ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Modi government: నేరచరితుల ఆటకట్టు సాధ్యమేనా

ABN, Publish Date - Aug 27 , 2025 | 12:24 AM

నీకెంత సేన ఉన్నా వ్యూహం లేకపోతే నీవు జనరల్ కాలేవు.. అన్న ఒక సైనిక నిపుణుడి ఉవాచ రాజకీయాలకు కూడా వర్తిస్తుంది. రాజకీయాల్లో వ్యూహరచన చేసే విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అంత సిద్ధహస్తుడు మరొకరు లేరు. 2029లో జరిగే సార్వత్రక ఎన్నికలకు ఆయన ....

నీకెంత సేన ఉన్నా వ్యూహం లేకపోతే నీవు జనరల్ కాలేవు..’ అన్న ఒక సైనిక నిపుణుడి ఉవాచ రాజకీయాలకు కూడా వర్తిస్తుంది. రాజకీయాల్లో వ్యూహరచన చేసే విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అంత సిద్ధహస్తుడు మరొకరు లేరు. 2029లో జరిగే సార్వత్రక ఎన్నికలకు ఆయన ఇప్పటి నుంచే సిద్ధపడుతున్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొద్ది రోజుల క్రితమే వెల్లడించారు. దీన్నిబట్టి చూస్తే వచ్చే సెప్టెంబర్ నెలాఖరులో షెడ్యూలు ప్రకటించబోతున్న బిహార్ ఎన్నికలకు ఆయన ఎంత ముందుగా సన్నాహాలు చేసి ఉంటారో వేరే చెప్పనక్కర్లేదు. సాధారణంగా ఏవైనా ఎన్నికలకు ముందు పార్లమెంట్ సమావేశాలు పెద్దగా జరిగే అవకాశాలు లేవు. పార్లమెంట్‌లో లేవనెత్తే అంశాలే తర్వాత జరగబోయే ఎన్నికలకు ప్రధాన ప్రచారాస్త్రాలవుతాయని అటు అధికార పక్షానికీ, ఇటు ప్రతిపక్షాలకూ తెలుసు. ఆపరేషన్ సిందూర్‌పై చర్చను తమకు అనుకూలంగా తిప్పుకోవాలని మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తే బిహార్‌లో ఓటర్ల జాబితా విస్తృత సవరణ, గత మేలో పాకిస్థాన్‌పై ప్రారంభించిన యుద్ధాన్ని ఆకస్మికంగా విరమించడం లాంటి అంశాలను ప్రతిపక్షాలు లేవనెత్తాయి. ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేసేందుకు కాంగ్రెస్ ‘ఓట్ చోరీ’ ఆరోపణను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. దీనితో మోదీ ప్రభుత్వం తన వ్యూహరచనపై పునరాలోచనలో పడ్డది. నిజానికి ఆగస్టు 12నే ఉభయ సభలను వాయిదా వేయాలని తొలుత నిర్ణయం తీసుకుని ఆ విషయం ఫ్లోర్ నేతల సమావేశంలో తెలియజేశారు. కాని మోదీ, షా ఏమి ఆలోచించారో కానీ ఆమోదించాల్సిన బిల్లులేవీ లేకున్నా యథా ప్రకారం ఆగస్టు 21 వరకు పార్లమెంట్‌ను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 19 రాత్రి పొద్దుపోయిన తర్వాత ఉన్నట్లుండి 130వ రాజ్యాంగ సవరణ బిల్లు, అందుకు సంబంధించిన ఇతర బిల్లులను మరునాడు ప్రవేశపెట్టనున్నట్లు బులెటిన్ విడుదల చేశారు. పార్లమెంట్ సభ్యులు అందరికీ బిల్లుల ప్రతిని పంపారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులు అయిదేళ్లపాటు శిక్షపడదగిన నేరానికి అరెస్టయి నెలరోజులపాటు జైలులో ఉంటే రాజీనామా చేయాలని, లేకపోతే వారు ఆ పదవులను కోల్పోయినట్లేనని ఈ బిల్లు సారాంశం. ఇప్పటి వరకూ మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రిని పోస్టుల నుంచి తొలగించేందుకు చట్టపరమైన నిబంధనలేవీ లేవు. లిల్లీ థామస్ కేసులో ఎమ్మెల్యే, ఎంపీలకు రెండేళ్లు, అంతకు మించి శిక్ష పడితే వారు సభ్యులుగా కొనసాగకూడదని 2013లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఈ కేసు ఆధారంగానే గుజరాత్‌లో సూరత్ కోర్టు ఒక పరువు నష్టం కేసులో రాహుల్‌గాంధీకి రెండేళ్ల శిక్ష విధించడంతో ఆయన సభ్యత్వాన్ని కోల్పోవాల్సి వచ్చింది.

