Banjara community: మీ గిరిజన ప్రేమలు పైపై ప్రకటనలకేనా
ABN, Publish Date - Aug 13 , 2025 | 04:47 AM
బంజారాలు సింధు నాగరికత కాలం నుంచి జీవిస్తూ వస్తున్న ప్రత్యేక, ప్రాచీన గిరిజన తెగ. ఆది నుంచీ బంజారాలు స్థిర నివాసాల వైపు..
బంజారాలు సింధు నాగరికత కాలం నుంచి జీవిస్తూ వస్తున్న ప్రత్యేక, ప్రాచీన గిరిజన తెగ. ఆది నుంచీ బంజారాలు స్థిర నివాసాల వైపు మొగ్గు చూపకుండా, గోవులలో సకల దేవతలు కొలువై ఉంటారని వాటిని తమ జీవనాధారంగా చేసుకున్నారు. దారులు లేని కష్టకాలంలో, తామే మార్గాలు అన్వేషించి దారులు ఏర్పరచుకుంటూ, 18 శతాబ్దం వరకు సంచారకులుగా దేశవ్యాప్తంగా విస్తరించారు. ప్రాంతాలవారీగా సరఫరా చేసిన ధాన్యాలు, సరుకులు, వస్తువులు, సిపాయిలకు ఆయుధాలు... తదితరాల ఆధారంగా బంజారాల పేరుకు ముందుగా సుగాలి, లంబాడీ, లాబానా, బాజిగర్, ధన్కుడి... విదేశాల్లో రోమా, జిప్సీ వంటి అనేక పేర్లు వాడుకలోకి వచ్చాయి. బలమైన బంజారాల రవాణా వ్యవస్థను ఆంగ్లేయులు ధ్వంసం చేయడంతో మైదాన ప్రాంతాలలో తండాల పేరుతో స్థిర నివాసాలకు అలవాటుపడ్డారు. వారి విలక్షణమైన సాంస్కృతిక వారసత్వ సంపద మూలాలు క్రమంగా వారి శాశ్వత సంస్కృతీ సంప్రదాయాలుగా మారి నేటికీ నిలిచి ప్రతిబింబిస్తున్నాయి. బంజారా భాష అక్షరబద్ధం కాకపోవటం వల్ల బంజారాలు దేశ రక్షణ, పురోగతిలోను చేసిన ఎనలేని సేవలు, కృషి, త్యాగాలు, వారి గొప్ప ఇతిహాసం... ఇవేవీ భారత దేశ చారిత్రక గ్రంథాల్లో లిఖితపూర్వక చరిత్రగా రాయబడలేదు. ఈ కారణంగా అవగాహన రాహిత్యంతో స్వార్థపరులు బంజారాలపై అనేక ఆరోపణలు చేస్తున్నారు.
ఈ ఆదిమ బంజారాలు భారతదేశ స్వాతంత్ర్యానికి ముందే గిరిజనులుగా గుర్తింపు పొందిన ఆధారాలు ఉన్నాయి. 1871లో బ్రిటిష్ పాలకులు అనేక తెగలతో పాటు బంజారాలను క్రిమినల్ ట్రైబల్స్ జాబితాలో చేర్చారు. 1931లో నిజాం రాజులు చేపట్టిన కులగణనలో బంజారాలను గిరిజనుల పట్టికలో చూపించారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో ఆంధ్ర, తెలంగాణ ప్రాంతం కలిసి 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు, ఆంధ్ర ప్రాంతంలోని లంబాడీలు, సుగాలీలను భారత పార్లమెంటు ఉభయసభల ఆమోదంతో ‘ద షెడ్యూల్డ్ క్యాస్ట్స్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ లిస్ట్స్ (మోడిఫికేషన్) ఆర్డర్–1956’ ప్రకారం గిరిజనులుగా గుర్తింపు పొంది, గిరిజన జాబితాలో సీరియల్ నంబర్ 19గా చేర్చబడ్డారు. అయితే ఒకే రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన లంబాడీలను గిరిజన జాబితాలో చేర్చకపోవడం కాంగ్రెస్ పార్టీ చేసిన ఘోరమైన అన్యాయం. తెలంగాణ ప్రాంత లంబాడీలు, ఇంకా ఇలాగే అన్యాయం జరిగిన ఇతర రాష్ట్రాలలోని అర్హులైన గిరిజనుల నిరంతర పోరాటం తర్వాత 1969లో అనిల్ కే చందా అధ్యక్షతన వేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ రిపోర్ట్ ఆధారంగా నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం భారత పార్లమెంటు ఉభయ సభల ఆమోదంతో ‘ద షెడ్యూల్డ్ క్యాస్ట్స్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ (సవరణ) యాక్ట్– 1976 (Act No. 108 of 1976)’, తేదీ: సెప్టెంబర్ 19, 1976 చట్టం చేసి, తెలంగాణ ప్రాంతానికి చెందిన లంబాడీలను గిరిజన జాబితాలో క్రమ సంఖ్య 29లో చేర్చారు. 