ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Andhra Pradesh investments: ప్రాజెక్టుల పల్లకీలో ఆంధ్రప్రదేశ్

ABN, Publish Date - Jul 30 , 2025 | 01:18 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మరోసారి పారిశ్రామిక వికాసానికి దిశానిర్దేశం చేస్తూ, పెట్టుబడులను ఆకర్షించే హబ్‌గా తనను తాను నిలబెట్టుకుంటోంది. 2024 జూలై నుంచి 2025 మే వరకు జరిగిన...

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మరోసారి పారిశ్రామిక వికాసానికి దిశానిర్దేశం చేస్తూ, పెట్టుబడులను ఆకర్షించే హబ్‌గా తనను తాను నిలబెట్టుకుంటోంది. 2024 జూలై నుంచి 2025 మే వరకు జరిగిన పెట్టుబడి ప్రోత్సాహక మండలి ఏడు సమావేశాల్లో మొత్తం రూ.5.74 లక్షల కోట్ల విలువైన 109 ప్రాజెక్టులకు ఆమోదం తెలపడం ద్వారా ఆ దిశగా కీలకమైన అడుగులు పడ్డాయి. ఈ పెట్టుబడుల ద్వారా 5,05,968 ఉద్యోగాల కల్పనతో యువత భవిష్యత్తు మార్చబోతున్నది. ఇవి కేవలం గణాంకాలుగా మాత్రమే కాకుండా, ఆంధ్రప్రదేశ్ యువత ఆశల ప్రతిబింబంగా, ప్రాంతీయ సమతుల అభివృద్ధికి, వికేంద్రీకరణకు బలమైన ఆధారంగా మారబోతున్నాయి. పరిశ్రమల విస్తరణ పట్ల ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యం ఈ ఆమోదిత ప్రాజెక్టుల పరిశీలనలో చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. ఆర్సెలర్ మిట్టల్, భారత్ పెట్రోలియం, ప్రీమియర్ ఎనర్జీస్, డిక్సన్ టెక్నాలజీస్, బ్లూ జెట్ హెల్త్‌కేర్, మహామాయా స్టీల్ వంటి ప్రముఖ కంపెనీలు రాష్ట్రంలో పరిశ్రమలను స్థాపించేందుకు ముందుకు వచ్చాయి. ఈ ప్రాజెక్టులు ఖనిజాల నుంచి ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, స్టీల్, రసాయనాలు, ఆటోమొబైల్స్ వరకూ విస్తరించి ఉన్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్‌ను పరిశ్రమల కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని సూచిస్తోంది. ముఖ్యంగా శ్రీ సిటీ, విశాఖపట్నం, తిరుపతి, కడప వంటి ఇండస్ట్రియల్ హబ్స్ మరింత బలపడనున్నాయి. కూటమి ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీ రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదించిన ప్రాజెక్టుల్లో గణనీయమైన వాటా సోలార్, విండ్, హైబ్రిడ్ పవర్ ప్రాజెక్టులదే. గ్రీన్‌కో, టాటా పవర్, బొండాడ ఇంజినీరింగ్, చింతా గ్రీన్ ఎనర్జీ, రీన్యూవిక్రమ్ శక్తి వంటి కంపెనీలు రాష్ట్రంలోని కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప జిల్లాల్లో భారీ స్థాయిలో పునరుత్పాదక విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాయి.