అసలీ బిల్లును ఇంత ఆగమేఘాలపై ఎందుకు ప్రవేశపెట్టాల్సి వచ్చింది? జమిలి ఎన్నికల వంటి ముఖ్యమైన అంశంపై అఖిలపక్ష సమావేశాల్లో చర్చించిన ప్రభుత్వం ప్రధాన పదవుల్లో ఉన్నవారి నేర చరిత్ర గురించి రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టే ముందు ఎవరితోనూ చర్చించనవసరం లేదా? అందుకోసం కనీసం కేబినెట్ సమావేశంలోనైనా చర్చ జరిగిందా? అన్న ప్రశ్నలకు జవాబులు లేవు. అసలీ దేశంలో ప్రధానమంత్రులను కేంద్ర సంస్థలు ఎప్పుడైనా అరెస్టు చేసే అవకాశాలున్నాయా? అన్నది ఆసక్తికరమైన ప్రశ్న. విచిత్రమేమంటే కస్టడీ నుంచి విడుదలైన తర్వాత మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి, మళ్లీ పదవులు స్వీకరించేందుకు ఎలాంటి అడ్డంకులూ లేవని కూడా ఈ బిల్లు పేర్కొంటోంది. అటువంటప్పుడు ఈ బిల్లు ప్రవేశపెట్టడం వల్ల ప్రయోజనమేమిటి?

ఈ బిల్లుకు ప్రచారం కంటే పెద్ద ప్రయోజనం లేదని అధికారపక్షానికి తెలియనిది కాదు. బిహార్‌లో ఎస్ఐఆర్‌పై ప్రతిపక్షాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నందువల్ల దాన్నుంచి దృష్టి మళ్లించేందుకే ఈ బిల్లు ప్రవేశపెట్టారన్న విశ్లేషణలూ లేకపోలేదు. ప్రభుత్వం ఊహించినట్లుగానే బిల్లుపై ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి. తద్వారా అవినీతిపై తాము చేస్తున్న పోరాటాన్ని వారు వ్యతిరేకిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా, ఇతర నేతలు ఆరోపించేందుకు ఆస్కారం కలిగింది. ఏమైనా ఈ నేపథ్యంలో బిహార్ ఎన్నికలు ఆసక్తికరంగా మారనున్నాయనడంలో సందేహం లేదు. రాహుల్‌గాంధీ ఇప్పటికే యాత్రలు ప్రారంభించి ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. పహల్గాం దాడి కాగానే మోదీ కూడా బిహార్‌కే వెళ్లి పాకిస్థాన్‌కు బుద్ధి చెబుతానని ప్రకటించారు. ఆపరేషన్ సిందూర్‌కు తోడు రాజ్యాంగ సవరణ బిల్లు కూడా ప్రతిపక్షాలను ఎండగట్టేందుకు మోదీ సేన ఉపయోగించుకుంటుందనడంలో సందేహం లేదు. రాజ్యాంగ సవరణ బిల్లు పట్ల ప్రతిపక్షాలు ఆందోళన చెందేందుకు కారణాలు లేకపోలేదు. ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను కుప్పకూల్చేందుకు కేంద్రం సీబీఐ, ఈడీ వంటి కేంద్ర ఏజెన్సీలను తప్పక ఉపయోగించుకోగలదని విపక్షాలు గట్టిగా విశ్వసిస్తున్నాయి. మనీలాండరింగ్ చట్టం ప్రకారం ఒక ముఖ్యమంత్రిని కానీ, మంత్రిని కానీ అరెస్టు చేస్తే వారికి 30 రోజుల వరకు బెయిల్ దొరికేందుకు అవకాశం లేదు. అదే అదనుగా వారిని తొలగించవచ్చు. ముఖ్యమంత్రిని అరెస్టు చేస్తే అధికారంలో ఉన్న ప్రభుత్వం కుప్పకూలిపోతుందని లేదా అధికారంలో ఉన్న పార్టీలో లుకలుకలు బయలుదేరుతాయనేది కూడా ప్రతిపక్షాల వారి ఆందోళన. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో పలువురు నేతలు ముఖ్యమంత్రి పదవికోసం మంత్రి పదవులకోసం అర్రులు చాస్తూ ఉంటారు. కనుక ఆ పార్టీని దెబ్బతీయడం కేంద్రంలో ఉన్న పార్టీకి సులభం.

