ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Ponguleti Srinivasreddy: భూభారతితో ధరణి పాపాల ప్రక్షాళన

ABN, Publish Date - Jul 15 , 2025 | 01:48 AM

మన దగ్గర భూములకు సంబంధించినన్ని సమస్యలు ఇక మరి దేనిలోనూ ఉండవు. ఈ భూ సమస్యలను పరిష్కరించాలంటే..

న దగ్గర భూములకు సంబంధించినన్ని సమస్యలు ఇక మరి దేనిలోనూ ఉండవు. ఈ భూ సమస్యలను పరిష్కరించాలంటే, గతంలో ఉన్నవాటి కన్నా మరింత మెరుగైన భూ చట్టాలను తీసుకురావాలి. ఇందుకోసం ఆ రంగంలో నిపుణులు, అనుభవజ్ఞులైన రెవెన్యూ అధికారులతో కమిటీ వేసి వారి నివేదికను అనుసరించి పకడ్బందీగా కొత్త రెవెన్యూ చట్టాన్ని రూపొందించాలి. కానీ, కేసీఆర్‌కు ఎవరినీ ఏ విషయంలోనూ సంప్రదించే అలవాటు లేదు. తానే అపర మేధావినని అనుకుంటారు. అలా అనుకొనే తానే ఇంజనీరు అవతారం ఎత్తి కట్టిన కాళేశ్వరం కుప్పకూలింది. అదేవిధంగా తానే రెవెన్యూ నిపుణుడి అవతారం దాల్చి రూపొందించిన ధరణి లక్షలాది రైతులను అవస్థలపాలు చేసింది.

తెలంగాణ భూ హక్కులు, పట్టాదారు పాస్‌పుస్తకాల చట్టం–2020ను అక్టోబర్‌ 29న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ మేడ్చల్‌ జిల్లా మూడు చింతలపల్లిలో అట్టహాసంగా ప్రారంభించారు. తెలంగాణ భూ సంస్కరణల కోసం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను ఈ సందర్భంగా తెచ్చింది. దీని ద్వారా భూములు కొనుక్కోవాలన్నా, అమ్ముకోవాలన్నా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని ప్రభుత్వం తెలిపింది. కానీ ఈ పోర్టల్‌ తప్పుల కారణంగా రైతుల పరిస్థితి పెనం పై నుంచి పొయ్యిలో పడ్డట్లయింది. లక్షలమంది రైతులు భూములు రిజిస్ట్రేషన్లు గాక, రిజిస్ట్రేషన్ల కోసం కట్టిన డబ్బులు వెనక్కి రాక, రెవెన్యూ ఆఫీసుల చుట్టూ చెప్పులరిగేలా ఏళ్ల తరబడి తిరిగినా ఆ సమస్యలు పరిష్కారం కాలేదు. ఆర్‌ఓఆర్‌–2020లో అప్పీళ్ల వ్యవస్థ లేకపోవడం వల్ల సామాన్యులు సివిల్‌ కోర్టులపై ఆధారపడాల్సి వచ్చింది. లాయర్లకు ఫీజులు చెల్లించుకోలేక, కోర్టుల చుట్టూ ఏళ్ల తరబడి తిరగలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సివిల్‌ కోర్టులు మొదలు హైకోర్టు దాకా కేవలం ధరణికి సంబంధించి 2 లక్షలకు పైగా కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి.

రైతుల ఈ సమస్యలను చూసి ‘తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో కలుపుతా’మని రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో తెలిపారు. చెప్పినట్లుగానే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణిని రద్దు చేసి భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ భూభారతిని పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన నాలుగు మండలాల్లో సదస్సులు నిర్వహించి గ్రామాల్లో రైతుల భూ సమస్యలను ప్రత్యేక ఫార్మాట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించాం. భూభారతి అమలులో భాగంగా ఆర్డీఓ, కలెక్టర్‌ స్థాయిలో అప్పీళ్ల ఏర్పాటు చేశాం. దీనితో ఒక స్థాయిలో కాకపోయినా, రెండో స్థాయిలో సమస్యలకు పరిష్కారం లభిస్తున్నది. ధరణి పోర్టల్‌పై కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కన్వీనర్‌తోపాటు నలుగురు సభ్యులను నియమించింది. భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌కు కన్వీనర్‌గా బాధ్యతలు అప్పగించింది. ఈ కమిటీ అనేక విడతలుగా జిల్లా కలెక్టర్లతో సమావేశమై ధరణిలో వచ్చిన సమస్యలపై చర్చలు జరిపి పరిష్కారమార్గాలపై నివేదికను సమర్పించింది. దాని ఆధారంగా ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టాన్ని రూపొందించింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 14న కొత్త నియమ నిబంధనలతో రెవెన్యూ చట్టం భూ భారతి–2025ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు.

