ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Global Diplomacy Crisis: మునీర్‌ ముచ్చట్లు

ABN, Publish Date - Jun 20 , 2025 | 02:17 AM

పాకిస్థాన్‌ సైన్యాధ్యక్షుడు ఆసీమ్‌ మునీర్‌కు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఎర్రతివాచీ పరిచి, కడుపునిండా భోజనం పెట్టడం, మనకు సరే, పాకిస్థాన్‌ మేధావులకు సైతం ఆశ్చర్యం కలిగించింది.

పాకిస్థాన్‌ సైన్యాధ్యక్షుడు ఆసీమ్‌ మునీర్‌కు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఎర్రతివాచీ పరిచి, కడుపునిండా భోజనం పెట్టడం, మనకు సరే, పాకిస్థాన్‌ మేధావులకు సైతం ఆశ్చర్యం కలిగించింది. ఈ భేటీకోసమే ట్రంప్‌ తన జీ7 పర్యటనను హడావుడిగా ముగించుకొని శ్వేతసౌధానికి పరుగులు తీశారు. మునీర్‌–ట్రంప్‌ భేటీకి ముందే మోదీ–ట్రంప్‌ టెలిఫోన్‌ సంభాషణ జరిగి, ఇంతకాలమూ తన మనసులో ఉన్న, గట్టిగా అనాలనుకుంటున్న మాటని మోదీ ట్రంప్‌కు చెప్పేశారు. ఇటీవలి భారత్‌–పాక్‌ ఘర్షణలను తానే ఆపానని, వాణిజ్యాయుధాన్ని ప్రయోగించి ఈ రెండు అణ్వస్త్రదేశాలను దారికితెచ్చానని ట్రంప్‌ ఇప్పటికి ఓ పదిసార్లయినా చెప్పుకొని ఉంటారు. ఆదిలో ఆయన మాటని కాదనలేకపోయినా, ఆయన అదేపనిగా అంటూంటే, అందులో ఉన్న మహాప్రమాదాన్ని మనం త్వరితంగానే గుర్తించాం. నర్మగర్భంగానో, పరోక్షంగానో కాదనడంతో ఆరంభించి, ఎవరూ మధ్యవర్తిత్వం వహించాల్సిన అవసరం లేదన్న మాట ఆఖరుకు గట్టిగా అనడం మొదలెట్టాం. పహల్గాం ప్రతీకారంలో భాగంగా మనం పాక్‌కు సింధుజలాలను కాదంటే, పాకిస్థాన్‌ సిమ్లా ఒప్పందాన్నే కాలదన్ని, మధ్యవర్తులు చొచ్చుకువచ్చేందుకు దారులు తెరిచిన విషయం తెలిసిందే. దాడులు ఆపమంటూ పాకిస్థాన్‌ కాళ్ళావేళ్ళాపడిందని మనం చె‍ప్పుకుంటూవుంటే, కాదుకాదు ట్రంప్‌ ఆదేశాలమేరకే కాల్పుల విరమణ జరిగిందని పాకిస్థాన్‌ సైన్యాధ్యక్షుడు గట్టిగా చెప్పి, ఏకంగా నోబెల్‌శాంతినే ఇవ్వాలంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, వీరిరువురి భేటీకి ముందే కాల్పుల విరమణతో అమెరికాకు సంబంధం లేదని మోదీ గట్టిగా చెప్పారు. అయినా కూడా, అప్పట్లో తానే నిప్పులమీద నీళ్ళుపోశానంటూ ట్రంప్‌ పాతపాటే పాడారు. అంతేకాదు, పాక్‌ సేనానినీ, భారత ప్రధానినీ సమం చేస్తూ, ఇద్దరూ గొప్పవారేనని కీర్తిస్తూ, రెండుదేశాలనూ ఒకేగాటన కట్టేయడం మరో విషాదం. నరేంద్రమోదీ ఆప్తమిత్రుడైన అమెరికా అధ్యక్షుడు, పాకిస్థాన్‌ సర్వసైన్యాధ్యక్షుడిని భోజనానికి పిలవడం మీద విపక్ష కాంగ్రెస్‌ విరుచుకుపడుతోంది. తన వ్యాఖ్యలతో పహల్గాం ఉగ్రదాడిని ప్రోత్సహించడమే కాక, అనంతరం ఆ దాడికి సంబంధించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని శ్వేతసౌధానికి పిలిచి గౌరవించడం మన దౌత్యవిధానం వైఫల్యమని కాంగ్రెస్‌ అంటోంది. కశ్మీర్‌లో తృతీయపక్షం జోక్యాన్ని అనుమతించబోమని ట్రంప్‌కు మోదీ గట్టిగా చెప్పారన్న విదేశాంగశాఖ వివరణను కూడా కాంగ్రెస్‌ తీసిపారేస్తోంది.

