ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Indian Politics : పునర్విభజన లొల్లి

ABN, Publish Date - Mar 01 , 2025 | 04:52 AM

దక్షిణాది మెడమీద పునర్విభజన కత్తివేలాడుతున్నదంటూ హెచ్చరిక చేసి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌ పెద్ద వివాదమే రేపారు.

క్షిణాది మెడమీద పునర్విభజన కత్తివేలాడుతున్నదంటూ హెచ్చరిక చేసి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌ పెద్ద వివాదమే రేపారు. జనాభా నియంత్రణలో ఘన విజయాలు సాధించిన దక్షిణాది రాష్ట్రాలు ప్రతిఫలంగా పెద్దఎత్తున లోక్‌సభ సీట్లను కోల్పోబోతున్నాయని హెచ్చరించారాయన. కోయంబత్తూరులో మహాశివరాత్రినాడు ఒక ఆధ్యాత్మిక వేడుకలో పాల్గొనడానికి వచ్చిన హోంమంత్రి అమిత్‌ షా, ఏమిటీ అసత్యప్రచారాలంటూ స్టాలిన్‌ మీద విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీ ఎప్పుడో ఇచ్చిన వాగ్దానం మేరకు దక్షిణ భారత రాష్ట్రాలకు ప్రోరేటా విధానంలో ఒక్క పార్లమెంట్‌ స్థానం కూడా తగ్గదని, దక్షిణాదికి అన్యాయం జరగబోదని అమిత్ జీ హామీ ఇచ్చారు. మార్చి ఐదున స్టాలిన్‌ ఓ విస్తృతస్థాయి సమావేశానికి సంకల్పిస్తున్న నేపథ్యంలో, అమిత్‌ షా తనకు తానుగా ఈ అంశాన్ని ప్రస్తావించి, హామీ ఇవ్వడం మంచిదే. అయితే, దక్షిణాదికి ఎందుకు అన్యాయం జరగదో, జరగకుండా తాము చేయబోతున్నదేమిటో ఆయన కాస్తంత వివరణగా చెప్పివుంటే, హామీ అనంతరం కూడా వెల్లువెత్తుతున్న అనుమానాలకు ఆస్కారమే ఉండేది కాదు.


దేశ భవిష్యత్తుకోసం జనాభా తగ్గించుకోండని ఐదుదశాబ్దాల క్రితం కేంద్రం చెబితే, చిన్న కుటుంబం చింతలు లేనిదనీ, మేమిద్దరం మాకిద్దరనీ, బడిలో ఒకరు ఒడిలో ఒకరనీ విభిన్నరీతుల్లో విస్తృతప్రచారం చేసి, భయపెట్టీ బతిమాలీ మొత్తానికి జనాభా నియంత్రణలో దక్షిణభారతం మంచివిజయాలు సాధించింది. వృద్ధిలో, విద్యలో ఉత్తరాది కన్నా ఓ మెట్టుపైనే ఉన్నందువల్ల ప్రభుత్వాల కృషి, పడుతున్న తాపత్రయం ప్రజలకు కూడా అర్థమైంది. ఎక్కువమందిని కంటే పోషించలేమనీ, రత్నాల్లాంటి బిడ్డలు ఒకరిద్దరు ఉంటే వారిని వృద్ధిలోకి తేవచ్చునని తమకు తాముగా సామాన్యజనం కూడా తెలుసుకున్నారు. చివరకు ఇద్దర్ని కూడా వద్దనుకొని, ఒక్కరే ముద్దు అన్న దశకు దక్షిణాది చేరుకుంటే, అవిద్య, పేదరికం అధికంగా ఉన్న ఉత్తరాదికి ఆ ఊసు పెద్దగా పట్టలేదు. జనాభానియంత్రణలోనూ, అభివృద్ధిలోనూ వెనకబడిన ఉత్తరాది రాష్ట్రాలకు వాటి వైఫల్యాలే అర్హతలుగా రకరకాల మేళ్ళు జరుగుతూండటం సహజంగానే దక్షిణరాష్ట్రాలకు అగ్రహం కలిగిస్తుంది. ఆకలి, దారిద్ర్యం, అభివృద్ధిలేమి కారణంగా వాటికి ఒనగూరే ప్రత్యేక కేటాయింపులు, రాయితీలు, పథకాలను దక్షిణాది అనాదిగా సహనంగా భరిస్తోంది, పరోక్షంగా పోషిస్తోంది.


