ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Dr. K. Lakshman: చరిత్రాత్మకం మోదీ కులగణన నిర్ణయం

ABN, Publish Date - May 03 , 2025 | 03:25 AM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని సాధించేందుకు కులగణనను అనివార్యంగా చేపట్టాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం సామాజిక, ఆర్థిక సమతుల్యతకు దోహదం చేస్తుంది. గత ప్రభుత్వాల కులగణన వ్యతిరేకతకు భిన్నంగా, మోదీ ప్రభుత్వం శాస్త్రీయంగా, పారదర్శకంగా కులగణన నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి వందేళ్లు నిండే నాటికి భారతదేశాన్ని ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశంగా నిలపాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘వికసిత్ భారత్ @ 2047’ లక్ష్యం. ఈ క్రమంలో మోదీ అనేక సాహసోపేత నిర్ణయాలు, చరిత్రాత్మక చర్యలకు శ్రీకారం చుట్టారు. రానున్న జనాభా లెక్కల్లో కులగణన చేపట్టాలన్న నిర్ణయం కూడా ఈ కోవలోకే వస్తుంది. ఈ నిర్ణయం సామాజిక న్యాయానికి మెరుగైన బాటలు వేస్తుంది. బడుగు, బలహీనవర్గాల అభివృద్ధికి ఇతోధికంగా తోడ్పడుతుంది. అందుకే దేశంలోని వెనకబడిన వర్గాల తరఫున ప్రధానమంత్రికి, కేంద్ర ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేశంలో కులగణన చివరిసారిగా 1931లో బ్రిటిష్ వారి హయాంలో నిర్వహించారు. 94 సంవత్సరాల తర్వాత నరేంద్ర మోదీ ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకొని చరిత్రాత్మక అధ్యాయాన్ని ఆరంభించింది. కులగణన నిర్ణయం తీసుకున్న 30 ఏప్రిల్, 2025 చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఈ కులగణన బీసీలకు, మైనారిటీ వర్గాలకే కాకుండా, దేశం మొత్తానికి సామాజిక-, ఆర్థిక సమతుల్యతను తీసుకొచ్చే మార్గం. అందుకే ప్రజలు, ముఖ్యంగా బడుగు, బలహీనవర్గాలు మోదీని ‘అభినవ అంబేడ్కర్‌’, ‘అభినవ జ్యోతిబా ఫూలే’ అని పిలుచుకుంటూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. బీసీల పట్ల కాంగ్రెస్ మొసలి కన్నీరు కారుస్తోంది.


60 ఏళ్ల పాలనలో ఏనాడూ కులగణన గురించి ఆలోచించని కాంగ్రెస్, ఇప్పుడు వరుసగా మూడు పర్యాయాలు అధికారం కోల్పోయి, రోజురోజుకు బలహీనమవుతూ, ఉనికే ప్రశ్నార్థకంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో గత్యంతరం లేకే కులగణన ఎత్తుకున్నారే కానీ, బడుగు బలహీన వర్గాలపై ప్రేమతో కాదు. ఇప్పుడు మోదీ ప్రభుత్వం కులగణన చేపట్టాలన్న నిర్ణయం తమ విజయంగా కొందరు కాంగ్రెస్ నాయకులు చెప్పుకోవడం వారి దివాళాకోరుతనానికి అద్దం పడుతోంది. 2021 జనగణనలో కులగణన తప్పక జరుగుతుందని 2018లోనే అప్పటి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. అయితే కోవిడ్ తదితర కారణాలరీత్యా 2021లో జనాభా లెక్కలు జరగలేదు. అప్పుడు రాజ్‌నాథ్ సింగ్ చెప్పిన దాని ప్రకారం త్వరలో జరగనున్న జనగణనలో కులగణన చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇది బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయం తప్పిస్తే, కాంగ్రెస్ కానీ, మరే పార్టీ ఒత్తిడి అనేది శుద్ధ అబద్ధం. కాంగ్రెస్ బీసీ వ్యతిరేకత ఈనాటిది కాదు. జవహర్‌లాల్ నెహ్రూ హయాం నుంచే ఉంది. భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్.అంబేడ్కర్‌ రాజ్యాంగంలో ఎస్సీ, ఎస్టీలతో పాటు వివిధ వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా హక్కులు కల్పించారు. బీసీలకు ప్రత్యేక రాజ్యాంగ హక్కులు కల్పించని కారణంగా వెంటనే జాతీయ కమిషన్‌ను నియమించాలని, ఆ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని అంబేడ్కర్‌ సూచించారు. అయితే నెహ్రూ అందుకు ససేమిరా అన్నారు. చివరకు అంబేడ్కర్‌ ఒత్తిడితో బీసీల సంక్షేమం కోసం, వారి సామాజిక, ఆర్థిక స్థితిగతులను అంచనా వేసేందుకు 1953లో కాకా కాలేల్కర్ కమిషన్‌ను నియమించారు. ఈ కమిషన్ 1955లో నివేదిక సమర్పించింది. అయితే, నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నివేదికపై పార్లమెంట్‌లో చర్చించకుండానే చెత్తబుట్టపరం చేసింది. ఓబీసీ రిజర్వేషన్లపై నెహ్రూ ఏనాడూ సానుకూలంగా స్పందించలేదు. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ హయాంలో కూడా కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకించింది. 1990లో వీపీ సింగ్ మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తే, నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న రాజీవ్‌గాంధీ తీవ్రంగా వ్యతిరేకించారు. రిజర్వేషన్లు కులాల ఆధారంగా కాకుండా ఆర్థిక ప్రాతిపదికన మాత్రమే ఉండాలని వాదించిన రాజీవ్ గాంధీ, బీసీల హక్కులను కాలరాసి, రిజర్వేషన్లను అణిచివేశారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా సోనియాగాంధీ నేతృత్వంలో సాగిన యూపీఏ పాలనలోనూ బీసీలకు అన్యాయమే జరిగింది. అప్పుడు బీజేపీ నాయకులు రాజ్‌నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్‌ 2010లో కులగణన జరిపించాలని యూపీఏపై ఒత్తిడి తీసుకొచ్చారు. రాజ్యాంగంలోని 246వ ఆర్టికల్‌కు అనుగుణంగా జనగణనలో భాగంగా కాకుండా ప్రైవేట్ ఏజెన్సీలతో రూ.5,000 కోట్లు ఖర్చు చేసి సర్వే చేపట్టారు. ఆ సర్వే వివరాలు ఇప్పటివరకు బహిర్గతం చేయలేదు.


