఈసీలుగా నియమితులైన వారి విధి నిర్వహణ తీరుతెన్నులను రాజ్యాంగ దర్పణంలో చూస్తే వారు భారత ప్రజాస్వామ్యానికి ఉపద్రవాలే అని నిర్మొహమాటంగా చెప్పక తప్పదు.
ఈసీఐ స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సంస్థ. స్వతంత్ర భారత తొలి సంవత్సరాలలో ఎన్నికల నిర్వహణను ఒక గొప్ప సవాల్‌గా పరిగణించలేదు. స్థానిక పెత్తందారులు ఓటు ఎవరికి వేయాలో నిర్దేశిస్తే అత్యధికులు వారికే ఓటు వేసేవారు. కొన్ని సామాజికవర్గాల వారిని ఓటు వేయకుండా అడ్డుకునేవారు. ఓటుహక్కును వినియోగించుకోలేనివారు పేదలు, ఎటువంటి పలుకుబడి లేనివారు. ఫిర్యాదు ఎలా చేయాలో కూడా తెలియనివారు. ఈ కారణంగా కాంగ్రెస్‌కు ఎలాంటి రాజకీయ సవాళ్లు ఎదురయ్యేవి కావు. 1967 తరువాత ఎన్నికలు కాంగ్రెస్‌తో సహా అన్ని పార్టీలకు సవాల్‌గా పరిణమించాయి. 1965–2014 సంవత్సరాల మధ్య అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఈసీఐ విధుల నిర్వహణలో జోక్యం చేసుకునేవి కావు. ప్రభుత్వం తమ బాధ్యతల నిర్వహణలో జోక్యం చేసుకుంటోందని ఏ ఈసీఐ అయినా ఆరోపించినట్టు నాకు జ్ఞాపకం లేదు. కొన్ని రాష్ట్రాల ఎన్నికలలో అధికార పార్టీకి అనుకూలంగా రిగ్గింగ్ జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ ఆరోపణలు కేంద్రంలోని పాలక పక్షానికి వ్యతిరేకంగా కాకుండా ఈసీఐ అసమర్థతకు వ్యతిరేకంగా చేసినవే అన్నది గమనార్హం.
2014 లోక్‌సభ ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, నిష్పాక్షికంగా జరిగాయి. ఆ తరువాత లోక్‌సభ లేదా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ అసమర్థంగా ఉందని, రిగ్గింగ్ విస్తృతంగా జరిగిందని మొదలైన ఆరోపణలు తీవ్రంగా వచ్చాయి. 2014 నుంచి ఈసీఐ పలు సవాళ్లను, ఒత్తిళ్లను ఎదుర్కోవలసివచ్చింది. ఈ రాజ్యాంగ సంస్థకు సుదీర్ఘకాలంగా ఉన్న పేరు ప్రతిష్ఠలు బాగా క్షీణించాయని చెప్పక తప్పదు. నవంబర్ 2024లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఓటర్ల జాబితాలు వివాదాస్పదమయ్యాయి. ఈసీఐపై ఇవీ ఆరోపణలు: (1) ఓటర్ల జాబితాలో అసాధారణంగా చాలా పెద్ద సంఖ్యలో కొత్త, బహుశా బూటకపు ఓటర్ల పేర్లను అదనంగా చేర్చారు; (2) పోలింగ్ గడువు ముగిసిన తరువాత కూడా ఓటు వేసేందుకు వేలాది ఓటర్లను అనుమతించారు; ఈ రెండు ఆరోపణలను తిరస్కరిస్తూ తన నిర్ణయాలను ఈసీఐ సమర్థించుకున్నది. ఏది సత్యం, ఏదసత్యమనేది ఇంకా తేలవలసివున్నది. బిహార్‌లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది మరికొన్ని రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్నాయి. బిహార్ ఎన్నికలు నాలుగు నెలల్లో జరగవలసివుండగా ఈసీఐ ఆ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)ను చేపట్టింది. ఇది అసాధారణం, ఇంతకు ముందెన్నడూ జరగనిది. సాధారణంగా ఏటా జనవరి 1న ఓటర్ల జాబితాలను సవరించడం జరుగుతుంది. ఎన్నికల సందర్భంగా వాటిని నవీకరిస్తారు. నవీకరించిన జాబితాలలో కొత్త ఓటర్ల పేర్లను చేర్చుతారు. చనిపోయినవారి ఓటర్ల పేర్లను, శాశ్వతంగా వలసపోయిన ఓటర్ల పేర్లను ఆ జాబితాల నుంచి తొలగిస్తారు. కొత్త ఓటర్ల పేర్ల చేర్పు, చనిపోయిన, వలసపోయిన ఓటర్ల పేర్ల తొలగింపు రాజకీయ పార్టీలకు కూడా పూర్తిగా తెలిపి వాటికీ ప్రమేయం కల్పిస్తారు. కొత్తగా చేర్చే పేర్లకు సంబంధించి సంబంధిత ఓటరు వివరాలను చాలా జాగ్రత్తగా పరీక్షిస్తారు. అలాగే తొలగించే పేర్లకు సంబంధించి కూడా సంబంధిత ఓటరును సంప్రదించిన తరువాతనే తొలగిస్తారు. ప్రత్యేక సమగ్ర సవరణ భిన్నమైనది. అది ప్రస్తుత ఓటర్ల జాబితాను పూర్తిగా రద్దు చేస్తుంది. సర్‌కు 2003 నాటి ఓటర్ల జాబితా ఆధారంగా ఉన్నదని చెబుతున్నప్పటికీ ఇది పూర్తిగా కొత్తది. మొదటి నుంచీ తిరిగి రూపొందిస్తున్న జాబితా ఇది. ప్రతి నియోజకవర్గానికి ఓటర్ల జాబితాను సరికొత్తగా రూపొందిస్తున్నారు. ప్రస్తుత ఓటర్ల జాబితాలో తమ పేరు ఉండేలా చూసుకోవల్సిన బాధ్యతను పూర్తిగా ఓటర్‌పైనే మోపారు. ఓటు హక్కు ఉన్నవారే (వీరిలో అత్యధికులు ఇంతకు ముందు జరిగిన ఎన్నికలలో ఓటు వేసినవారే) అయినప్పటికీ సర్‌లో తమ పేరు ఉండేలా చూసుకోవల్సిన బాధ్యత పూర్తిగా వారిదేనని ఈసీఐ స్పష్టం చేసింది. తమ పౌరసత్వాన్ని నిరూపించే డాక్యుమెంట్లతో సహా ఓటర్ల జాబితాలో నమోదయ్యేందుకు దరఖాస్తు చేసుకోవాలి.
