ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ISRO Former Chairman: అంతరిక్ష విజ్ఞాని కస్తూరి రంగన్

ABN, Publish Date - May 06 , 2025 | 02:21 AM

భారత అంతరిక్ష పరిశోధన రంగాన్ని గణనీయంగా అభివృద్ధి చేసిన డా. కస్తూరి రంగన్ 2025 ఏప్రిల్ 25న కన్నుమూశారు. ఇస్రో చైర్మన్‌గా పీఎస్ఎల్వీ, చంద్రయాన్ వంటి ప్రాజెక్టులకు దారితీశారు.

భారతీయ అంతరిక్ష విజ్ఞాన వినీలాకాశంలో ఓ ధ్రువతార డా. కృష్ణస్వామి కస్తూరి రంగన్. ఆయన ఇటీవల (2025 ఏప్రిల్ 25న) కన్నుమూసిన విషయం విదితమే. 1994–2003 మధ్యకాలంలో ‘ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్’ (ఇస్రో)ను విజయవంతంగా ముందుకు నడిపిన ద్రష్ట. 84 ఏళ్ల వయసులో కన్నుమూసే నాటికి కూడా సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్, ఎన్ఐఐటి యూనివర్సిటీలకు కస్తూరి రంగన్‌ ఛాన్సలర్‌గా ఉన్నారు. అంతకుముందు జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఛాన్సలర్, కర్ణాటక నాలెడ్జ్ కమిషన్ చైర్మన్, రాజ్యసభ సభ్యత్వం, ప్లానింగ్ కమిషన్ సభ్యత్వం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ డైరెక్టర్. వీటన్నిటికీ మించి ‘న్యూ ఎడ్యుకేషన్ పాలసీ–2020’ కమిటీకి చైర్మన్... ఇలా కస్తూరి రంగన్‌ అందించిన సేవలు ఎనలేనివి.

భారతదేశపు తొలి ప్రయోగాత్మక భూ అధ్యయన ఉపగ్రహాలైన భాస్కర–1, 2లకు సంబంధించి ప్రాజెక్ట్ డైరెక్టర్‌గానూ, తర్వాత రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ (ఐఆర్ఎస్–1ఎ)కు పర్యవేక్షకుడిగానూ ఆయన బాధ్యతలు నిర్వహించారు. తర్వాత సారథిగా పీఎస్‌ఎల్వీ, జీఎస్‌ఎల్వీ అలాగే పోలార్ శాటిలైట్స్‌ను విజయవంతం చేశారు. వ్యవసాయం, అటవీ సంపద, టౌన్ ప్లానింగ్, నీటి వనరుల నిర్వహణ, చేపల పెంపకం, ఆరోగ్యం, విద్య వంటి మంత్రిత్వ శాఖలకు దోహదపడే నేషనల్ నేచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ద్వారా సామాన్య జనానికి అంతరిక్ష విజ్ఞానం ఎలా సాయం చేయగలదో చేసి చూపించారు. 1999 నేషనల్ టెక్నాలజీ డే సందర్భంగా మే 11న చేసిన ప్రసంగంలో చంద్రుడి చుట్టూ ప్రదక్షిణం చేయగల కృత్రిమ ఉపగ్రహాన్ని పీఎస్ఎల్వీ ద్వారా ఎలా సాధించగలమో వివరించారు. నాలుగేళ్ల తర్వాత ఆ దార్శనిక ప్రసంగమే చంద్రాయన్–1 ప్రాజెక్ట్ రిపోర్టుగా రూపుదాల్చింది. 2003 ఆగస్టు 15న అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయి ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగంలో దీని గురించి తొలుత ప్రస్తావించారు.


