కులం అహంకారం అవినీతి
ABN, Publish Date - Aug 05 , 2025 | 06:05 AM
కులం, అహంకారం, అవినీతి... మన ప్రజాస్వామ్య వ్యవస్థలను, సమాజాన్ని పట్టి పీడిస్తున్న జాడ్యాలు. కులం రెండువైపులా పదును ఉన్న కత్తిగా మారింది. అధికారంతో కూడిన అహంకారం వ్యవస్థల విధ్వంసానికి దారితీస్తున్నది...
కులం, అహంకారం, అవినీతి... మన ప్రజాస్వామ్య వ్యవస్థలను, సమాజాన్ని పట్టి పీడిస్తున్న జాడ్యాలు. కులం రెండువైపులా పదును ఉన్న కత్తిగా మారింది. అధికారంతో కూడిన అహంకారం వ్యవస్థల విధ్వంసానికి దారితీస్తున్నది. ఇక స్వార్థం డబ్బు రూపంలో జడలు విప్పుతున్నది. సమాజ ధర్మాన్నే సవాలు చేస్తున్నది. తిమ్మిని బమ్మిని చేసే సాధనంగా, అన్యాయాన్ని న్యాయంగా, అధర్మాన్ని ధర్మంగా చిత్రించే స్థాయికి అది ఎదిగింది. ధనమూల మిదం జగత్ అన్న సామెతను పరిపూర్ణంగా నిజం చేస్తున్నది. వీటన్నిటికీ మూలాధారం రాజకీయం. మంచీ చెడును వేరు చేయలేనంతగా రూపు మార్చుకుంది నేటి రాజకీయం.
కులం గురించి అడగడాన్ని, మాట్లాడడాన్ని ఒకప్పుడు చిన్నతనంగా చూసేవారు. కులనిర్మూలన ఉద్యమాలు కూడ ఆంధ్రలో ఒకప్పుడు బలంగానే ఉండేవి. అందుకోసం కులాంతర వివాహాలను కూడ నాస్తికులు, హేతువాదులు, కమ్యూనిస్టులు ప్రోత్సహించేవారు. కాని క్రమంగా పరిస్థితులు మారిపోయాయి. కుల ప్రాతిపదికన ఎక్కడికక్కడ సంఘాలు ఏర్పడడం, రాజకీయ డిమాండ్లను తెరపైకి తేవడం మొదలయింది. సామాజిక న్యాయం ప్రధాన విధానంగా, నినాదంగా మారిపోయింది. వర్గం బదులు వర్ణం / కులం వెనుకబడిన తనానికి ప్రమాణం అయింది. కమ్యూనిస్టులలో కూడ క్రమంగా ఈ విషయంలో కొంత మార్పు వచ్చింది. కులానికి – అది ఏ కులమైనా – గౌరవం పెరిగిపోయింది. ఆత్మన్యూనత స్థాయి నుంచి ఆత్మగౌరవ స్థాయికి చేరుకుంది. ఒకప్పుడు పత్రికలలో కులం గురించి రాస్తే చిరాకుపడేవారు. ఒకవేళ రాయవలసి వచ్చినా ‘సామాజిక వర్గం’ అనే మాటను కులానికి ప్రత్యామ్నాయంగా, తప్పించుకునే ఉపాయంగా వాడేవారు. కాని సమాజంలోను, రాజకీయాలలోను వచ్చిన మార్పులతో మీడియా కూడ ఇప్పుడు నేరుగా రంగంలోకి వచ్చేసింది. కులప్రాతిపదికన వివరాలు ఇవ్వడం, విశ్లేషణలు చేయడం ఎక్కువయింది. ఎవరయినా అదేమని ప్రశ్నిస్తే ‘ఏమిటయ్యా ఎంతకాలం దాచిపెడతావు?’ అని ఎదురు ప్రశ్నించే పరిస్థితి. ఆ విధంగా కులం వేసుకున్న ముసుగు తొలగిపోయింది. ఇంకా చెప్పాలంటే, కులాభిమానం ముదిరి పాకానపడి కులద్వేషంగా కూడ జడలు విప్పుతున్నది.
అధికారంలో ఉన్నవారికి అహంకారం కూడదంటారు. అదే పతనానికి దగ్గర దారి అని కూడా అంటారు. వ్యక్తులకే కాదు, మొత్తం సమాజానికి కూడా నష్టం జరుగుతుంది. కాని ఆచరణలో అహంకారం ఆవహించని ముఖ్యమంత్రులు తక్కువ. ఎంత ఎక్కువ అధికారం లభిస్తే, మరెంత ఎక్కువకాలం అధికారంలో కొనసాగితే అంత ఎక్కువగా అహంకారం ప్రదర్శించడం కద్దు! ఆంధ్రప్రదేశ్‌లో అధికారం చెలాయించిన 16 మంది ముఖ్యమంత్రులలో ఎక్కువ భాగం ఎంతో కొంత ఈ ధోరణి ప్రదర్శించినవారే! రెండవసారి ముఖ్యమంత్రి అయితే ఇక చెప్పనవసరం లేదు. అహంకారానికి తాము ఆమడదూరం అనుకునేవాళ్ళు, ఒకసారి ముఖ్యమంత్రి గద్దెనెక్కగానే, వారికి తెలియకుండానే అహంకారభూతం ఆవహిస్తుంది. జనానికి దూరం చేస్తుంది. ఇది అవరోహణకు నాంది.
