Amaravati Development: ఆంధ్ర ప్రగతికి అమరావతి
ABN, Publish Date - May 04 , 2025 | 03:31 AM
ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి రాజధానిని నిర్మించేందుకు ప్రధానమంత్రి మోదీ సహకారం హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయకత్వంలో రాజధాని నిర్మాణం వేగంగా జరగాలని లక్ష్యం పెట్టుకున్నారు.
అమరావతి పనులు పునఃప్రారంభమయ్యాయి. మూడేళ్లలో పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాజధాని పనులు వేగంగా, గడువులోపు పూర్తవడానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఇదొక శుభపరిణామం.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతి కొందరిదే అన్న భావనను ఒక వర్గం ప్రజల్లో బలంగా వ్యాపింపజేయడంలో జగన్ రెడ్డి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఆయన మళ్లీ ప్రతిపక్షంలో ఉన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అమరావతి నిర్మాణం పూర్తయ్యే వరకు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి.
భారతదేశంలో బెంగళూరు, హైదరాబాద్ మాత్రమే ఐటీకి కేరాఫ్‌గా అభివృద్ధి చెందాయంటే ఎస్.ఎం.కృష్ణ, చంద్రబాబు పోటీపడటం వల్లనే. అప్పట్లో కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా ఉన్న వీరిరువురూ ఐటీని అభివృద్ధి చేయడంలో పోటీ పడ్డారు.
రాజధాని నిర్మాణం కోసం యాభై వేల ఎకరాలు అవసరమా? అని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొంతమంది అపర మేధావులు ఇప్పటికీ కూనిరాగాలు తీస్తున్నారు. ఇలాంటి వాళ్లు హైదరాబాద్ అభివృద్ధి ఎలా జరిగిందో తెలుసుకోవాలి.
అమరావతి నిర్మాణానికి ఖర్చు చేయబోయే డబ్బుకు రాష్ట్ర బడ్జెట్‌తో సంబంధం లేదు. రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇచ్చిన భూముల్లో ప్రభుత్వానికి తన వాటాగా వచ్చే భూమిని అభివృద్ధి చేసి విక్రయించడం ద్వారా రాజధాని నిర్మాణానికి నిధులు సమకూర్చుకుంటున్నారు. అందుకే ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అయింది.
హైదరాబాద్ ఈ స్థితికి రావడానికి మూడు దశాబ్దాలకు పైగా సమయం పట్టింది. అమరావతిలో కూడా అభివృద్ధి జరిగితే భూములు ఇచ్చిన రైతులు మైనారిటీలు అవుతారు. ఇతర ప్రాంతాలకు చెందిన వారి సంఖ్యే అధికంగా ఉంటుంది. ఇప్పుడు జగన్ అండ్ కో ఏడుస్తున్నట్టుగా ‘ఆ వర్గం’ వారు ఎక్కడుంటారో కూడా తెలియదు.
అమరావతిలో చేపట్టిన పనుల వల్ల జీఎస్టీ రూపంలో ప్రభుత్వానికి దాదాపు పదివేల కోట్ల రూపాయలు సమకూరుతాయి. ఈ డబ్బుతో సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించవచ్చు. చంద్రబాబు చెప్పే మోడల్ ఇదే.
