ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Neeti Aayog Analysis: కాంగ్రెస్‌కు అధిష్ఠానమే గుదిబండ

ABN, Publish Date - Jun 04 , 2025 | 06:12 AM

నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు, రేవంత్‌رెడ్డి ప్రసంగాలు రాజకీయాల్లో ఆకర్షణీయంగా నిలిచాయి. కాంగ్రెస్ పార్టీలో అసమ్మతులు, పదవుల కోసమూ సమస్యలు తీవ్రంగా కనిపిస్తున్నాయి.

త నెల చివరి వారంలో నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ పదవ సమావేశంలో ముగ్గురే ముగ్గురు ముఖ్యమంత్రులు అద్భుతమైన ప్రసంగాలు చేసి అందరి దృష్టినీ ఆకర్షించారని ఒక అధికారి తెలిపారు. వారిలో ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, రేవంత్‌రెడ్డి కావడం గమనార్హం. సాధారణంగా తన సహజ శైలిలో చంద్రబాబు తన ప్రసంగ వెల్లువలో తానే కొట్టుకుపోకుండా నిర్దిష్టమైన సూచనలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను జాతీయ అభివృద్ధికి నమూనాగా మార్చేందుకు తానేమి చేయబోతున్నానో స్పష్టంగా చెప్పి చంద్రబాబు అందర్నీ ఆకట్టుకున్నారు. తెలంగాణ రైజింగ్ ఎజెండాను ఆవిష్కరిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థలోను, సామాజిక న్యాయం అందించడంలోను తెలంగాణ ముఖ్యమైన భూమిక ఎలా పోషించగలదో రేవంత్‌రెడ్డి వివరించారు. కేంద్రం సహకార సమాఖ్య విధానాన్ని అవలంబించినప్పుడే రాష్ట్రాలు సమానంగా అభివృద్ధి చెందగలవని ఆయన స్పష్టీకరించారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్‌సింగ్ మాన్ తమ రాష్ట్రం పట్ల కేంద్రం అవలంబిస్తున్న సవతి తల్లి ధోరణిని నిర్ద్వంద్వంగా ఖండించారు. ఆ సమావేశం తర్వాత నరేంద్రమోదీ కూర్చున్న రౌండ్ టేబుల్‌లోనే చంద్రబాబు, రేవంత్‌రెడ్డి కూడా ఉండడంతో సహజంగా మోదీ ఇరువురితోనూ స్నేహపూర్వకంగా మాట్లాడారు. మాటల సందర్భంలో రేవంత్ తన సహజ ధోరణిలో మాట్లాడుతూ ‘నేను మొదట మీ స్కూలులోనూ, తర్వాత చంద్రబాబు కాలేజీలోనూ చదువుకున్నాను.. ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉద్యోగం చేస్తున్నాను..’ అని చమత్కరించారు. ఇందుకు మోదీ బిగ్గరగా నవ్వి రేవంత్ భుజం తట్టారని సమాచారం. చంద్రబాబు ఢిల్లీలో ఉన్న రెండు రోజుల్లోనూ అమిత్ షాతో సహా ఏడుగురు మంత్రులను కలుసుకుని నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొని అదే రోజు సాయంత్రం వెళ్లిపోయారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు నెలకోసారి సగటున ఢిల్లీకి వచ్చినప్పటికీ నిర్దిష్టంగా తనకు అవసరమైన పనులు చేసుకుని వెళ్లిపోతారు. ఆయన వచ్చిన ప్రతిసారీ ఆయన ప్రాధాన్యం కొట్టొచ్చినట్లు కనపడుతుంది. మంత్రులు ఆయనను ఎదురెదురుగా కూర్చోబెట్టడం కాకుండా తమ పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడడమే ఇందుకు నిదర్శనం. నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్న రేవంత్ వెంటనే ఢిల్లీ నుంచి వెళ్లిపోలేదు. అదే రోజు ఆయనకు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో అపాయింట్‌మెంట్ లభించి రాష్ట్రానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రతిపాదనలపై చర్చించే అవకాశం లభించినప్పటికీ కాంగ్రెస్ అధిష్ఠానంతో పెండింగ్ అంశాలను చర్చించడం కోసం మూడు రోజుల పాటు దేశ రాజధానిలోనే మకాం వేయవలిసి వచ్చింది. చివరకు ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను తప్ప మరెవరినీ కలుసుకోలేక, సమస్యలకు పరిష్కారం సాధించలేక తిరిగి వెళ్లిపోయారు. నిజానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అనుకున్న సమయానికి రాలేకపోవడం వల్ల నిర్ణయాలు వాయిదా పడి ఉండవచ్చు కాని సహజంగానే ఒక ముఖ్యమంత్రి ఢిల్లీలో పార్టీ నేతలను కలుసుకోవడం కోసం ఇన్ని రోజులు ఉండాల్సి రావడంపై ప్రజల్లో చర్చకు రాక తప్పదు. పీసీసీ అధ్యక్షుడు తాను ఎంపికై ఏడెనిమిది నెలలు కావస్తున్నా ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ కార్యవర్గాన్ని ఎంపిక చేసుకోలేకపోవడం, ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటిపోతున్నా మంత్రివర్గాన్ని విస్తరించలేకపోవడం ప్రధాన చర్చనీయాంశాలు.


