ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Socio Economic Surveys: ఏ వెలుగులకీ లెక్కలు

ABN, Publish Date - May 09 , 2025 | 02:12 AM

భారతదేశంలో కులగణన పై గవర్నమెంట్ తీసుకున్న పద్ధతులు, వాటి ప్రభావాలు, మరియు సమాచార సేకరణలోని లోపాలను ఈ వ్యాసం వివరంగా విశ్లేషిస్తుంది. కులగణన ద్వారా సామాజిక, ఆర్థిక అసమానతలను అర్థం చేసుకోవడం అవసరమని సూచించబడింది.

కొన్ని నిర్ణయాలను.. తాత్కాలిక ఆవేశంతోనో, స్పందనతోనో, చిరకాల కోరిక నెరవేరుతుందన్న ఆశావహ దృష్టితోనో చూస్తే చరిత్రాత్మకం అనిపిస్తాయి. సమకాలీన చరిత్రను కొత్త మలుపు తిప్పే శక్తి వాటికి ఉన్నదని భావించేలా మనపై ప్రగాఢ ముద్రవేస్తాయి. 14 ఏళ్ల కిందట సామాజిక, ఆర్థిక కులగణనను (ఎస్‌ఈసీసీ) చేపడతామని ఆనాటి యూపీయే ప్రభుత్వం ప్రకటించినప్పుడు అన్నిరంగాల్లో సామాజిక న్యాయం, రిజర్వేషన్ల పరిధి బాగా విస్తరించాలని కోరుకుంటున్న వారందరూ అలాగే భావించారు. కులగణన అనేది కులనిర్మూలనకు దారితీస్తుందని ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త సతీశ్‌ దేశ్‌పాండే ఘనంగా ప్రకటించారు. మరో ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త గేల్‌ ఆమ్‌వెట్‌ సమానత్వానికి అవసరమైన విధానాల రూపకల్పనకు కులగణన ఎంత అవసరమో వివరించారు. దాన్ని వ్యతిరేకించే వారందరూ కళ్లముందున్న సామాజిక అసమానతలను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కులగణన అనేది సంక్లిష్టమైనది కానేకాదనీ, ప్రతివ్యక్తి దగ్గరికి వెళ్లి నీ కులం ఏమిటి? అని అడిగి దాన్ని నమోదుచేస్తే సరిపోతుందనీ ఆమ్‌వెట్‌ సూచించారు. అట్లా సేకరించిన సమాచారాన్ని ఇతరత్రా వాటిని ఆధారం చేసుకుని నిపుణులు నింపాదిగా విశ్లేషణ చేసి వివిధ కులాల ప్రజలు సామాజికంగా, ఆర్థికంగా ఏ వర్గానికి చెందుతారో నిర్ణయించవచ్చని చెప్పారు. ప్రజలు స్వచ్ఛందంగా చెప్పే కులాల పేర్లను జనాభా సేకర్తలు యథాతథంగా రాసుకోవాలనీ, ముందుగా నిర్దేశించుకున్న కొన్ని కేటగిరీల్లో చేర్చేలా ఫలానా విధంగా సమాచారం చెప్పాల్సిందిగా నిర్బంధం పెట్టకూడదని కూడా సూచించారు. ఎన్నో తర్జనభర్జనల అనంతరం ఆనాడు సామాజిక, ఆర్థిక, కులగణను ఆమ్‌వెట్‌ లాంటి వాళ్లు సూచించిన పద్ధతిలోనే చేపట్టారు. 6.4 లక్షల ‘టాబ్స్‌’తో 640 జిల్లాల్లో డిజిటల్‌గా సమాచారాన్ని సేకరించారు. జనాభా సేకరణ చట్టం పరిధిలో కాకుండా ఆ కులగణనను వేరుగా నిర్వహించారు. అందుకే జనాభా లెక్కలతో పాటు ఆ సమాచారాన్ని వెల్లడించలేదు. విడిగా కూడా కులాల సమాచారాన్ని బహిరంగపరచలేదు. అంతలోనే ఎన్నికలు వచ్చాయి. యూపీయే ప్రభుత్వం ఓడిపోయింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం 2015లో పాక్షికంగా కొంత సమాచారాన్ని వెల్లడించింది.