2003లో ‘ద షెడ్యూల్డ్ క్యాస్ట్స్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఆర్డర్స్ (సవరణ) యాక్ట్ 2002 (Act No.10 of 2003), తేదీ: జనవరి 7, 2003 ద్వారా బంజారా తెగను గిరిజన జాబితాలోని క్రమ సంఖ్య 29లో ఉన్న లంబాడీలు, సుగాలిల తర్వాత చేర్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం–2014, నం.6 of 2014, తేదీ: మార్చి 07, 2014, పార్ట్ XXV ద్వారా తెలంగాణలో 32 గిరిజన తెగలు మిగలగా క్రమ సంఖ్య 28లో సుగాలిలు, లంబాడీలు, బంజారాలు గిరిజనులుగా నూతనంగా ఏర్పడిన రెండు రాష్ట్రాలలో కొనసాగుతారని చెబుతూ ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.
ప్రధాని మోదీ అక్టోబర్ 5, 2024న మహారాష్ట్ర, యావత్‌మాల్ జిల్లాలోని పౌహ్రదేవిలో నిర్వహించిన బంజారాల విరాసత్ పరిరక్షణ సభలో పాల్గొన్నారు. శ్రీహాతి రాం బావాజీ, సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్, వీర యోధుడు లక్కీసా బంజారాలను గిరిజనులుగా గుర్తు చేస్తూ, వేల సంవత్సరాల బంజారాల ఇతిహాసాన్ని ప్రపంచానికి చాటారు. 341 ఆర్టికల్ అనుసరించి చట్టబద్ధంగా రాజ్యాంగంలో చేరిన లంబాడీలు, సుగాలీలు, బంజారాలను గిరిజనుల జాబితాలో తాము చేర్చామంటూ జాతీయ కాంగ్రెస్ ఆనాటి నుంచీ లంబాడీల ఓట్లు పొందుతున్నది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గత శాసనసభ ఎన్నికల్లో లంబాడీల ఓట్లతోనే తాను గద్దెనెక్కానని అనేక సభలలో ప్రకటించారు. కానీ 2017లో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ప్రాంతంలో హింసాత్మక ఘటనలకు కారకులైన సోయం బాపూరావు, తెల్లం వెంకట్రావులను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకున్నారు. వీరు లంబాడీలను గిరిజన జాబితా నుంచి తొలగించాలని 24–7–2025న సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ (నెం.40271/2025) దాఖలు చేశారు. వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల ప్రకారమే సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారా? అన్న విషయంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వివరణ ఇవ్వాలి. లేకపోతే, ఇటీవల లగచర్ల భూముల పేరిట లంబాడీలను లక్ష్యంగా చేసుకున్న విధానాలే కాకుండా, రాబోయే స్థానిక ఎన్నికల్లో లంబాడీల ఓట్లు పొందాలనే ఉద్దేశంతోనే భయానక వాతావరణం సృష్టించి లొంగతీసుకోవాలని కాంగ్రెస్ కుట్ర చేస్తున్నట్టు భావించాల్సి వస్తుంది.
-అజ్మీరా సీతారాం నాయక్ లోక్‌సభ మాజీ సభ్యులు,
మహబూబాబాద్
Updated Date - Aug 13 , 2025 | 04:47 AM