ఓటర్‌గా నమోదయ్యేందుకు వెసులుబాటు కల్పించడం కాకుండా... నమోదయ్యేందుకు, ఓటు వేసేందుకు అధిగమించలేని అవరోధాలు కల్పించడమే సర్ లక్ష్యంగా ఉన్నట్టు కనిపిస్తోంది. పౌరసత్వాన్ని నిరూపించుకునేందుకు రుజువులుగా 11 డాక్యుమెంట్లను ఈసీఐ నిర్దేశించింది. వాటిలో నాలుగు పుట్టిన ప్రదేశానికి సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని ఇచ్చేవి కావు. మరో రెండిటిని బిహార్‌లో ఏ వ్యక్తికీ జారీ చేయనేలేదు. పోతే రుజువులుగా చూపించగలిగేవి (రెవెన్యూ అధికారులు జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రంతో సహా) ఐదు మాత్రమే. పాస్‌పోర్ట్, బర్త్ సర్టిఫికెట్, ప్రభుత్వ ఉద్యోగి ఐడి వంటివి బిహార్ జనాభాలో కేవలం 2.4 నుంచి 5 శాతం మందికి మాత్రమే ఉన్నాయి. ఈసీఐ నిర్దేశించిన డాక్యుమెంట్ల జాబితాలో ఆధార్, ఓటర్ గుర్తింపు కార్డు, రేషన్ కార్డు లేనే లేవు. ఈ డాక్యుమెంట్లను ఎందుకు మినహాయించారని సుప్రీంకోర్టు ప్రశ్నించినప్పుడు ఈసీఐ సమాధానం చెప్పలేకపోయింది. చిత్రమేమిటంటే నివాసం, కులానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను ఆధార్ కార్డు ప్రాతిపదికనే రెవెన్యూ అధికారులు జారీ చేస్తారు. సర్‌కు నివాస, కుల ధ్రువీకరణపత్రాలు అంగీకారయోగ్యమైనవి కాగా, ఆధార్ ఆమోదయోగ్యం కాలేదు! సర్‌లో ఏకైక హేతుబద్ధ అంశం చనిపోయిన వ్యక్తుల పేర్లను, రెండుసార్లు నమోదు చేసిన పేర్లను విధిగా తొలగించివేయడం. బిహార్ నుంచి 17.5 లక్షల మంది ఓటర్లు వలసపోయారని ఈసీఐ అంచనా వేసింది. అయితే వారు ఇంకెంత మాత్రం బిహార్ నివాసులు కాదని, ఓటు వేయడానికి స్వరాష్ట్రానికి రారని భావించనవసరం లేదు. బిహార్ వెలుపల ఉన్న బిహారీ ఓటర్ల సౌకర్యార్థం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి జూలై 15న ఓటరుగా నమోదయ్యేందుకు వివరాలు నింపవలసిన దరఖాస్తు పత్రాన్ని అప్‌లోడ్ చేశారు. ఆ ఓటర్ల నమోదు ప్రక్రియను జూలై 26 లోగా పూర్తి చేసేందుకు ఆయన సంకల్పించారు! దీన్నెలా అర్థం చేసుకోవాలి? సర్ ప్రక్రియ అర్హులైన పౌరులు ఓటరుగా తమ పేరు నమోదు చేయించుకుని ఓటు వేసేందుకు తోడ్పడదు గాక తోడ్పడదు అనే నిర్ధారణకు రావడాన్ని అనివార్యం చేస్తోంది. లక్షలాది పేద ప్రజలు, వనరులు, అవకాశాలులేని అణగారిన వ్యక్తులు, వలసజీవుల ఓటుహక్కు రద్దు లక్ష్యంగా ఉన్న రహస్య పథకమే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ. జూలై 28న దేశ సర్వోన్నత న్యాయస్థానం ‘సర్’పై ఎటువంటి తీర్పు వెలువరించనున్నదో వేచిచూద్దాం.
-పి. చిదంబరం
(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి,
కాంగ్రెస్ సీనియర్ నాయకులు)
Updated Date - Jul 19 , 2025 | 02:37 AM