తాము ఎదిగి, దేశాన్ని ప్రగతిపథంలో నిలిపిన దక్షిణాదికి సభా ప్రాతినిథ్యంలోనూ అన్యాయం జరగబోతోందన్న అనుమానాలు చాలాకాలంగా ఉన్నాయి. జనాభా ప్రాతిపదికన జరిగే పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజనలో, తక్కువమంది సంతానాన్ని కన్న తమిళనాడుకు నష్టం జరగబోతోందని స్టాలిన్‌ వాదన. ఆయన స్వరాష్ట్రానికి సంబంధించిన లెక్కలు విప్పినప్పటికీ, ఇది దక్షిణాది బాధ. రెండేళ్ళక్రితం మహిళా రిజర్వేషన్‌ బిల్లు సందర్భంలోనే ఈ అంశాన్ని లేవనెత్తినప్పుడు దక్షిణాదికి అన్యాయం జరగనివ్వబోమని ప్రధాని నిండుసభలో కనిమొళికి హామీ ఇచ్చారు. ఇప్పుడు అమిత్‌ షా కూడా దానినే మరింత గట్టిగా పునరుద్ఘాటించారు.

నియోజకవర్గాల పునర్విభజన ఏ ప్రాతిపదికన, ఏ విధంగా జరిగితే తమకు ఏ మేరకు నష్టం వాటిల్లుతుందో దక్షిణాదిరాష్ట్రాలకు అవగాహన ఉంది. సీట్లు కోల్పోతామన్న అనుమానాలకు ఆధారాలున్నాయి. పునర్విభజన కసరత్తు ఫలితంగా మొత్తం స్థానాల సంఖ్య 543నుంచి మరో మూడువందలు హెచ్చినా, ఆ పెరుగుదలలో దక్షిణాదికి జరగబోయే అన్యాయం మీద కూడా అవగాహన ఉంది. స్థానాలున్న ఉత్తర్‌ప్రదేశ్‌ అదనంగా మరో అరవైస్థానాలతో లాభపడుతుందని, బిమారు బిహార్‌ రెట్టింపు స్థానాలతో బాగుపడుతుందనీ వాదనలున్నాయి.


ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగకుండా, అవి ఉన్నవాటిని కోల్పోకుండా పునర్విభజన ఉంటుందని అమిత్‌ షా హామీ ఇచ్చినంతమాత్రాన దక్షిణాదికి న్యాయం చేసినట్టు కాదు. దక్షిణాదికి అన్యాయం జరగకుండా తాము ఏ ప్రాతిపదికలతో ముందుకు పోబోతున్నామో కేంద్రపాలకులు ఇప్పటికైనా స్పష్టంచేయాలి. ఎక్కువమంది పిల్లలను కనని పాపానికి దక్షిణాదిని శిక్షించి, బండెడు సంతానం ఉన్న ఉత్తరాదిని అత్యధిక ప్రాతినిథ్యంతో సత్కరిస్తే ఎవరూ ఊరుకోరు. ఉత్తరాది పార్టీగా ముద్రపడిన బీజేపీ, దక్షిణాదిలోనూ బలపడి విస్తరిస్తున్న తరుణంలో ఉత్తర, దక్షిణ విభేదాలకు తావివ్వకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

Updated Date - Mar 01 , 2025 | 04:53 AM