Telugu Cartoonist Bapu: తొలి రోజుల బాపు
ABN, Publish Date - May 12 , 2025 | 04:32 AM
బాపు గా పేరొందిన సత్తిరాజు లక్ష్మీనారాయణ బాల్యంలో నుంచే చిత్రకళపై సాధన చేయడంతో కళారంగంలో అప్రతిమమైన కీర్తిని సంపాదించారు. ఆయన రేఖా చిత్రాలు, కార్టూన్లు తెలుగు జర్నలిజం మరియు సాంస్కృతిక పత్రికల్లో ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టాయి.
‘‘నువ్వు ఎంచుకున్న రంగంలో రోజుకి ఒక గంట పాటు సాధన చేస్తే చాలు, మూడేళ్ళల్లో ఆ రంగంలో మంచి స్థానంలో ఉంటావు. ఐదేళ్ళలోపు ఆ రంగంలో దేశం మొత్తమ్మీద నీదే అథారిటీ. ఏడేళ్ళలోకల్లా ప్రపంచం మొత్తమ్మీద ఆ రంగంలోని ప్రముఖుల్లో నువ్వూ ఒకడివి అవుతావు’’
– ఎర్ల్ నైటింగేల్
ఈ విషయం ‘బాపు’గా ప్రసిద్ధులైన సత్తిరాజు లక్ష్మీనారాయణ (1933–2014)కు సంబంధించి వందశాతమూ నిజం! బి.కామ్, ఎల్.ఎల్.బి. చేసి మద్రాసులో అడ్వకేట్‌గా ఎన్‌రోల్ ఐనా; తర్వాత దశలో తెలుగు, హిందీ సినిమా దర్శకుడిగా రాణించినా– బాపు స్థూలంగా చిత్రకారుడు. తొలి దశలో గంటల తరబడి కృషి చేయడం వల్లనే ‘బాల’, ‘గృహలక్ష్మి’, ‘ఆనందవాణి’, ‘పారిజాతం’, ‘చిత్రగుప్త’, ‘తెలుగు స్వతంత్ర’ ఇత్యాది పత్రికల ద్వారా ప్రతిభ చూపి 1959 కల్లా ‘ఆంధ్ర సచిత్ర వార పత్రిక’లో ప్రవేశించారు. అప్పటికి ఆయన వయసు 26ఏళ్ళు మాత్రమే. నిజానికి ఆయన బొమ్మలు 1945–47 నుంచే పాఠకులకు తెలుసు. ఆంధ్ర పత్రిక వీక్లీ 1960 ఆగస్టు 24 సంచికలో తోటపల్లి నుంచి టి.హెచ్. కృష్ణ అనే పాఠకుడు ‘‘కడచిన రెండు సంచికలలో బాపు బొమ్మలు వేయలేదు’’ అని రాయగా ‘‘బాపు చిత్రాలు ప్రచురించని సంచిక ఇంతవరకు వెలవరించలేదు గమనించమని కోరిక’’ అని ఆ పత్రిక జవాబుగా ప్రచురించింది. అలా మొదలైన బాపు బొమ్మలు, కార్టూన్లు, కథలకు ఇలస్ట్రేషన్లు, పుస్తకాలకు ముఖచిత్రాలతో 2012–13 దాకా, అంటే అరశతాబ్దం మించి కొనసాగాయి.
1955 లో ఆంధ్ర సచిత్ర వారపత్రిక సైజుతో సహా కంటెంట్ సంబంధించి పెద్ద స్థాయిలో మార్పులు జరిగాయి. ‘కాంచన ద్వీపం’, ‘80 రోజుల్లో భూప్రదక్షిణం’, ‘రాజు–పేద’, ‘రెండు నగరాలు’ వంటి అత్యుత్తమ అనువాద నవలలతో పాటు ‘తెలుగు వెలుగులు’ వంటి శీర్షిక, సినిమా కబుర్లు, రాష్ట్ర రాజకీయాలు.. ఇలా తెలుగు వీక్లీలకు ఒక మోడ్యూలు తయారయ్యింది. ఆ సక్సెస్ ఫార్ములాలో ఎంతోమంది ప్రఖ్యాతుల రచనలతో పాటు, బాపు బొమ్మలూ అంతర్భాగం.
