ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Bangladesh Election Crisis: బంగ్లాలో అనిశ్చితి

ABN, Publish Date - May 30 , 2025 | 05:34 AM

బంగ్లాదేశ్‌లో డిసెంబరులో ఎన్నికలు జరగాలంటూ బిఎన్‌పి చేపట్టిన ఆందోళనలు రాజకీయ సంక్షోభాన్ని సూచిస్తున్నాయి. తాత్కాలిక ప్రభుత్వం చర్యలపై బిఎన్‌పి తీవ్ర విమర్శలు చేస్తూ, వెంటనే ఎన్నికల రోడ్‌మ్యాప్‌ను ప్రకటించాలంటోంది.

న్నికలు డిసెంబరులోనే జరగాలంటూ ఖలీదాజియాకు చెందిన బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ (బిఎన్‌పి) బుధవారం నిర్వహించిన భారీ ప్రదర్శన అక్కడి రాజకీయ పరిస్థితులకు అద్దంపడుతోంది. బిఎన్‌పి కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఖలీదా కుమారుడు అయిన తారిఖ్‌ రహ్మాన్‌ లండన్‌ నుంచి ఒక వీడియోలింక్‌ ద్వారా వేలాదిమంది కార్యకర్తలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. గత పదినెలల కాలంలో మహ్మద్‌ యూనిస్‌ ప్రభుత్వాన్ని బిఎన్‌పి ఎన్నడూ ఇంతగా తప్పుబట్టలేదు. తాత్కాలిక ప్రభుత్వాలంటే ఓ మూడునెలల్లో ఎన్నికలు జరిపి, ప్రజలు ఎన్నుకున్నవారికి అధికారం అప్పగించాలే తప్ప, ఏళ్ళకు ఏళ్ళు దేశాన్ని పాలించవని ఆయన విమర్శించారు. ఎన్నికలతో సంబంధం లేకుండా అధికారాన్ని అనుభవిస్తున్నవారు విదేశాంగవిధానాన్ని ఎలా నిర్ణయిస్తారు, దేశభవిష్యత్తుతో ముడివడిన కీలక నిర్ణయాలు ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు. నోబెల్‌ విజేత మహ్మద్‌ యూనిస్‌కు పదవీకాంక్ష పట్టుకుందని, ఎన్నికల నిర్వహణను కుట్రపూరితంగా వాయిదావేస్తూ, అధికారాన్ని అనుభవిస్తున్నారన్న అర్థం వచ్చేలా తారీఖ్‌ వ్యాఖ్యలు చేశారు. డిసెంబరులో ఎన్నికలు జరపాలన్న ఈ డిమాండ్‌కు జవాబుగా, వచ్చే ఏడాది జూన్‌ లోపు గ్యారంటీ అంటూ టోక్యోలో ఉన్న యూనిస్‌ సమాధానం చెప్పారు. ఎవ్వరు ఏమనుకున్నా ఎన్నికలకు ఇంకొంత సమయం పడుతుందన్నది ఆయన వ్యాఖ్యల సారాంశం. డిల్లీకాదు, పిండి కాదు, బంగ్లాదేశ్‌కే ప్రాధాన్యం అంటూ ఈ ప్రసంగంలో తారిఖ్‌ రహ్మాన్‌ ఉద్ఘాటించడమే కాక, కార్యకర్తలతో పలుమార్లు నినాదాలు చేయించారు. న్యూఢిల్లీతో, రావల్పిండితో రాసుకుపూసుకోవడం కాక, బంగ్లాదేశ్‌ ప్రయోజనాలే తనకు ముఖ్యమని అర్థం. రేపు ఈ పార్టీ అధికారంలోకి వస్తే, ఆచరణ అలాగే ఉంటుందన్న నమ్మకం ఏ మాత్రం లేదు. పాకిస్థాన్‌తో ఖలీదాజియా కుటుంబానికి ఉన్న అనుబంధం తెలియనిదేమీ కాదు.