అది కూడా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన ఆర్థిక సమాచారాన్ని మాత్రమే ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లోని 17.91 కోట్ల కుటుంబాల్లో 7.05 కోట్ల కుటుంబాలు ప్రభుత్వ చేయూత అవసరం లేనివిగా గుర్తించారు. 16 అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆ నిర్ణయానికి వచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక పరిస్థితులపై 2011కు ముందు కూడా అవసరమైన సమాచారం ఉంది. కానీ దేశవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులను ఏకకాలంలో సర్వేచేయటంతో అంతకుముందు లేనంత స్థాయిలో సమగ్రంగానే సమాచారం లభ్యమైంది. కులగణన కోసం పట్టుపట్టిన వాళ్లకు ఆ సమాచారం సంతృప్తిని ఇవ్వలేదు. వెనుకబడిన కులాల జనాభా ఎంత ఉందో స్పష్టంగా వెల్లడి కావాలనీ దాంతో పాటు వారి విద్య, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక పరిస్థితి గురించి స్పష్టమైన గణాంకాలు ఉండాలనీ వారు కోరుకున్నారు. ప్రభుత్వం 2018లో వెల్లడించిన తుది నివేదికలో కూడా కులాల సమాచారాన్ని పొందుపర్చలేదు. రిజర్వేషన్ల కోసం మరాఠాలు చేస్తున్న ఆందోళనలతో సతమతమవుతున్న మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రం తన వద్దనున్న కులాలవారీ గణాంకాలను ఇవ్వాలని కోరింది. కేంద్రం తిరస్కరించింది. దీంతో సుప్రీంకోర్టులో మహారాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‌ దాఖలుచేసింది. తన దగ్గరున్న కులాల సమాచారం చాలా గందరగోళంగా ఉందనీ, దానికి ప్రామాణికత లేదనీ కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. మహారాష్ట్రలో కులాలు 4,28,677గా తేలాయనీ, ఇక దేశవ్యాప్తంగా అవి 45 లక్షల దాకా నమోదయ్యాయని పేర్కొంది. గందరగోళాన్ని సృష్టించే అటువంటి సమాచారాన్ని వెల్లడి చేయలేమని తేల్చిచెప్పింది.అప్పటికి మహారాష్ట్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీల జాబితాలో 494 కులాలు మాత్రమే ఉన్నాయి. ప్రతి రాష్ట్రంలోనూ ఈ తరహా జాబితాలు ఉన్నాయి.


వాటిని ప్రాతిపదికగా తీసుకుని కులాల జనసంఖ్య లెక్కించినా కొంత ఫలితం ఉండేది. ఎవరికి వారు తమది ఫలానా కులమని చెబితే మారుమాట్లాడకుండా దాన్ని నమోదు చేయాలనే నిర్ణయం మొదటికే మోసం తెచ్చింది. ఈ పరిస్థితిని అధికార యంత్రాంగం ఎందుకు ఊహించలేకపోయిందన్నది ఇప్పటికీ జవాబులేని ప్రశ్నగానే మిగిలిపోయింది. రాష్ట్రాలవారీగా కులాలపై ఎన్నో అధ్యయనాలు అప్పటికే వెలువడిన నేపథ్యంలో ఇదెందుకు జరిగిందన్న విషయాన్ని కూడా ఎవరూ గట్టిగా లేవనెత్తలేదు. అప్పటి సర్వేని వేనోళ్ల పొగిడిన చాలామంది ఆ వైపరీత్యంపై మౌనం పాటించారు. కులాల లెక్కల విషయంలో ఆ గతం పునరావృతం కాకుండా ఏం చేయబోతున్నారన్న దానిపై ఇప్పటికైతే స్పష్టత లేదు. జనాభా సేకరణ చట్టాన్ని సవరించి కులాల లెక్కలను సాధికారికంగా తేల్చుతామని కేంద్రమంత్రుల నుంచి ప్రకటనలు మాత్రం వెలువడుతున్నాయి. ఆ లెక్కలు రాజకీయాల్లో పావులుగా మారకుండా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. కేంద్ర మంత్రివర్గం తీసుకున్న కులగణన నిర్ణయాన్ని కాంగ్రెస్‌ పార్టీ తన ఘనతగానే భావిస్తోంది. రాహుల్‌ గాంధీ చేసిన పోరాటంతోనే కేంద్రం దిగివచ్చిందనే ప్రచారాన్ని ముమ్మరం చేసింది. దాంతోనే ఆగలేదు. తెలంగాణలో తమ పార్టీ ప్రభుత్వం చేసిన కులసర్వే సర్వసమగ్రమైందనీ దాన్ని దేశవ్యాప్తంగా అనుసరిస్తే అద్భుత ఫలితాలు వస్తాయని చెబుతోంది. తెలంగాణ కులసర్వేలో వెల్లడైన విద్య, ఉద్యోగ, ఆర్థిక పరిస్థితులకు సంబంధించి కీలక సమాచారాన్ని బయటపెట్టకుండా అద్భుత ఫలితాల గురించి పదేపదే మాట్లాడటం అసంబద్ధంగా అనిపిస్తుంది. ఆ సమాచారం ఏమిటో తెలిస్తేనే దేశవ్యాప్తంగా అనుసరించతగ్గ నమూనాగా తెలంగాణ సర్వే పనికొస్తుందో లేదో చెప్పగలిగే అవకాశం ఉంటుంది. ఈసారి చేపట్టబోయే జనాభా లెక్కల్లో కులాన్ని ఒక అంశంగా చేర్చినంత మాత్రాన అద్భుతాలు జరుగుతాయని చెప్పలేం. ప్రతి కులానికి సంబంధించి సమగ్ర సమాచారం సేకరించటమే లక్ష్యమైతే జనాభా సేకరణలో చాలా మార్పులను చేపట్టాల్సి వస్తుంది.