1962 ఆగస్టు 3 సంచికలో ఆంధ్ర పత్రిక వీక్లీ బాపు గురించి ఒక పూర్తి పేజీ వ్యాసం ప్రచురిస్తూ ‘రాజు–రైతు’, ‘బంగారం–సింగారం’, ‘బుడుగు’, ‘మనవాళ్లు’ వంటి బొమ్మల సిరీస్‌లు ప్రఖ్యాతమైనవనీ; అప్పటికే రేఖ, శేషు, రంగ అనే పేర్లతో కూడా బాపు బొమ్మలేశారని పేర్కొన్నారు. ఇప్పుడైతే దాచుకోవడానికి సాంకేతిక విజ్ఞానపరమైన సౌలభ్యాలు చాలా ఉన్నాయి కానీ అప్పట్లో అంత సదుపాయంగా ఉండేది కాదు. కనుక బాపు వంటి ఆర్టిస్టు విస్తృతంగా చిత్రించిన కళాఖండాలు చూడాలంటే ఇప్పుడు కష్టమే.
1962 దాకా ఆయన వేసిన బొమ్మలు ‘బాపు ఆర్ట్ కలెక్షన్ డాట్ కామ్’ (bapuartcollection. com)లో లభ్యమౌతున్నాయి. ఆంధ్ర పత్రిక వీక్లీలో పలు రకాలుగా, పలు సైజుల్లో బాపు వేసిన బొమ్మలను సేకరించడం, పునర్ముద్రించడం కొంత కష్టమైన వ్యవహారమే. వారి కుటుంబ సభ్యులు రంగారావు సారథ్యంలో ఇటీవల కొన్ని అమూల్యమైన సంకలనాలు ప్రచురించారు. అందులో మొదటిది ‘ఎప్పుడూ ఇంతే’ పేరున 210 పేజీలతో వచ్చింది. ఇందులో ఆంధ్ర సచిత్ర వారపత్రికలో 1959 సెప్టెంబర్ 23 నుంచి 1962 జూన్ 29 సంచిక వరకు వెలువడిన బాపు, అలాగే వారి తమ్ముడు శంకర్ (శంకర నారాయణ) బొమ్మలు ఉన్నాయి.
ఇందులో ప్రచురించిన 125 ‘ఎప్పుడూ ఇంతే’ కార్టూన్లు శంకర్ పేరుతో ఉన్నా కేవలం కొన్ని వారాలు మాత్రమే శంకరనారాయణ వేశారు, మిగతా అన్నీ బాపు వేసినవే. సంకలనంలో కొన్ని పేజీలలో చందమామలో వేసిన కార్టూన్లు కూడా జోడించారు. ఈ బొమ్మలను జాగ్రత్తగా గమనిస్తే బాపు ఎంతగా చదివారో, ఎంతగా కష్టపడి సాధన చేశారో సులువుగా బోధపడుతుంది. అదే సమయంలో సామర్థ్యం ఉండి, సాధన చేయగలిగిన కళాకారుడికి ఊతంగా సంస్థలు ఎలా దోహదపడగలవో కూడా అర్థం చేసుకోవచ్చు. కేవలం 25 నయా పైసాల ఖర్చుతో 60 పేజీల వారపత్రిక రకరకాల ప్రయోజనకరమైన అంశాలతో అందుబాటులో ఉండేది. ఇప్పుడు టెక్నాలజీ పుష్కలంగా రావడంతో కళానైపుణ్యంతో పాటు కళాకారులను కూడా పూర్వపక్షం చేసింది. ఇప్పుడు 70, 75 ఏళ్ల వయస్సు ఉన్న వారందరికీ అప్పటి విషయాలు మహాద్భుతంగా స్మృతిపథంలో మెదులుతూ ఉంటాయి. ఆ ఫీల్ రావాలని బాపు కార్టూన్లున్న పేజీలను యథాతంగా స్కాన్ చేయించి ఈ పుస్తకంలో అందుబాటులోకి తెచ్చారు. చిత్రకళ, కార్టూన్లు, జర్నలిజం సంబంధించిన ధోరణుల పట్ల ఆసక్తి ఉన్నవారందరికీ ఈ సంకలనం దాచుకోదగ్గది.
-నాగసూరి వేణుగోపాల్
94407 32392
Updated Date - May 12 , 2025 | 04:57 AM