ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Safeguarding Bachawat Allocations: బచావత్ కేటాయింపులు కాపాడితేనే జల భద్రత

ABN, Publish Date - Sep 18 , 2025 | 06:17 AM

ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగం భవిష్యత్తు నేడు గరిమనాభి మొనపై ఉంది. ప్రస్తుతం విచారణ జరుపుతున్న బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్‌లో బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులు కాపాడుకోవడంపైనే కూటమి ప్రభుత్వం నిబద్ధత ఇమిడి ఉంటుంది....

ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగం భవిష్యత్తు నేడు గరిమనాభి మొనపై ఉంది. ప్రస్తుతం విచారణ జరుపుతున్న బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్‌లో బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులు కాపాడుకోవడంపైనే కూటమి ప్రభుత్వం నిబద్ధత ఇమిడి ఉంటుంది. జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం మిగిల్చిపోయిన విపత్తు నివారించడం అంత ఆషామాషీ కాదు. ఇప్పుడు ట్రిబ్యునల్ ముందు తెలంగాణ ప్రభుత్వం వాదనలు తుది దశకు వచ్చాయి. తిరిగి ఈ నెల 23, 24, 25 తేదీల్లో ఈ కేసు విచారణకు రానున్నది. తెలంగాణ ప్రభుత్వమే తన వాదనలు వినిపిస్తుంది. తదుపరి విచారణ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన వాదనను వినిపించవలసి ఉంది. తెలంగాణ ప్రభుత్వ వాదనల సందర్భంగా బ్రిజేశ్ కుమార్ జోక్యం చేసుకుని అడిగిన వివరణలు పరిశీలిస్తే, కేసు విచారణ జటిలంగానే ఉండబోతోంది. ఇంతవరకు ట్రిబ్యునల్ ముందు జరిగిన విచారణ గురించి చెదురుమదురుగా ఆంధ్రప్రదేశ్‌లో వార్తలు వచ్చాయి, కానీ సమగ్రంగా రాలేదు. మున్ముందు ఈ కేసు తీర్పులో ఏదైనా జరగరానిది జరిగితే ముందు వరుసలో జగన్మోహన్‌రెడ్డి, తదుపరి కేంద్ర ప్రభుత్వం, ఆఖరుగా కూటమి ప్రభుత్వం నెపం మోయవలసి ఉంటుంది. రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 89 మేరకు ట్రిబ్యునల్ విచారణ జరుపుతున్నా, సంతృప్తి చెందని కేసీఆర్ వ్యూహాత్మకంగా 2020లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో జగన్మోహన్‌రెడ్డిని బుట్టలో వేసుకున్నారు. 1956 అంతర్ రాష్ట్ర జల వివాద చట్టం కింద కొత్త ట్రిబ్యునల్ నియామకంపై అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి డిసెంట్ నోట్ పెట్టి ఉండాల్సింది. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగాన్ని కుదిపివేసే కొత్త ట్రిబ్యునల్ నియామకం వ్యతిరేకించాల్సింది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం చేతులు కూడా కట్టివేసినట్టు అయ్యేది. జగన్మోహన్‌రెడ్డి అభ్యంతరం చెప్పకపోవడంతో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తీర్మానం ఆమోదం పొందింది. మూడేళ్ల పాటు కేసీఆర్ అడిగినపుడల్లా న్యాయ శాఖ వద్ద ఫైలు ఉందని చెబుతూ వచ్చిన బీజేపీ ప్రభుత్వం, 2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందేందుకు కొత్తగా ట్రిబ్యునల్ నియామకం చేసి, అవశేష ఆంధ్రప్రదేశ్ గొంతు కోసింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉన్నందున, మున్ముందు రాష్ట్ర ప్రభుత్వమూ ప్రజలకు జవాబు చెప్పవలసి ఉంటుంది.

