ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

India China relations: వాణిజ్య మైత్రితో సరిహద్దు వైరం తీరేనా

ABN, Publish Date - Sep 06 , 2025 | 02:35 AM

ఇద్దరు వ్యక్తులు నాట్యం చేయడానికి సిద్ధమవుతున్నారు. సంగీతం అస్ఫుటంగా వినిపిస్తోంది. గాయకుడు ఎవరైందీ ఇంకా కనిపించడం లేదు...

ద్దరు వ్యక్తులు నాట్యం చేయడానికి సిద్ధమవుతున్నారు. సంగీతం అస్ఫుటంగా వినిపిస్తోంది. గాయకుడు ఎవరైందీ ఇంకా కనిపించడం లేదు. అయితే ఆ గాయకుడు భారత ప్రధానమంత్రి మాత్రం కాదు. ఇది స్పష్టాతి స్పష్టం. మహాబలిపురంలో చైనా అధ్యక్షుడు క్సి జిన్‌పింగ్‌తో కలిసి ఊయల ఊగిన రోజుల నుంచి నరేంద్ర మోదీ చాలా దూరం వచ్చారు. జూన్‌ 15, 2020న గల్వాన్‌ లోయలో చైనా, భారత్‌ సైనిక దళాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణల్లో 20 మంది భారత జవాన్లు మరణించారు. ఆ ఘటన నాలుగురోజుల అనంతరం జరిగిన అఖిలపక్ష సమావేశంలో ‘బయటివారెవ్వరూ భారత భూ భాగాల్లోకి చొరబడలేదు, ఏ బయటి వ్యక్తీ భారత భూభాగంలో లేడు’ అని మోదీ గంభీరంగా ఉద్ఘాటించారు.

అయితే కొద్ది వారాలలోనే రక్షణ మంత్రి, విదేశాంగ మంత్రి మోదీ మాటకు విరుద్ధమైన ప్రకటనలు చేశారు. సైనికాధికారుల స్థాయి చర్చల్లో సరిహద్దుల్లో సాధారణ పరిస్థితుల పునరుద్ధరణకు భారత్‌ త్రివిధ చర్యలను ప్రతిపాదించింది. అవి: ఉపసంహరణ, ఉద్రిక్తతల సడలింపు, నిస్సైనికీకరణ. భారత్‌తో చర్చలలో చైనా పాల్గొన్నది. తన సైనిక దళాలను వెనక్కి తీసుకువెళ్లింది. అయితే ఉద్రిక్తతల సడలింపునకు, నిస్సైనికీకరణకు నిరాకరించింది. గల్వాన్‌ సరిహద్దు ప్రాంతంలో చైనా సైనిక దళాలను పెద్ద ఎత్తున సమీకరిస్తున్నట్టు, సైనిక శకటాలను మోహరిస్తున్నట్టు, 5జి నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసినట్టు, కొత్త రహదారులు నిర్మించినట్టు, తన సైనిక దళాలకు కొత్త ఆవాసాలను నిర్మిస్తున్నట్టు ఉపగ్రహాలు తీసిన ఛాయా చిత్రాలు స్పష్టం చేశాయి. భారత్‌, చైనాల మధ్య ఘర్షణలకు గల్వాన్‌ ఒక్కటే కేంద్రం కాదు. డెప్సాంగ్‌, డెమ్‌చోక్‌ వివాదాలు అపరిష్కృతంగా ఉన్నాయి. వాస్తవాధీనరేఖకు ఈవల వైపు భారత్‌లో ఉన్న ఈ కీలక ప్రదేశాలలో చైనా సైనిక దళాలు తిష్ఠ వేసి ఉన్నాయి. డిసెంబర్ 2024లో కూడా ‘ఉభయ దేశాల మధ్య సంబంధాలు 2020 నుంచి మామూలుగా లేవని’ భారత విదేశాంగ మంత్రి చెప్పారు. ఈ ఏడాది జూన్‌లో భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య నాలుగురోజుల యుద్ధం జరిగినప్పుడు భారత్‌ను దెబ్బతీసేందుకు చైనా పరోక్షంగా ప్రయత్నించింది.