రికార్డుల్లో వేల ఎకరాలు భూమి కనిపిస్తోంది. పట్టా పాస్‌ పుస్తకాలు ఉంటాయి. కానీ క్షేత్రస్థాయిలో భూమి కనిపించదు. ఒకవేళ ఉన్నా కొండలు, గుట్టలు, పడావు భూములు ఉంటాయి. అవి ప్రభుత్వ భూములా, అటవీ భూములా? అనేవి తెలియని పరిస్థితి ధరణి వల్ల ఏర్పడింది. కొన్ని జిల్లాల్లో రెవెన్యూ సిబ్బంది మూల సర్వే నంబర్లను మార్చి కొత్త విస్తీర్ణాలను రికార్డుల్లోకి ఎక్కించారు. దీనితో వేలమంది అర్హులైన ఖాతాల్లో భూ విస్తీర్ణాలు తగ్గిపోయాయి. దానికి తగినట్లుగా ఇతరుల భూ ఖాతాల్లో భూమి పెరిగిపోయింది. ధరణిని అడ్డం పెట్టుకొని గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో దేశంలోనే అతిపెద్ద కుంభకోణం చేశారు. 24 లక్షల ఎకరాల అసైన్డ్‌ భూములను నిషేధిత జాబితాలో పెట్టి, ఆ తర్వాత వారికి కావాల్సిన వాళ్లకి కట్టబెట్టినట్లు తేలింది. ఇటీవల నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో ఇటువంటి సమస్యలపై 1.70లక్షల దరఖాస్తులు వచ్చాయి. నల్గొండ జిల్లాలో అత్యధికంగా 14,803 మంది తమ భూమి ఏమైందో చెప్పాలంటూ దరఖాస్తు చేశారు. తమ భూమి ఖాతాలో సర్వే నెంబర్లు తొలగించారని, వాటిని చేర్చాలని కోరుతున్నారు. సూర్యాపేటలో 8,580 మందికి చెందిన సర్వే నెంబర్లలోని భూమి నమోదు కాలేదు. ఈ విధంగా అన్ని జిల్లాల్లో రైతులు సమస్యల్ని ఎదుర్కొన్నారు. రాష్ట్రంలో భూ సమస్యలకు పరిష్కార వేదికలు లేకపోవడం భూ యజమానులకు ఇబ్బందిగా మారింది. ఆర్‌ఓఆర్‌–2020 ద్వారా అంతకుముందు అమలులో ఉన్న రెవెన్యూ కోర్టులను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తొలగించింది. కనీసం సీసీఎల్‌ఏ స్థాయిలోనూ సమస్యలకు పరిష్కారం కల్పించలేదు. దీనితో పేరు మార్పులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. చట్టాల్లో మార్గదర్శకాలు లేక పార్ట్‌–బిలో చేర్చిన 11 లక్షల ఎకరాలకు పరిష్కారం లభించలేదు. సాదాబైనామా కింద 12 లక్షల ఎకరాలకు హక్కుల కల్పన సాధ్యం కాలేదు. జిల్లాల్లో రికార్డుల పరిశీలన, క్షేత్రస్థాయి పరిశీలన లేకుండానే కొందరు సిబ్బంది ఇష్టారీతిన డేటా నమోదు చేయటంతో సమస్యలు ఉత్పన్నమైనట్లు దరఖాస్తులను పరిశీలిస్తే తెలుస్తోంది.

కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన ఆర్‌ఓఆర్‌–2025 భూ భారతి చట్టంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్‌ 17 నుంచి ఏప్రిల్ 30 వరకు రెండవ విడతలో ప్రతి జిల్లాకు ఒక మండలం చొప్పున, జూన్ 3 నుంచి జూన్ 21 వరకు అన్ని మండలాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించాం. ఆ సదస్సులలో 8.58 లక్షల దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. వాటిలో అధికంగా భూమి హక్కుల కల్పన (ఆర్‌ఓఆర్‌)కు సంబంధించినవే ఉండటం గమనార్హం. రైతులు విన్నవించిన సమస్యల పరిష్కారానికి రెవెన్యూ శాఖ కార్యాచరణ రూపొందిస్తోంది. భూభారతి చట్టంలో తహసీల్దార్‌, ఆర్డీవో, కలెక్టర్‌ స్థాయిలోనే ఎక్కువ సమస్యలు పరిష్కారమయ్యేలా పలు సెక్షన్లు ఏర్పాటు చేశాం. సీసీఎల్‌ఏ స్థాయిలోనూ పలు ఐచ్ఛికాలు కల్పించాం. దిగువ స్థాయిలో ఏదైనా సమస్య పరిష్కారం కాలేదంటే తిరిగి ఆర్డీఓకు, కలెక్టర్‌కు, సీసీఎల్‌ఏకు అప్పీల్‌ చేసుకొనే అవకాశం కల్పించాం. ప్రభుత్వానికి వచ్చిన దరఖాస్తులను ఆన్‌లైన్‌లో పెట్టే ప్రక్రియ పూర్తి కావస్తున్నది. భూ భారతి చట్టంలోను, రూల్స్‌లోను తహసీల్దార్‌ నుంచి సీసీఎల్‌ఏ స్థాయివరకు ప్రతి సమస్య/ అప్పీల్‌ పరిష్కారానికి నిర్దేశిత విధానాన్నీ కాల వ్యవధిని నిర్ధారించాం. తద్వారా దరఖాస్తుదారునికి కచ్చితమైన, నాణ్యమైన పరిష్కారం లభిస్తుంది.

