ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Ethical Politics: నైతిక రాజకీయాలు ఎండమావులేనా

ABN, Publish Date - Aug 13 , 2025 | 05:01 AM

ప్రతిపక్షాలకు ప్రజాస్వామిక సంస్థలంటే విశ్వాసం లేదు. పార్లమెంటు సమావేశాలు కొనసాగించడం వారికి ఇష్టం లేదు. పార్లమెంటు..

ప్రతిపక్షాలకు ప్రజాస్వామిక సంస్థలంటే విశ్వాసం లేదు. పార్లమెంటు సమావేశాలు కొనసాగించడం వారికి ఇష్టం లేదు. పార్లమెంటు ముఖ్యమైన సమయాన్ని ప్రతి రోజూ వృథా చేయడాన్ని మేము ఇక అనుమతించబోం.. ముఖ్యమైన బిల్లులను ఆమోదించి తీరుతాం..’ అని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. సోమ, మంగళవారాల్లో పార్లమెంటు పెద్దగా చర్చ లేకుండా దాదాపు పది బిల్లులను ఆమోదించింది. జూలై 21న ప్రారంభమైన పార్లమెంటు సమావేశాలు ప్రతిపక్షాల నిరసన ధ్వనుల మధ్య ఒకటి రెండు రోజులు తప్ప పెద్దగా సాగలేదు.

ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలపై చర్చ జరిపించడం ఏ ప్రభుత్వానికీ ఇష్టం ఉండదు. గతంలో కూడా బోఫోర్స్ నుంచి 2జీ వరకు అనేక కుంభకోణాలపై ప్రతిపక్షాలు తీవ్ర గందరగోళం సృష్టించాయి. రోజుల తరబడి పార్లమెంటు సమావేశాలకు అంతరాయం కలిగించాయి. ‘ప్రభుత్వం జవాబుదారీగా వ్యవహరించనప్పుడు పార్లమెంటుకు అంతరాయం కలిగించడం ప్రతిపక్షాల చట్టబద్ధమైన హక్కు’ అని యూపీఏ హయాంలో ప్రతిపక్ష నేతగా ఉన్న అరుణ్ జైట్లీ అన్నారు. ‘పార్లమెంటును సాగనివ్వకపోవడం కూడా ప్రజాస్వామ్యంలో భాగమే’ అని లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న సుష్మా స్వరాజ్ కూడా చెప్పారు. పార్లమెంటు సమావేశాలు ఒకప్పుడు ఎంతో ఆసక్తి కలిగించేవి. అటల్ బిహారీ వాజపేయి, ఇంద్రజిత్ గుప్తా, చంద్రశేఖర్, సోమనాథ్ ఛటర్జీ లాంటి వారు మాట్లాడుతుంటే మీడియా గ్యాలరీలతో పాటు అతిథుల గ్యాలరీలు కూడా కిక్కిరిసిపోయేవి. కానీ ఇప్పుడు గ్యాలరీలేకాదు సభలు కూడా వెలవెలబోతున్నాయి. ఈ వర్షాకాల సమావేశాల్లో ఆపరేషన్ సిందూర్‌పై తప్ప ఏ అంశంపైనా చర్చ జరగలేదు. ఈ చర్చలో కూడా ప్రతిపక్ష నేతలు ఆవేశంతో ప్రశ్నలు వేసినప్పటికీ అన్నీ ఒకే మాదిరిగా ఉన్నాయి. ఆ ప్రశ్నలకు కూడా సరైన సమాధానాలు రాలేదు. భారత సైనిక దళాలు వీరోచితంగా నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత పార్లమెంటులో ప్రభుత్వం ఏ జవాబు చెబుతుందా అని ప్రతిపక్షాలే కాదు, ప్రజలు కూడా ఎదురు చూశారు. కానీ రెండు రోజుల సుదీర్ఘ చర్చ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ సుదీర్ఘ ప్రసంగం తర్వాత కూడా అనేక ప్రశ్నలకు జవాబులు లభించకుండా మిగిలిపోయాయి. ముఖ్యంగా పహల్గామ్ సంఘటనకు దారి తీసిన భద్రతా వైఫల్యం నుంచి ఆపరేషన్ ఉన్నట్లుండి 88 గంటల్లో ముగిసిన తీరు, భారత్ పాక్‌కు బుద్ధి చెప్పే పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కాల్పుల విరమణకు అంగీకరించడం, పాక్ పట్ల అమెరికా స్నేహంగా వ్యవహరించడం, సంఘటనకు కారకులైన ఉగ్రవాదుల ఆచూకీ, విదేశాంగ విధానం గురించి ప్రజల్లోను, ప్రతిపక్షాల్లోనూ ఉన్న ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు రాలేదు. అధికార పార్టీ నేతలు ఇచ్చిన ప్రసంగాల్లో పహల్గామ్ కంటే నెహ్రూ, ఇందిరాగాంధీ పేర్లే అనేకసార్లు దొర్లాయి. నెహ్రూ, ఇందిరాగాంధీ హయాంలో చాలా పొరపాట్లు జరిగి ఉండవచ్చు కానీ వాటినే చర్విత చర్వణం చేయడం వల్ల సాధించేదేముంటుంది?