చైనాతో అన్ని రంగాలలో సంబంధాలను తెంచుకునే విషయమై భారత్‌ మాట్లాడింది కానీ అది ఆచరణలో అంత తేలిక కాదని రుజువయింది. చైనాతో భారత్‌ వస్తూత్పత్తుల వాణిజ్య లోటు ఏటా పెరుగుతూనే ఉంది. 2024–25లో ఈ వాణిజ్యలోటు 10,000 కోట్ల డాలర్లుగా ఉన్నది. పలు కీలక వస్తువుల విషయంలో భారత్‌ పూర్తిగా చైనాపై ఆధారపడి ఉన్నది. భారత్‌లో రిజిస్టర్‌ అయిన చైనా కంపెనీలు 174 కాగా 3,560 భారతీయ కంపెనీల మేనేజ్‌మెంట్‌ బోర్డులలో చైనీస్‌ డైరెక్టర్లు ఉన్నారు. భారత్‌–పాకిస్థాన్‌ యుద్ధం తరువాత టిక్‌టాక్‌ తదితర చైనీస్‌ మొబైల్‌ యాప్స్‌ను భారత్‌ నిషేధించింది. భారత్‌లో చైనా పెట్టుబడులపై ఆంక్షలు విధించింది.

షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ)కు క్సి జిన్‌పింగ్‌ మొదటి నుంచీ చాలా ప్రాధాన్యమిస్తున్నారు. 2019, 2022, 2024 ఎస్‌సీఓ శిఖరాగ్ర సదస్సుల సందర్భంగా జిన్‌పింగ్‌, మోదీల మధ్య ద్వైపాక్షిక సమావేశాలు జరగలేదు. ఈ దృష్ట్యా టియాంజిన్‌ సదస్సు సందర్భంగా ఇరువురి మధ్య జరిగిన ద్వైపాక్షిక సమావేశం చరిత్రాత్మకమైనది. సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవడంలో అవరోధాలను అధిగమించేందుకు అది పెద్దగా ఉపయోగపడదు. అయితే ఇటీవలి కాలంలో వాణిజ్యం, పెట్టుబడుల విషయంలో తీవ్రమైన విభేదాలు, వ్యత్యాసాలను తొలగించుకునేందుకు గణనీయంగా తోడ్పడే అవకాశమున్నది. ఇదే సంభవిస్తే ఉభయ దేశాల మధ్య సంబంధాలు మేలుమలుపు తిరుగుతాయి.

భారత్‌, చైనా రెండూ తమ పాత వైఖరులను విడనాడి స్నేహపూరిత సంబంధాలను పెంపొందించుకోవాలని నిర్ణయించుకోవడానికి దారితీసిన పరిస్థితులు, కారణాలను మనం జాగ్రత్తగా విశ్లేషించాలి. డోనాల్డ్‌ ట్రంప్‌తో స్నేహానికి నరేంద్ర మోదీ ఎనలేని ప్రాధాన్యమిచ్చారు. అయినప్పటికీ ట్రంప్‌ మోదీ స్నేహాన్ని తృణీకరించారు. ఫలితంగా భారత్‌–అమెరికా ద్వైపాక్షిక సంబంధాలలో న్యూఢిల్లీకి చేదు అనుభవాలే మిగిలాయి. సుసంబంధ, పరస్పర ప్రయోజనకర ఆర్థిక సంబంధాల కంటే వ్యక్తిగత వ్యాపార లబ్ధికి, సంకుచిత రాజకీయ లక్ష్యాలకు ప్రాధాన్యమిచ్చే లావాదేవీల అధ్యక్షుడి నుంచి భారత ప్రభుత్వం ఒక క్రూర పాఠాన్ని నేర్చుకున్నది. మరే దేశంపై విధించని విధంగా భారత్‌పై ట్రంప్‌ అత్యధిక సుంకాలు విధించారు.

