Caste Based Political Reservations: పార్టీపర రిజర్వేషన్లు మోసపూరిత ఆలోచన
ABN, Publish Date - Aug 16 , 2025 | 05:10 AM
అధికారమనే పులి మీద స్వారీ చేయాలని కలగనేవాడు ముందుగా ప్రమాద సమయంలో ప్రాణాపాయం లేకుండా దాన్నుంచి దిగడం నేర్చుకోవాలి.;...
అధికారమనే పులి మీద స్వారీ చేయాలని కలగనేవాడు ముందుగా ప్రమాద సమయంలో ప్రాణాపాయం లేకుండా దాన్నుంచి దిగడం నేర్చుకోవాలి. అట్లా దిగడం నేర్చుకోనట్లయితే అంతిమంగా పులికి ఆహారం కావాల్సి వస్తది. ఇప్పుడు 42శాతం బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పరిస్థితి అలాగే ఉన్నది. రాహుల్ గాంధీకి ఉన్నంత చిత్తశుద్ధి తెలంగాణ పాలకులకు లేకపోవడం తోనే 42శాతం రిజర్వేషన్లు అమలు కావడం లేదనేది బహుజన బుద్ధిజీవుల వాదన. 2023 ఎన్నికల సమయంలో రాహుల్‌గాంధీ జడ్చర్ల సభలో ప్రసంగిస్తూ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కులగణన చేపాడుతామని హామీ ఇచ్చాడు. ఈ హామీ మేరకు రేవంత్‌రెడ్డి సర్కారు ఫిబ్రవరి 4, 2024 నాడు కేబినెట్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే అసెంబ్లీలో ఫిబ్రవరి 16న తీర్మానం చేసిండ్రు. ఎనిమిది నెలలు ఆలస్యంగానే అయినా అక్టోబర్ 10 (2024) నాడు కులగణన కోసం ఉత్తర్వులు జారీచేసిండ్రు. ఈ మేరకు సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ, కుల గణన నవంబర్ 6 – డిసెంబర్ 25, 2024 మధ్య కాలంలో జరిగింది. తర్వాత ఫిబ్రవరి 2025లో మిగిలిపోయిన వారి కోసం రెండో విడత కులగణన కూడా జరిగింది.
ఈ సర్వే ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం మార్చి 17, 2025 నాడు రెండు వేర్వేరు బిల్లులు అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఇందులో విద్యా, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించేది ఒక బిల్లు కాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆమోదించినది రెండో బిల్లు. ఇప్పుడు ప్రభుత్వం విద్యా, ఉద్యోగాల బిల్లుని అసలు పట్టించుకోవడం లేదు. స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లుపైనే శ్రద్ధ చూపిస్తున్నది. స్థానిక సంస్థల ఎన్నికలకు నిర్ణీత కాల వ్యవధిలో ఎన్నికలు జరపనట్లయితే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోతుండడంతో ఈ హడావిడి నడుస్తున్నది. అట్లాగే సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు కూడా ఆదేశించింది.
ఈ రెండు బిల్లులకు అసెంబ్లీలో అన్ని పక్షాలు మద్ధతు ప్రకటించాయి. ఏకగ్రీవంగా ఆమోదాన్ని తెలిపాయి. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ బిల్లులు ఆమోదించుకునేందుకు అఖిలపక్షాన్ని కేంద్రం దగ్గరికి తీసుకువెళతానని హామీ కూడా ఇచ్చాడు. అయితే రాజకీయ ఎత్తుగడలో భాగంగా అఖిలపక్షంగా వెళ్ళి ప్రధానిని కలిసి విన్నవించుకునేందుకు అవకాశం ఉన్నప్పటికీ ఆ దారిన కాకుండా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ధర్నాకు పిలుపునిచ్చింది. నిజానికి అసెంబ్లీలో మద్దతు ఇచ్చినప్పుడు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయని భారతీయ జనతాపార్టీ ఇప్పుడు ముస్లింలను బీసీల నుంచి తొలగించాలి అనే డిమాండ్‌ని ముందుకు తెస్తున్నది. అఖిలపక్షాన్ని కేంద్రం వద్దకు తీసుకపోయి అందుకు కలిసి రాని పార్టీలను ప్రజల ముందట దోషిగా నిలబెట్టేందుకు అవకాశమున్నప్పటికీ ఆ మార్గాన్ని కాంగ్రెస్ పార్టీ ఎంచుకోలేదు. 42శాతం రిజర్వేషన్ల బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్‌లో ఉన్న సమయంలో గవర్నర్ ఆర్డినెన్స్ అదే విషయమై జారీ చేయడానికి వీలుండదని న్యాయనిపుణులు తేల్చి చెప్పినా రేవంత్ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఈ విషయంలో అడ్వకేట్ జనరల్ సలహా కూడా తీసుకున్నామని ప్రకటించారు. మరి ఇంత పకడ్బందీగా తయారు చేసిన 285–ఎ పంచాయతీరాజ్ బిల్లు సవరణ ఆర్డినెన్స్ ఇప్పటికీ జారీ కాలేదు. గవర్నర్ ఈ బిల్లుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదం తెలుపడు అని కచ్చితంగా తెలిసినప్పటికీ రాజకీయ క్రీడలో భాగంగా సవరణ బిల్లుని గవర్నర్‌కు పంపించారు. ఈ బిల్లు ఇట్లా ఉండగానే ఢిల్లీలో ధర్నాకు పిలుపునిచ్చారు. ప్రధానిని కలిసి షెడ్యూల్–9లో రిజర్వేషన్లు చేర్చాలని ఒత్తిడి పెంచాల్సింది. కానీ కాంగ్రెస్ నాయకులు రాష్ట్రపతి అప్పాయింట్‌మెంట్ ఇవ్వకుండా బీజేపీ నేతలు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఇవన్నీ బీసీ బిల్లు అమలు పట్ల కాంగ్రెస్ చిత్తశుద్ధిని శంకించేలా చేస్తున్నాయి.