ఎన్డీఏ ప్రభుత్వం ఓబీసీ పక్షపాతిగా వ్యవహరిస్తోంది. జాతీయ ఓబీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధత కల్పించడం, వైద్యవిద్యలో అఖిల భారత కోటాలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో 27 శాతం ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయడం, ప్రస్తుత మోదీ మంత్రివర్గంలో 27 మంది ఓబీసీలకు స్థానం కల్పించడం.. ఇలా చెప్పుకొంటూ పోతే ఓబీసీల సాధికారత దిశగా మోదీ ప్రభుత్వంలో అనేక చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ఇది బీసీల పట్ల బీజేపీ నిబద్ధతకు నిదర్శనం. ఎన్డీఏ ప్రభుత్వం దేశంలో తొలిసారి బిహార్‌లో కులగణనను చేపట్టింది. ఆ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చట్టరూపం దాల్చేలా చేసింది. అందులో అన్ని వివరాలు పొందుపర్చారు, పారదర్శకంగా ఉండేలా బహిర్గతం చేశారు. అయితే కొందరు కోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం ఆ చట్టంపై స్టే విధించింది. కులగణనలో తెలంగాణను రోల్ మోడల్‌గా తీసుకోవాలని రాహుల్‌గాంధీ, రేవంత్ రెడ్డి తదితరులు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. తెలంగాణలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అశాస్త్రీయంగా కులగణన చేపట్టింది. అందుకే, ఆ వివరాలు ప్రజాబాహుళ్యంలో పెట్టలేదు. శాస్త్రీయంగా నిర్వహించి ఉంటే గ్రామాల వారీగా కులాల వివరాలు, వారి ఆర్థిక, సామాజిక స్థితిగతులను వెల్లడించేవారు. కానీ అలా జరగలేదు.


తెలంగాణలో 51శాతం బీసీలున్నారని గతంలో పేర్కొన్నారు, కానీ కాంగ్రెస్ చేపట్టిన కులగణనలో బీసీల జనాభా 46శాతానికి పడిపోయింది. సంతాన సాఫల్యత రేటు ప్రకారం చూసుకుంటే బీసీల జనాభా శాతం పెరిగి ఉండాలి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ చూపెడుతూ తెలంగాణ బీసీలకు తీరని అన్యాయం చేసింది. పైగా తెలంగాణలో 12శాతం ముస్లింలు ఉంటే, 10శాతం ఓబీసీలుగా చూపించారు. అంటే రేవంత్ ప్రభుత్వ లెక్కల ప్రకారం 80 శాతం పైగా ముస్లింలు ఓబీసీలే. వీరిని ‘ముస్లిం ఓబీసీ’లు అన్న కొత్త పదప్రయోగంతో కాంగ్రెస్ తెలంగాణ ఓబీసీలకు వెన్నుపోటు పొడిచింది. ఇలాంటి తప్పులతడక, అశాస్త్రీయమైన కులగణన ఏ విధంగా ‘రోల్ మోడల్’ అవుతుందో రేవంత్‌రెడ్డి, రాహుల్ గాంధీ చెప్పాలి. కాంగ్రెస్ మాదిరిగా కాకుండా, పాలనలో పారదర్శకత, జవాబుదారీతనానికి పెద్దపీట వేస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్వహించే జనగణన, కులగణన శాస్త్రీయంగా, ప్రజల ఆమోదయోగ్యంగా ఉంటుంది. దేశ సామాజిక, ఆర్థిక పునాదులు బలోపేతం చేయాలనేది మోదీ ప్రభుత్వం లక్ష్యం. దానికనుగుణంగానే కులాల వారీగా సమాచారం సేకరించి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రణాళికలు రూపొందించి, బడ్జెట్‌లో తగిన నిధులు కేటాయించేలా చర్యలు తీసుకుంటారు.

డా. కె.లక్ష్మణ్

రాజ్యసభ సభ్యులు

బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు

Updated Date - May 03 , 2025 | 03:28 AM