Ashok Gajapathi Raju: విలువల రాజకీయానికి రోల్ మోడల్!
ABN, Publish Date - Jul 16 , 2025 | 01:18 AM
అశోక్ గజపతిరాజు గారు ఆధునిక రాజకీయాల్లో విలువలు, ఆదర్శ నాయకత్వానికి ప్రతీక.
అశోక్ గజపతిరాజు గారు ఆధునిక రాజకీయాల్లో విలువలు, ఆదర్శ నాయకత్వానికి ప్రతీక. జూన్ 26, 1951న జన్మించిన అశోక్ గజపతిరాజు గ్వాలియర్, హైదరాబాద్, విశాఖపట్నంలలో చదివారు. విద్యార్థి దశలోనే ప్రజా ఆందోళనల్లో పాల్గొన్నారు. పీవీజీ రాజుగా వాసికెక్కిన పూసపాటి విజయరామ గజపతిరాజు రెండో కుమారుడైన అశోక్ గజపతిరాజు 1978లో మొదటిసారి జనతా పార్టీ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తర్వాత 1982లో తెలుగుదేశం పార్టీ ఏర్పాటుతో ఎన్టీఆర్ పిలుపు మేరకు తెలుగుదేశంలో చేరారు. ఆయన ఏడుసార్లు ఎమ్మెల్యేగా, 2014లో ఒకసారి ఎంపీగా గెలిచారు. పదమూడు ఏళ్ల పాటు వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, శాసనసభ వ్యవహారాలు, ఆర్థిక, రెవెన్యూ వంటి పదవులు నిర్వహించారు. 2014–2018 వరకు కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రిగా పనిచేశారు. గోవా గవర్నర్‌గా ఇప్పుడు దక్కిన అరుదైన గౌరవానికి ఆయన అన్నివిధాలా అర్హుడు. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎక్కడా చిన్న మచ్చలేని సరైన వ్యక్తికి నేడు సరైన పదవి లభించింది.
ఆయన మితభాషి. మృదువైన వ్యక్తిత్వం కలవాడు. ప్రజల కోసం నిరంతరం పని చేసిన ఆదర్శవాది. పదవులకు అతీతంగా ప్రజల అభిమానాన్ని చూరగొన్న గొప్పనాయకుడు. అందరికీ అజాత శత్రువు. నేడు యువతరం, తెలుగుదేశం కార్యకర్తలు ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుంటే నిజమైన ప్రజాసేవకులుగా ఎదగగలుగుతారు. ఆయనకు ఈ పదవి దక్కడం ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో నిజాయితీకి, నిబద్ధతకు ప్రజాసేవకు, మానవతా విలువలకు దక్కిన గౌరవంగా చూడవచ్చు. ఆయన ఆదర్శ వ్యక్తిత్వమే ఆయనకు గవర్నర్ పదవి దక్కేలా చేసింది.
విజయనగరం రాజ కుటుంబానికి వారసుడిగా పేరున్న అశోక్ గజపతిరాజు తెలుగుదేశం పార్టీ స్థాపన కాలంలోనే పార్టీలో చేరారు. నాటి నుంచి నేటి దాకా పార్టీ పట్ల విధేయుడిగా నిలిచారు. పార్టీ సిద్ధాంతాలపట్ల అంకితభావంతో, నైతికతను కాపాడే విధంగా జీవితాన్ని కొనసాగించారు. ఎన్టీఆర్ గారికి అశోక్ గజపతిరాజుతో ప్రత్యేక అనుబంధం ఉంది. అశోక్ గజపతిరాజంటే ఎన్టీఆర్‌కు అమితమైన గౌరవం. నేడు అంతే సాన్నిహిత్యం ఆయనకు చంద్రబాబుతోనూ ఉంది. చంద్రబాబు కూడా రాజు గారి మాటకు విలువ ఇస్తారు. అశోక్ గజపతిరాజు రాజ కుటుంబంలో పుట్టినా ఆయనలో రాజరిక ధోరణి ఏ మాత్రం కనిపించదు. వేలాది ఎకరాల భూములతో సహా వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నప్పటికీ సాధారణ జీవితమే గడుపుతారు. రాజకీయాన్ని వ్యాపారంగా కాకుండా సేవా మార్గంగా చూసిన నేత. ఎన్టీఆర్‌ను