నిజానికి ఇవేమీ పెద్ద ప్రజాసమస్యలు కాకపోయినా ఢిల్లీ రావడం, రోజుల తరబడి వాటికోసం ఉండాల్సి రావడం జనం దృష్టిని దాటిపోలేని అంశాలే అనడంలో సందేహం లేదు. ముఖ్యమంత్రి వచ్చినప్పుడల్లా పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి రావడం, పార్టీ నేతల్ని కలుసుకోవడం, రకరకాల కథనాలను ప్రచారం చేయడం జరుగుతూనే ఉంటోంది. ఎలాగూ ముఖ్యమంత్రి తరుచుగా వస్తున్నారు కనుక మళ్లీ వెళ్లిపోవడం ఎందుకులే అని కొందరు ఎమ్మెల్యేలు ఇక్కడే ఉండి రకరకాల నేతల్ని కలుసుకుంటున్నారు. ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కటాక్ష వీక్షణాలకోసం తాపత్రయపడుతూనే ఉన్నారు. కర్ణాటక పరిస్థితి కూడా తెలంగాణ పరిస్థితికి ఏమంత భిన్నంగా లేదు. ముఖ్యమంత్రిని ఢిల్లీకి పదే పదే తిప్పించుకోవడం కాంగ్రెస్ పార్టీకి ఆది నుంచి అలవాటేనని, దాని వల్లే పార్టీకి ఈ దుస్థితి దాపురించిందని సీపీఐ నేత నారాయణ లాంటి వారు కూడా విమర్శించారు. కాంగ్రెస్‌లో రెండు ప్రధాన లక్షణాలు కనపడుతుంటాయి. ఒకటి– పదవులకోసం తపన; రెండవది– అసమ్మతి. పదవులకోసం కాంగ్రెస్‌ నాయకుల ఆరాటం, ఓపిక చూస్తుంటే అధికారం లేకపోతే జీవించలేరా అన్న ఆశ్చర్యం కలుగుతుంది. అధికారమే కాదు, నిత్య అసమ్మతి కూడా కాంగ్రెస్‌లో జీవలక్షణంలా కనిపిస్తుంది. ప్రతి రోజూ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఈ మెయిల్స్, ఫోన్లు ఢిల్లీకి చేరుతూనే ఉంటాయి. ముఖ్యమంత్రి ప్రతి నిర్ణయాన్నీ, ప్రసంగాన్నీ విమర్శిస్తూ కాంగ్రెస్ పార్టీకి ఏదో తీవ్ర నష్టం జరిగిపోతున్నదని చెప్పేవారు ఉంటారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే వీటిలో కొన్ని మాటలు పార్టీ నేతలు కూడా నమ్ముతుంటారు. దానివల్ల రాష్ట్రానికి సంబంధించిన కొన్ని కీలక నిర్ణయాలు సుదీర్ఘకాలం పెండింగ్‌లోనే ఉంటాయి. నాలుగేళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ పంజాబ్, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్ రాష్ట్రాలలో అధికారంలో ఉండేది. ఈ మూడు రాష్ట్రాల్లోనూ ముఖ్యమంత్రులను మార్చాలని కాంగ్రెస్ అధిష్ఠానంపై తరుచూ ఒత్తిళ్లు వచ్చేవి. పంజాబ్‌లో అమరీందర్‌సింగ్ నేతృత్వంలో కాంగ్రెస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయనపై అసమ్మతి తార స్థాయికి చేరుకుంది.


