ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: మీ మాట మీకు వర్తించదా సీఎం గారూ?

ABN, Publish Date - Oct 23 , 2025 | 04:11 AM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల గ్రూపు–2లో ఉద్యోగులుగా ఎంపికైన అభ్యర్థులకు ఉత్తర్వులను పంపిణీ చేసే సభలో మాట్లాడుతూ– తల్లిదండ్రులను సరిగా చూసుకోని ఉద్యోగుల...

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల గ్రూపు–2లో ఉద్యోగులుగా ఎంపికైన అభ్యర్థులకు ఉత్తర్వులను పంపిణీ చేసే సభలో మాట్లాడుతూ– తల్లిదండ్రులను సరిగా చూసుకోని ఉద్యోగుల వేతనం నుంచి 15శాతాన్ని మినహాయించి దాన్ని నేరుగా వారి తల్లిదండ్రులకి ఇస్తామని, ఆ మేరకు ఉత్తర్వులు కూడా ఇస్తామని ప్రకటన చేశారు. మంచిదే, కానీ మరి ఇదే తప్పు ప్రభుత్వం చేస్తే శిక్ష ఎవరికి విధించాలి? రిటైర్డ్‌ ఉద్యోగుల బాగోగులు చూసుకోవాల్సిన తల్లీ తండ్రీ స్థానంలో ఉన్నది ప్రభుత్వమే! మరి అలాంటప్పుడు, 2024 నుంచి రిటైర్ అయిన ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకుండా వారి మరణాలకు కారణం అవుతున్న ప్రభుత్వ పెద్దలు తమకు ఏ శిక్షను వేసుకుంటారో చెప్పాలి. ఉద్యోగంలో చేరేవారికి మీరు పెట్టిన నిబంధన ఉద్యోగ విరమణ చేసేవారికి వర్తించదా? ఇరువురి సంక్షేమమూ చూడాల్సింది ప్రభుత్వమే కదా! 2024 నుంచి రిటైర్ అయిన ఉద్యోగులకు చెల్లించాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించనే లేదు. రెండేళ్ళుగా ఎదురు చూసిన ఉద్యోగులు తమ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక, కుటుంబ అవసరాలు తీరక, ఆర్థికపరమైన ఒత్తిడితో కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. రిటైరైన ఉద్యోగులు తమ ఉద్యోగ విరమణ అనంతరం వచ్చే నిధులతో ప్రధానమైన కుటుంబ అవసరాలు తీర్చడంతోపాటు, ఇల్లు లేని ఉద్యోగులు ఇల్లు సమకూర్చుకోవడం, పేరుకుపోయిన అప్పులు ఉంటే తీర్చుకోవడం చేస్తుంటారు. ఒకే మొత్తంగా వస్తాయి కనుక ఈ డబ్బును తమ కుటుంబ వైద్య అవసరాలకు, పిల్లల పెళ్ళిళ్లకు ఖర్చు చేయడం కోసం దాచుకుంటారు.‍ ఉద్యోగులు దాచుకున్న ఏపీజీయల్ఐసీ, ప్రావిడెంట్ ఫండ్‌లతో పాటు, సరెండర్ లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌, పెన్షన్ కమిట్‌మెంట్, గ్రాట్యుటీ తదితరాలను ఉద్యోగులు రిటైర్ అయిన తేదీనే గతంలో ప్రభుత్వం చెల్లించేది. ఏ ప్రభుత్వమైనా ఉద్యోగి రిటైర్‌ అయిన నెలరోజుల్లోగా వారికి చెల్లించాల్సిన బకాయిలను చెల్లించడం గత కొన్ని దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీ. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏప్రిల్ 2024నుంచి రిటైర్మెంట్ పొందిన ఉద్యోగుల బకాయిలు పెండింగ్‌లో పెట్టారు. మునుపెన్నడూ లేనివిధంగా, నిధులు లేవని ఇవ్వకపోవడంతో ఈ రిటైర్మెంట్ బకాయిలు పెద్ద మొత్తంలో పేరుకుపోయాయి. సుమారు రూ.10వేల కోట్ల వరకు రిటైర్మెంట్ బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. గతంలో ఉద్యోగి రిటైర్మెంట్ నెలలోనే సబ్‌ ట్రెజరీ ఆఫీసు నుంచి రాష్ట్ర స్థాయిలో ఉన్న ‘పే అండ్ అకౌంట్’ కార్యాలయానికి ప్రతిపాదన పంపితే దరఖాస్తు చేసిన నెలలోపు ఆర్థిక లబ్ధి మంజూరు అయ్యేది.

ప్రస‍్తుతం ఆర్థిక స్థితి మొత్తం ప్రభుత్వం తన నియంత్రణలోనికి తీసుకోవడంతో ఆయా ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించే సంస్థలైన రాష్ట్ర పే & అకౌంట్ కార్యాలయం, ట్రెజరీ, సబ్ ట్రెజరీ ఆఫీసులు నిర్వీర్యం అయ్యాయి. ఆర్థిక అధికారం మొత్తం ప్రభుత్వం చేతిలో కేంద్రీకృతమైంది. రిటైర్ అయిన ఉద్యోగి నుంచి పెద్దగా ఒత్తిడి ఏమీ ఉండదులే అన్న ఉద్దేశంతో వారికి చెల్లించాల్సిన బకాయిలను పెండింగ్‌లో ఉంచింది ప్రభుత్వం. కొందరు ఉద్యోగులు తమ అవసరాలను పేర్కొంటూ హైకోర్టును ఆశ్రయించి బకాయిలు పొందారు. అటు తర్వాత ఫిర్యాదులు కుప్పలు తెప్పలుగా రావడంతో కోర్టు కూడా ఈ సమస్యను ప్రభుత్వ పరిష్కారానికే వదిలివేసింది. ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చల్లో ఈ ప్రస్తావన ఉన్నప్పటికీ, ఉద్యోగ సంఘాలు తమ సమస్యలకే ప్రాధాన్యతనిచ్చి ఈ అంశాన్ని పక్కనపెట్టేయడంతో రిటైర్మెంట్ ఉద్యోగులు మరింత కలవరపాటుకు గురయ్యారు. ఇటీవలే రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘాలు ఆందోళనబాట పట్టాయి. కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నాలకు, నిరాహార దీక్షలకు దిగడంతో పాటు, తదుపరి ఆందోళనా రూపాలకు సైతం సిద్ధం అవుతున్నాయి. ప్రభుత్వం వెంటనే ఈ విషయమై భరోసా కల్పిస్తూ ప్రకటన ఇవ్వడంతోపాటు, పదవీ విరమణ చేసిన ఉద్యోగుల బకాయిలు వీలైనంత త్వరగా చెల్లించాలని కోరుకుందాం.

– ---ఎన్. తిర్మల్, సామాజిక కార్యకర్త

Updated Date - Oct 23 , 2025 | 04:12 AM