ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Airport Infrastructure: రాష్ట్రానికి విదేశీ విమాన సర్వీసులు ఏవీ

ABN, Publish Date - Jul 02 , 2025 | 02:59 AM

రాష్ట్రం విడిపోయి పదకొండేళ్ళు అవుతున్నా గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి గాని, ఎప్పుడో అంతర్జాతీయ హోదా ఉన్న విశాఖపట్నం విమానాశ్రయానికి గాని, తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి గాని కనీసం ఒక్క డైలీ ఇంటర్నేషనల్ ఫ్లైట్ సర్వీస్ తెచ్చుకోలేకపోయాం.

రాష్ట్రం విడిపోయి పదకొండేళ్ళు అవుతున్నా గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి గాని, ఎప్పుడో అంతర్జాతీయ హోదా ఉన్న విశాఖపట్నం విమానాశ్రయానికి గాని, తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి గాని కనీసం ఒక్క డైలీ ఇంటర్నేషనల్ ఫ్లైట్ సర్వీస్ తెచ్చుకోలేకపోయాం. రాష్ట్ర రాజధానికి ముఖద్వారంగా ఉండాల్సిన విజయవాడ ఎయిర్‌పోర్ట్‌కి ఒకే ఒక్క అంతర్జాతీయ విమానం, అది కూడా వారానికి రెండు సార్లు మాత్రమే వస్తుంది. అది కూడా ఎప్పుడు లేట్ అవుతుందో, ఎప్పుడు కేన్సిల్ అవుతుందో తెలియని పరిస్థితి. 2003 వరకు మన దేశంలో ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ అంతర్జాతీయ విమాన సర్వీసులు నడపటానికి పర్మిషన్ లేదు. దేశీయంగా మాత్రమే ఎయిర్ సహారా, ఎయిర్ డెక్కన్, జెట్ ఎయిర్‌వేస్ సర్వీసులు నడిపేవి. కేవలం ఎయిర్‌ ఇండియా, ఇంకా ఇతర దేశాల విమానాలు మాత్రమే అంతర్జాతీయ సర్వీసులు నడిపేవి. ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌కి ఎమిరేట్స్‌ ఫ్లైట్‌ రప్పించడానికి భగీరథ ప్రయత్నమే చేశారు. 2001లో చంద్రబాబు ఆదేశాలతో దుబాయ్‌లో ప్రముఖ పారిశ్రామికవేత్త దివంగత కోనేరు రాజేంద్ర ప్రసాద్ అక్కడి ఎమిరేట్స్‌కి ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వానికి సమన్వయకర్తగా వ్యవహరించి మూడు నెలల పాటు ఢిల్లీలో మకాం వేసి రోజుకి మూడు సర్వీసుల ఎమిరేట్స్ ఫ్లైట్‌ను హైదరాబాద్‌కి తెచ్చారు. ఇది ఆయన నాతో స్వయంగా చెప్పిన మాట. ‘‘కానీ క్రెడిట్‌ చంద్రబాబుదే!’’ అని ఆయనే చెప్పారు. జూలై 2, 2001న మొట్టమొదటి ఎమిరేట్స్ ఫ్లైట్ హైదరాబాద్‌లో దిగింది. ఆ తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం ‘ఓపెన్‌ స్కై’ పాలసీ తీసుకు వచ్చాక 2004 నుండే ‘ఇండిగో’, ‘జెట్’, ‘స్పైస్‌ జెట్‌’ లాంటి ప్రైవేట్ ఎయిర్‌లైన్స్‌ బయట దేశాలకి నేరుగా విమానాలు నడుపుతున్నాయి. ఇప్పుడు హైదరాబాద్ నుంచి సగటున రోజుకి 2500 మంది కేవలం దుబాయ్ ఫ్లైట్స్ లోనే ట్రావెల్ చేస్తారు. అందులో సగం ఆంధ్రా, రాయలసీమ వాళ్ళే. వీళ్ళంతా కేవలం గల్ఫ్ వరకూ మాత్రమే ప్రయాణించేవారు కాదు, అక్కడి నుండి అమెరికా, ఐరోపా దేశాలకి కనెక్టింగ్ ఫ్లైట్స్‌లో వెళ్ళేవారు కూడా ఉంటారు. ‘ఓపెన్ స్కై’ పాలసీ లేని రోజుల్లోనే బేగంపేటకు వంటి చిన్న ఎయిర్‌పోర్టుకు మూడు నెలల్లోనే వేరే దేశం ఎయిర్‌లైన్స్ నుంచి విమాన సర్వీసులను రప్పించగలిగిన చంద్రబాబు తలచుకుంటే విజయవాడ ఎయిర్‌పోర్టుకూ విమాన సర్వీసులు సాధించగలరు. 2014లో గెలిచిన కొద్ది కాలంలోనే విజయవాడ ఎయిర్‌పోర్ట్‌కి అంతర్జాతీయ హోదా తీసుకొచ్చి, సింగపూర్‌కి ఫ్లైట్ సాధించారు.