ఈ బిల్లు ప్రవేశపెట్టేందుకు మోదీ ప్రభుత్వానికి అనేక కారణాలున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మద్యం కుంభకోణంలో అరెస్టయి 156 రోజులు జైలులో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగారు. ఆయన మంత్రివర్గంలో ఉన్న సత్యేంద్ర జైన్ హవాలా కేసులో అరెస్టయినప్పటికీ చాలా కాలం మంత్రి పదవిలో కొనసాగారు. తమిళనాడులో కూడా డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి స్టాలిన్ తన మంత్రి సెంథిల్ బాలాజీ అరెస్టయి జైలుపాలైనప్పటికీ అతడిని మంత్రివర్గంలో కొనసాగించారు. మంత్రివర్గం నుంచి తొలగించాలని గవర్నర్ రవి ఆదేశించినప్పటికీ స్టాలిన్ ఒప్పుకోలేదు. నిజానికి గతంలో ఆరోపణలు వచ్చినా, కోర్టు వ్యాఖ్యలు చేసినా, తమ మంత్రిత్వశాఖ పరిధిలో ఏవైనా దుర్ఘటనలు జరిగినా మంత్రులు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసేవారు. ఇంజనీరింగ్ కాలేజీల్లో క్యాపిటేషన్ ఫీజులపై హైకోర్టు తప్పుపట్టడంతో ప్రధానమంత్రి పీవీ నరసింహారావు అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డిని రాజీనామా చేయించారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న యడ్యూరప్ప, తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత, బిహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ తమను అరెస్టు చేయకముందే పదవులనుంచి తప్పుకున్నారు. రాజకీయ నాయకులు చాలా మందికి ఈ అరెస్టుల వల్ల పెద్దగా నష్టం జరిగిన దాఖలాలు లేవు. హేమంత్ సోరెన్ జైలు నుంచి వచ్చిన తర్వాత ఎన్నికల్లో పోరాడి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. లాలూప్రసాద్ తాను అరెస్టయ్యే ముందు రబ్రీదేవిని ముఖ్యమంత్రి చేసినప్పటికీ ఆయన ప్రభుత్వం పడిపోలేదు. జయలలిత తాను అరెస్ట్‌ అయిన రెండుసార్లూ ఒకసారి పన్నీర్‌సెల్వన్‌ను, రెండవసారి పళనిస్వామిని ముఖ్యమంత్రి చేశారు. రెండుసార్లూ ఆమె ప్రభుత్వానికి పెద్దగా ఢోకా రాలేదు. గత ఏడాది జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్టుకు ముందే రాజీనామా చేసి చంపాయి సోరెన్‌ను ముఖ్యమంత్రి చేశారు. బహుశా కేజ్రీవాల్ కూడా ముందే రాజీనామా చేసి ఉంటే మళ్లీ మెజారిటీ సాధించేవారేమో. అప్పుడు కేంద్రం ఈ బిల్లు ప్రవేశపెట్టాల్సిన అవసరం కూడా ఉండేది కాదు.