అహంకారం తర్వాత ముఖ్యమంత్రులను, తద్వారా ప్రజాజీవితాన్ని భ్రష్టుపట్టించే మరో జాడ్యం డబ్బు పిచ్చి. అవినీతి అనే మాట దీనికి పర్యాయపదం. అధికారం అందించే అవకాశాలు అనేకం తన్నుకుంటూ వస్తాయి. ఒకసారి రుచి మరిగితే ఇక అంతే సంగతులు! అవినీతి విషయంలో మన ముఖ్యమంత్రులను అందరినీ ఒకే గాటన కట్టలేం! తొలితరం ముఖ్యమంత్రులది అదొక తరహా! అవినీతి మకిలకు వీలయినంత దూరం! కాని మధ్యకాలం నాటికి మరికొంత మార్పు! చూసీచూడనట్టు నడిపించే మధ్యస్థ రకం. ఇక కొత్త మిలీనియం అయితే బిలియన్‌ల వ్యవహారంగా మారిపోయింది. ఎన్నికలలో వాడకం పెరిగేకొద్దీ, ఆర్జన కూడా అమాంతం పెరిగిపోయింది. అవసరాల హద్దులను కూడ దాటిపోయింది. కొందరికయితే ఆకాశమే హద్దు. వందల వేల కోట్ల మాటలు మూటలు – కాకపోతే కీర్తికాంక్ష ఉన్నవారు ఇందులో రవంత నయం. అభివృద్ధి – అవినీతి బొమ్మ బొరుసు కావడం ఈనాటి రాజకీయంలో ఒక విషాదపర్వం.
స్వాతంత్ర్యానంతర రాజకీయాలలో మత సమీకరణలు ప్రధానంగా ఉండేవి. హిందూత్వ పేరుతో బీజేపీ, సెక్యులరిజం పేరుతో కాంగ్రెస్ పని చేసేవి. ప్రయోజనం పొందేవి. ఇది దేశవ్యాప్త ధోరణి. ఇటీవలి కాలంలో ఇది బీజేపీకి అనుకూలంగా మారడంతో కాంగ్రెసు పార్టీ దానికి విరుగుడుగా కులం మంత్రాన్ని తెరపైకి తెచ్చింది. కులం ప్రాంతీయ రాజకీయ చదరంగంలో ఎప్పుడూ కదను తొక్కే అశ్వం లాంటిదే. కులం బలంతో ఏర్పడిన ప్రాంతీయ పార్టీలు కూడ చాలానే ఉన్నాయి. బలహీనవర్గాలు ఓకే. కానీ అగ్రకులాల చాటింపు కూడ ఇటీవల మరీ బహిరంగం అయిపోయింది. కాంగ్రెసు విధానాలకు అనుగుణంగా రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెసు ప్రభుత్వం తెలంగాణలో కులగణన చేపట్టింది. దానినీ విపక్షాలు వివాదాస్పదం చేశాయి. అయితే కేంద్ర ప్రభుత్వం కూడ ఇటీవల కులగణనకు పచ్చజెండా ఊపింది. నిజానికి కులం విషయంలో ఉన్నంత భావోద్రేక అనుబంధం మతం విషయంలో ఉండదు. కులానికి పుట్టుకతోనే విడదీయరాని బంధం ఏర్పడుతుంది. (ఆంధ్ర రాష్ట్రంలో కులాన్ని బట్టి పార్టీ విధేయత యథాలాపంగా నిర్ణయమైపోతున్నది.) మతాన్ని మార్చుకోగలం కాని, కులాన్ని మార్చుకోలేం. కాని ఆచరణలో అలా లేదు. మతం మారిన కుటుంబాలు, తమతో పాటే కులాన్ని వెంట తీసుకువెడుతున్నాయి. ఆంధ్ర, రాయలసీమలలో కమ్మ, రెడ్డితో సహా అగ్రకులాలలో కూడ ఈ ‘ద్వంద్వ పౌరసత్వం’ బాగా కనబడుతుంది. వాళ్లంతా క్రిస్టియన్‌లకు క్రిస్టియన్‌లు, కులానికి తమ కులస్థులు. గుంటూరు మెట్ట ప్రాంతాలలో, ముఖ్యంగా పల్నాడులో ఈ పరిస్థితి కనిపిస్తుంది. మళ్లీ ఇస్లాంలోకి మారితే ఇది కుదరదు. ముస్లింలలో కులానికి తావు ఉండదు. అయితే ఇందులో కూడా బీసీ కులాలు / వర్గాలను గుర్తిస్తున్నారు. ఈ కులగణన లక్ష్యం మొత్తం – జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు అమలు చేయాలన్న డిమాండ్ నుంచి పుట్టుకువచ్చిందే!
(ఇనగంటి వెంకట్రావు ‘విలీనం–విభజన’ గ్రంథంలోని భాగం ఇది.)
(నేడు ఉదయం 10 గంటలకు బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారక భవన్,
సురవరం ప్రతాపరెడ్డి హాలులో మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు
వెంకయ్యనాయుడు ‘విలీనం–విభజన’ను ఆవిష్కరిస్తారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాసరెడ్డి అధ్యక్షత వహిస్తారు.)
ఈ వార్తలు కూడా చదవండి..
అరెస్ట్ చేయొచ్చు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
వారిపై చర్యలకు కాళేశ్వరం కమిషన్ కీలక సిఫార్స్
For More AP News and Telugu News
Updated Date - Aug 05 , 2025 | 06:05 AM