ప్రధానమంత్రి శుక్రవారం నాడు ప్రారంభించిన పనులతోనే రాజధాని నిర్మాణం సంపూర్ణం కాదు. ప్రభుత్వ నిర్మాణాలతో పాటు ప్రైవేటు రంగంలో కూడా నిర్మాణాలు జరిగినప్పుడే రాజధానికి ఒక రూపు వస్తుంది. ‘‘అమరావతి పేరిట ఒక వర్గం ప్రజలకు మేలు చేసేందుకు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేయడం అవసరమా? రాష్ట్ర ప్రజలందరికీ చెందిన సొమ్మును ఒకే చోట ఖర్చు చేయడం ఏమిటి?’’ అని ప్రజలలో విష ప్రచారం చేస్తున్న వారికి వాస్తవం తెలియక కాదు. అమరావతి నిర్మాణానికి ఖర్చు చేయబోయే డబ్బుకు రాష్ట్ర బడ్జెట్‌తో సంబంధం లేదు. రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇచ్చిన భూముల్లో ప్రభుత్వానికి తన వాటాగా వచ్చే భూమిని అభివృద్ధి చేసి విక్రయించడం ద్వారా రాజధాని నిర్మాణానికి నిధులు సమకూర్చుకుంటున్నారు. అందుకే ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అయింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి గ్రహణాలన్నీ ఇప్పుడు తొలగిపోయాయి. నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం మూడేళ్లలో రాజధాని నిర్మాణానికి నేను కూడా భుజం కలుపుతానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. అమరావతి కేవలం రాజధాని కాదు– ఒక శక్తి అని, రాజధాని పూర్తయితే రాష్ట్ర జీడీపీ ఎక్కడికి వెళుతుందో ఊహించగలనని కూడా ప్రధాని చెప్పారు. ఇదే అమరావతికి, ఇదే ప్రధానమంత్రి సుమారు పదేళ్ల కిందట శంకుస్థాపన చేశారు. కాలూ చేయీ కూడదీసుకొని పనులు ప్రారంభించి, ఒకస్థాయికి చేర్చేసరికి రాష్ట్రంలో ప్రభుత్వం మారి జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చారు. మూడు రాజధానుల పల్లవి అందుకున్నారు. అప్పటి నుంచి అమరావతికి గ్రహణం పట్టింది. ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. అప్పటికే ఖర్చు చేసిన పది వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయింది. అమరావతిని భ్రమరావతిగా, కమ్మరావతిగా అభివర్ణించారు. వైసీపీకి చెందిన కాలనాగులు రాజధానిపై విషం చిమ్మాయి. ఫలితంగా ఆంధ్రుల కలల రాజధాని శ్మశానంగా మారింది. రేపటి కోసం చంద్రబాబు కలలుగన్న అమరావతి ఉసురు తీయాలనుకున్నారు. అమరావతి తమది కాదన్న భావనను ఒక వర్గం ప్రజలలో నూరి పోశారు. ఇది గతం! అమరావతి చంద్రబాబుది కాదు. లోకేశ్‌ది కాదు. ఆ సామాజిక వర్గానిదీ కాదు. రేపటికోసం నిర్మితం కాబోతున్న నగరమది. రేపటి తరం ఆ ఫలితాలను అందుకుంటుంది.
శుభపరిణామాలు...
ఇప్పుడు చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అమరావతి పనులు పునఃప్రారంభమయ్యాయి. మూడేళ్లలో పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాజధాని పనులు వేగంగా, గడువులోపు పూర్తవడానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఇదొక శుభపరిణామం. ఎందుకంటే, అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఏర్పడిన ప్రభుత్వాలు 2029 వరకు అధికారంలో ఉంటాయి. నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం పనులు జరిగితే ఆలోపే రాజధాని నిర్మాణం పూర్తవుతుంది. ఆ తర్వాత ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ రాజధానిని కదిలించలేరు. అయితే, ఇల్లు అలకగానే పండుగ కాదన్నట్టుగా శుక్రవారం నాటి ప్రధాని హామీతో అంతా సవ్యంగా జరుగుతుందని భావించలేం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అమరావతిపై అంతులేని ద్వేషాన్ని పెంచుకున్నారు. రాజధానికోసం భూములు ఇచ్చిన రైతుల ముఖాలు చూడ్డానికి కూడా అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఇష్టపడలేదు. గత ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిందిగానీ, వైసీపీకి అనుబంధంగా మారిన పోలీసులు, అధికారులు, జర్నలిస్టులుగా చలామణి అవుతున్న