ఇప్పుడు రాహుల్‌గాంధీ ప్రధాని అయితేగానీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు రావు అని రేవంత్‌రెడ్డి తేల్చి చెప్పిండు. నిజానికి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్లయితే ముందు నుంచే షెడ్యూల్–9లో తెలంగాణ బీసీ రిజర్వేషన్ల అంశాన్ని చేర్చాలని పోరాటం చేసేది. అట్లా గాకుండా బీసీల ప్రయోజనాలు తాము మాత్రమే రక్షించగలం అనే ఒక నాటకీయతను ముందుకు తెచ్చిండ్రు. జయలలిత ముఖ్యమంత్రిగా ఉండి అప్పటి ప్రధాని పి.వి.నరసింహారావుపై ఒత్తిడి తీసుకువచ్చి షెడ్యూల్–9లో చేర్పించి తమిళనాడులో 69శాతం రిజర్వేషన్లను సాధించుకున్నారు. ఆ మార్గాన్ని సరిగ్గా వినియోగించుకొని అందుకు అడ్డుపడినట్లయితే బీజేపీని దోషిగా నిలబెట్టడానికి అవకాశమున్నప్పటికీ ఆ దిశలో రేవంత్ సర్కార్ చర్యలు శూన్యం. అఖిలపక్షంతో పాటు ఢిల్లీని తెలంగాణ ప్రజలతో దిగ్బంధనం చేయడానికి అవకాశమున్నప్పటికీ కాంగ్రెస్ సర్కారు ఆ దిశలో ఆలోచించలేదు. బీసీల పట్ల వారికి చిత్తశుద్ధి లేదని ఈ చర్యలు నిరూపిస్తున్నాయి. ఇప్పుడు 42శాతం పార్టీపరంగా బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ పార్టీ కొత్త రాగమెత్తుకున్నది. ఈ విషయమై రేవంత్‌రెడ్డి ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌లో చెప్పిండు కూడా! కాంగ్రెస్ పార్టీది మొదటి నుంచి మోసపూరిత ఆలోచన విధానమే! 2023 సార్వత్రక ఎన్నికల సమయంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఇద్దరు బీసీలకు అసెంబ్లీ టికెట్లు జైపూర్ తీర్మానం మేరకు కేటాయిస్తామని నమ్మబలికారు. తీరా నామినేషన్ దాఖలు చేసే తుదిగడువు దగ్గర పడుతున్న కొద్దీ తాత్సారం చేసి 34 సీట్లకు బదులు 19 సీట్లు కేటాయించారు. అందులో నాలుగు సీట్లు ఓల్డ్ సిటీలో ఇచ్చారు. అంటే ఇవన్నీ ఓడిపోయే సీట్లే అని తెలిసే వారికి కేటాయించారు.
42శాతం పార్టీపరంగా ఇచ్చినప్పటికీ అగ్రకులాల నాయకులు పార్టీలకు అతీతంగా బదులుకొని ఓడిపోయే సీట్లల్లో బీసీలను నిలబెట్టి, గెలిచే సీట్లను రెడ్లు, వెలమలకు కేటాయించే అవకాశమున్నది. చట్టపరంగా రిజర్వేషన్లు ఉన్నప్పుడు మాత్రమే బీసీలకు వాటా దక్కుతుంది. లేనట్లయితే అన్ని పార్టీలు కలిసి ఓడిపోయే సీట్లల్లో బీసీలకు టికెట్లిచ్చి, తర్వాత బీసీలకు టికెట్లిస్తే ఓడిపోతారు కాబట్టి వారికి టికెట్లివ్వకూడదు అనే నరేషన్‌ని ప్రచారంలో పెడుతారు. ఇప్పటికైనా 42శాతం రిజర్వేషన్లు సాధించే వరకు స్థానిక ఎన్నికలు వాయిదా వేయాలి. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలు చేయాలి. తాము పకడ్బందీగా చేశామని చెప్పుకుంటున్న కులగణన వివరాలను కోర్టు ముందుంచి 50 శాతం సీలింగ్ ఎత్తివేతకు న్యాయ పోరాటం చేయాలి. లేదంటే తెలంగాణ బీసీలందరినీ ఢిల్లీకి తరలించి రైతుల మాదిరిగా దేశ రాజధానిని దిగ్బంధం చేసే ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టాలి. అప్పుడు మాత్రమే కాంగ్రెస్‌పార్టీకి ప్రజల్లో విశ్వసనీయత ఏర్పడుతుంది.
-సంగిశెట్టి శ్రీనివాస్
Updated Date - Aug 16 , 2025 | 05:10 AM