పహల్గామ్ సంఘటన సరే, బిహార్‌లో ఎస్ఐఆర్‌ పేరిట జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ గురించి ప్రతిపక్షాలు తీవ్ర గందరగోళం సృష్టిస్తున్నప్పటికీ దానిపై మాట్లాడేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఎస్ఐఆర్‌పై గందరగోళం జరుగుతున్న సమయంలోనే ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ దేశంలో ఓట్ల చోరీ జరుగుతోందని ఆరోపించారు. గత పార్లమెంటు ఎన్నికల్లో కర్ణాటకలో ఒక అసెంబ్లీ నియోజకవర్గంలోనే లక్షకు పైగా బోగస్ ఓట్ల పోలింగ్ జరిగిందని ఆయన సాక్ష్యాధారాలతో బయటపెట్టారు. దేశంలో ఎన్నికల కమిషన్ బీజేపీని గెలిపించేందుకు చేసే ప్రయత్నాల్లో భాగంగానే ఈ ఓట్ల చోరీ జరుగుతోందనే అభిప్రాయాన్ని ఆయన ప్రజల్లో బలంగా ఏర్పరిచేందుకు ప్రయత్నించారు. ఎస్ఐఆర్‌ పైనే కాదు, ఓట్ల చోరీపై కూడా ఉభయ సభల్లో ప్రతిపక్షాలు వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టి చర్చను డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలను తిప్పిగొట్టగలమన్న విశ్వాసం ఉంటే ఏ ఒక్క అంశంపైనైనా చర్చకు అంగీకరించి ప్రభుత్వం వారి ఆరోపణలు తప్పని చెప్పేందుకు ఆస్కారం ఉన్నది. నిజానికి ఓట్లను తొలగించడం, బోగస్ ఓటర్లను చేర్చడం అనేది ఎన్నికల వ్యవస్థకు చెదలు పట్టేలా చేస్తోంది. ‘నా నియోజకవర్గంలో కూడా 3.5 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించారు. మా బంధువుల ఓట్లు కూడా లేకుండా పోయాయి’ అని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి సైతం అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా తన కొడంగల్ నియోజకవర్గంలో 15వేల ఓట్లు గల్లంతైన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. వీటిపై ప్రభుత్వం పార్లమెంటులో చర్చించి ఎన్నికల సంస్కరణలపై ప్రతిపక్షాలతో కలిసి ఏకాభిప్రాయం తెచ్చేందుకు ప్రయత్నిస్తే కాదనేవారెవరు ఉన్నారు? అతి పెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత దేశంలో కూడా కెన్యా, మొజాంబిక్ లాంటి దేశాల్లో లాగా అక్రమాలు చేసి ఎన్నికల్లో విజయం సాధిస్తున్నారనే అభిప్రాయం ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడడం మంచిదా?