వాళ్లు, మేధావుల ముసుగులో తిరగాడుతున్న వాళ్లు, పిల్ల సైకోలు ఇప్పటికీ చురుగ్గానే పనిచేస్తున్నారు. ఈ శక్తులు మారీచులుగా మారి అమరావతి నిర్మాణానికి అడుగడుగునా ఆటంకాలు సృష్టించవచ్చు. రాజధాని ప్రాంతంలో అరటి తోటలు తగులబెట్టడం– కులం చిచ్చు పేరిట రాష్ట్రంలో రైళ్లను ధ్వంసం చేయడం వంటి సంఘటనలను మళ్లీ చూడాల్సి రావచ్చు. హైసెక్యూరిటీ ఉండే విమానాశ్రయాలలో కోడికత్తులను చూశాం. నట్టింట్లో గొడ్డలి వేటునూ చూశాం. ఇలాంటివి మళ్లీ జరగవన్న గ్యారంటీ ఏమిటి? కులాలపరంగా ఆంధ్రప్రదేశ్ అతి సున్నితమైన రాష్ట్రం. కులం కోసం కత్తులు దూసుకుంటారు. తెలంగాణలో మాదిరి ఈ రాష్ట్రం నాది– మాకు రాజధాని లేకపోతే ఎలా? అన్న భావన తక్కువ. ఈ కారణంగానే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతి కొందరిదే అన్న భావనను ఒక వర్గం ప్రజల్లో బలంగా వ్యాపింపజేయడంలో జగన్‌రెడ్డి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఆయన మళ్లీ ప్రతిపక్షంలో ఉన్నారు. శాసనసభలో సంఖ్యాపరంగా జగన్ బలహీనంగా ఉన్నప్పటికీ కుల, మత అభిమానంతోపాటు రాజశేఖరరెడ్డి కుమారుడన్న అభిమానం కలగలిపి మొత్తం మీద 40 శాతం ప్రజలు ఇప్పటికీ తనకు అండగా ఉన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం అమరావతి నిర్మాణం పూర్తయ్యే వరకు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ఎంత మంచి పంట వేసినా దానికి చీడపీడలు పట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కలుపు మొక్కలను ఏరిపారేయాలి. అప్పుడే పంట చేతికి వస్తుంది. ప్రధాని ఊహించినట్టుగా రాష్ట్ర జీడీపీ అమాంతం పెరగాలంటే అమరావతి నిర్మాణం ఆటంకాలు లేకుండా సకాలంలో పూర్తి కావాలి. ఈ క్రమంలో రాహు కేతువులను అణచివేయాలి. మన చుట్టూ ఉన్న ఆర్థిక ఉగ్రవాదులు, సైకోలను కట్టడి చేయాలి. జగన్‌రెడ్డి సంప్రదాయ రాజకీయాలను నమ్మకోరు. ఈ కారణంగా ఎవరూ ఊహించని మార్గాల నుంచి రాజధాని నిర్మాణానికి ఆటంకాలు ఎదురుకావొచ్చు.
నేటికీ లేని రాజధాని
రాష్ట్రం విడిపోయి పదకొండేళ్లు అవుతున్నా రాజధాని కూడా ఏర్పడనందుకు ఆంధ్రులు బాధపడాలి. అద్భుతంగా అభివృద్ధి చెందిన హైదరాబాద్ తెలంగాణ సొంతం. మనం కూడా అటువంటి రాజధానిని నిర్మించుకోవాలన్న కసి ఏపీ ప్రజల్లో ఏర్పడకుండా చేశారు. ప్రపంచంలో ఏ నగరం కూడా మూడు నాలుగేళ్లలో పూర్తి కాదు. అదొక నిరంతర ప్రక్రియ. హైదరాబాద్‌నే తీసుకుందాం! ప్రస్తుతం అభివృద్ధికి నమూనాగా ఉన్న సైబరాబాద్‌కు చంద్రబాబు పురుడుపోసినప్పుడు అక్కడ రాళ్లూ రప్పలు మాత్రమే ఉండేవి. ఆ తర్వాత ప్రైవేటు రంగం సహకారంతో అద్భుత నగరంగా అభివృద్ధి చెందింది. ప్రభుత్వం తరఫున చంద్రబాబు అప్పట్లో సహాయ సహకారాలు అందించారు. ఐటీ రంగాన్ని ఆకర్షించారు. అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తాను హైదరాబాద్‌లో చంద్రబాబు ఐటీ రంగాన్ని అభివృద్ధి చేస్తున్న తీరును జాగ్రత్తగా గమనించేవాడినని ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా చెప్పారు. నాలుగు ప్రభుత్వ భవనాలను నిర్మించినంత మాత్రాన అభివృద్ధి జరిగిపోదు. ఏ ప్రభుత్వమైనా ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించేందుకు మౌలిక వసతులను మాత్రమే సమకూరుస్తుంది. భారతదేశంలో బెంగళూరు, హైదరాబాద్ మాత్రమే ఐటీకి కేరాఫ్‌గా అభివృద్ధి చెందాయంటే ఎస్.ఎం.కృష్ణ, చంద్రబాబు పోటీపడటం వల్లనే. అప్పట్లో కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా ఉన్న వీరిరువురూ ఐటీని అభివృద్ధి చేయడంలో పోటీపడ్డారు. అప్పటికే ఐటీలో బెంగళూరు ముందంజలో ఉంది. హైదరాబాద్ మత కలహాలకు కేరాఫ్‌గా ఉండేది. ఆ పరిస్థితులలో హైదరాబాద్‌లో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములను దిగ్గజ ఐటీ కంపెనీలకు కేటాయించడం ద్వారా చంద్రబాబు ఆయా కంపెనీలను ఆకర్షించారు.