కానీ, తాత్కాలికంగా కుర్చీలో కూర్చున్న యూనిస్‌ కఠినమైన భారత వ్యతిరేకవైఖరి తీసుకొని, పాకిస్థాన్‌తో రాసుకుపూసుకు తిరుగుతున్న నేపథ్యంలో, ఆ విధానాన్ని ప్రశ్నిస్తూ, దేశానికి నష్టం జరుగుతోందని తారిఖ్ హెచ్చరించడం విశేషమైనదే. హసీనాను దేశం నుంచి వెళ్ళగొట్టి పదినెలలు అవుతున్నా ఇంకా ఎన్నికల దిశగా అడుగులుపడకపోవడం బిఎన్‌పికి ఆగ్రహం కలిగిస్తోంది. సమస్త వ్యవస్థలు కట్టకట్టుకొని అవామీలీగ్‌ మీద నిషేధం విధించి, ఎన్నికల్లో పాల్గొనకుండా చేసిన నేపథ్యంలో, తనకు ఇక ఎదురుండదన్న ధైర్యం బిఎన్‌పికి వచ్చింది. ఎన్నికలు వెంటనే జరిగితే తనకు ఘన విజయం ఖాయమన్న నమ్మకంతోపాటు, ఆలస్యమవుతున్న కొద్దీ కొత్తశక్తులు బలపడతాయన్న భయం దానిది. వెంటనే ఎన్నికల రోడ్‌మ్యాప్‌ ప్రకటిస్తేనే ప్రభుత్వానికి సహకరిస్తానని అది బెదిరిస్తోంది. హసీనా విధించిన నిషేధంనుంచి ఈ మధ్యనే బయటపడిన జమాతే ఇస్లామీ కూడా బిఎన్‌పి వాదనలనే బలపరుస్తోంది. హసీనామీద తిరుగుబాటుచేసిన విద్యార్థులంతా ఏర్పాటు చేసుకున్న జాతీయ నాగరిక్‌ పార్టీ (ఎన్సీపీ) మాత్రం ముందుగా స్థానిక సంస్థల ఎన్నికల కోసం పట్టుబడుతోంది. బిఎన్‌పిని ఈ యువకులంతా అణచివేతకు, నియంతృత్వానికీ మారుపేరుగా, మరో అవామీలీగ్‌గా అభివర్ణిస్తున్నారు. ఎన్నికలు జరిగేలోగానే సమస్తవ్యవస్థల ప్రక్షాళన పూర్తికావాలని, ఎన్నికల, రాజకీయ సంస్కరణలు సమూలంగా జరగాలని వీరు పట్టుబడుతున్నారు. మరోపక్క, దేశభద్రతకు సంబంధించిన కీలక నిర్ణయాలు మీరెలా తీసుకుంటారంటూ ఆర్మీచీఫ్‌ వకార్‌ కూడా యూనిస్‌ను ప్రశ్నిస్తున్నారు. ఆర్మీకీ, యూనిస్‌కు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకొని, ఒక దశలో సైన్యం తిరుగుబాటు అవకాశాలమీద విశ్లేషణలు కూడా వెలువడ్డాయి. రొహింగ్యాలకు మానవతాసాయం, చట్టోగ్రామ్‌ పోర్టు విదేశీ నిర్వహణ, ఎలాన్‌మస్క్‌ స్టార్‌లింక్‌కు అనుమతి ఇత్యాది విషయాల్లో ఈ ఘర్షణ ఇంకా పెరిగింది. హసీనాకు వ్యతిరేకంగా ఉద్యమించి, ఆమెను దేశం విడిచిపోయేట్టుగా చేసి, అమెరికా ఆదేశాలమేరకు యూనిస్‌ను తాత్కాలిక అధినేతగా ప్రకటించడం వరకూ మనకు కనిపించిన ఏకాభిప్రాయం ఇప్పుడు లేకుండా పోవడం విచిత్రం. హసీనాపార్టీని నిషేధించి, ఆ నాయకులను జైళ్ళలో కుక్కుతున్న నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో ఎన్నికలు ఎప్పుడు జరిగినా, అవి విస్తృత ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించబోవన్నది వాస్తవం.

Updated Date - May 30 , 2025 | 05:36 AM