ఆదర్శంగా తీసుకుని తెలుగుదేశం పార్టీ విలువలకు కట్టుబడి, చంద్రబాబు నాయుడుకి అత్యంత విశ్వాస పాత్రుడుగా నిలిచారు. రాజకీయంలో విలువలు, విశ్వసనీయత, పారదర్శకత ఎంత ముఖ్యమో తన జీవితంతో చూపించారు. పాలన అంటే ప్రజల సమస్యలకు పరిష్కారం అని నమ్మారు. తన నియోజకవర్గమైన విజయనగరం అభివృద్ధికి ఎనలేని కృషి చేయడమే కాక, దేశవ్యాప్తంగా విమానయాన రంగాన్ని అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు. విజయనగరం జిల్లాలో పేద విద్యార్థులకు ఆర్థిక సాయం, అనాథ ఆశ్రమాలకు భూదానం, రోగులకు ఉచిత వైద్య శిబిరాలు ఇలా ఎన్నో కార్యక్రమాలతో ప్రజలకు మానవతా విలువలతో సేవలందించారు. ప్రభుత్వ, ప్రజా అవసరాలకు అనుగుణంగా పెద్ద ఎత్తున భూములను ఉచితంగా ఇచ్చి ఉదారత చాటుకున్నారు. విదేశాల్లో రాజ కుటుంబానికి ఉన్న భూములు అక్కడ ప్రజలు, స్వచ్ఛంద సంస్థలకు అప్పగించారు. ఆయన అవినీతికి బద్ధ వ్యతిరేకి. పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తారు. పైలట్ అయి విమానాలను నడపాలని రాజు గారి కోరిక. కానీ 2014లో కేంద్ర విమానయానశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి విమానాలను నడిపించే స్థాయికి ఎదిగారు
గవర్నర్‌గా నియమించేందుకు అశోక్ గజపతిరాజు గారికి మోదీ కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. కానీ సిగ్నల్స్ లేక ఫోన్ కలవలేదు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి కార్యాలయం నుంచి వచ్చిన ఫోన్ కూడా కలవలేదు. చివరకు సింహాచలం అప్పన్న ఆలయంలో గిరి ప్రదక్షిణ చేస్తున్న సమయంలో నాకు ఫోన్ చెయ్యగా నేను వారి సతీమణి నంబరు ఇచ్చాను. ఆ నంబరుకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేసి మాట్లాడారు. మిమ్మల్ని గవర్నర్‌గా నియమించాలని నిర్ణయించామని, అందుకు మీరు అంగీకరించాలని కోరగా అశోక్ గజపతిరాజు ఐదు నిమిషాల్లో చెబుతానంటూ ఫోన్ పెట్టేసి, తర్వాత ఈ విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబుకు తెలియజేసిన తర్వాతనే తన అంగీకారాన్ని ప్రధానమంత్రికి తెలియచేశారు. ఆయన ఎంతటి నిబద్ధత గల, ఆదర్శవంతమైన నాయకుడో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆయన పదవుల కోసం ఏనాడూ పరితపించలేదు. 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నా చేత దగ్గర ఉండి నామినేషన్ వేయించి నా గెలుపునకు విశేష కృషి చేశారు. మండుటెండలోనూ గ్రామాల్లో ప్రచారం చేసి నన్ను గెలిపించడంతో పాటు, విజయనగరం జిల్లాలో తెలుగుదేశం క్లీన్ స్వీప్ చెయ్యడానికి కృషి చేసారు. ఏది ఏమైనా అశోక్ గజపతి రాజును గవర్నర్ పదవి వరించడం అభినందనీయం. గోవా గవర్నర్ పదవి చేపట్టబోతున్న అశోక్ గజపతిరాజు గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు.
-కలిశెట్టి అప్పలనాయుడు,
విజయనగరం పార్లమెంట్ సభ్యులు
Updated Date - Jul 16 , 2025 | 01:18 AM