కుహానాల కూని రాగాలు...
రాజధాని నిర్మాణం కోసం యాభై వేల ఎకరాలు అవసరమా? అని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొంతమంది అపర మేధావులు ఇప్పటికీ కూని రాగాలు తీస్తున్నారు. ఇలాంటి వాళ్లు హైదరాబాద్ అభివృద్ధి ఎలా జరిగిందో తెలుసుకోవాలి. ప్రైవేటు సంస్థలకు కేటాయించడానికి అవసరమైన భూమి ప్రభుత్వం వద్ద ఉన్నప్పుడే ఏ కంపెనీ అయినా ముందుకు రావడానికి ఆసక్తి చూపుతుంది. హైదరాబాద్‌లో ఇప్పటికీ ప్రభుత్వం వద్ద కొన్ని వేల ఎకరాల భూమి ఉంది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలనుకొనే వారికి ఈ భూములను ఆకర్షణగా చూపుతున్నారు. అమరావతి మహానగరంగా అభివృద్ధి చెందాలంటే ప్రైవేటు రంగం కూడా కలసి రావాలి. ప్రధానమంత్రి శుక్రవారం నాడు ప్రారంభించిన పనులతోనే రాజధాని నిర్మాణం సంపూర్ణం కాదు. ప్రభుత్వ నిర్మాణాలతో పాటు ప్రైవేటు రంగంలో కూడా నిర్మాణాలు జరిగినప్పుడే రాజధానికి ఒక రూపు వస్తుంది. ‘‘అమరావతి పేరిట ఒక వర్గం ప్రజలకు మేలు చేసేందుకు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేయడం అవసరమా? రాష్ట్ర ప్రజలందరికీ చెందిన సొమ్మును ఒకేచోట ఖర్చు చేయడం ఏమిటి?’’ అని ప్రజలలో విష ప్రచారం చేస్తున్న వారికి వాస్తవం తెలియక కాదు. అమరావతి నిర్మాణానికి ఖర్చు చేయబోయే డబ్బుకు రాష్ట్ర బడ్జెట్‌తో సంబంధం లేదు. రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇచ్చిన భూముల్లో ప్రభుత్వానికి తన వాటాగా వచ్చే భూమిని అభివృద్ధి చేసి విక్రయించడం ద్వారా రాజధాని నిర్మాణానికి నిధులు సమకూర్చుకుంటున్నారు. అందుకే ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అయింది. హైదరాబాద్‌లో, అంటే సైబరాబాద్‌లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి తెలంగాణ ప్రభుత్వాలు కూడా తమ వద్ద ఉన్న భూములను విక్రయించడం ద్వారా నిధులు సమకూర్చుకోవడం వాస్తవం కాదా? ఇప్పుడు అభివృద్ధి చెందిన హైదరాబాద్ నుంచి అందుతున్న ఫలాలతోనే తెలంగాణలోని మిగతా ప్రాంతాలను అభివృద్ధి చేయడం నిజం కాదా? అమరావతిని మాత్రమే అభివృద్ధి చేస్తే రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల పరిస్థితి ఏమిటని నసుగుతున్నవారు ఈ విషయం తెలుసుకోవాలి. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ఆర్థికంగా పరిపుష్టంగా ఉండటానికి కారణం ఏమిటి? చెన్నయ్, బెంగళూరు, ముంబై వంటి మహానగరాలు ఉండటం వల్లనే ఆయా రాష్ర్టాలకు ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం వస్తోంది. తమిళనాడులో చెన్నయ్ మాత్రమే కాదు– మరెన్నో నగరాలు ఉన్నాయి. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన కోయంబత్తూరు వంటి నగరాలు ఉన్నాయి. చిన్న రాష్ట్రమైన కర్ణాటకను బెంగళూరు ఆదుకుంటోంది. దేశ ఆర్థిక రాజధానిగా అలరారుతున్న ముంబైతోపాటు పుణె, నాగపూర్ వంటి నగరాలు మహారాష్ట్రలో ఉన్నాయి. నగరాలు అభివృద్ధి చెందిన రాష్ర్టాలలోనే ప్రగతిని చూస్తున్నాం. మహానగరాలు లేని ఎన్నో రాష్ర్టాలు ఉన్నాయి. అందుకే వాటి గురించి మనం మాట్లాడుకోం! మన యువత ఉపాధి కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నయ్, ముంబై, ఢిల్లీ వంటి నగరాల వైపు మాత్రమే చూస్తున్నారు కదా! నగరాల నుంచి లభించే ఆదాయంతో గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవచ్చు. ఈ దిశగా ప్రభుత్వాలు కృషి చేయాలి. లేని పక్షంలో గ్రామాల నుంచి నగరాలకు వలసలు పెరిగిపోయి సామాజిక పరమైన సమస్యలు ఉత్పన్నమవుతాయి.