దీంతో చైనాతో సంబంధాలు మెరుగుపరచుకోవడం ద్వారా అమెరికా సృష్టించిన ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి బయటపడేందుకు భారత్‌ ప్రయత్నిస్తోంది. చైనా తన వాణిజ్యాభివృద్ధికి, పెట్టుబడులను ఇతోధికంగా విస్తరింపచేసుకునేందుకు ఆరాటపడుతోంది. అందుకు అవసరమైన అవకాశాలు ప్రపంచ అతిపెద్ద మార్కెట్‌ అయిన భారత్‌లో ఉన్నాయనే వాస్తవాన్ని చైనా గుర్తించింది. ఆసియా–పసిఫిక్‌ ప్రాంతంలో తన ప్రభావాన్ని విస్తరింపచేసుకోవడం కూడా భారత్‌ లక్ష్యంగా ఉన్నది. ఈ కారణాల వల్ల నిన్నటిదాకా తన శత్రువుగా ఉన్న చైనాను తనకు అనుకూలం చేసుకునేందుకు పూనుకున్నది. అయితే వాస్తవాలను నిశితంగా పరిశీలిస్తే భారత్‌–చైనా సరిహద్దు ప్రాంతాలపై తన వాదనలను విడనాడడానికి గానీ, తాను ఉత్పత్తి చేసే సైనిక సామగ్రిని భారీ ఎత్తున కొనుగోలు చేస్తున్న పాకిస్థాన్‌ ప్రయోజనాలను దెబ్బతీసే నిర్ణయాలు తీసుకోవడానికి గానీ బీజింగ్‌ అంగీకరించదని స్పష్టమవుతున్నది. టియాంజిన్‌లో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో వాణిజ్యాన్ని పెంపొందించుకోవడం, ఉగ్రవాదం నిర్మూలన అంశాలకు మోదీ అమిత ప్రాధాన్యమిచ్చారు. అయితే క్సి జిన్‌పింగ్‌ చాలా తెలివిగా ఆ అంశాలకు ప్రాధాన్యమివ్వకుండా వ్యవహరించారు.

ఈ వాస్తవాల దృష్ట్యా భారత్‌ ప్రయోజనాలకు అనుకూలంగా మోదీ స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలో లేరు. భారత్‌ ఎగుమతుల ప్రధాన గమ్యమైన అమెరికా, భారత్‌ భారీ దిగుమతులకు మూలదేశమైన చైనా మధ్య చిక్కుకున్నారు. క్వాడ్‌, ఎస్‌సీఓ /ఆర్‌ఐసీలలో దేనికి అగ్ర ప్రాధాన్యమివ్వాలనే విషయంలో కూడా ఆయనకు అన్నీ చిక్కులే. ట్రంప్‌ మాదిరిగా మోదీ కూడా తన రాజకీయ సహజాతాలు తిరుగులేని రీతిలో సక్రమమైనవని విశ్వసిస్తారు. ఆయన వైయక్తిక దౌత్యశైలికి ప్రధాన కారణం ఆ ప్రగాఢ విశ్వాసమే. ఇప్పటికే ఎన్నో వైఫల్యాలు ఎదురయ్యాయి. భారత్‌ ప్రయోజనాలు దెబ్బతింటున్నందున నరేంద్ర మోదీ తన వైయక్తిక దోస్తీ దౌత్యాన్ని విడనాడి, విదేశాంగ శాఖ అధికారులు, అనుభవజ్ఞులైన దౌత్యవేత్తల సలహా, సూచనల ప్రకారం వ్యవహరించాలి. అప్పుడు మాత్రమే భారత్‌ ప్రయోజనాలకు విశేషంగా దోహదం చేకూరుతుంది.

-పి. చిదంబరం

Updated Date - Sep 06 , 2025 | 02:35 AM