భ్రమలు పక్కనబెట్టి వాస్తవికంగా వ్యవహరించాలని హితవు చెబుతోంది. గతంలో అమెరికా అధ్యక్షులు పాక్‌ సైన్యాధ్యక్షులతో భేటీలు జరిపిన సందర్భాలు లేకపోలేదు. అయితే, ఫీల్డ్‌మార్షల్‌ అయూబ్‌ఖాన్‌, జనరల్‌ జియా ఉల్‌హక్‌, జనరల్‌ పర్వేజ్‌ ముషార్రఫ్‌ శ్వేతసౌధంలో విందు‍ అందుకొనేటప్పటికే పాక్‌లో తిరుగుబాటు చేసి పాలకులుగా అవతరించినవారు. కానీ, ఇప్పుడు పాకిస్థాన్‌లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉన్నది, అధ్యక్ష ప్రధానులతో సహా ఒక రాజ్యాంగబద్ధ వ్యవస్థ ఉన్నది. అయినా కూడా, షరీఫ్‌లూ భుట్టోలను పక్కకు నెట్టి నేరుగా మునీర్‌తో ట్రంప్‌ ముచ్చట్లాడటాన్ని బట్టి పాక్‌ను ఏలుతున్నది సైన్యమేననీ, అక్కడ ఉన్నది అనధికార నియంతృత్వమేనని మరోమారు స్పష్టంగా తెలిసొచ్చింది. తక్కువ ర్యాంకుతో త్వరలో రిటైరుకావాల్సి ఉన్న మునీర్‌ను, ఇమ్రాన్‌ఖాన్‌ మీద అతడికి ఉన్న అమితమైన ద్వేషమే అర్హతగా షరీఫ్‌ సోదరులు సైన్యాధ్యక్షుడిని చేస్తే, పహల్గాం ఉగ్రఘాతుకానికి జవాబుగా భారత్‌ నిర్వహించిన ప్రతీకార దాడులతో అతడు ఏకంగా ఫీల్డ్‌మార్షల్‌ అయ్యాడు, పాకిస్థాన్‌ రక్షకుడుగా అవతరించి, ప్రపంచ వ్యవహారాలు చక్కబెడుతున్నాడు. ఒక గంటలో ముగియాల్సిన ట్రంప్‌–మునీర్‌ భేటీ రెండుగంటలు సాగిందట. తమపై అణుబాంబు వేస్తే, ఇజ్రాయెల్‌ మీద పాకిస్తాన్‌ అణుబాంబు వేస్తుందని వ్యాఖ్యానించిన ఇరాన్‌ను ఈ భేటీ నివ్వెరపరిచింది. ఇరాన్‌మీద ఇజ్రాయెల్‌ దాడులు ఆరంభించిన మరుక్షణంలోనే మునీర్‌ ఎంతో ఆగ్రహంగా, ఇస్లామిక్‌ దేశాలన్నీ ఒక్కటిగా నిలిచి ఇరాన్‌ను కాపాడుకోవాలనీ, లేదంటే ఇలా ఒక్కోదేశమూ నాశనమైపోతూనే ఉంటుందని హెచ్చరించారు. అటువంటి మునీర్‌ ఇప్పుడు ట్రంప్‌తో భేటీ అయిన నేపథ్యంలో, పాక్‌ భూ, గగనతలాలను వాడుకొని తమను దెబ్బతీసే ప్రయత్నం జరగదన్న ఆశాభావాన్ని ఇరాన్‌ వ్యక్తంచేస్తోంది. ఇరాన్‌తో యుద్ధం చేస్తానో చెయ్యనో చెప్పలేనని అంటూనే అమెరికా అధ్యక్షుడు యుద్ధానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

Updated Date - Jun 20 , 2025 | 02:20 AM