‘ఒక వర్గం’... ఒక వాదన!
అమరావతి ఒక వర్గం ప్రజలకు మాత్రమే పరిమితమన్న విమర్శల విషయానికి వద్దాం! హైదరాబాద్ ఒకప్పుడు ఎలా ఉండేదో గుర్తుచేసుకుందాం. అప్పుడు మూసీకి అవతల, ఇవతల అన్నట్టుగా ఉండేది. ఒకవైపు ముస్లింల సంఖ్య అధికంగా ఉండేది. మరోవైపు స్థానిక హిందువులు ఉండేవారు. రెండు వర్గాల మధ్య మత ఉద్రిక్తతలు తలెత్తేవి. నిజాం హయాంలో నిర్మితమైన కట్టడాలు మినహా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చెప్పుకోదగిన నిర్మాణాలను ప్రభుత్వాలు చేపట్టలేదు. హైదరాబాద్ అభివృద్ధి చెందని కారణంగా రాష్ట్ర ఆదాయం 1983 వరకు పదివేల కోట్ల రూపాయలలోపు ఉండేది. ఈ నేపథ్యంలో ఎన్టీరామారావు ముఖ్యమంత్రిగా ట్యాంక్ బండ్‌తోపాటు హైదరాబాద్‌లోని ప్రధాన రహదారులను విస్తరించారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆంధ్ర ప్రాంతం నుంచి సామాన్య ప్రజలు కూడా హైదరాబాద్‌కు వలస వచ్చారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ఐటీ రంగం అభివృద్ధిని ఒక ఉద్యమంలా చేపట్టారు. దీంతో ఇతర రాష్ర్టాలకు చెందిన ఐటీ రంగ నిపుణులు ఉపాధి కోసం హైదరాబాద్ బాట పట్టారు. ఆ తర్వాత రాజశేఖరరెడ్డి, కేసీఆర్ వంటి వారితోపాటు ప్రస్తుత రేవంత్‌రెడ్డి ప్రభుత్వాలు కూడా పెట్టుబడులను ప్రోత్సహించడంలో పోటీపడ్డాయి. ఫలితంగా దేశం నలుమూలల నుంచి ప్రజలు హైదరాబాద్‌కు వలస వచ్చి స్థిరపడ్డారు. దేశంలోని 28 రాష్ర్టాల ప్రజలూ ఇక్కడ కనిపిస్తారు. ఫలితంగా హిందూ–ముస్లింల మధ్య గొడవలు నిలిచిపోయాయి. ఇప్పుడు హైదరాబాద్‌లో తెలంగాణ వారు ఎంత మంది? ఇతర రాష్ర్టాల వారు ఎంత మంది? అంటే బయటి వాళ్లే ఎక్కువ అని చెప్పవచ్చునేమో! దీంతో మత ఉద్రిక్తతలకు ఒకప్పుడు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే హైదరాబాద్ ఉపాధి అవకాశాలకు చిరునామాగా మారింది. హైదరాబాద్ ఈ స్థితికి రావడానికి మూడు దశాబ్దాలకు పైగా సమయం పట్టింది. అమరావతిలో కూడా అభివృద్ధి జరిగితే భూములు ఇచ్చిన రైతులు మైనారిటీలు అవుతారు. ఇతర ప్రాంతాలకు చెందిన వారి సంఖ్యే అధికంగా ఉంటుంది. ఇప్పుడు జగన్ అండ్ కో ఏడుస్తున్నట్టుగా ‘ఆ వర్గం’ వారు ఎక్కడుంటారో కూడా తెలియదు. రేపటికోసం ఆలోచించే వాడే నిజమైన ప్రజానాయకుడు, రాజనీతిజ్ఞుడు అవుతాడు. సంకుచితంగా ఆలోచించేవాడు ఎప్పటికీ ప్రజా నాయకుడు కాలేడు. సైబరాబాద్‌కు పునాదులు వేసిన చంద్రబాబు ఇప్పుడు తెలంగాణలో బయటి వ్యక్తి! నిజాం నిర్మించిన భవనాలలో ఇప్పుడు వారి వారసులు నివసించడం లేదే? అమరావతి కూడా పూర్తిగా అభివృద్ధి చెందడానికి కొన్ని దశాబ్దాలు పడుతుంది. అప్పటిదాకా నేను జీవించి ఉంటానా? అని చంద్రబాబు ఆలోచిస్తే సమర్థించగలమా? ‘గొప్పగా ఆలోచించండి’ అని దివంగత అబ్దుల్ కలాం చెప్పిన మాటలను విశ్వసించే