అయినా ప్రభుత్వాలను పడగొట్టాలంటే ఇలాంటి బిల్లులు ఏ మాత్రం అవసరం లేదు. గతంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రభుత్వాలను పడగొట్టేందుకు బీజేపీ వేర్వేరు మార్గాలను అనుసరించింది. ముఖ్యమంత్రులనో, మంత్రులనో అరెస్టు చేసినంత మాత్రాన ప్రభుత్వాలు పడిపోతాయని చెప్పడానికి లేదు. పైగా అసంబద్ధంగా కుట్రపూరితంగా అరెస్టులు జరిగితే న్యాయవ్యవస్థ చేతులు ముడుచుకుకూర్చునే అవకాశాలు తక్కువ. కేంద్రం కక్షసాధింపు చర్యలతో ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, మంత్రులను కేసుల్లో ఇరికిస్తే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్ర మంత్రులపై తమ పోలీసులను, ఏజెన్సీలను ప్రయోగించేందుకు పూనుకోవచ్చు. ఇది ఒక గందరగోళ పరిస్థితికి దారితీస్తుంది. అయినా ఇప్పుడున్న కేంద్ర ఏజెన్సీలనే రాష్ట్ర నేతలపై ప్రయోగించే అవకాశం ఉండగా రాజ్యాంగ సవరణ తేవాల్సిన అవసరం ఏమున్నది? రాజకీయాల్లో నేరచరితులను అంతం చేయడానికి చిత్తశుద్ధి ఉంటే అందుకు సవాలక్ష మార్గాలున్నాయి. నేరచరితులపై వోహ్రా కమిషన్ తన నివేదికలో చేసిన సిఫారసులను ఏ ప్రభుత్వమూ అమలుపరచనేలేదు. లోక్‌పాల్ వంటి వ్యవస్థ కోసం బీజేపీ గతంలో పోరాడింది. కానీ ఆ వ్యవస్థ ఇప్పుడు నామమాత్రంగా పనిచేస్తోంది. ప్రధానమంత్రి, కేంద్రమంత్రులపై వచ్చిన ఫిర్యాదులపై లోక్‌పాల్ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నదో ఎవరికీ తెలియదు. జగన్మోహన్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి లాంటి వారిపై తీవ్ర ఆరోపణలున్నా ఏజెన్సీలు సరిగా పనిచేయడంలేదనే వాదనలూ లేకపోలేదు. నేరచరితులు అధికార పార్టీలో చేరగానే వారి నేరాలు ప్రక్షాళన అయ్యాయన్న విమర్శలూ వచ్చాయి. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో న్యాయమూర్తులను సరైన సంఖ్యలో నియమించకపోవడంతో అనేకమంది నేరచరితులు తప్పించుకుంటున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన 1618 మంది అభ్యర్థుల్లో 16 శాతం మందిపై క్రిమినల్ కేసులున్నాయి. చార్జిషీటు దాఖలైనప్పుడే అనర్హత వేటు వేయాలని లా కమిషన్ కూడా సూచించింది. అయినా త్వరలో జరుగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనైనా బీజేపీతో పాటు అన్ని రాజకీయ పార్టీలు నేరచరితులకు టిక్కెట్లు ఇవ్వకూడదని నిర్ణయం తీసుకోగలవా?

-ఎ. కృష్ణారావు (ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - Aug 27 , 2025 | 12:24 AM