పాత టెర్మినల్ పక్కనే కొత్త టెర్మినల్ వెంటనే నిర్మించారు. రన్‌వేని పెద్ద విమానాలు దిగేందుకు వీలుగా విస్తరించారు. వెంటనే మరో పెద్ద ఇంటిగ్రేటెడ్ టెర్మినల్‌కి శంకుస్థాపన చేశారు. కానీ ఆ నిర్మాణం మందకొడిగా సాగుతోంది. తరువాత వచ్చిన ప్రభుత్వం ఉన్న ఒక్క సింగపూర్ సర్వీస్‌ని రద్దు చేసింది. పైగా నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ విషయంలో కూడా పట్టనట్లుగా వ్యవహరించింది. ఇప్పుడు కేవలం ఒక ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ మాత్రం వారానికి రెండు సార్లు విజయవాడ నుండి షార్జాకి వెళుతోంది. ఈ సర్వీసు కూడా షార్జా వరకే పరిమితం, అక్కడి నుండి ఎటువంటి కనెక్టింగ్‌ ఫ్లైట్ ఉండదు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ఏడాది దాటింది, విమానయాన శాఖ మంత్రిగా సొంత పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఉన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ మీద అమితమైన శ్రద్ధతో త్వరితగతిన నిర్మాణం అయ్యేలా పర్యవేక్షిస్తున్నారు. మంచిదే. కానీ రాష్ట్ర రాజధానికి అవసరమైన అత్యంత కీలకమైన విజయవాడ ఎయిర్పోర్ట్‌కి అంతర్జాతీయ సర్వీసులు తీసుకురావటం మీద మాత్రం అంత ఫోకస్ చేస్తున్నట్లు కనిపించటం లేదు. ఎప్పుడో పూర్తయ్యే ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ కోసం చూడకుండా ఉన్న వనరులతోనే అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభించే అవకాశం ఉన్నా ఆ దిశగా ప్రయత్నాలు సాగటం లేదు. ఇటీవల ఎమిరేట్స్ ప్రతినిధులు వచ్చి నూతన టెర్మినల్‌నూ, రన్‌వేనూ సర్వే చేసి సంతృప్తి వ్యక్తం చేశారు.

కాని ఎమిరేట్స్ లాంటి పెద్ద సర్వీసులు అంత సులువుగా కొత్త సర్వీసులు ప్రారంభించవు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ బోయింగ్ 777 విమానాలే. అందులో 350–400 మంది సీటింగ్ కెపాసిటీ ఉంటుంది. వయబిలిటి చూసుకున్నా అంత సులువుగా రావటం కష్టమే. ఇండిగో, స్పైస్ జెట్ విస్తారంగా నడిపే 180 సీట్ల విమానాలు ఇప్పుడు విజయవాడలో ఉన్న సౌకర్యాలతో దేశీయ స్థానాలకి నడుస్తున్నాయి. ఎప్పుడో పూర్తయ్యే ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ కోసం ఎదురు చూడకుండా, ఆ తర్వాత మరెప్పుడో వచ్చే ఎమిరేట్స్ విమాన సర్వీసు కోసం ఎదురు చూడకుండా ఏదైనా ప్రైవేట్ సంస్థ విమానాలు ముందుగా గల్ఫ్ దేశాలకి నడిపితే వెంటనే మనకి అంతర్జాతీయ కనెక్టివిటీ వస్తుంది. ప్రస్తుతం ఉన్న వనరులతో ముందు సర్వీసులని ప్రారంభించి కనెక్టివిటీ సాధిస్తే, దానికి సమాంతరంగా ఇంటిగ్రేటెడ్ టెర్మినల్‌ని పూర్తి చేసుకుంటూ భవిష్యత్తులో పెద్ద విమాన సర్వీసులను ప్రారంభించవచ్చు.

- రాజేష్‌ వేమూరి

Updated Date - Jul 02 , 2025 | 03:03 AM