చంద్రబాబు అమరావతి విషయంలో కూడా గొప్పగా ఆలోచిస్తున్నారు. ఇందులో తప్పు పట్టేది ఏముంది? ఆయన తదనంతరం ముఖ్యమంత్రులుగా వచ్చేవాళ్లు ఇదే ఒరవడిలో ఆలోచిస్తే అమరావతి నిరంతరంగా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. చంద్రబాబు రేపటి కోసం ఆలోచిస్తుండగా, కొంతమంది ఇవాళ సంగతి ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్‌లో హైటెక్ సిటీ భవన నిర్మాణం చేపట్టినప్పుడు కూడా ఎన్నో విమర్శలు వచ్చాయి. హైదరాబాద్‌లో ఇప్పుడు కొంత మందైనా ఆయనను తలచుకుంటున్నారు. రాయలసీమలో పాలెగాళ్ల సంస్కృతి విషయానికి వద్దాం! ఒకప్పుడు అక్కడ ఫ్యాక్షన్ గొడవలకు ఎంతో మంది బలయ్యారు. అందుకు ప్రధాన కారణం పేదరికంతోపాటు ఉపాధి లేకపోవడం. కాల క్రమంలో రాయలసీమలో సాగునీటి వసతి మెరుగుపడుతూ వచ్చింది. దీంతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి. ప్రభుత్వాలతో ప్రమేయం లేకుండానే పాలెగాళ్ల సంస్కృతి చాలా వరకు మాయమైంది.
అందుబాటులో భూమి...
భూమి లభ్యత కారణంగా హైదరాబాద్‌లో వేలాది పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. వందలు, వేల ఎకరాల్లో కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏర్పడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఈ స్థాయిలో భూమి లభ్యత ఉండదు. అక్కడ ప్రైవేటు భూమి ఎక్కువ. భారీ పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూమిని ప్రభుత్వం కేటాయించలేదు. అలాంటప్పుడు రాజధానిలో ఉపాధి అవకాశాలు పెంచడం ఎలా? అన్న సందేహం కలుగుతుంది. ఈ కారణంగానే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాంది పలికారు. వందల వేల ఎకరాలు కేటాయించలేని పరిస్థితి ఉన్నందున సర్వీసు రంగాన్ని ఆయన ఎంచుకున్నారు. అమరావతి వంటి మహా నగరాలు అభివృద్ధి చెందినప్పుడే ఆంధ్రప్రదేశ్‌లో కులాల కుంపట్లు పోతాయి. హైదరాబాద్‌లో ఎవరి కులం ఏమిటో ఎవరికీ తెలియదు. ఎందుకంటే మన పక్కింటివాడు వేరే రాష్ర్టానికి చెందినవాడై ఉంటాడు. అభివృద్ధి కారణంగానే అక్కడ కులాలు, మతాలకు చోటు లేకుండా పోయింది. ఏపీలో ఒక్కో ప్రాంతాన్ని ఒక్కో రంగంలో అభివృద్ధి చేయవచ్చు. ఇప్పటికే అభివృద్ధి చెందిన విశాఖపట్టణాన్ని మరింతగా అభివృద్ధి చేస్తే అది కూడా మహానగరం అవుతుంది. రాయలసీమలో తిరుపతి ఉండనే ఉంది. మిగతా ప్రాంతాలలో సోలార్ ఎనర్జీని అభివృద్ధి చేస్తున్నారు. అమరావతితో పాటు రాష్ర్టాన్ని అభివృద్ధి చేయడానికి తన సంపూర్ణ సహకారాలు ఉంటాయని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు కనుక ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇదొక మహదావకాశం. అమరావతి ప్రజా రాజధాని ఎలా అవుతుంది? అని విమర్శించే వారికి కూడా సమాధానం చెప్పేలా ఆయన