ఈ ప్రాజెక్టులు 1000 మెగావాట్లకు పైగా విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నాయి. పర్యావరణ హితం, నిర్బంధ విద్యుత్ సరఫరా, జాతీయ ‘నెట్-జీరో’ పొల్యూషన్ లక్ష్యం వైపు రాష్ట్రాన్ని తీసుకెళ్లే ఈ ప్రాజెక్టులు, ఆర్థికంగా కూడా స్థానిక ఉపాధి అవకాశాలకు మార్గం వేస్తున్నాయి. పెట్టుబడి ప్రోత్సాహక మండలి అనుమతులతో సాంకేతిక రంగంలో సైతం రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతున్నది. విశాఖపట్నం, శ్రీ సిటీ, తిరుపతి వంటి ప్రాంతాల్లో టీసీఎస్, డైకిన్, సెన్సోరెమ్, ఉర్సా క్లస్టర్స్ వంటి కంపెనీలు తమ ఐటీ కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రానికి సాంకేతిక పరిజ్ఞానం త్వరితగతిన అందనుంది. ఈ రంగంలోనే సుమారు 20,000కి పైగా ఉద్యోగావకాశాలు రానున్నాయి. ఇది హైస్కిల్ సెగ్మెంట్లకు మద్దతుగా మారబోతోంది. అదే విధంగా, పర్యాటక రంగంలో మయ్‌ఫెయిర్, ఓబెరాయ్, వరుణ్ హాస్పిటాలిటీ వంటి ప్రముఖ సంస్థలు విలాసవంతమైన హోటల్స్, రిసార్ట్‌లు ఏర్పాటు చేయనుండడం పర్యాటకాభివృద్ధికి నాంది పలికే అంశం. దీంతో రాష్ట్రానికి అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకునే అవకాశాలు మరింత పెరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి అనుమతించిన ప్రాజెక్టుల్లో ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే ఇవి కేవలం మెట్రో నగరాలకు మాత్రమే పరిమితం కాకుండా జిల్లా స్థాయిలోనూ సమానంగా వ్యాప్తి చెందనున్నాయి. కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, విశాఖపట్నం, తూర్పుగోదావరి, కడప, తిరుపతి, శ్రీ సిటీ వంటి అనేక జిల్లాల్లో ప్రాజెక్టులు అమలయ్యేలా నూతన పెట్టుబడులు సమానంగా పంపిణీ అయ్యాయి.

ఇది రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి అవకాశాలను సమానంగా పెంచే దిశగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. పరిశ్రమలు, విద్యుత్, టూరిజం, ఐటీ వంటి విభిన్న రంగాల్లో ఈ సమతుల్యత గమనించదగిన అంశం. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని కలిగించేలా వేగవంతమైన, పారదర్శక నిర్ణయాలను తీసుకుంటోంది. ముఖ్యంగా ఎస్ఐపీబీ ద్వారా పెట్టుబడి ప్రతిపాదనలను పరిశీలించి, వేగంగా ఆమోదించేందుకు ఒక సమర్థవంతమైన వ్యవస్థను అమలుచేస్తోంది. ‘సింగిల్ విండో’ విధానాన్ని మరింత బలోపేతం చేస్తూ, అనుమతుల ప్రక్రియను సమర్థవంతం చేయడమే కాకుండా, నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం పర్యవేక్షించే విధంగా వ్యవస్థను రూపొందిస్తోంది. పారిశ్రామిక భూముల కేటాయింపు, విద్యుత్, నీటి సరఫరా వంటి మౌలిక వసతుల అందుబాటును సులభతరం చేస్తూ పెట్టుబడిదారులకు ఎలాంటి జాప్యం లేకుండా సేవలు అందించాలన్న దిశగా చర్యలు చేపడుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రం పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుతున్నదంటే, అది శాశ్వత అభివృద్ధికి అంకురార్పణ అనే చెప్పాలి. ఈ ప్రాజెక్టులు అమలయ్యే కొద్దీ, ‘ఆత్మనిర్భర ఆంధ్రప్రదేశ్’ కల సాకారమవుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పెట్టుబడుల ఆకర్షణ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఈర్ష్య కలిగించే విధంగా ఉందన్నది సుస్పష్టం. ఆయన దూరదృష్టి, సాంకేతికతపై నమ్మకం, పారదర్శక పరిపాలన, వేగవంతమైన ఫైల్ క్లియరెన్స్ విధానాలు ఆయన పాలన అనుభవానికి అద్దం పడుతున్నాయి. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే అనువైన విధానాలే గాక, ప్రభుత్వ తీరు కూడా కీలక అంశం. చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకుని పాలసీ స్థాయిలో క్లారిటీ ఇవ్వడమే కాకుండా పార్టీ నాయకులు వివాదాలకు దూరంగా ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫారిన్ డెలిగేషన్లు, సీఈఓ మీటింగ్స్, పెట్టుబడి సదస్సుల నిర్వహణలో ఆయన ప్రత్యక్షంగా పాల్గొనడం ద్వారా పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంపొందిస్తున్నారు. ఆయన దృఢ సంకల్పం, పాలసీ స్పష్టత, పరిపాలనా ప్రతిభ రాష్ట్రాన్ని ప్రాజెక్టుల పల్లకిలా తయారు చేయడమే కాకుండా రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తును కొత్త మలుపు తిప్పుతుందనటంలో ఆశ్చర్యం లేదు.

గుమ్మడి ప్రభాకర్

మీడియా కో-ఆర్డినేటర్, ముఖ్యమంత్రి కార్యాలయం

ఈ వార్తలు కూడా చదవండి

సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట

హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 30 , 2025 | 01:18 AM