మనదేశంలో 1962లో అంతరిక్ష విజ్ఞానానికి సంబంధించిన ప్రయోగాలు ప్రారంభమయ్యాయి. ఈ ఇస్రోకు విక్రమ్ సారాభాయ్, ఎంజీకే మీనన్, సతీష్ ధావన్, యుఆర్ రావు తర్వాత 1994లో కస్తూరి రంగన్ చైర్మన్‌గా పగ్గాలు చేపట్టారు. భూగ్రహాన్ని పరిశీలించేందుకు, సమాచారం సేకరణ, బట్వాడా కోసం వినియోగించిన ఉపగ్రహాలు, వాటిని ప్రయోగించే రాకెట్లు, అంతరిక్ష విజ్ఞానం నుంచి ఆదాయం వంటివన్నీ ఆయన హయాంలో సుసాధ్యమైనవే. ఎడ్యుశాట్, ఇన్‌శాట్, జీ శాట్, రిసోర్స్ శాట్, ఆస్ట్రో శాట్, ఒకే రాకెట్ ద్వారా ఒకేసారి పలు ఉపగ్రహాలను ప్రయోగించడం వంటివి ఆయన సాధించిన విజయాల మైలురాళ్లు.‌ 1999లోనే ఇన్సాట్–2ఇ లోని 10 ట్రాన్స్‌ఫాండర్లను లీజుకి ఇవ్వడం ద్వారా మనం ప్రాంతీయ భాషల్లో సైతం కేబుల్ టీవీని చూడగలిగాం. అంతేకాదు, సుమారు 47 దేశాలకు భారతీయ టీవీ ఛానెళ్ల కార్యక్రమాలు చేరగలిగాయి.‌ ‘షార్’ సెంటర్లో ఉపగ్రహాలను ప్రయోగించేందుకు మరో లాంచింగ్ పాడ్ ఏర్పాటు ప్రయత్నాలు, చంద్రయాన్ ప్రాజెక్టు పురుడు పోసుకోవడం ఆయన చలువే. అందుకే ఈ విజయ గాథను ‘కస్తూరి రంగన్ మ్యాజిక్’ అని ఆయన మిత్రులు, సిబ్బంది కొనియాడుతూ ఉంటారు.

కస్తూరి రంగన్‌ వ్యక్తిగత జీవితాన్ని పరిశీలిస్తే.. కొచ్చిన్ సంస్థాన ప్రాంతంలోని ఎర్నాకులంలో 1940 అక్టోబర్ 24న సీ.ఎం. కృష్ణస్వామి అయ్యర్, విశాలాక్షి దంపతులకు కస్తూరి రంగన్ జన్మించారు. కృష్ణస్వామి అయ్యర్ ‘టాటా’తో పాటు ఇండియన్ ఎయిర్‌లైన్స్ కార్పొరేషన్‌లో పనిచేశారు. చిన్న వయసులోనే తల్లిని కోల్పోయారు. అక్కడే శ్రీరామ వర్మ హైస్కూల్ విద్య, రామ్ నారాయణ రుయా కాలేజ్‌లో డిగ్రీ చదివారు. అటు పిమ్మట బొంబాయి యూనివర్సిటీ నుంచి ఎంఎస్సీ (ఫిజిక్స్) పూర్తి చేశారు. అనంతరం అహ్మదాబాద్‌లోని విక్రం సారాభాయ్ డైరెక్టర్‌గా ఉన్న ‘ఫిజికల్ రీసెర్చ్ లేబరేటరీలో హై ఎనర్జీ ఎక్స్ రే, గామా రే ఆస్ట్రానమి’కి సంబంధించి 1967లో పీహెచ్‌డి పూర్తి చేశారు. 1969లో కస్తూరి రంగన్‌కు లక్ష్మితో వివాహమైంది.


తొలుత 1967లో రీసెర్చ్ అసోసియేట్‌గా ఉద్యోగాన్ని ప్రారంభించి, 1971లో బెంగళూరులోని ఇస్రో శాటిలైట్ సెంటర్‌లో ఫిజిసిస్ట్‌గా చేరారు. అలా 35 ఏళ్లు అక్కడే పని చేసి ఇస్రో చైర్మన్‌గా, స్పేస్ కమిషన్ బాధ్యులుగా, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ సెక్రటరీగా పని చేసి 2003లో పదవీ విరమణ చేశారు.

కస్తూరి రంగన్ తన జీవితాన్నంతా పరిశోధనకే అంకితం చేశారు. తొలుత ఎర్నాకులం, తర్వాత బొంబాయి, అనంతరం అహ్మదాబాద్‌లో, తర్వాత నాలుగు దశాబ్దాలకు పైగా బెంగళూరులో గడిపి అక్కడే కన్నుమూశారు. 240 పరిశోధనా పత్రాలు కల్గిన కస్తూరి రంగన్‌కు 27 యూనివర్సిటీల నుంచి గౌరవ డాక్టరేట్లతోపాటు ప్రభుత్వం నుంచి పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ గౌరవాలు కూడా లభించాయి. రంగన్ రచించిన ‘స్పేస్ అండ్ బియాండ్’ అనే పుస్తకం అంతరిక్ష విజ్ఞానం, విద్యారంగం గురించి ఆయన చేసిన కృషిని వివరిస్తుంది.

- డా. నాగసూరి వేణుగోపాల్

ఆకాశవాణి పూర్వ సంచాలకులు

Updated Date - May 06 , 2025 | 02:22 AM