రాజధానిని నిర్మించాలి. భూముల ధరలు ప్రజలకు అందుబాటులో లేని పరిస్థితి ఏర్పడితే అల్పాదాయ వర్గాల వారు ఇబ్బందిపడతారు. అన్ని వర్గాల వారూ నివసించడానికి అనువుగా రాజధాని నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలి. లేని పక్షంలో ఇప్పుడు హైదరాబాద్‌లో అల్పాదాయ వర్గాల వారికి ఎదురవుతున్న ఇబ్బందులే అమరావతిలోనూ ఎదురవుతాయి. కేసీఆర్ హయాంలో రియల్ ఎస్టేట్ బూమ్ పేరిట హైదరాబాద్‌లో భూముల ధరలను ఆకాశాన్ని అంటేలా చేశారు. ధరలను కృత్రిమంగా పెంచారు. వేలాది ఎకరాల భూమి నిరుపయోగంగా ఉన్నప్పటికీ సొంత ఇంటి కలకు పేదవారు దూరమయ్యారు. అమరావతిలో భూముల ధరలకు ఇప్పటికే రెక్కలు వచ్చాయి. బహుశా ఈ కారణంగానే కాబోలు, మరికొంత భూమిని రాజధాని కోసం సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది.
విశాల దృక్పథంతోనే...
చరిత్రలో ఎంతో మంది పాలకులను చూశాం. వారిలో కొందరినే గుర్తుపెట్టుకుంటాం. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అక్కడి ప్రజల ఆలోచనలు కూడా కొన్ని సందర్భాలలో సంకుచితంగా ఉంటాయి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వంటి వారు ఉండనే ఉంటారు. ప్రజల మెదళ్లను విషపూరితం చేయడానికి ఆయన ప్రయత్నిస్తూనే ఉంటారు. అమరావతి నిర్మాణం సజావుగా పూర్తయి చంద్రబాబుకు పేరొస్తే జగన్‌రెడ్డి జీర్ణించుకోలేరు. ఇప్పటికైనా రాజధాని ఏర్పడుతుందా? అని ఎంతో మంది ఆశగా ఎదురుచూస్తుండగా, రాజధాని ఎప్పటికీ ఏర్పడకూడదని కోరుకొనే వాళ్లలో జగన్ వంటి వాళ్లు ముందుంటారు. విపరీత మనస్తత్వం ఉన్న వాళ్లు ఇలాగే ఆలోచిస్తారు. ఈ కారణంగా గతంలో జరిగిన కుట్రలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో అమలయ్యే అన్ని రకాల కుట్రలను పసిగడుతూ చంద్రబాబు ప్రభుత్వం జాగరూకతతో వ్యవహరించాలి. జగన్‌కు మద్దతుగా నిలుస్తున్న పిల్ల సైకోలు ప్రతి చిన్న విషయాన్ని రాద్దాంతం చేయడానికి కాచుకొని ఉన్నాయి. అడుగుకొకరు చొప్పున మారీచులు, సుబాహులు ఉన్నారు. అందుచేత అమరావతి నిర్మాణానికి ఆటంకాలు తొలగిపోయాయని భావించడానికి లేదు. ఈ నేపథ్యంలో రేపటి తరంకోసం ఆలోచించే వారందరూ ప్రభుత్వానికి అండగా నిలబడి రాజధాని అనే మహాయజ్ఞం నిర్విఘ్నంగా పూర్తయ్యేలా చేయి చేయి కలిపి నడవాలి. అదే సమయంలో ప్రభుత్వం తన దృష్టినంతా అమరావతి నిర్మాణంపైనే పెట్టిందన్న అభిప్రాయం ఇతర ప్రాంతాల ప్రజల్లో వ్యాపించకుండా పాలకులు జాగ్రత్తలు తీసుకోవాలి. అభివృద్ధి ఫలాలు అందేలోపు.. ప్రజల్లో అసంతృప్తి బీజాలు ఏర్పడకుండా చూడాలి. ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజల్లో ఫీల్ గుడ్ భావన కల్పించడం అవసరం. అయితే ప్రభుత్వ పరంగా చోటుచేసుకొంటున్న కొన్ని సంఘటనలు కూటమి ప్రభుత్వానికి మచ్చగా మిగులుతున్నాయి. తాజాగా విశాఖపట్నంలో సింహాచలం దేవస్థానం వద్ద నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. ఇందుకు అధికారుల నిర్లక్ష్యమే కారణం. కనీస అంచనాలు, డిజైన్లు కూడా లేకుండా ఎవరో అధికారి చెప్పారని గోడ కట్టించడం ఏమిటి? తిరుమల తర్వాత అంతటి ప్రాశస్త్యం ఉన్న సింహాచలం దేవస్థానానికి పూర్తి స్థాయి ఈవో లేకపోవడం ఏమిటి? అధికార యంత్రాంగం కలుషితం అయింది. అధికారుల్లో అనేక మంది ఇప్పటికీ జగన్‌రెడ్డికి విధేయులుగానే ఉన్నారు. ఇలాంటి వారిని ఏరి పారేయకుండా కీలక స్థానాల్లో కొనసాగించడం వల్ల అనర్థాలే జరుగుతాయి. నోటి మాటగా చెప్పగానే గోడ కట్టించడం అంటే దేవదాయ శాఖలో బాధ్యతారాహిత్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. గోడ నిర్మాణంలో దేవాదాయ శాఖ బాధ్యత ఎంతో, పర్యాటక శాఖ బాధ్యత ఎంతో తేలాల్సి ఉంది. ఏది ఏమైనా ఏడు నిండు ప్రాణాలు పోయాయి. ప్రభుత్వ విభాగాలలో జవాబుదారీతనం పెంపొందించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి పెట్టాలి. నిన్నగాక మొన్న తిరుపతిలో ఒక దురదృష్టకర సంఘటన జరిగింది. ప్రమాదాలకు కారణాలు ఏమైనప్పటికీ అధికార యంత్రాంగంలో భయం, భక్తి లేకపోవడమే ప్రధాన కారణం. వివిధ కారణాల వల్ల తెలుగునాట భక్తి రసం పొంగి పొరలుతోంది. భక్తిని మార్కెట్ చేస్తున్నారు. దీంతో ప్రతి చిన్న ప్రత్యేక సందర్భాలలో భక్తులు దేవాలయాలకు పోటెత్తుతున్నారు. ఒకప్పుడు హనుమాన్ జయంతిని పెద్దగా పట్టించుకునేవారు కారు. ఇప్పుడు ఆ రోజున కూడా రామాలయాలు కిటకిటలాడుతున్నాయి. ఇప్పుడు అమరావతిలో కూడా భారీ నిర్మాణాలు చేపట్టబోతున్నారు. అక్కడ ఎలాంటి దురదృష్టకర సంఘటనలు, ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలి. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఫలితం ఉండదు.
అలాగే... అమరావతితో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో కూడా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాలి. లేని పక్షంలో ప్రాంతీయ విద్వేషాలు సృష్టించడానికి కొంత మంది సిద్ధంగా ఉన్నారు. అభివృద్ధి పనులు ఊపందుకుంటే ప్రభుత్వ ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది. అమరావతిలో చేపట్టిన పనుల వల్ల జీఎస్టీ రూపంలో ప్రభుత్వానికి దాదాపు పదివేల కోట్ల రూపాయలు సమకూరుతాయి. ఈ డబ్బుతో సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించవచ్చు. చంద్రబాబు చెప్పే మోడల్ ఇదే. అయితే, చంద్రబాబు రాజకీయంగా దెబ్బ తినకూడదంటే వచ్చే ఎన్నికల లోపు అభివృద్ధి ఫలాలు పేదలకు అందేలా ప్రణాళికలు రూపొందించుకోవాలి. లేనిపక్షంలో జగన్ వంటి వారికి ఆయుధాలు ఇచ్చినట్టే అవుతుంది. తస్మాత్ జాగ్రత్త!
-ఆర్కే
Updated Date - May 04 , 2025 | 05:40 AM