Congress and Social Justice Legacy: కాంగ్రెస్ డీఎన్‌ఏలోనే సామాజిక న్యాయం
ABN, Publish Date - Aug 05 , 2025 | 06:12 AM
స్వాతంత్య్రానంతరం నెహ్రూ మొదలుకొని మన్మోహన్‌సింగ్ వరకూ అన్ని ప్రభుత్వాలూ ఏ మినహాయింపూ లేకుండా సామాజిక న్యాయసాధనకు పాటుబడ్డాయి. అట్టడుగువర్గాల ఆర్థికావకాశాల మెరుగుదలకు కృషిచేశాయి. ఈ రెండు....
స్వాతంత్య్రానంతరం నెహ్రూ మొదలుకొని మన్మోహన్‌సింగ్ వరకూ అన్ని ప్రభుత్వాలూ ఏ మినహాయింపూ లేకుండా సామాజిక న్యాయసాధనకు పాటుబడ్డాయి. అట్టడుగువర్గాల ఆర్థికావకాశాల మెరుగుదలకు కృషిచేశాయి. ఈ రెండు సాధనాల ద్వారా నిజమైన జాతీయ ప్రగతికి దృఢమైన పునాదులు పడ్డాయి. సామాజిక న్యాయం సమకూర్చటం మొదలుకొని ఆర్థికశక్తిగా ఆవిర్భవించటం వరకూ సాగిన ఎదుగుదలలో ఉన్నది కాంగ్రెస్ వారసత్వమే. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఓబీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు ఖరారు చేయటం ఆ వారసత్వం కొనసాగింపే.
సామాజిక న్యాయం! ఈ మాట ఇటీవల తరచుగా వినిపిస్తోంది. నిన్న మొన్న కళ్లు తెరిచిన పార్టీలు, కొందరు నాయకులు తామే దానికి ఆద్యులమని భ్రమపడి రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. స్వాతంత్య్ర సాధనకు పూర్వం నుంచీ సామాజిక న్యాయాన్ని తన డీఎన్‌ఏలో భాగం చేసుకున్న కాంగ్రెస్ పార్టీకి ఇది వింతగా అనిపిస్తున్నది. ఎందుకంటే ఆరంభం నుంచీ సామాజిక న్యాయవిస్తరణ, ఆర్థికావకాశాల మెరుగుదల అనే రెండు మూలస్తంభాలే మన దేశ ప్రగతి ప్రస్థానాన్ని నిర్వచిస్తున్నాయి. ఈ ప్రస్థానానికి కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వాలే సంపూర్ణంగా దోహదపడ్డాయి. నిరుపేదలూ, అట్టడుగువర్గాల అభ్యున్నతి అనేది కేవలం నైతిక బాధ్యతగా కాక జాతీయ ప్రగతికి దోహదపడే నిజమైన సాధనాలుగా కాంగ్రెస్ విశ్వసించటమే ఇందుకు కారణం. కేంద్రంలో అయినా, రాష్ట్రాల్లోనైనా కాంగ్రెస్ ప్రభుత్వాలున్నప్పుడే సామాజిక న్యాయం, పేదరిక నిర్మూలన, ఆర్థికాభివృద్ధి సాధ్యమయ్యాయన్నది చరిత్ర చాటుతున్న సత్యం. దీనికి కొనసాగింపుగానే తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న దృఢ సంకల్పంతో ఉంది. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం దీనికి ఆమోదం తెలిపే దాకా కాంగ్రెస్ పార్టీ విశ్రమించదు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం, మా అధినేత రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేపట్టింది. దాని ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. వెనకబడిన తరగతులకు రాజకీయాధికారం ఇచ్చే ఈ సంకల్పానికి బీజేపీ, బీఆర్‌ఎస్ మద్దతు పలకకపోతే బీసీల ద్రోహులుగా మిగిలిపోతారు.
ఒక్కసారి చరిత్రను తిరగేస్తే, భారత ప్రథమ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ నేతృత్వంలోని కాంగ్రెస్ రాజ్యాంగ సమానతకు పథనిర్దేశం చేసింది. రాజ్యాంగ ముసాయిదా రూపకల్పనకు నియమించిన రాజ్యాంగ నిర్ణాయక సభ సారథ్యాన్ని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌కు నెహ్రూ అప్పగించారు. పర్యవసానంగానే షెడ్యూల్ కులాలు, జాతులకు పార్లమెంటులోనూ, అసెంబ్లీల్లోనూ, ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగం రూపుదిద్దుకుంది. ఈ రక్షణలు దశాబ్దాలు గడుస్తున్నా, భిన్న రాజకీయ పక్షాల ఏలుబడులొచ్చినా నిరాటంకంగా, అప్రతిహతంగా సాగుతున్నాయంటే అది కాంగ్రెస్ సమ్మిళిత భావనకూ, నిబద్ధతకూ చిహ్నం.
