ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Scheduled Caste Inclusion: రాష్ట్రపతి ఉత్తర్వును రద్దు చేయాలి

ABN, Publish Date - Jun 28 , 2025 | 03:16 AM

దళిత క్రైస్తవులను షెడ్యూల్డ్ కేటగిరీలో చేర్చాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మే 23న జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. 1950 ఆగస్టు 10న రాష్ట్రపతి ఉత్తర్వుతో మొదలైన సమస్యకు, నేటికి కూడా పరిష్కారం చూపలేదు.

దళిత క్రైస్తవులను షెడ్యూల్డ్ కేటగిరీలో చేర్చాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మే 23న జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. 1950 ఆగస్టు 10న రాష్ట్రపతి ఉత్తర్వుతో మొదలైన సమస్యకు, నేటికి కూడా పరిష్కారం చూపలేదు. షెడ్యూల్డ్ కులాల జాబితాలో కొత్త కులాలను చేర్చడానికి లేదా తొలగించడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 రాష్ట్రపతికి అధికారమిచ్చింది. ఈ ఆర్టికల్‌లో మత ప్రస్తావన లేదు, కానీ రాష్ట్రపతి ఉత్తర్వులో ‘‘హిందూమత విశ్వాసాలు కాకుండా వేరే మతాలను విశ్వసించేవారు షెడ్యూలు కులంవారిగా పరిగణించబడరు’’ అని ఉంది. సిక్కు, లింగాయత్‌లు తాము హిందువులం కాదని ప్రకటించారు. బౌద్ధులు దేవుడిని నమ్మరు. కానీ ఈ మూడు మతాల వారిని ఎస్సీలుగానే గుర్తిస్తున్నారు. హిందువులు కాని వారిని ఎస్సీలుగా గుర్తించం అంటే ఎలా? ఎస్సీలుగా కొనసాగాలంటే హిందూ మతాన్ని అనుసరించాలనడం ఏం న్యాయం?

మతం మారవచ్చు గానీ, కులం మారడానికి వీలులేదని సుప్రీంకోర్టు అనేక కేసుల్లో తీర్పు చెప్పింది. ఆర్టికల్ 14లోని చట్టం ముందు అందరూ సమానులు అనే రాజ్యాంగ మౌలిక సూత్రానికి రాష్ట్రపతి ఉత్తర్వు పూర్తి వ్యతిరేకం. ఆర్టికల్ 19(ఉ)– భారత ఎల్లల లోపల తాను ఇష్టపడిన స్థలంలో నివసించడానికి, స్థిరనివాసం ఏర్పరచుకోడానికి భారత పౌరులకు హక్కు ఉంది. కానీ, దళితుల నివాసాలు నేటికీ ప్రధాన గ్రామానికి దూరంగానే ఉన్నాయి. రాష్ట్రపతి ఉత్తర్వుపై పార్లమెంటులో చర్చించి, చట్టం చేయాలి కానీ ఈ రోజు వరకు సహేతుకమైన చర్చ జరగలేదు. బీసీ, ఈబీసీ, ఎస్టీ కేటగిరీలలో లేని మతం మెలిక, ఎస్సీలకు మాత్రమే ఎందుకు? దళితులు హిందువులు కాదని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ పోరాడి నిరూపించారు. ఆ కోణంలోనే 1932లో కమ్యూనల్ అవార్డు సాధించారు. ఏ మతంలోని దళితులైనా వివక్షను అనుభవిస్తున్నది కులం తోటే గానీ మతంతో కాదని అర్థం చేసుకోవాలి.

దళితులను హిందూమతానికి బంధిస్తూ తెచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వును రద్దు చేసే అధికారం కూడా రాజ్యాంగం రాష్ట్రపతికి కల్పించింది. అనేకమంది రాష్ట్రపతులు మారుతున్నా, సుదీర్ఘకాలంగా ఆత్మగౌరవ సమస్యగా ఉన్న ఈ ఉత్తర్వును మరింత జటిలంగా మారుస్తున్నారు గానీ, సులభంగా రద్దు చేసే ప్రక్రియ వైపు మళ్లడం లేదు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాలకృష్ణన్ నేతృత్వంలో 2023లో ఎంక్వైరీ కమిషన్ నియమించారు. అది నత్తనడక నడుస్తోంది. ఆర్టికల్ 15, 16లకు కొత్త క్లాజ్‌లను జత చేసి సవరణ 103 ద్వారా అగ్రకుల ఆర్థిక వెనుకబాటుదారులకు రిజర్వేషన్లు కల్పించారు. ఏ ఉద్యమాలు, పోరాటాలు, అవసరాలు లేకుండా రూ.8 లక్షల ఆదాయం ఉన్న అగ్రకులం వారిని ఆర్థిక బలహీనులుగా గుర్తించారు. కానీ దళితుల విషయాన్ని తెరమరుగు చేసి అణచివేస్తున్నారు. స్వతంత్ర భారతదేశంలో దళితులను స్వేచ్ఛ నుంచి చెరసాలకు నెట్టి వేశారు. విముక్తి పొందాలంటే పోరాటమే పరిష్కారం గానీ వినతిపత్రాలు కావు.

– కె.బాబూరావు, విశ్రాంత అదనపు డీజీపీ

– పులుగుజ్జు సురేష్, సామాజిక విశ్లేషకులు

(సీసీసీ, ఎన్‌ఎఫ్‌డీసీ ఆధ్వర్యంలో జూన్ 30న

విజయవాడలో దళిత క్రైస్తవ ఆత్మగౌరవ సభ)

Updated Date - Jun 28 , 2025 | 03:21 AM