గ్రామ రెవెన్యూ అధికారుల వీఆర్‌ఓ వ్యవస్థను 2020 సెప్టెంబర్‌లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నది. రెవెన్యూ శాఖలో 5657 మంది వీఆర్‌ఓలు, 22,053 మంది గ్రామ రెవెన్యూ సహాయకులు అప్పటివరకు ఉన్నారు. గ్రామ రెవెన్యూ వ్యవస్థ అవినీతిమయమైందని, రెవెన్యూ అధికారులందరూ అవినీతిపరులని వారిపై ముద్రవేసి ఆ వ్యవస్థను రద్దు చేయటంతో గ్రామాలలో రెవెన్యూ రికార్డులను చూసే వారే లేకుండా పోయారు. గ్రామ రెవెన్యూ వ్యవస్థపై కేసీఆర్‌ మొదటి నుంచి తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. 2017లో పంచాయతీరాజ్‌ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు నేతృత్వంలో వేసిన రహస్య కమిటీ గ్రామస్థాయిలో ఏదో ఒక పేరుతో రెవెన్యూ వ్యవస్థ ఉండాల్సిందేనని నివేదిక ఇచ్చింది. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో అభిప్రాయం తీసుకోగా, మెజారిటీ అధికారులు వీఆర్‌ఓ వ్యవస్థ ఉండాలని అప్పటి ముఖ్యమంత్రికి విన్నవించారు. అయినా కేసీఆర్‌ ఎవరి మాట లెక్కచేయకుండా వీఆర్‌ఓ వ్యవస్థను రద్దు చేశారు. దీనితో రైతులు తమ భూ సమస్యల పరిష్కారం కోసం ఎవరిని సంప్రదించాలో అర్థంకాని పరిస్థితి నెలకొన్నది.

మేము ఇప్పుడు భూముల కార్యకలాపాలపై పర్యవేక్షణకు ప్రతీ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని ఏర్పాటు చేస్తున్నాం. ప్రతీ రైతు భూమికి ‘భూధార్‌’ సంఖ్యను ఇవ్వాలని యోచిస్తున్నాం. గత ప్రభుత్వ పాలనలో సర్వే వ్యవస్థ క్షీణించింది. ప్రైవేటు లైసెన్స్‌ ఉన్న వారిని కూడా కలిపితే ఇతర రాష్ట్రాల్లో 10వేల మంది సర్వేయర్లు ఉంటే, మన రాష్ట్రంలో 382మంది మాత్రమే ఉన్నారు. మా ప్రభుత్వం వచ్చాక వెయ్యి మందిని నియమించే ప్రక్రియను ప్రారంభించాం. వీరికి సర్వే ఆఫ్‌ ఇండియా సంస్థతో 90 రోజులపాటు శిక్షణను ఇప్పిస్తున్నాం. గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థను పటిష్ఠం చేయాలనే లక్ష్యంతో ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక గ్రామ పరిపాలనాధికారిని నియమిస్తున్నాం.

ధరణి పోర్టల్‌ కారణంగా లక్షల మంది రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నా ఆ వ్యవస్థను సరిదిద్దడానికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నం చేయకుండా అంతా బాగుందని కళ్లు మూసుకుని కూర్చున్నది. పైగా, ధరణి వ్యవస్థను రద్దు చేస్తామని కాంగ్రెస్‌ చెబితే, ధరణి రద్దయితే రైతుబంధు రాదంటూ ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేశారు. అందుకే ప్రజలు ఎన్నికల్లో ఆ పార్టీని బండకేసికొట్టారు. ఇన్నాళ్లూ రైతులు ఎదుర్కొన్న భూ సమస్యలన్నింటిని ప్రస్తుతం మా ప్రభుత్వం భూ భారతి చట్టం ద్వారా పరిష్కరిస్తున్నది.

-పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలంగాణ రెవెన్యూ,

గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి

Updated Date - Jul 15 , 2025 | 01:48 AM