అనంతర కాలంలో వచ్చిన కాంగ్రెస్ ప్రధానమంత్రులందరూ ఆ దృఢమైన పునాది ఆలంబనగా సామాజిక న్యాయసాధన దిశగా మరిన్ని చర్యలు తీసుకున్నారు. ఉపాధి కల్పన ద్వారా పేదరిక నిర్మూలన, గృహకల్పన, అట్టడుగు వర్గాలకు సామాజిక మద్దతు వంటి లక్ష్యాలతో ఇందిరాగాంధీ ఇరవై సూత్రాల కార్యక్రమం రూపొందించారు. అత్యధికులకు విద్య అందించాలన్న సంకల్పంతో రాజీవ్‌గాంధీ మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత పట్టుదలతో అమలుచేయటం, ఎస్సీ విద్యార్థుల ఉన్నత చదువులే లక్ష్యంగా నేషనల్ ఫెలోషిప్‌ల ఏర్పాటు వంటివి అమలు చేశారు. ఈ చర్యలు డ్రాపౌట్‌లను తగ్గించి, అక్షరాస్యతను పెంచి, అవకాశాలను మరింత విస్తృతపరిచాయి.
సామాజిక న్యాయ విప్లవం పీవీ నరసింహారావు ప్రభుత్వ హయాంలోనూ కొనసాగింది. ఓబీసీలకు విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న మండల్ కమిషన్ సిఫార్సులకు చట్టబద్ధత కల్పిస్తూ ఆయన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశ చరిత్రను కీలక మలుపు తిప్పింది. ఎందుకంటే, ఆ ఒక్క చర్యవల్ల ఓబీసీల ప్రాతినిధ్యం భిన్న రంగాల్లో అపారంగా పెరిగింది. పీవీ కేబినెట్‌లో డాక్టర్ మన్మోహన్‌సింగ్ ఆర్థికమంత్రిగా, అనంతరం ప్రధానిగా సమ్మిళిత అభివృద్ధి విధానాన్ని కొనసాగించి కాంగ్రెస్ ప్రతిష్ఠను మరింత పెంచారు. అందరూ ‘ఉపాధి హామీ పథకం’గా పిలిచే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి గ్యారెంటీ చట్టం(నరేగా)ను 2005లో తీసుకొచ్చిన ఘనత ఆయన ప్రభుత్వానిదే. ప్రతిష్ఠాత్మకమైన ఈ చట్టం పల్లెసీమల్లోని అట్టడుగువర్గాలైన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కుటుంబాలకు ఏడాదికి వందరోజుల వేతనంతో కూడిన ఉపాధిని కల్పించింది.
ఉపాధి హామీ పథకం కింద సమకూరిన హక్కు పర్యవసానంగా దాదాపు 14.3 కోట్ల మంది లబ్ధిదారులున్నారు. అంటే గత మూడేళ్లలో ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి కుటుంబానికీ కనీసం ఒక్కసారైనా పని దొరికిందని అర్థం. నవంబర్ 2023 నాటికి ఈ పథకం 221 కోట్ల పనిదినాలను సృష్టించింది. అంతకు క్రితం సంవత్సరం ఇది 208 కోట్లు. నిధుల రీత్యా చూస్తే కేంద్రం కోవిడ్ కాలాన్ని కలుపుకొని 2022 నాటికి ఎనిమిదేళ్లలో రూ.5 లక్షల కోట్లు వ్యయం చేసింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో దీని కోసం రూ.60,000 కోట్లు కేటాయిస్తే, అది రూ.89,400 కోట్లకు పెరిగింది. అసలు వందరోజుల పని లక్ష్యాన్ని సంపూర్ణంగా సాధించాలంటే ఈ పథకానికి 1.1 లక్ష కోట్లు అవసరమవుతాయి. కాంగ్రెస్ పాలనలో ఈ పథక విస్తృతి అర్థవంతమైన పనికి, వేతనాలకు తోడ్పడి కోట్లాది కుటుంబాల్లో వెలుగులు నింపింది. ఉదాహరణకు దేశ జీడీపీ 1991 నాటి ఆర్థిక సంస్కరణల అనంతరం అది ఒక్కసారిగా ముందుకురికింది. 2000లలోనూ, అటు తర్వాత 6 నుంచి 8శాతం వార్షిక వృద్ధిరేటు నిలకడగా సాగింది. తలసరి ఆదాయం 1991– 2023మధ్య 360 శాతం పెరిగింది. మరోపక్క దారిద్య్రం రేటు క్షీణిస్తూ కోట్లాది మందిని ప్రధాన ఆర్థిక స్రవంతిలోకి తీసుకురాగలిగింది. సామాజిక సమ్మిళితమూ, ఆర్థిక విస్తృతి చెట్టపట్టాలేసుకుని సాగాయి. రిజర్వేషన్లు ప్రాతినిధ్యానికి చోటు కల్పిస్తే, సంక్షేమ పథకాలు సామాన్యులకు దేన్నయినా తట్టుకునే సామర్థ్యాన్నిచ్చాయి.