ట్రిబ్యునల్ ముందు దశల వారీగా జరిగిన విచారణలో ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వం విన్పించిన వాదనల్లో బేసిన్ సమస్యను ప్రధానంగా తీసుకువచ్చింది. ఆంధ్రప్రదేశ్ బేసిన్ ఆవలకు కృష్ణ జలాలను తీసుకెడుతున్నదని ప్రస్తుతమున్న 510 టీఎంసీల్లో 331 టీఎంసీలు బేసిన్ ఆవలకు తరలిస్తున్నదని గణాంకాలతో సహా నివేదించింది. ఆంధ్రప్రదేశ్‌కు 180 టీఎంసీలు చాలన్నట్లు తెలంగాణ అడ్వకేట్ వైద్యనాథన్ వివరించారు. ఈ సందర్భంలో బ్రిజేశ్ కుమార్ జోక్యం చేసుకొని వివరాలు అడిగితే తెలంగాణ అడ్వకేట్ వాటిని సమర్పించారు. బేసిన్ ఆవలకు తీసుకెడుతున్న 331 టీఎంసీలు కోత విధించి, తమకు కేటాయించాలని కోరారు. తెలంగాణ దృష్టిలో సాగర్ కుడి కాలువ, కేసీ కెనాల్, తుంగభద్ర ఎగువ కాలువ ఆయకట్టు, రాయలసీమ మొత్తం బేసిన్ ఆవలగా చిరకాలంగా చెబుతోంది. అదే విషయాన్ని వాళ్ల అడ్వకేట్, ట్రిబ్యునల్ ముందు ఉంచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీల్లో 71 శాతం తెలంగాణకు కేటాయించాలని వైద్యనాథన్ కోరారు. 1954లో హైదరాబాద్, ఆంధ్ర రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందం మేరకు సాగర్ కుడి కాలువ కింద 9.7 లక్షల ఎకరాలు ఆయకట్టు ఉండాల్సివుంటే నేడు 11.74 లక్షల ఎకరాలకు పెంచారని, ఇందులో కోత విధించాలని కూడా తెలంగాణ కోరింది. పైగా మరో ప్రమాదకరమైన అభ్యర్థన ఏమంటే ఆంధ్రప్రదేశ్‌లో పంటల సాగు విధానం మార్పు చేయాలని, ఇందుకు ఉదాహరణగా కావేరి ట్రిబ్యునల్ తీర్పు ఉల్లేఖించారు. తెలంగాణలో ఎక్కువ మెట్ట ప్రాంతాలుగా ఒక పంట కూడా సాగు కాని దుర్భిక్ష పరిస్థితులుంటే ఆంధ్రప్రదేశ్‌లో రెండు వైపుల నుంచి సాగునీటి వసతి ఉన్నదని ఈ పరిస్థితుల్లో ఒక వైపు కోత విధించి, ఆ నీళ్లు తెలంగాణకు కేటాయించాలని కోరింది. ఉదాహరణకు కృష్ణ డెల్టాకు గోదావరి జలాలు కూడా వస్తాయి కాబట్టి కృష్ణ నీళ్లు గొంతెండిపోతున్న తెలంగాణకు కేటాయించాలని వైద్యనాథన్ కోరారు. ట్రిబ్యునల్ విచారణ ప్రారంభ దశలోనే కేంద్ర జలసంఘం మాజీ సభ్యులు చేతన్ పండిట్ ట్రిబ్యునల్ ముందు ఒక అఫిడవిట్ వేశారు. క్యారీ ఓవర్ కింద ఉన్న 150 టీఎంసీల్లో 125 టీఎంసీలు తెలంగాణకు కేటాయించాలని, 25 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్‌కు చాలని కోరారు. దీనితో పాటు గోదావరి నుంచి కృష్ణలో కలిసే 80 టీఎంసీల్లో ఎగువ రాష్ట్రాలకు పోగా మిగిలే 45 టీఎంసీలు కూడా తెలంగాణకే కేటాయించాలని కోరి ఉన్నారు. ఈ అంశాలపై వైద్యనాథన్ మరింత వివరణ ఇస్తూ ట్రిబ్యునల్ ముందు వాదన వినిపించారు.

మరీ అన్యాయమైన డిమాండ్ ఏమంటే నిత్య క్షామపీడిత ప్రాంతమైన రాయలసీమకు ఉన్న దిక్కు కేసీ కెనాల్ ఒక్కటే. బ్రిటిష్ కాలం నుంచి కేసీ కెనాల్ కింద ఆయకట్టుకు తుంగభద్ర నీళ్లు వస్తున్నాయి. పైగా బచావత్ ట్రిబ్యునల్ చట్టబద్ధంగా నీటి కేటాయింపులు చేసింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి అది బేసిన్ ఆవలగా కనిపిస్తోంది. తెలంగాణలోని దుర్భిక్ష ప్రాంతాల కన్నా కనాకష్టంగా ఉన్న రాయలసీమకు స్పాట్ పెట్టడమే విశేషం. తెలంగాణ అడ్వకేట్ తుది దశలో తన వాదనలను విన్పిస్తూ శ్రీశైలం కేవలం జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టుగా నిర్మితమైందని దాని నుంచి సాగుకు నీళ్లు తీసుకొనే అవకాశం లేదని స్పష్టంగా చెప్పారు. అంతకు ముందు విచారణ సందర్భంగా 1976లో కుదిరిన ఒప్పందం మేరకు శ్రీశైలం నుంచి కేవలం 15 టీఎంసీల నీళ్లు చెన్నై తాగు నీటి కోసం మాత్రమే తీసుకొనే అవకాశం ఉందని, కానీ ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నీళ్లు తీసుకుంటోందని కాబట్టి 15 టీఎంసీలు మించి తీసుకోకుండా కట్టడి చేయాలని వైద్యనాథన్ నివేదించారు. వీటన్నింటికీ మించి ప్రమాదకరమైన డిమాండ్ తెలంగాణ చేసింది. రాష్ట్ర విభజన చట్టం 11వ షెడ్యూల్‌లో పేర్కొన్న మిగులు జలాల ఆధారంగా నిర్మితమైన ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు ఆంధ్రప్రదేశ్ కోరి ఉన్నదని, ఈ ప్రాజెక్టులకు కేటాయింపులు చేయవద్దని కూడా వైద్యనాథన్ అభ్యర్థించారు. అంతే కాదు, తెలంగాణలో పడే వర్షపు నీరు లెక్కించి ఆ మేరకు కృష్ణ జలాలను తెలంగాణకు కేటాయించాలని కూడా తెలంగాణ ట్రిబ్యునల్‌ను కోరారు. ఇవన్నీ ప్రధానమైన అంశాలు. సంవత్సర కాలంగా తెలంగాణ సమర్పించిన ప్రత్యేక అఫిడవిట్లు వాళ్ల అడ్వకేట్ వైద్యనాథన్ చేసిన వాదనలు ఒక ఉద్గ్రంథమే అవుతుంది. ఈ నేపథ్యంలో మున్ముందు ట్రిబ్యునల్ ముందు సమర్థవంతమైన, సమగ్రమైన వాదన వినిపించేందుకు సమర్థులైన లాయర్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంపిక చేయవలసి ఉంది. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి వెంటనే సమీక్ష జరపాలి.

-వి. శంకరయ్య విశ్రాంత పాత్రికేయులు

Updated Date - Sep 18 , 2025 | 06:17 AM