పార్లమెంటును సాగనివ్వకపోవడం వల్ల ప్రతిపక్షాలకు ప్రయోజనం లభిస్తుందా? చాలాసార్లు లభించకపోవచ్చు. కానీ ప్రభుత్వం కీలకమైన ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు నిరాకరిస్తున్నదని ప్రజలు భావిస్తే ప్రతిపక్షాల ప్రశ్నలకు కూడా ఆమోదయోగ్యత లభిస్తుంది. ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న ప్రశ్నలు ప్రజల్లో కూడా కలిగితే పార్లమెంటును వాయిదా వేసినా ప్రభుత్వం ప్రజా కోర్టులో జవాబుచెప్పలేని పరిస్థితిలో పడుతుంది. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించినప్పుడు పార్లమెంటులో ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలను జైలులో నిర్బంధించారు. కానీ ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆమె పరాజయం పాలయ్యారు. గతంలో బోఫోర్స్ విషయంలోను, 2జీ కుంభకోణం విషయంలోనూ పార్లమెంటులో ప్రభుత్వం జవాబులు చెప్పకుండా తప్పించుకుని ఉండవచ్చు. కానీ ప్రజలు జవాబుదారీ ప్రభుత్వాన్ని ఆశించినందువల్ల నరేంద్రమోదీ ప్రభుత్వానికి పట్టం కట్టారు.

ప్రస్తుతం దేశంలో ఆ పరిస్థితి ఏర్పడుతోందా? అని చెప్పడం కష్టం. ప్రభుత్వం కానీ వ్యవస్థలు కానీ జవాబులు చెప్పలేని పరిస్థితిలో పడుతోందని మాత్రం అనిపిస్తోంది. నిజానికి పార్లమెంటు కంటే బయట జరుగుతున్న పరిణామాలు చాలా ఆసక్తి కలిగిస్తాయి. ప్రతిరోజూ పార్లమెంటు ఆవరణలో ప్రతిపక్షాలు నిర్వహిస్తున్న నిరసన ప్రదర్శనలు, ఎన్నికల కమిషన్‌కు ఊరేగింపుగా వెళ్ళి అనేకమంది అరెస్టు కావడం వంటి సంఘటనలు ఒక ఎత్తు అయితే రాహుల్ నివాసంలో జరిగిన విందుకు మొత్తం ప్రతిపక్ష పార్టీల అగ్రనేతలు అందరూ హాజరు కావడం మరొక ఎత్తు. దేశంలో ప్రతిపక్ష పార్టీలన్నీ సంఘటితం కావడమే కాదు, రాహుల్ వారి నేతగా ఆవిర్భవించడం భారత రాజకీయాల్లో జరిగిన కీలక పరిణామం. ఇటీవలి కాలం వరకూ రాహుల్ నాయకత్వంపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. ఇప్పుడు ఆ ప్రశ్నలు చెరిగిపోతున్నాయి. అయితే అంత మాత్రాన రాహుల్ మోదీకి ప్రత్యామ్నాయ నేతగా మారారా అన్నది ఇప్పుడే చెప్పడం కష్టం. సార్వత్రక ఎన్నికలు ఇప్పట్లో లేవు. ఈ ఏడాది నవంబర్‌లో జరిగే బిహార్ ఎన్నికల్లో సంఘటితంగా పోరాడినప్పటికీ అధికారంలోకి రాగలరా అన్న విషయం కూడా ఇప్పుడే చెప్పలేం. అక్కడ ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జన సురాజ్ పార్టీ, చిరాగ్ పాశ్వాన్ లోక్‌జనశక్తికి వస్తున్న ప్రతిస్పందన ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అవకాశాలు లేకపోలేదు. బిహార్ మాత్రమే కాదు వచ్చే ఏడాది జరిగే తమిళనాడు, కేరళ, అస్సాం, పశ్చిమబెంగాల్ ఎన్నికలు ప్రతిపక్షాల సత్తాకు ఒక అగ్నిపరీక్ష. రాహల్, ఆయన మిత్రపక్షాలు సంఘటితంగా సార్వత్రక ఎన్నికల వరకూ నిలదొక్కుకునేందుకు ఎంతో పోరాడాల్సిన అవసరం ఉన్నది. ఈ లోపు ఆయన లేవనెత్తుతున్న ఎన్నికల అక్రమాలపై ప్రజాభిప్రాయాన్ని పూర్తిగా తన వైపునకు తిప్పుకోగలరా అన్నది వేచి చూడాలి.