ఇదే సమయంలో మన భారతీయ సంస్థలు సృజనాత్మకతకూ, అభివృద్ధికి ప్రతీకలుగా రూపుదిద్దుకున్నాయి. జవహర్‌లాల్ నెహ్రూ సంకల్పంతో 1962లో ప్రారంభమైన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రపంచశ్రేణి అంతరిక్ష యాత్రలకు చిరునామాగా మారింది. 1994లో పీవీ నరసింహారావు ప్రధానిగా ఉండగా, అభివృద్ధి చెందిన దేశాలను విస్మయానికి గురిచేసిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పిఎస్ఎల్‌వీ) వినియోగంలోకి వచ్చింది. ఇప్పుడు రక్షణ పరిశోధన సంస్థలు బ్రహ్మోస్, ఆకాశ్ వంటి క్షిపణులకు రూపకల్పన చేసి వాటిని ఎగుమతిచేసే స్థాయికి వెళ్లాయి.
ఇవన్నీ నిరూపిస్తున్నది ఒక్కటే– కాంగ్రెస్ ప్రభుత్వాలు సమ్మిళిత అభివృద్ధి భావన కేంద్రంగా వ్యూహరచన చేశాయి. నెహ్రూ, అంబేడ్కర్‌ల హయాంలో రిజర్వేషన్లకు రాజ్యాంగపరమైన గ్యారెంటీ లభించటం మొదలుకొని ఇందిరాగాంధీ సంక్షేమ ఎజెండా, రాజీవ్‌గాంధీ విద్యా సాధికారత, పీవీ అమలుచేసిన ఓబీసీ రిజర్వేషన్లు, మన్మోహన్ ఉపాధి హామీ పథకం వరకూ అమలైనవన్నీ సమాజంలోని అత్యంత నిరుపేద వర్గాల అభ్యున్నతికి దోహదపడ్డాయి. కాంగ్రెస్ విధానాలు దేశాభివృద్ధిలో క్రియాశీలక పాత్ర పోషించే విధంగా ఆ వర్గాలను తీర్చిదిద్దాయి.
ఉపాధి హామీ పథకం కింద 14 కోట్లకు మించిన కుటుంబాలు ఏటా తమ జీవికను పొందగలుగుతున్నాయి. ఆ పథకం తాలూకు వార్షిక వ్యయం దాదాపు రూ.90,000 కోట్లు. ఇటీవలి సంవత్సరాల్లో దీని సంచిత వ్యయం రూ.5 లక్షల కోట్లు దాటింది. కోట్లాది మంది దారిద్య్రం నుంచి బయటపడి, జీవన అవకాశాలను మెరుగుపరుచుకున్నారు.
కాంగ్రెస్ నాయకత్వం అందించిన పాలన దేశాన్ని– జీడీపీ అంకెల ద్వారా కాదు... దుర్బల వర్గాల జీవితాల్లో వెలుగులు నింపటం ద్వారా– రూపాంతరం చెందించగలిగింది. చట్టంలో న్యాయాన్ని, విధానంలో సమానతను పొందుపరచటం వల్ల ఒక బలహీన, విభజిత సమాజం పల్లెసీమల ఆధారంగా నడిచే శక్తిమంతమైన ఆర్థిక వ్యవస్థగా రూపుదాల్చింది. సామాజిక న్యాయం సమకూర్చటం మొదలుకొని ప్రపంచ ఆర్థికశక్తిగా దేశం ఆవిర్భవించటం వరకూ సాగిన ఆ ఎదుగుదలలో దృఢమైన పునాదిగా ఉన్నది నిస్సందేహంగా కాంగ్రెస్ వారసత్వమే.
దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి
ఈ వార్తలు కూడా చదవండి..
అవినీతి, ఆశ్రిత పక్షపాతంతోనే ప్రాజెక్ట్ నిర్మాణం: సీఎం రేవంత్ రెడ్డి
Read latest Telangana News And Telugu News
Updated Date - Aug 05 , 2025 | 06:17 AM