రాహుల్‌గాంధీకి సన్నిహితుడుగా భావించిన నవజ్యోత్‌సింగ్ సిద్ధూ అవకాశం వచ్చినప్పుడల్లా అమరీందర్‌సింగ్‌పై తీవ్ర విమర్శలు చేసేవారు. లోక్‌సభ టిక్కెట్ల పంపిణీ నుంచి శాఖ కేటాయింపు దాకా ప్రతి అంశంలోనూ విభేదించేవారు. ముఖ్యమంత్రిని అవినీతిపరుడని నిందించేవారు. ఈ ఘర్షణ తీవ్రమై చివరకు అమరీందర్‌సింగ్ స్థానంలో ఒక దళిత ముఖ్యమంత్రిని నియమించారు. అమరీందర్‌సింగ్ వేరు కుంపటి పెట్టుకున్నారు. ఆ తర్వాత పంజాబ్‌లో కాంగ్రెస్ అధికారం కోల్పోయింది. ఛత్తీస్‌గఢ్‌లో 2018లో బీజేపీని గద్దెదించిన తర్వాత పీసీసీ అధ్యక్షుడు భూపేశ్ భగేల్‌ను ముఖ్యమంత్రి చేశారు. ఆయన మంత్రిమండలిలో ఆరోగ్యమంత్రి, ఒకప్పటి ప్రతిపక్ష నేత టీఎస్ సింగ్ దేవ్ సీఎం కావాలని తహతహలాడుతుండేవారు. రాష్ట్రంలో రొటేషన్ ప్రాతిపదికన ముఖ్యమంత్రిని మారుస్తామని రాహుల్ తనకు వాగ్దానం చేసినట్లు ఆయన చెప్పుకుంటుండేవారు. అలాంటిదేమీ లేదని, తానే ముఖ్యమంత్రిగా ఉంటానని భూపేష్ భగేల్ ప్రతిఘటించేవారు. ఇరు వర్గాలను కాంగ్రెస్ అధిష్ఠానం తరుచూ కలుసుకుని బుజ్జగిస్తూ ఉండేది. ప్రతిసారీ అధిష్ఠానమే అంతా నిర్ణయిస్తుందనే వారు కాని ఆ కుంపటి రగులుతూ చివరకు ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం కోల్పోయేందుకు దారి తీసింది. రాజస్థాన్‌లో కూడా ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్‌కూ, సచిన్ పైలట్‌కూ మధ్య బహిరంగంగానే రాజకీయ ఘర్షణ జరుగుతుండేది. మధ్యప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా ఉన్న కమల్‌నాథ్‌పై రాహుల్ సన్నిహితుడు జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటు సచిన్ పైలట్‌కు ప్రేరణగా నిలిచింది. మంత్రివర్గంలో తన విధేయులను చేర్చలేదనే కినుకతో ఉన్న సచిన్‌ను బుజ్జగించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఒక దశలో అశోక్ గెహ్లోట్‌ను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడుగా నియమించాలని ప్రయత్నం చేసినా ఆయన ముఖ్యమంత్రిగా ఉంటానని భీష్మించుకుకూర్చునే సరికి అధిష్ఠానం ఏమీ చేయలేకపోయింది. చివరకు రాజస్థాన్‌లో కూడా కాంగ్రెస్ అధికారం కోల్పోయింది. గత ఏడాది హర్యానాలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని అనేక మంది భావించారు. కాని కుమారి సెల్జా, రణదీప్ సింగ్ సూర్జేవాలా వర్గాలకూ, నాటి ముఖ్యమంత్రి భూపిందర్‌సింగ్ హుడా వర్గానికీ మధ్య రేగిన చిచ్చు ప్రధానంగా పార్టీ అధికారంలోకి రాలేకపోవడానికి కారణమైంది. నిజానికి భారతీయ జనతా పార్టీలో కూడా అంతర్గత తగాదాలు లేకపోలేదు. కాని దీనివల్ల పార్టీకి పెద్దగా నష్టం రాకుండా జాతీయ నాయకత్వం దృఢవైఖరితో, నిర్ణయాత్మకంగా వ్యవవహరించింది. ఒకే ఒక నాయకుడో, నాయకురాలో దేశంలో పార్టీని గెలిపించడం ఎల్లవేళలా సాధ్యం కాదని, స్థానిక నాయకత్వాలు కూడా బలంగా ఉండడం అవసరమన్న విషయంపై బీజేపీలో కూడా చర్చ జరుగుతోంది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదట్లో తన సన్నిహితుడైన కేవీపీ రామచంద్రరావుకు రాజ్యసభ సభ్యత్వాన్ని సాధించలేకపోయారు. తన కుమారుడికి సీటు కూడా ఇప్పించలేకపోయారు. అయితే ఆయన క్రమంగా పార్టీపై పట్టు సాధించి తాను అనుకున్నవి జరిగేలా చూసుకున్నారు. పీజేఆర్‌ను మంత్రిగా నియమించాలని సోనియా భావించినా ఆయన సున్నితంగా తిరస్కరించారు. తనపై అసమ్మతి ప్రకటించిన వి. హనుమంతరావు లాంటి వారిని ఢిల్లీ విస్మరించేలా చేశారు. పార్టీపై తన పట్టు బిగించడానికి వైఎస్‌కు చాలా కాలం పట్టింది. విచిత్రమేమంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో అధికారంలో లేకపోయినా, కేవలం మూడు రాష్ట్రాలకే పరిమితమయిపోయినా ఆ పార్టీ రాజకీయ సంస్కృతి మాత్రం మారలేదు! బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలంటే ఆ రాజకీయ సంస్కృతిని ఏ విధంగా మార్చుకోవాలో ఆత్మవిమర్శ చేసుకోవాలి. ముఖ్యంగా తాము ఎంపిక చేసుకున్న నేతల్ని తమ దగ్గర పనిచేసే ఉద్యోగుల్లా కాకుండా విశ్వాసంలోకి తీసుకుని వారికి పూర్తి అండదండలివ్వడం అవసరం.

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - Jun 04 , 2025 | 06:19 AM