రాహుల్, ఆయన మిత్రపక్షాలు చేయాల్సింది దీర్ఘకాలిక పోరాటమైనా అది నరేంద్రమోదీ పైనే. అయితే నరేంద్రమోదీ కేవలం రాహుల్ సేనను మాత్రమే కాదు. ఇంటా, బయటా, ఇతరత్రా కూడా ఎన్నో రకాలుగా పోరాడాల్సి ఉన్నది. పార్లమెంటులో ప్రశ్నల్ని తప్పించుకున్నప్పటికీ ఆయన పార్లమెంటు బయట కూడా అనేక శక్తుల్ని ఎదుర్కోవాల్సి ఉన్నది. ఇప్పటి వరకూ ఆయన ‘వన్ మాన్ ఆర్మీ’ లాగా పోరాడారు. ఏ ఎన్నికైనా మోదీ పేరుతోనే గెలువగలమనే ధైర్యాన్ని పార్టీ నేతలకు ఇచ్చారు. కానీ గత లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆ అభిప్రాయం క్రమంగా సడలిపోతోంది. ఈ ఎన్నికల్లో 400 సీట్లు సాధిస్తామన్న వ్యక్తి 240 సీట్లకు పరిమితమయ్యారు. మిత్రపక్షాలపై ఆధారపడి ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వచ్చింది. మహారాష్ట్ర, హరియాణా ఎన్నికల్లో గెలిచినప్పటికీ ఆ విజయాలకు పూర్తి ఘనత తనదేనన్న నమ్మకం ఆయన కలిగించలేకపోయారు. రాష్ట్రీయ స్వయం సేవక్ బీజేపీ గెలిచేందుకు గట్టి ప్రయత్నాలు చేయడం ఒక ఎత్తు అయితే ఈ గెలుపుపై అనుమానాలు రేకెత్తించడంలో ప్రతిపక్షాలు సఫలీకృతం కావడం మరొక ఎత్తు. పహల్గామ్ సంఘటన, ఆ తదనంతర పరిణామాలు, విదేశాంగ విధానంపై జరుగుతున్న చర్చలు, ట్రంప్ స్థిమితం లేనట్లుగా పాల్పడుతున్న చర్యలు ఎందుకో జాతీయ స్థాయిలో పరిస్థితి అంత సవ్యంగా లేనట్లు అభిప్రాయం కలిగిస్తోంది. 2014లో అఖండమైన విజయం సాధించి వారణాసిలో గంగాహారతిలో పాల్గొన్న మోదీకి ఇప్పటి మోదీకి మధ్య ఏదో తేడా కనిపిస్తోంది. భారత రాజకీయాల్లో నైతికత అనేది ప్రధానం. భారతీయ ధర్మాన్ని, సంస్కృతిని పాటించేవారు ఈ నైతికతకు, సత్యశీలతకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. రాజకీయాల్లో గమ్యం మాత్రమే కాదు దారి కూడా సవ్యంగా ఉన్నప్పుడే వాటికి విలువ ఉంటుంది.

- ఎ. కృష్ణారావు (ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - Aug 13 , 2025 | 05:01 AM