ఆస్తులు, ఆదాయాలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, హోదాల సమాచారాన్ని కచ్చితంగా సేకరించాలి. అట్లాంటి సమాచారాన్ని సాధారణ జనాభా లెక్కలతో పాటు సేకరించిన సందర్భం ఇప్పటివరకూ లేదు. 2011లో చేసిన కసరత్తు ఆశించిన ఫలితాన్నీ ఇవ్వలేదు. పోనీ సాధారణ జనాభాలెక్కల్లో భాగంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సంబంధించి సేకరిస్తోన్న సమాచారం మాదిరిగానే ఇతరకులాల విషయంలో జరిపితే లక్ష్యం నెరవేరుతుందని చెప్పలేం. ఉదాహరణకు 2011 నాటి జనాభా లెక్కల్లో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి ప్రతి కులం, తెగ విషయంలో సంఖ్యాపరమైన సమాచారం ఉంది. కానీ కులాలవారీగా ఆర్థిక, విద్యా, ఉద్యోగపరమైన సమాచారం లేదు. ఎస్సీల్లో డిగ్రీ ఎంతమంది చదివారో తెలుస్తుంది. ఎంతమంది నిరక్షరాస్యులు ఉన్నారో వెల్లడవుతుంది. ఎంతమంది భూమిలేని వారున్నారో కనుక్కోవచ్చు. ఎంతమంది ఏ వృత్తుల్లో ఉన్నారో కూడా అంచనాకట్టొచ్చు. కానీ ఏ కులం వాళ్లు నిర్దిష్టంగా ఎక్కడున్నారో తెలుసుకోలేం. ఎవరికి ఉద్యోగాలు ఎక్కువ ఉన్నాయో, ఎవరికి తక్కువ ఉన్నాయో తెలుసుకోలేం. స్థూలచిత్రమే తప్ప విడి కులం పరిస్థితి కనపడదు. జనాభా లెక్కల్లో అటువంటి నిర్దిష్ట కుల సంబంధిత సమాచారమే ఉండి ఉంటే ఎస్సీ వర్గీకరణ సమస్య అంత జటిలమయ్యేది కాదు. కళ్లముందు కనపడే వాస్తవాలతో ఎవరు ఎక్కడ ఉన్నారో తెలిసిపోయేది.వర్గీకరణ వివాదం ఎప్పుడో ముగిసేలా రాజకీయ ఒత్తిళ్లు వచ్చి ఉండేవి. న్యాయస్థానాలూ వాస్తవాలను తొందరగా పరిగణనలోకి తీసుకుని ఉండేవి! పరిస్థితి ఇలా ఉన్న నేపథ్యంలో ఇతర కులాలకు సంబంధించి కూడా ఆ తరహా సమాచారాన్నే సేకరిస్తే అది పరిమితంగానే ఉంటుంది.


