ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Education System: ప్రక్షాళనతోనే ఏపీ వర్సిటీల పునరుత్తేజం

ABN, Publish Date - Jun 03 , 2025 | 01:17 AM

వైసీపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యారంగంలో అవినీతి, అనియమాలతో తీవ్ర నష్టం చేకూర్చింది. ప్రస్తుతం ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరించి ఉన్నత విద్యావ్యవస్థను సవరణ చేసేందుకు కృషి చేస్తోంది.

రాష్ట్రంలో ఉన్నత విద్యారంగం గత ఐదేళ్ళ వైసీపీ ప్రభుత్వంలో భ్రష్టుపట్టిపోయింది. ఆ ఫలితాల్ని ఇప్పుడు రాష్ట్ర ప్రజలు అనుభవిస్తున్నారు. ఈ పరిస్థితుల నుంచి ఉన్నత విద్యారంగాన్ని ప్రక్షాళన చేసే పనిలో రాష్ట్ర ప్రభుత్వం తలమునకలై ఉంది. బ్రిటీష్‌ పాలన నుంచి ఈ రాష్ట్రంలో విజయవంతంగా నడుస్తున్న చరిత్ర కలిగిన ఎయిడెడ్‌ కళాశాలల వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం నాశనం చేసింది. యూజీ అధ్యాపకుల్లో తమకు ఇష్టమైన కొందరిని తీసుకెళ్ళి డిప్యుటేషన్‌ మీద యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల టీచింగ్‌లో నియమించారు. ఏపీ యూనివర్సిటీల చట్టం, అకడమిక్‌ సెనేట్ల నియమావళిని పట్టించుకోలేదు. పైగా ఈ అధ్యాపకుల్ని ఎన్‌ఐఆర్‌ఎఫ్‌, నాక్‌ కమిటీల ముందు ప్రొఫెసర్లుగా చూపించారు.


అప్పటి ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి, ఆ శాఖ మంత్రి ప్రమేయం లేకుండా మొత్తం ఉన్నత విద్యారంగంలో ఆధిపత్యం చలాయించారు. ఆయన ముఖ్యమంత్రికి బంధువు కావడంతో రాష్ట్రంలో ఉన్నత విద్యామండలి పరిధిలో విధులు నిర్వహించే ఏ వ్యక్తీ నోరు మెదప లేదు. ఈయనకి తోడు విజయసాయిరెడ్డి దన్నుతో అప్పటి ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉప కులపతి ప్రొఫెసర్‌ పీవీజీడీ ప్రసాదరెడ్డి తన ఇష్టానుసారం వ్యవహరించారు. ఎయిడెడ్‌ అధ్యాపకుల్ని విశ్వవిద్యాలయంలోకి తీసుకొచ్చి గందరగోళం సృష్టించారు. మచిలీపట్నం కృష్ణా యూనివర్సిటీ నుంచి ఇద్దరు జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్లను ఆంధ్ర విశ్వవిద్యాలయానికి బదిలీ మీద తీసుకొచ్చారు. వీరికి మచిలీపట్నంలో ఒక్కొక్కరికీ పది మంది చొప్పున పిహెచ్‌.డి. పరిశోధకులు కూడా ఉన్నారు. ఈ నిర్ణయం మున్ముందు సహాయక ఆచార్యుల ఉద్యోగాల భర్తీలో ఓపెన్‌ కేటగిరీ పోస్టుల రోస్టర్‌ పాయింట్లకి అడ్డంకిగా మారుతుంది. దీంతో ఆశావహులు న్యాయస్థానాల్ని ఆశ్రయిస్తారు. వీటిని ఇప్పటికైనా సంస్కరించకపోతే రాష్ట్రం మొత్తం భర్తీ ప్రక్రియకు ముప్పు వాటిల్లుతుంది. ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డి అవినీతి కార్యకలాపాల మీద ప్రభుత్వం విజిలెన్స్‌ విచారణ చేపట్టనున్నట్టు హెచ్‌ఆర్డీ మంత్రి నారా లోకేష్‌ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా శాసనమండలిలో ప్రకటించారు.


శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ప్రొఫెసర్‌ శ్రీకాంత్‌ రెడ్డి అవినీతి దారిలో అడ్డగోలుగా వెళ్ళారు. విశ్రాంత ఐఏఎస్‌ అధికారి, మాజీ ముఖ్యమంత్రి ఓఎస్డీ ధనంజయరెడ్డి సతీమణిని కూకట్‌పల్లి జేఎన్టీయూ నుంచి తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఫిజిక్స్‌ విభాగంలోకి సరాసరి ప్రొఫెసర్‌గా నియమించేశారు. ఇవన్నీ యూజీసీ, ఏపీ యూనివర్సిటీ చట్టాన్ని ధిక్కరించడమే కాకుండా, ఉన్నత విద్య, పరిశోధన విలువల్ని మంటగలపడమే అవుతుంది. ప్రభుత్వం మొత్తంగా మకిలిని కడిగితేనే ప్రక్షాళన జరిగినట్టు. లేకుంటే గత ప్రభుత్వ అవినీతి, అక్రమ మరకల మీద రంగులు పూసినట్టవుతుంది. వైసీపీ ప్రభుత్వ తప్పిదాల మీద విచారణ జరిగితీరాలి. అప్పుడే ఉన్నత విద్యావంతులయిన మేధావులు, నిరుద్యోగులు సంతృప్తి వ్యక్తం చేస్తారు. విజయనగరం జేఎన్టీయూ నుంచి ఒక అధ్యాపకుడిని డిప్యుటేషన్‌ మీద తీసుకొచ్చి జవాబు పత్రాల వాల్యుయేషన్‌ ఇన్‌చార్జిగా నియమించారు. అతనితో వాల్యూయేషన్‌, రీ వాల్యూయేషన్లలో చాలా తప్పులు చేయించారని వర్సిటీ వర్గాల్లో తీవ్రప్రచారం జరిగింది. ఐపీఎస్‌ అధికారి సంజయ్‌ ఎంటెక్‌ పరీక్షలను వేరే వ్యక్తులతో పరీక్షలు రాయించి, ప్రథమశేణి మార్కులతో ఆయనను పాస్‌ చేశారు. అంతేగాక వీసీ ప్రసాదరెడ్డి పాలనకు వ్యతిరేకంగా ఉన్న విద్యార్థి నాయకుల్ని ముందస్తు అరెస్టులు చేయించి, స్నాతకోత్సవంలో అతిరథ, మహారథుల సమక్షంలో సంజయ్‌కి డిగ్రీ ప్రదానం చేశారు. ఇటువంటి అతిక్రమణలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఈ ఘటనలన్నీ గత ప్రభుత్వంలో మీడియాకి ఎక్కాయి. అయినా అప్పటి ప్రభుత్వం వీటిని లెక్కచేయలేదు. అప్పటి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ ఎగ్జామినేషన్‌ డీన్‌, ప్రస్తుత ప్రభుత్వంలో గత ఏడాది జూలైలో ఒక యూనివర్సిటీకి ఇన్‌చార్జి వైస్‌ ఛాన్సలర్‌గా నియమితులయ్యారు.


ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యారంగాన్ని ఇప్పటి వరకు పట్టిపీడిస్తున్న సమస్యల్ని పరిష్కరించి, వర్సిటీల ప్రక్షాళనకు ప్రభుత్వం వెళ్లవలసి ఉంది. గత ప్రభుత్వ తప్పిదాల్ని వెలికితీసి, వాటిని సరిచేయాలి. రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌, రోస్టర్‌ పాయింట్‌ వంటి సమస్యల్ని ముందుగానే నివారించాలంటే ఇవన్నీ జరగాలి. లేకుంటే విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగ ప్రకటనలన్నీ న్యాయస్థానాల్లో అపరిష్కృతంగా మిగిలిపోతాయి. 2017, 18 సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వం స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహించి కూడా ఉద్యోగాల భర్తీ నిలిచిపోవడానికి ఈ తప్పిదాలే కారణం. ఇప్పటికీ ఈ కేసులు సుప్రీంకోర్టులో కొనసాగుతున్నాయి.

వైసీపీ ప్రభుత్వం 2023లో ఎన్నికల షెడ్యూల్‌కు నాలుగు నెలల ముందు విశ్వవిద్యాలయాల్లో ఆచార్యుల భర్తీకి బూటకపు ప్రకటన విడుదల చేసింది. మూలిగే నక్కమీద తాటిపండు పడినట్టు నిరుద్యోగుల నుంచి ఫీజుల రూపేణా కోట్లాది రూపాయిల డబ్బు కొల్లగొట్టేసింది. దీని మీద కూడా ప్రస్తుత ప్రభుత్వం విచారణ కమిటీ వేసి, నిజానిజాలు వెల్లడించాలి. రాష్ట్ర విభజన తరువాత ఇక్కడి విశ్వవిద్యాలయాల్లో ఆచార్యుల ఉద్యోగాల భర్తీ జరగనేలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2014కి ముందు అప్పటి ప్రభుత్వం భర్తీ చేసిన ఒక జనరల్‌, మరో ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్‌ ఉద్యోగాల భర్తీలో వచ్చిన ఆచార్యులు మాత్రమే ఇప్పుడు ఉన్నారు. రాష్ట్ర విశ్వవిద్యాలయాల్ని సమర్థవంతంగా నడపాలంటే ఈ అరకొర ఆచార్యుల సంఖ్య సరిపోదు.

ప్రతిభావంతులైన మానవవనరులు మరుగునపడి పోకుండా, నిరుద్యోగానికి బలికాకుండా రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అందుకు యూజీసీ నియమావళిని, కేంద్ర విశ్వవిద్యాలయాల పద్ధతుల్ని అనుసరించి దశాబ్దాలుగా నిర్దేశిత కాలవ్యవధి లేని వేతనాలతో ఒప్పంద ఆచార్యులుగా, అతిథి ఆచార్యులుగా పనిచేస్తున్న బాధితుల సమస్యలను సైతం న్యాయబద్ధంగా పరిష్కరించాలి. అప్పుడే ప్రభుత్వం అమరావతిలో చేపడుతున్న అంతర్జాతీయ ఉన్నత విద్యాసంస్థల వ్యవస్థాపనకు అందరి మద్దతు లభిస్తుంది. ప్రభుత్వ కార్యాచరణ ఫలప్రదమవుతుంది. స్వర్ణాంధ్ర ఆకాంక్షలు నెరవేరి వికసిత భారతం వర్ధిల్లుతుంది.

-డాక్టర్‌ జీకేడీ ప్రసాదరావు ఫ్యాకల్టీ

ఆంధ్రవిశ్వవిద్యాలయం

Updated Date - Jun 03 , 2025 | 01:19 AM