దాన్ని సైతం చేపట్టకుండా కేవలం కులాలవారీ జనాభాను మాత్రమే లెక్కిస్తే అది మరింత పరిమితమైన ప్రయోజనాన్నే ఇస్తుంది. కీలక విషయాల్లో ఎవరు.. ఎక్కడున్నారో తెలియని పరిస్థితి వల్ల ఆశిస్తున్న మార్పులు వచ్చే అవకాశాలు తక్కువ. భవిష్యత్తులో రాజకీయ ప్రయోజనాలు ఎటువైపు లాగుతాయో చెప్పలేం. మార్గదర్శకాలు రూపొందితే గానీ స్పష్టత రాదు. అయితే పైన ప్రస్తావించిన రెండు మార్గాల్లో ఏదో ఒకదాన్ని అనుసరించే అవకాశాలే ఎక్కువ! వలసపాలనలో కులాలు, తెగల వారీగా జరిగిన జనాభా లెక్కలకు అవసరానికి మించి ప్రాధాన్యతనూ, విపరీత శాస్త్రీయతను ఆపాదించటం ఇటీవల ఎక్కువైపోతోంది. కులం ఆధారంగా 1931లో జరిపిన జనాభా లెక్కలు చివరివే గానీ అవి సర్వసమగ్రమని చెప్పలేం. చాలా కులాలను అప్పుడు లెక్కించలేదు. కొన్ని కులాలను కలిపి చూపారు. పాలనా అవసరాల కోసం మార్పులూ చేర్పులూ చేశారు. 1921 నాటి లెక్కలతో పోల్చితే 1931లో మార్పులు కొట్టొచ్చినట్లు కనపడతాయి. 1931లో వృత్తుల ఆధారంగా కులాలను వర్గీకరించారు. 1891లో మొదటగా అలా చేశారు. మధ్యలో రెండుసార్లు వేరేరకంగా చేశారు. 1901లో అయితే కులాలకు ఎక్కువ తక్కువ హోదాలనూ సూచిస్తూ జాబితాను రూపొందించారు. విమర్శలు రావటంతో దాన్ని వదిలేశారు.


కులాల జాబితాలు ఎలా మారిపోతాయో తెలుసుకోవాలంటే మద్రాసు రాష్ట్ర లెక్కలను బట్టి తేలికగా గ్రహించొచ్చు. 1931లో ఆ రాష్ట్రంలో 156 కులాలకు లెక్కలు ఇచ్చారు. 1921లో 351 కులాలవారీ జనాభాను ప్రచురించారు. కులాలు, తెగలు, మత సమూహాలుగా మాత్రమే భారత ప్రజలను బ్రిటిషు పాలకులు ప్రధానంగా చూశారు. అందరినీ ఏకంచేసే జాతీయభావన భారత్‌లో లేదన్న ఆలోచనే బ్రిటిషు పాలకుల విధానాలను ప్రభావితం చేసింది. కులలెక్కలను కూడా ఆ దృష్టితోనే చేపట్టారు. ఆ లెక్కలు కులాలు సంఘటితం కావటానికీ, పదవుల కోసం పోటీపడటానికి దారితీశాయి. ఈ రెండు పరిణామాలు ఇప్పటికీ ఏదో రూపంలో కొనసాగుతున్నాయి. ఇవి మరింత ఉధృతం అవుతాయా లేదా అన్నది కులగణన ఫలితాలను, వాటి ఆధారంగా చేపట్టే విధానాలు బట్టి ఉంటుంది. కుల, మత అస్తిత్వాలనూ, ఆలోచనలనూ దాటలేని పరిస్థితే దేశంలో ఇంకా బలంగా ఉంది. ప్రజాస్వామ్యాన్ని కులలెక్కల ఆధారంగా పరిపుష్టం చేయాలన్న భావనపై జాతీయపార్టీలు ఏకాభిప్రాయానికి రావటమే ఇందుకు నిదర్శనం. 21వ శతాబ్దపు భారత విశిష్టతగా దాన్ని చెప్పుకోవచ్చు!

(ఆంధ్రజ్యోతి ఎడిటర్‌)

Updated Date - May 09 , 2025 | 02:15 AM